రిజర్వేషన్ కు ఇక గుర్తింపు కార్డు తప్పనిసరి
posted on Nov 30, 2012 @ 2:12PM
రైల్వేల్లో రిజర్వేషన్ టికెట్ పొందాలంటే ఇక గుర్తింపు కార్డు తప్పనిసరి. ఈ నియమం రేపటి నుండి అమల్లోకి వస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇంతవరకూ, ఎ సి, తత్కాల్ టికెట్లకు మాత్రమే ఈ నియమం వర్తించేది. ప్రస్తుతం స్లీపర్ క్లాస్ టికెట్లకు కూడా ఇక గుర్తింపు కార్డు తప్పనిసరి. పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐ డి కార్డ్ వంటి కొన్ని గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇక రైల్వే ప్రయాణానికి తప్పనిసరి.
గుర్తింపు కార్డు లేని ప్రయాణీకుల్ని టికెట్ లేని వారిగా గుర్తించి టికెట్ ఛార్జ్ తో పాటు జరిమానా కూడా విధిస్తామని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియచేసారు. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు టికెట్ తీసుకొనే సమయంలో ఈ గుర్తింపు కార్డులను చూపించాల్సిన పనిలేదు.దొడ్డి దారిన ఆదాయాన్ని పొందేందుకే ఈ నియమాన్ని అమల్లోకి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే, దేశంలో చాలా మంది ప్రజలకు ఏ విధమైన గుర్తింపు కార్డులు లేవు. అంటే, వారు రిజర్వేషన్ ప్రయాణానికి అనర్హులా అనే ప్రశ్న తలెత్తుతుంది. దేశ ప్రజలందరికి, ఏదో ఒక గుర్తింపు కార్డు జారీ చేసిన తర్వాత ఈ నియమం అమల్లోకి తెస్తే బాగుండేది.