నిశ్శబ్దం అవలించు కుంటూ ఒళ్ళు విరుచు కుంది, మగత నిద్ర నుండి మేల్కొని!
ఆవలింత కి అన్నగారు ఉంటారు, తుమ్ముకు తమ్ముడు లేడు గాని, సుమిత్ర కూడా అవలించుకుంటూ లేచి నిలబడింది. "లే, నాన్నా, అమ్మ మన కోసమని చూస్తూ ఉంటుంది. భోజనాల వేళ దాటి పోతుంది కూడానూ." పళ్ళెం లో పూల మాల పడవేసింది తండ్రి చేతుల్లోంచి అంది పుచ్చుకుని!
ఈసారి కూతుర్ని అనుసరించడం తండ్రి వంతు అయింది!
కనిపిస్తున్న తండ్రి కూతుళ్ల మొహాల్లో ఏమైనా చదవ గలనేమో అనుకుని ప్రయత్నం లో పరిశీలించి విఫలురాలయింది సత్యవతమ్మ. వాళ్ళ ముఖాలను ఫ్రెంచి భాషలోను, జర్మను భాష లోను చదువు కోలేక పోయినా, వాళ్ళు ఏ విధమైన నిర్ణయానికి వచ్చింది మాత్రం తెలియనివ్వడం లేదు! నిరాశపడి నిట్టూర్చింది.
కొంచెం దూరంలో టేబుల్ లైటు కింద బుద్దిగా పుస్తకాలు తెరిచి కూర్చున్న పన్నెండేళ్ళ రాజు మనస్సు ఈ గంబీర వాతావరణానికి కాస్సేపు కంగారు పడి తనను చూసి చిన్నగా నవ్విన సుమిత్ర అక్కయ్య ని చూసి తృప్తిగా నిట్టుర్పు విడిచి, ఎనిమిదో క్లాసు తెలుగు పుస్తకం లోని ములిగి పోయింది.
"అమ్మా! అన్నం వేళయిపోయింది గా, మన అందరికి అన్నాలు వడ్డించేయ్యనా?' దిగులును ఎంత త్వరగా మింగి వేసిందో ఆమె పెదవుల మీద చిరునవ్వు!
ఆ గంబీర్యానికే రామారావు గారు గర్వపడేది!
అదే గామ్బీర్యానికి సత్వవతమ్మ ఆశ్చర్యపడేది!
దానికే విశాలి సుమిత్రని మరింత అసహ్యించు కునేది!
అందుకే రాజు సుమిత్ర అక్కయ్య ను ఆ సమయంలో భయం భయంగా చూసేది!
అందువల్లనే గోపాలం, మొట్టమొదట సుమిత్ర ను, పెద్ద అందకత్తె కాని సుమిత్ర ను ఇష్టపడింది!
"విదేశాలకి వెళ్ళిపోబోతూన్న కూతుర్ని మనస్సులో ఊహించు కుంటున్నా వల్లే ఉందే!" పరిహాసాన్ని ఆ గదిలోకి లాక్కువచ్చి గంబీర్యాన్ని తరిమి వేశారు రామారావు గారు.
దిగులుగా నవ్వింది సత్యవతమ్మ!
అదే తల్లీ కూతుళ్ళ లోని పెద్ద తేడా!
దిగులుగా ఉన్నా సంతోషాన్ని పెదవుల మీద నాట్యం చేయించ గల ఓర్పు తల్లి కెలాగూ ఇవ్వలేదని కూతురికే ఇచ్చాడు సృష్టి కర్త!
"అనుకోవడం లో చాలా ఆనందమే ఉంటుంది కాని, ఒక్కొక్కసారి అనుకుంటుంటే కొన్ని కొన్ని పనులు కరగకుండా పోతాయి." నవ్వేసింది తన పెళ్లి విషయం అనుకుని ఆనందించడం , అది జరగకపోవడం ప్రతి ధ్వనించింది ఆ వాక్యంలో!
"అక్కా, నాకు తెలుగు రావడం లేదే!" అనుకోకుండా సంభాషణ వేరే పక్కకు లాగేశాడు పసివాడైనా రాజు.
"మరింకేం వస్తుందిట? సరే, నేను అన్నం తింటూ చెబుతాలే , రా!"
తల్లి వెనకాలే సుమిత్రా, తండ్రి వెనకాల తల్లి, సుమిత్ర తో మాట్లాడుతూ రాజు భోజనాల గదిలోకి వెళ్ళిపోయారు. వెండి నవ్వుల పీటల మీద ఆసీనులయ్యారు తండ్రీ కూతుళ్ళు పక్కపక్కగా.
