వేప పువ్వులు
కుమారి పి. లీలా వెంకట్రామన్

వెండి పళ్ళెం లో పువ్వులు కుప్పగా పోసి ఉన్నాయి.
ఒకదానితో ఒకటి కిలకిల లాడుతూ సంభాషించు కుంటూన్నట్లుంది వాటి వాలకం!
మాటల మధ్యలో అప్పుడప్పుడు అడ్డు వస్తూన్న మలయ మారుతానికి కొసరి కొసరి సువాసనలను పంచి ఇచ్చి పంపేసి తిరిగి, తమ గొడవ లో పడిపోసాగాయి.
అరువు తెచ్చుకున్న సువసనలే అయినా అవలీలగా పంచి ఇచ్చేస్తుంది , అటు నుండి ఇటు, ఇటు నుండి అటు వీచే పిల్ల గాలులకి మలయ మారుతం. అప్పు అడిగి తెచ్చుకున్న వస్తువును అరుదుగా చూసుకుంటారు ఎవరైనా, అయినా మలయ మారుతం మహా దుబారాగా ఖర్చు చేసేస్తుంది.
ఆ ఇంటి పరిసరాల్లో ని గాలులకి ఆ విధమైన హృదయవైశాల్యం , హృదయ నైర్మల్యం ఉండడం లో గొప్ప ఏముంది? ఆ ఇంటి పరిస్థితే అంత!
ఒక్కొక్క వారావరణం లో ఉంటుంది తమాషా!
సిగరెట్లు కాల్చుకుంటూ, ఉంగరం తెగనమ్మి మేక మాంసం తిని, జులాయిగా తిరిగే గాంధీ మహాత్ముడు మారిపోయిన ముఖ్య కారణం అయన తండ్రి పెంచిన వాతావరణం!
ఒక్కొక్క స్థలం లో ఉంటుంది ఆ అదృష్టం!
వేట కుక్కలను తరిమి కొట్టిన కుందేళ్ళు, ఆ గమ్మత్తు చూపించ బట్టే విజయ నగర సామ్రాజ్యం వెలిసింది.
ఇక్కడ అంతే!
మాటల్లో పడిపోయిన మల్లె పువ్వులని రెట్టించి, అవి మాటల సందర్భంలో పడిపోయి ఎంతెంత పంచి పెట్టేస్తున్నది మరిచిపోయిన మలయ మారుతం -- ఆ సువాసనలను ఒక చేతితో అందుకుంటూనే మరొక చేతితో దానం చేసేస్తుంది పిల్ల గాలులకి.
అరవిచ్చు కుంటూన్న మల్లెల వాసన పరిసరాలన్నింటి లోను ప్రసరించింది. అలలు అలలుగా పోయి ఏవేవో విషయాలని వెలికి తెచ్చి కవ్వించేస్తుంది.
వెండి పళ్ళెం మెరుపులో వాటి నవ్వులు, సంతోషము ప్రతిబింబిస్తున్నాయి.
నవ్వుకుంది సుమిత్ర వెండి పళ్ళెం లోని మల్లె పువ్వుల్ని, వాటి నవ్వుల్నీ, పక్కనే పడి ఉన్న దారపు బండిని చూసి.
మొగ్గగా పుట్టే ముందు తెలియదు వాటి భవిష్యత్తు వాటికి.
పూచినా తరవాత ఎంచుకున్న వాళ్లతో జరగదు.
జరిగిన వాళ్ళతో జీవితం ముగిసి పోతుంది.
అమాయికంగా సంభాషించు కుంటూన్న మల్లెలను చూస్తూనే దీర్ఘంగా నిట్టూర్చింది సుమిత్ర.
యాంత్రికంగా ఒక్కొక్క పువ్వునే ఏరి మాల కట్టసాగింది!
పక్కపక్కగా ఉన్న పూలనే ఏరి మరీ కడుతుంది శ్రద్దగా.
'అమ్మా సుమిత్రా!" కింది నుండి రామారావు గారు పిలుస్తున్నారు.
"వస్తున్నాను, వస్తున్నా, నాన్నా!" పూల పళ్ళెం చేత్తో పట్టుకొని మేడమేట్లు గబగబా దిగి వచ్చింది సుమిత్ర.
గంబీరంగా ముందుకు నడిచాడాయన!
ఆయనకి మాట్లాడవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటె, అలా గంభీరంగా నడిచి తోటలోని మల్లె పందిరి కింద సిమెంటు సోఫాలో కూర్చుని చర్చించడం అలవాటని ఆ ఇంట్లో అందరికి తెలుసు.
