యడ్యూరప్ప కొత్త పార్టీ పనులు విజయదశమినుంచే ప్రారంభం
posted on Oct 25, 2012 @ 11:28AM
కొత్తపార్టీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బిజెపి గుడ్ బై కొట్టేశారు. తనకి బిజెపితో సంబంధాలు తెగిపోయాయని, కొత్త పార్టీకి ప్రజలు మద్దతివ్వాలని ఆయన కర్నాటక వాసులకు విజ్ఞప్తి చేశారు. బిజెపికి ఇంకా రాజీనామా సమర్పించని యడ్యూరప్ప విజయదశమి సందర్భంగా తన కొత్త పార్టీ ఏర్పాట్లను లాంఛనంగా మొదలుపెట్టేశారు. డిసెంబర్ పదో తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి తన రాజీనామా లేఖని పంపుతానని యడ్యూరప్ప చెబుతున్నారు. తనకి పార్టీతో ఏమాత్రం పడడం లేదని, పడనప్పుడు వేరు కుంపటి పెట్టుకోవడంలో ఉన్న సంతోషం మరి దేంట్లోనూ ఉండదని యడ్డీ వ్యాఖ్యానించారు. స్కామ్ లో ఇరుక్కుని ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న యడ్యూరప్ప ఆరు నెలలు తిరిగేలోగా మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటానని కలలుగన్నారు. కానీ.. పార్టీ అధిష్ఠానం ఆయనకు మొండిచేయి చూపించింది. అలిగి అటకెక్కిన యడ్డీ తనకికి మళ్లీ ఛాన్స్ దక్కే అవకాశం లేదని గ్రహించి, కొత్త కుంపటి పెట్టుకోవాలన్న బలమైన ఆలోచనని ముందుకు తీసుకొచ్చారు. యడ్యూరప్ప కర్నాటక బిజెపి అధికార పీఠాన్ని కోరుతున్నారు. దాన్ని యడ్డీకి ఇస్తే ప్రజల్లో చెడ్డపేరొస్తుందని పార్టీ భావిస్తోంది. రెండు పక్షాలకూ మధ్య లంగరు కుదరని పరిస్థితుల్లో యడ్యూరప్ప తనదారి తను చూసుకున్నారు.