Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 7

కొన్ని నిమిషాలపాటు మంగమ్మ అలానే నిలబడిపోయింది. అది రోడ్దనిగానీ, తను బొమ్మలాగా నిలబడి పోయాననిగానీ మంగమ్మకు తెలీదు. చేతిలో సంచి అలానే ఉంది. ఇంకా అలా ఎంతసేపలా ఉండేదో తెలీదు. ఓ పొడుగాటి నల్లటి కారొకటి దాదాపుగా ఆవిడమీద పడబోయినంత దగ్గరగావచ్చి, చటుక్కున ఆగి, చెవులు గింగురెత్తేలా అరవసాగింది.
"ఏవఁమ్మా! బతకాలని లేదా?" అన్నాడు డ్రైవరు, సైడులోంచి తల ఇవతలికి చూస్తూ.
వెనుకసీట్లో వేళ్ళనిండా ఉంగరాలున్న ఆసామీ కూచుని ఉన్నాడు. ఎదర అద్దంలోంచి అతను మంగమ్మను చూశాడు. ఎక్కడో చూసిన మొఖంలాగా ఉంది. కానీ ఎక్కడ చూసిందీ, చప్పునగుర్తులేదు. అతనికి గుర్తొచ్చేలోగా మంగమ్మ అక్కడలేదు. ఆసరికే ఆవిడ వీషి మలుపు తిరిగిపోయింది.
"ఆ పోయినావిడ నాటకాల్లో వేషాలేస్తుందిగదట్రా" అన్నాడు ఉంగరాల మనిషి ఎవర్నో చూస్తూ.
డ్రైవరు సన్నగా ఏదో గొణిగాడు.
- చాలా సేపటివరకూ మంగమ్మ అలా నడుస్తూనే ఉంది. ఆవిడకో గమ్యమంటూ లేదు. దాదాపుగా పిచ్చిదానిలాగా, పదకొండు గంటలవరకూ తిరుగుతూనే ఉంది. దోవలో చాలామంది.,ఆవిడ్ని పలకరించారు. వారికేమని సమాధానం చెప్పింది మంగమ్మకు జ్ఞాపకం లేదు. ఒకరిద్దరు కొంటె వెధవలు. లోగడ ఆవిడాడిన నాటకాల్లోని డైలాగుల్ని ఆవిడ వెనక బిగ్గరగా అరిచారు. మరొక్కప్పుడైతే, ఆ డైలాగులు విని ఆవిడ తప్పకుండా సంతోషించి ఉండేది.
మధ్యాహ్నం మూడుగంటలకు హోటల్లో ఓగది అద్దెకు తీసుకొంది. ఆదరా బాదరా ఇన్ని చన్నీళ్ళు మీద దిమ్మరించుకొంది. పలుచని చీర కట్టుకొని, మంచంమీదకు వాలింది. కొంతభారం తీరినట్లనిపించింది మంగమ్మకు. అంతవరకూ ఆవిడ పచ్చి మంచినీళ్లయినా తీసుకోలేదు. తీసుకోవాలని కూడా ఆవిడకు అనిపించలేదు.
ఒక్కసారి మంచంమీంచి లేచికూచుంది. కిటికీలోంచి రోడ్డు దాని కవతలగా షాపులు, అందులో వొచ్చే పోయే జనం - తోపులాట, రకరకాల ధ్వనులు - అందరూ ఏదో పనిలో మునిగి తేలుతున్నారు.
వారందరికీ ఏవో ఆశలున్నాయి. ఏమో చేయాలన్న ప్రేరేపణ ఉంది వారితోపోలిస్తే, తనురాయికన్నా అధ్వాన్న మనిపించింది మంగమ్మకు. తనకిప్పుడున్నదేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక మంగమ్మ గిజగిజలాడి పోయింది.
ఎలాగడపడమన్న భయం తనకులేదు. రామచంద్రం గారన్నట్లు భగవంతుడు తనకింత అందమిచ్చాడు. వయసిచ్చాడు. ఈ రెండింటికి మాంచి విలువున్న సంగతి తనకు తెలుసు. తనీ రోజున కాస్త కాలుజారితే తనను అందలాల్లో ఊరేగించే వారున్నారు. తనను పూలతో పూజించే వారున్నారు. తను మహాపతివ్రత కాదుగానీ మరీ బజారు సరుక్కూడా కాదు. రోజుకో మగాడితో గడపడం లోని అసహ్యత, జుగుప్స బయటివారికి తెలీదు. తనా వాతావరణంలో పెరిగింది. ఆ బ్రతుకు కొంతకాలం బ్రతికింది. ఆ అనుభవాలను తలుచుకుంటే - వొంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్లుంటుంది తనకు. ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు. తనే క్షణాన నాగమణి దగ్గరకెళ్ళినా ఆవిడ ఎగిరి గంతేస్తుంది. తనమీద, వేళకు వేలు వ్యాపారం చేస్తానని నాగమణి ఏనాడో అన్నది. ఇప్పుడా అవకాశం మరింత పెరిగింది.