అది కాకుండా అయన మాట్లాడదలుచుకున్న విషయమూ తెలుసు సుమిత్ర కి!
హుందాతనం అయన చేతి కర్ర విదిలింపు లలో ఉట్టి పడుతుంది.
ప్రతి అడుగు లోను, కదలిక లోను గంబీర్యం తాండవమాడుతుంది . మౌనంగా అయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ అనుసరించింది సుమిత్ర.
సిమెంటు సోఫాని సమీపించి కూర్చునేసరికి అప్పటి వరకు చప్పుడు చేసిన అయన చేతి కర్ర కూడా విశ్రాంతి తీసుకుంటుంది. పచ్చని గడ్డి మీద తీరికగా మెత్తని అడుగుల చప్పుడు కూడా మాయమయింది.
విషయం ఎలా కదపాలో తెలియని పరిస్థితి ఆయనిది.
ఆ విషయం లో ఆయనని ఎలా ఒప్పించాలో ఊహ కందని స్థితి అమెది.
మనస్సులో తికమకలు పడిపోతూన్న తండ్రీ కూతుళ్ళ ను అటు వచ్చిన పిల్ల గాలి చూసి, నిశ్శబ్దం గజ్జలు సవరించు కుంటుంది. లేవాలి త్వరగా అంటూ, విచ్చుకుంటూన్న మల్లెలను ఒక్కసారి పలకరించి, అవి పలకరింపు లకు జవాబుగా నవ్విన నవ్వుల్లోని సువాసనల ని అంది పుచ్చుకుని తండ్రీ కూతుళ్ళ మీద వెదజల్లి మాట్లాడు కొండి అంటూ సాగిపోయింది.
పిల్ల తెమ్మేరలలో అల్లల్లాడే సువాసనలు మృదువుగా మనస్సు ను తట్టే సరికి ఆప్యాయంగా పువ్వులను చేతిలోకి తీసుకుంటూ , "సుబ్బన్న మల్లె పువ్వులు కోసి ఇచ్చి వెళ్లి పోయాడా? ఈ ఏడాది చాలా పువ్వులు పూస్తున్నట్లున్నాయే." ముందుగా పలకరించాడు తండ్రి , హుందానీ గంబీర్యాన్నీ చెదరగొట్టే నవ్వు నవ్వుతూ!
"సుబ్బన్న వెళ్లి పోయాడు కానీ ఇక్కడున్న మల్లె పువులన్నీ ఈ మల్లివే అనుకుంటున్నావా? అబ్బే కాదు. ఆ మధ్య కరణం గారి నడిగి, బొండు మల్లెల అంటు తెచ్చి ఆ మూల గాను, అదే మల్లిని అంటు కట్టి అటు వైపు మరో దిక్కు గాను వేసిన ఆ రెండు మల్లెలు కూడా పూశాయి. మూడు మల్లెలు కలిపి కోసేశాడు. మరేం, నాన్నా! నువ్వూ, నేనే కాదు , ఆఖరికి సుబ్బన్న కూడా ఇందులోని ఏయే పూవులు-- ఎన్నెన్ని పువ్వులు, ఏ ఏ మల్లె వో కూడా కనిపెట్ట లేడు!'మెల్లిగా తలఎత్తి తండ్రి మొహం లోని మార్పులను గమనిస్తూ అంది సుమిత్ర, అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచు కోవడం ఇష్టం లేక.
అసలు సుమిత్ర చెప్పేది త్వరగా వినేస్తే తాను మాట్లాడ వలసినది చాలా ఉందనే భావన లో . త్వరత్వరగా సంభాషణ ఒక కొలిక్కి తెద్దామనే తొందర లో వెనువెంటనే ఒప్పేసుకున్నారు రామారావు గారు, "అవును సుమీ" అంటూ.
తండ్రి జవాబు కోసం ఎదురు చూస్తున్న సుమిత్ర తృప్తిగా తల పంకించి, అయన ఈ సంభాషణ ముగించి వెయ్యదలుచుకున్న విషయాన్ని గుర్తుంచుకుని, ఎంత త్వరగానో తిరిగి సంభాషణ ఉపక్రమించి, అదే ప్వువుల మీద నెట్టి తను చెప్పదలుచుకున్న విషయం చెప్పి వెయ్య దలిచింది.
ఒక్కొక్క పువ్వునే ఏరి మాల కడుతూ మొదలెట్టే సింది అరక్షణం తేడాలో.