ఎదురుగా తల్లి కూడా వడ్డించేస్తూ తినేయ్యాలనే ప్రతిపాదన ప్రవేశ పెట్టింది సుమిత్ర రెండో పక్కన పెద్ద తమ్ముడు కూర్చుని అక్కయ్య ని అడగవలసిన ప్రశ్నలు చూసుకుంటున్నాడు.
గిన్నెల చప్పుడు, గరిటెల చప్పుడు తప్ప మనుష్యుల అలికిడి లేదు.
మౌనంగా ఉంటె డానికి భయపడి వాళ్ళెం నిర్ణయించు కున్నదీ చెప్పేస్తా రని, మౌనంతో జయించవచ్చునని సత్యవతమ్మ మౌనం లోనే పనులు ముగించేస్తుంది.
"చూశావా , నాన్నా, మనమెంత ఆలస్యంగా వచ్చామో! అమ్మకి బాగా ఆకలిగా ఉన్నట్లుంది. మాట్లాడే ఓపిక లేక ఎంత త్వరగా పెట్టేస్తుందో!" ఓరకంటి తో తల్లిని చూస్తూ అంది, తండ్రి నుద్దేశించి సుమిత్ర.
చిరునవ్వు పెదవుల మీద చిలకరించింది, ఓటమి ఒప్పుకుంటూన్నట్లు సత్యవతమ్మ.
తల్లి చిరునవ్వు ను చూస్తూనే కిలకిలా నవ్వేసింది సుమిత్ర!
కొన్ని జన్మల నుండి పురులలో దాచిన ధాన్యాన్ని తిరగతోడినట్లు విపరీత వేగంతో ప్రవహించే ప్రవాహానికి ఒక్క నిమిషం అడ్డుకట్టి , మళ్ళీ వదిలి వేస్తె చేసే గలగలలు వినవచ్చినట్లూ , ఏవో మధురమైన విషయాలు మదిలో దూరి కితకితలు పెట్టినట్లూ అనిపించింది వయసు మళ్ళిన దంపతులకి సుమిత్ర నవ్వు!
వరండా లో కట్టిన ధాన్యపు కంకెల కోసం చేరే పిచ్చుకల గుంపుల కల కలలు గుర్తుకు వచ్చాయి రాజుకు!
తీరికగా నవ్వేశాక, విషాద చాయలు తారాడాయి, "ఇంతటి నవ్వు నేను నవ్వగా వినేవాళ్ళు లే'రనే ఊహ మదిలో మెదిలిన సుమిత్ర ముఖంలో.
"నాన్నా.....అమ్మ చిన్నప్పుడు మూగనోము పట్టిందా?" చాలాకాలం తరవాత పుట్టిన సుమిత్ర ప్రశ్నించింది తండ్రిని.
"మీ అమ్మ మూగ నోమును గూర్చి మీ అక్కయ్య కు చాలా బాగా తెలుసు నా కంటే " నవ్వారు రామారావు గారు.
అక్క మాట వింటూనే దిగులు లోకి దిగజారి పోతున్న తల్లిని చూసి గుటకలు మింగి సంభాషణ మార్చేసింది సుమిత్ర.
'ఆ మధ్య ఒక చిన్న సవరణ తో క్రిసిన్ సబ్మిట్ చేసెయ్యాలి. ఇక్కడ నుండి మీరేమో ఉత్తరాలు వ్రాయడం లేదు! మనస్సులో ఊరుకేనే దిగులు! క్లాసుకు పొతే ఏమి చెప్పేదాన్నో నాకే తెలియదు! ఏదో ప్రాక్టికల్సు కి చెప్పేసి, కుర్చీ లో చతికిల బడి ఆలోచిస్తూ కూర్చునే దాన్ని.
అవును, మీరు తెలియజేయ నంత మాత్రాన్ని, ఇక్కడి విషయాలు నాకు తెలియవనా మీ ఉద్దేశ్యం? స్పటికం లాంటి మనస్సు ముందు యేది నిలబెడితే అదే ప్రతిబింబిస్తుందిట! మీ ప్రతిబింబమే పడడానికి కారణం, నా హృదయ కవాటాల మీద, గోడల మీద మీ చిత్తరువులే కదా ఉంట! చిత్రం! నే చిత్రించు కున్నట్లుగా పడవు అవి. మీరిక్కడ ఏ విధంగా ఉంటె ఆ విధంగానే ఉంటాయి.
నీడలు అబద్దాలు చెబుతాయి.