మామూలు రోజుల్లోనే తనంటే జనం పడిచచ్చేవారు. ఆ హోటలు, దాని పేరేమిటో తనకిప్పుడు జ్ఞాపకంలేదు - అప్రోప్రియేటరు తనకోసం అంగలార్చాడు. వాడిదగ్గర వంద రూపాయలు పుచ్చుకొని, రాత్రికి తనగదిలోకి పంపించింది నాగమణి., మగవాళ్ళ మీద అసహ్యం కలగడానికి అదే ప్రారంభం. ఆ కామేశ్వరరావు చూడడానికి ఎంత అందంగా ఉంటాడో లోపలంత విశాలంగా ఉంటాడు. అతనన్న మాటలు, చేసిన పనులు తను జన్మ జన్మలకు, కూడా మరిచిపోలేదు వాడు తాగడమే కాకుండా, తన్నుకూడా తాగమని బలవంతం చేశాడు. చేతులు రెండూ పైకెత్తించి ఒళ్ళు చీరుకుపోఎలాగా చూసేవాడు అలా చూస్తూ చూస్తూ వాడు చేసిన పని - జ్ఞాపకం రాకుండా ఉంటే ఎంత బావుణ్ణు.
ఎంతమంది మనుషులు ? ఎన్ని రకాల మనుషులు? ఏ ఇద్దరికి సంబంధాలుండవు, ఏ ఇద్దరికీ పోలికలుండవు, మెరక వీధికొచ్చేసరికి పెద్ద పొగాకు వ్యాపారం చేస్తాట్ట - కూలీలకు సరిగ్గా కూలీడబ్బులివ్వకుండా నానాహింసలూ పెడతాట్ట. వాడి దగ్గర తను నాలుగొందలు కొట్టేసింది. రాజమణి అంటూ ఉండేది. ఎక్కడన్నా ఇల్లు చూసుకుని నువ్వూ నేనూ ఉందాంపదవే! ఇద్దరం తలుచుకొన్నామంటే, టైమంతా పూడ్చిపారేస్తాం. అని.
తనకా వృత్తి మీద ఎంత అసహ్యమో రాజమానికి తెలీదు, కానీ తానా అసహ్యాన్ని బయటకు కక్కలేదు. అందువల్ల ప్రయోజనమేమీ లేదని తనకు తెలుసు.
"పోలీసు ఇన్స్ పెక్టర్ కరీం, నాకు తెలుసు. గాడిదకొడుకు, నేను కనపడితే చాలు., వళ్ళు మరిచిపోతాడు. అవసరమయితే మనకే ఇబ్బందీ రాకుండా చూడమని వాడితో చెబుతాను, నీ అంత చాకచక్యంగా డబ్బు పిన్దలేకపోయినా, వచ్చిన ఖాతాలను మాత్రం పోగొట్టనులేవే" అనేది రాజమణి.
దానికి ఈ వాతావరణంలోంచి రావాలని లేదు. రామచంద్రం, మాధవరావులు రాకపోతే ఏమయ్యేదో తను చెప్పలేదు. వారు రావడంతో తన బ్రతుకులో, ఓ గొప్ప మార్పువచ్చింది. ఆ ఊబిలోంచి తను బయటపడింది. ఇంతకు ముందు దాకా రాజవిచారంగా రోజులు గడిచిపోయాయి. ఇంతకాలం తర్వాత మళ్ళా మొదటి ప్రశ్న ఆవిడముందు కొచ్చింది. దానికప్పుడు తను విధిగా జవాబు చెప్పుకోవాలి.
"కాఫీ తాగుతారా అమ్మా?" తలుపు వోరగా నించుని సర్వర్ అడిగాడు.
"ఊఁ"
"టిఫిన్ కూడా తీసుకురమ్మంటారా" అన్నాడు వాడు.
"ఊఁ "
"ఏం తీసుకు రమ్మంటారు?"
ఈసారి "ఆఁ"-"ఊఁ"లతో జవాబు చెప్పేందుకు లేదు అంచేత-
"ఏదోటి తీసుకురా!" అన్నది మంగమ్మ, సర్వర్ కేసి తిరిగి వాడు మంగమ్మ కేసే చూస్తున్నాడు. వాడి కళకళ తళతళలాడుతున్నాయి. దాహంగొన్న వాడిలాగా పెదవులు తడుపుకొంటున్నాడు ఈ లక్షణాలను ప్రదర్శించే మగవాడు లోలోపల ఏమనుకొనేదీ మంగమ్మకు అనుభవమే! ఆ సంగతి మనస్సులో మెదలగానే "ఓ వెధవా!" అనుకొన్నది మంగమ్మ.
"వెళ్ళవోయ్! త్వరగా కాఫీపట్రా" అన్నది మంగమ్మ విసుగు నటిస్తూ.