పాపం, ఆ పువ్వులు తల్లిని అంటి పెట్టుకుని ఉండేటప్పుడు ఏవేవి పక్కపక్కగా ఉండేవో, మాలి సుబ్బన్న అన్ని మల్లి పందిరి నుండి కోసి కలిపేశాడు.....కొమ్మలలో, మొగ్గలుగా ఉన్నప్పుడే నవ్వుకుని అవి ఉంటాయి, "నువ్వు నేను జతగా ఉందాం" అని ఒకదానితో ఒకటి!
పువ్వుల జీవితాలను గూర్చి ఎరిగి ఉన్నవి కాబట్టి, వాటి అమాయికత్వానికి అల్లల్లాడు టూ నవ్వే ఆకులను కూడా లెక్క చేసి ఉండవు!
మహా అయితే రాతి ఆకారం లో మలిచిన దేవుడి కి కానీ, ఊహ చిత్రం అయిన అతీత వ్యక్తీ పటానికి గానీ తలిగించి ఉంటాయి వికసించాక!
విడివిడిగా పూజ చేసే దేవుడి ఓడిలోను, పాదాల మీద, భక్తీ గల ముత్తయిదువుల ముడి లో ముచ్చట గాను, పరమ ఛాందసుల పిలకలలో ఒంటి గాను నలిగి పోతాయి అప్పుడప్పుడు!
సర్వసాధారణం గా దారాల ముడి లో ఇరుక్కుని, ఆడవారి తలల్లో నల్లటి కురుల మధ్య తమ అందానికి తామే మురిసి నవ్వు కుంటుంటాయి.
మూడు వంతుల పువ్వుల జీవితం మాత్రం దారం ముడి లోనే ముగిసి పోతుంది.
మొగ్గ తొడిగే వరకు అమాయికంగా ఉండే ఆ పువ్వులు, ఒక్కొక్క రేకనే విప్పుకుంటూ పక్క నున్న వాటి లో సఖ్యం చేసేసు కుంటాయి.
"నీవు నేను జతగా ఉందాం! విడిపోవద్దు!' అని ఒకదాని కొకటి చెప్పుకుంటాయి . ఒకే కొమ్మకి పూచిన బోలెడు పువ్వులు!
వాటికి , పాపం ఆ సమయం లో తెలియనిది, తోటమాలి ఎవరిని ముందర కోసుకుని పోతాడో, ఎవరి పక్కన ఎవరిని సజ్జలో పడవేస్తాడో అనేది!
అవి అనుభవ పూర్వకంగా తెలుసుకున్న తరవాత కూడా సజ్జ లో ఒకదాని పక్కగా మరో కొత్త నేస్తం కనిపించేసరికి కనీసం మనమేనా ఒకళ్ళ నొకళ్ళు విడిచి పెట్టద్దు!" అని ప్రమాణాలే చేసుకుంటాయి.
కాని, మాల కట్టే మాలిని కివేమీ పట్టవు! చేతికందిన పువ్వు తీసుకుని మాల పూర్తీ చేసేస్తుంది!
రెండు కొత్త పువ్వులు దారం తో ముడి వేసి, మరో రెండు పువ్వుల్ని మరో దారం ముడి లో ఇరికించే యత్నం లో మునిగి పోతుంది!
నిరాశ పడిపోయినా, ఒకదాని నొకటి మొదటి పది క్షణాలు కొత్త కొత్త గా చూసుకుని కలిసి పోతాయి చివరికి!
ఆ దారం ముడి లోనే వడిలి వాలి పోతాయి!
అందులోనే వాటి జీవితం ఆఖరయిపోతుంది!
ఇక మీదట వినే ఓపిక నశించింది రామారావు గారికి.
"అంటే ....నీ ఉద్దేశ్యం నా కర్ధమైంది కాని....అమ్మా , సుమిత్రా! నేనే కదా మాలను కట్టేది! నాకు నచ్చిన పువ్వులు జతలుగా కట్ట వచ్చునే?" గంబీర్యపు సంకెళ్ళు వణికి పోతున్నాయి!
వేదన ప్రతి అక్షరం లోను ప్రతి ధ్వనిస్తుంది!
కళ్ళ లోను, పెదవుల కదలిక లోను, మాటల పొందిక లోను ప్రతి బింబిస్తుంది!
"నాన్నా! మరీ , విశాలి కిష్టమైనట్లు కట్టవా నువ్వు? అది కూడా నీ కన్నకూతురే కదూ?' అణిగి పోనీ నిరాశ నిట్టూర్చింది అడుగునుండి.
