టీడీపీ తీరంలో వలస పక్షులు!
posted on Nov 12, 2013 @ 1:37PM
టీడీపీ తీరంలో వలస పక్షులు సంచరిస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే టీడీపీలోకి దూకేయడానికి రెడీగా వున్నాయి. కాంగ్రెస్, వైఎస్సార్సీపీతోపాటు టీఆర్ఎస్ నుంచి కూడా తెలుగుదేశంలోకి రావడానికి పలువురు ప్రముఖ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పైమూడు రాజకీయ పార్టీలలో కీలక నాయకులుగా వున్నప్పటికీ సరైన గౌరవం లభించని అనేకమంది నాయకుల నాలుకలు పిడచగట్టుకుని పోయాయి.
టీడీపీ తీర్థం పుచ్చుకోవడమే దీనికి సరైన పరిష్కారమన్న ఆలోచనలో అనేకమంది నాయకులు వున్నారు. వారంతా సరైన సమయం కోసం ఎదురుచూస్తూ టీడీపీ నాయకులతో రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. అడ్డగోలు విభజన నిర్ణయంతో సీమాంధ్రలో అడ్డంగా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు పదిలంగా వుండాలన్నా, తెలుగుజాతి భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీని బలపరచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉద్ధండ పిండాల్లాంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం.
ఇక వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీలో వున్న అనేకమంది నాయకులు కూడా తెలుగుదేశం నీడకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి ఒక స్పష్టమైన విధానం లేకపోవడం, పార్టీ నాయకులు జగన్మోహనరెడ్డి నిరంకుశ, నియంతృత్వ ధోరణి, రాష్ట్రాన్ని విభజించడానికి జగన్ సోనియాతో మిలాఖత్ అయ్యాడన్న విషయం బహిర్గతం కావడం.. వీటన్నిటి కారణంగా ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగటం కంటే అటు తెలంగాణలో, ఇటు సీమాంధ్రలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీలోకి మారడమే ఉత్తమమన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో కలుగుతోంది. అలాగే టీఆర్ఎస్ కుటుంబ పాలనని తట్టుకోలేకపోతున్న అనేకమంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వలస వచ్చే నాయకుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంలా కనిపిస్తోంది.