కరోనా అనాథలకు కేంద్రం బాసట
posted on May 26, 2021 @ 4:39PM
కరోనా ప్రాణాలను తీయడమే కాదు, జీవితాలను ఛిద్రం చేస్తోంది. తల్లి తండ్రులు ఇద్దరూ కరోనా కాటుకు బలై అనాధలుగా మిగిలిన చిన్నారుల వ్యధలు గుండెలు పిండేస్తున్నాయి.ఇలా అనాధలుగా మిలిన వారిలో నెలల వయసు పసికందులున్నారు, పట్టుమని పదేళ్ళు లేని పసి పాపలున్నారు. కన్నవారిని కోల్పోయిన వారే కాదు, తాము కన్నపిల్లలను కోల్పోయి అనాధలైన వృద్ధులు ఉన్నారు. ఇలా కరోనా మహమ్మారి అనాధలుగా మిగిల్చిన అందరినీ, అన్ని విధాల ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తామని భరోసానిచ్చింది. అందుకోసం నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 1 నుంచి మే 25 వరకు దేశవ్యాప్తంగా, కరోనా కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన 577 మంది చిన్నారులును గుర్తించినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ అందరి ఆలనా పాలనా కేంద్ర మహిళా,శిశు సంక్షేమశాఖ చూసుకుంటుందని, ఆమె వివరించారు. అనాధలుగా గుర్తించిన పిల్లలు అందరూ ప్రస్తుతం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వారికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి కౌన్సిలింగ్ ఇప్పంచడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. వీరి బాగోగులపై రాష్ట్ర, జిల్లా యంత్రాంగాల నుంచి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటోందని వెల్లడించాయి.
కొవిడ్ సెకండ్ వేవ్’లో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులను, ఏ ఆసరా లేని వృద్ధులను ఇతర బాధిత వర్గాలను ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. వారికి అవసరమైన వైద్యం, భద్రత కల్పించాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ సాయం ఎలా పొందాలో మార్గనిర్దేశం చేయాలని సూచించింది.