"కాదమ్మా, మొగ్గలుగా ఉన్నప్పుడు తెలియనివి. ఎన్నెన్నో అనుకుంటాయవీ, అవన్నీ జరగవనీ నువ్వే ఒప్పుకుంటున్నావు కదా! అయినా ఇది నువ్వు మొగ్గగా ఉన్నప్పటి నుండి అనుకున్న విషయం. అదే సువాసనలు వికసించాక కూడా విరజిమ్మే సమయంలో వికసిస్తూ సువాసన లని వెదజల్లుతూన్న పువ్వును ఇప్పుడు వికసించ బోయే మొగ్గ కోసమని వాడిపోనిస్తానా? అసలు ఆ మొగ్గ వికసించేందుకు తగిన వాతావరణం కల్పించే బాధ్యత నాది! నాకు నువ్వు కొన్ని విషయాలు వదిలేయాలమ్మా." విశాలి సుఖం కోసం, విశాలి కట్టుకుంటున్న గాలి మేడల కోసం తను నిర్మించుకున్న బంగారు హర్మ్యాన్ని కూడా దానం చేసి, తన సుఖాన్ని త్యాగం చేసేసుకో నిశ్చయించు కున్న సుమిత్ర నిస్వార్ధత మరీ బాధించింది రామారావు గారిని!
"లేదు, నాన్నా, విశాలి మొగ్గ కాదీ నాడు . వికసించిన విరజాజి, నాన్నా! ఈనాడు నువ్వు విరజాజి విరిసి సువాసనలు వెదజల్లు తుంటే, దూరానికి విసిరి మొగ్గ అనుకుంటున్నావా?' సుమిత్ర కంఠం లో ఏడుపు అదిమి పెట్టి లేనిపోని గంబీర్యాన్ని ప్రదర్శిస్తుంది.

"మొగ్గగా నాకు తెలియనియ్య కుండా, పూర్తిగా వికసించే వరకు , నీకు నువ్వు అన్యాయం ఎందుకు చేసుకున్నావమ్మా? నాకీ క్షోభ ఎందుకు కలిగించావు తల్లీ?' పెద్ద ఎత్తు కొండ మీది నుండి పల్లానికి దూకే వాగులా ఉంది బాధ అయన కంఠం లో!
"నేనూ మొగ్గ గానే ఊహించు కున్నాను, నాన్నా! కాని -- నాకూ తెలియనేలేదు చాలా కాలం వరకు! వికసించి సువాసనలు వెదజల్లు తున్నా , ఆ మాత్రం పసి కట్ట లేవా, అనకు నాన్నా! నా నమ్మకమే నాకు ద్రోహం చేసింది!
నీకు తెలుసును కదా ఎదటి వాళ్ళ డైరీలు చదవడం నా దృష్టి లో ఘోరమని!
ఒకరోజు నేనేదో కేకలేస్తే మూల కూర్చుని వ్రాసుకుంటుంటే చూశాను!
ఏం వ్రాసుకుందో చూడమని మనస్సు వేధిస్తే, తప్పు సుమా అని మనస్సుకు నచ్చ చెప్పుకుని ఆ ఊహను అణచి వేసుకున్నా.
నా నిర్లిప్తత లో , నా నమ్మకం లో , నా నిజాయితీ లో నా విధి నేను నిర్వర్తించడం లేదని భయపడి ఒకసారి స్నేహితులతో పోతున్నానని చెప్పి గోపాలం తో సినిమాకు పోయిన దాని డైరీ చూశాను!"
ఏటో చూస్తూ వింటూన్న రామారావు గారు తన వైపు తిరిగి తలవంచుకుని రెండు మల్లెలు కలిపి జంటగా వస్తే, వాటిని ఒకే దారం ముడి లో ఇరికిస్తూన్న కూతుర్ని చూసి కడుపులో బాధ మెలికలు తిరిగే సరికి, తల పక్కకి తిప్పుకుంటుంటే ఆమె కన్నీటి బొట్టు కంట పడేసరికి ఉలిక్కి పడిపోయారు!
వికసిస్తున్న మల్లె రేకుల మీది తడి లో చంద్ర కిరణాలు పడి నవ్వు తున్నాయి! వికసించే మొగ్గలలో తడి ఎక్కడిది? ఆ మెరుస్తున్న తడి అంతా సుమిత్ర కన్నీరే! ప్రశ్న ఉదయించిన వేను వెంటనే పూల దండ చేతులోకి తీసుకున్నాడాయన.
బోలెడు తడి రాలిపోయి అరచేతిలో చంద్ర కిరణాలు నవ్వుతూ కనిపించే సరికి ఆమెకు తెలియనియ్య కుండా సుమిత్ర మొహం చూడ్డానికి ప్రయత్నించి కూడా విఫలులయ్యారు రామారావు గారు.
