జగన్ కు రెడ్ల రెడ్ సిగ్నల్
posted on Jun 19, 2024 @ 10:48AM
ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఉనికి మాత్రంగానైనా రాష్ట్రంలో మనగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించి ఘనంగా అధికారం చేపట్టిన వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ నిర్వాకం కారణంగా ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. తాజా ఎన్నికలలో ఆ పార్టీ ఏపీ అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితమైపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ షాక్ నుంచి జగన్ మోహన్ రెడ్డి ఇప్పట్లో తేరుకోవడం కష్టమేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
అయితే జగన్ మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదనీ, నేర్చుకోవడానికి సిద్ధంగా లేడనీ చెప్పడానికి ఆయన తాజాగా ఈవీఎంల కారణంగానే వైసీపీ పరాజయం పాలైందంటూ చేసిన ట్వీట్ ను తార్కానంగా చూపుతున్నారు. కాగా ఇంతటి ఘోర పరాజయానికి అసలైన కారణాలు ఏమిటన్నది ఆత్మపరిశీలన చేసుకుని తెలుసుకునే ఉద్దేశమే జగన్ కు లేనట్లు కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఏ వర్గమూ కూడా జగన్ పాలనలో సంతోషంగా లేదు. ఏ వర్గమూ జగన్ కు ఓటేయాలని భావించలేదు. ఐదేళ్లు పంటి బిగవున కప్పి పెట్టిన ఆగ్రహాన్ని ఓటు అనే ఆయుధంగా మార్చి జగన్ ను తిరిగిలేచే అవకాశం లేని దెబ్బ కొట్టారు. అన్ని సామాజిక వర్గాలూ జగన్ ను తిరస్కరించాయనడానికి ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇట్టే అవగతమౌతుంది.
వైసీపీకి గట్టి దన్నుగా, బలంగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ సారి జగన్ ను తిరస్కరించారని ఎన్నికల ఫలితాలను గమనిస్తే అర్ధమైపోతుంది. రాష్ట్రంలో 3.5 శాతంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే వైసీపీ అభ్యర్థులలో అత్యధికంగా ఉన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో రెడ్డి సమాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు జగన్ 49 స్థానాలు కేటాయించారు. అంటే మొత్తం స్థానాలలో జగన్ 28 శాతం తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు. సరే మొత్తం స్థానాలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన 36 స్థానాలను మినహాయిస్తే జగన్ రెడ్డి తాజా ఎన్నికలలో రెడ్డి సమాజిక వర్గానికి 35శాతానికి పైగా స్థానాలను కేటాయించారు. అదే రాయల సీమ విషయానికి వస్తు ఇది ఇంకా ఎక్కువ. సీమలోని మొత్తం 52 స్థానాలలో వైసీపీ అభ్యర్థులలో 33 స్థానాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే ఉన్నారు. అంటే సీమలో మొత్తం స్థానాలలో 63.4 శాతం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే జగన్ రెడ్డి వైసీపీ టికెట్లు కేటాయించారు. అదే రాయలసీమ ప్రాంతంలోని 9 ఎస్సీ రిజర్వేషన్ సీట్లను మినహాయిస్తే ఈ శాతం 75కు పెరుగుతుంది. అలాగే జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు స్థానాలలో సొంత సామాజికవర్గానికి చెందిన వారినే పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టారు.
ఇక ఇప్పుడు ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులలో జగన్ రెడ్డితో సహా ఆరుగురు మాత్రమే విజయం సాధించారు. జగన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గం రాష్ట్రంలోనే రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి జగన్ రెడ్డి విజయం సాధించినా.. గత ఎన్నికల కంటే మెజారిటీ తగ్గింది. ఇక రెడ్డి సామాజికవర్గ జనాభా అధికంగా ఉన్న రెండో నియోజకవర్గం అనపర్తి. ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిపై బీజేపీ క్యాండిడేట్ విజయం సాధించారు. ఈ ఉదాహరణలే చాలు రెడ్డి సామాజిక వర్గం వైసీపీని, జగన్ ను తిరస్కరించిందని చెప్పడానికి.
సరే వైసీపీ నుంచి విజయం సాధించిన రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులలో జగన్ ను మినహాయించి మిగిలిన వారి విషయాన్ి వస్తే వారిలో ఎవరికీ కూడా 15 వేల ఓట్లకు మించి మెజారిటీ రాలేదు. పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నేతగా గుర్తింపు పొందిన పుంగనూరు అభ్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం 6 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. మరో ఇద్దరు రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులు రెండు వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ రెడ్డి తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెడ్డి సామాజిక వర్గంలో ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.