అందుకే నీకు ఒంట్లో బాగాలేదని నాకు క్షణాల్లో తెలిసి పోయింది. ఆ విషయం నా మనస్సు కు చేరనీయకుండా దిగులు మాత్రం ఆవహించింది.
అయినా నువ్విలా ఉంటె నాకేం, నీకే అమ్మా!
విశాలి, మీ చిన్నారి కూతురికి అక్కడ ఎంత దిగులుగా ఉంటుందనీ?" తల్లిని చూస్తూ అంది సుమిత్ర ముగింపు గా!
"దాని కా బాధలు లేవు నీకే తప్ప!" సుమిత్ర ప్రయోగించిన అస్త్రాన్ని రెండు ముక్కలుగా విరిచి పడేసింది సత్యవతమ్మ, మర్నాడు పొయ్యి లోకి ఉంటుందని కాబోలు!
నవ్వేశారు కూతురి ఓటమి కి రామారావు గారు.
"అక్కా! మరీ , సత్యవంతుడు అల్పాయుష్కుడు అని తెలిసినా కూడా సావిత్రి సత్యవంతుడనె పెండ్లాడ దలిచిన కారణా లేమిటక్కా?' అని ఉనికి జ్ఞప్తి కి తెస్తూ తను వచ్చిన పని నిర్వర్తించదలచి నట్లున్నాడు రాజు!
ఉలిక్కిపడ్డారు సుమిత్ర తల్లి తండ్రులు.
ఏ దిగులు నుండి తల్లిని తప్పించి వేద్దామని మాట్లాడు తుందో అదే పరిస్థితిలోకి విసిరి వేయబడింది సుమిత్ర!
నోట్లో పెట్టుకున్న అన్నాన్ని నమల కుండా మింగేసింది గజిబిజి లో.
ఉక్కిరి బిక్కిరై గుటకలు మింగేసిన కూతుర్ని అరక్షణం చూసి అవే మానసిక బాధ అద్దంలో ప్రతిబింబం లా ముఖంలో, కదలిక లలో కనిపిస్తుంటే నిశ్చేష్టులయ్యారు రామారావు గారు.
మంచినీళ్ళు తాగింది ఉపశమనానికి సుమిత్ర.
కదలని కాలాన్ని, చూసి తెల్లబోయాడు రాజు.
కోలుకుంటూన్న సుమిత్ర తల్లి తండ్రులని ఓర కంటితో పరిశీలించి తమ్ముడ్ని చూసి దిగులుగా నవ్వుకుని తీరికగా మొదలు పెట్టింది , మనస్సు లోనే ఆ అవకాశాన్ని కల్పించిన భగవంతునికి వేయి కృతజ్ఞతలు తెలుపుకుంటూ.
"సావిత్రి వన విహారానికి వెళ్ళిన దగ్గర నుండి ఉందా నీకు? ఉన్నా లేకపోయినా కధ తెలుస్తుంది లే విను. ఒక రోజున చెలి కత్తెలతో వన విహారాని కై వెళ్ళింది సావిత్రి! అక్కడ సత్యవంతుడ్ని చూస్తూనే అతనినే పెళ్ళాడాలి అని నిశ్చయించు కుంది. తిరిగి వెళుతూనే ఆ విషయాన్ని తండ్రికి చెప్పేసరికి రాజ్యం కోల్పోయిన సత్యవంతుడి కి తన కూతురి నిచ్చేదేలా అని ఆమె తండ్రి మనస్సులో తికమక పడుతుంటే నారదుడు వచ్చి మరో విషయాన్ని, అంటే సత్యవంతుడి తరపున ఇంకో అభ్యంతరం నివేదిస్తాడు. అదేమంటే సత్యవంతుడు అర్ధాయుష్కుడని! ఆ విషయాన్ని వింటూనే ఉలిక్కిపడి తన ముద్దుల కూతురిని, గారాల కూచిని అల్పాయుష్కుడి చేతిలో పెట్టడానికి తండ్రి ససేమిరా అంగీకరించనంటాడు! అంతటితో ఊరుకోక ఆమె కోసమని వివిధ రాజ్యాల రాజుల పటాలన్నీ తెప్పించి ఎంచు కొమ్మంటాడు. ఒకసారి మనస్సుకు ఇచ్చేశాక మళ్లీ ఏవో వంకలు పట్టుకుని, అతనిని వదిలి మరో రాజును కోరుకొమ్మని బోధిస్తున్న తండ్రికి సావిత్రి ఎదురు తిరిగి అంటుంది.