సర్వర్ తలదించుకొని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాక మంగమ్మ తనలో తనే నవ్వుకొంది. ఆ నవ్వు నవ్వులాగా లేదు. ఏడవలేక నవ్వినట్టుంది.
సర్వర్ కాఫీతోబాటు ఫలహారం కూడా తెచ్చి బల్లమీద ఉంచి, ఎడంగా నిలబడ్డాడు.
"నీ కిక్కడేమిస్తారోయ్" అన్నది మంగమ్మ చేతులు కడుక్కొంటూ.
వాడో క్షణం తటపటాయించి "పూటకుయాభై" అన్నాడు.
అది అబద్దమని తెలిసిపోతూనే ఉంది. ఆ మాట ముఖంమీదనే అనేయడం మంగమ్మ కిష్టంలేదు.
"ఊఁ" అన్నది మంగమ్మ.
"సంసారం లేనివాణ్ణి వొంటరిగాణ్ణి. ఎక్కడి తొక్కిడిగా సరిపోతాయి" అన్నాడు వాడు మంగమ్మను మింగేసేలా చూస్తూ.
"సుఖపడు నాయనా" అనుకొంది మంగమ్మ, ఆ విషయమే నిజం కావాలని లోలోపల కోరుకుంటూ.
ఆవిడ తిన్నదాకా ఉండి, పళ్ళాలూ కప్పులూ పట్టుకెళ్ళాడు. వెడుతూ వెడుతూ మరోసారి మంగమ్మకేసి తిరిగి, అదోలాగా కళ్ళు తిప్పాడు.
"ఓరి నా బిడ్డా!" అనుకొంది మంగమ్మ నవ్వింది.
ఆవిడ కెందుకో, వొక్కసారి నాగమణిని చూడాలనిపించింది. గబగబా స్నానం చేసింది. మళ్ళీ ఉన్నవాటిల్లో కల్లా మంచి చీరె తీసి కట్టుకొంది. పట్టుజాకెట్టు తొడుక్కుంది. రెండు జడలు వేసుకొంది. ఆజాద ముందుకు మరోటి వెనక్కు సర్దుకుంది. మున్గురులులను కొద్దిగా రేపుకొంది. అయిదారు వెంట్రుకలను మెలితిప్పి ఎడం కనుబొమ్మమీదుగా జిగురుతో అంటించుకుంది. ఇంత స్నో పట్టించి కొద్దిగా సెంటు రాసుకొని, ప్లాస్టిక్ చేసంచిని వూపుకొంటూ వీధిలో కొచ్చింది.
వెనక నుంచి ఎవరో "మంగమ్మరా? నాటకాల్లో వేషాలేస్తుందే! అదీ" అంటున్నారు.
పోతున్న రిక్షాను ఆపి, చెంగున ఎక్కి కూచుంది.
"నాగమణి ఇంటికి పోనివ్వవోయ్! కోళ్ళగూడెం ప్రక్కకు" అన్నది మంగమ్మ.
"హైసా" అని నవ్వి, గంటను మోగించాడు రిక్షావాడు.
నున్నని తారు రోడ్డుమీదుగా రిక్షాచక్రాలు 'రఁ య్" మని జారిపోతున్నాయి. ఆ చక్రాల్లాగే మంగమ్మ ఆలోచనలు కూడా సంచలిస్తున్నాయి. రిక్షావాడు, మధ్య మధ్య గంటను మోగించుతూ, కుదుపులు వచ్చినచోట వేగాన్ని తగ్గిస్తూ ఉత్సాహంగా తొక్కుతున్నాడు. ఇటువంటి బాడుగలవల్ల కలిగే లాభాలేమితో వాడికి బాగా తెలుసు.
మంగమ్మ మనస్సు మనస్సులో లేదు. అధిప్పుడో ఇనుళ్ళపుట్టలాగా ఉంది. తానిప్పుడు నాగమణి ఇంటికి ఎందుకు వెడుతున్నదో తెలీదు. తిరిగి పూర్వపు జీవితంలో అడుగు పెట్టాలన్న ఉద్దేశమా? అదెంత మాత్రంలేదు. ఆ వ్రుట్టివల్ల, ఆర్ధికమైన బాధలంటూ ఉందని మాట నిజమేగాని, బ్రతుకంటే డబ్బు వొక్కటే కాదుగదా! ఈ నాటకాల గొడవతో, తానీ ఊబినుండి బయటికి రాకపోతే, అదే పరమార్ధమనుకొనేదేమో మరి! అంతకన్నా మంచిబ్రతుకు, కొన్నేళ్ళపాటు బ్రతికింది. ఈ క్రొత్త బ్రతుకులో డబ్బూ, కీర్తీ కూడా లభించాయి. ఇప్పుడు తిరిగి ఆ మురికి కూపంలోకి వెళ్ళడంలో అర్ధంలేదు.
మరో అరగంటకల్లా నాలుగైదు గొందులు తిరిగి ఓ పాతరకం పెంకుటింటి ముందు రిక్షా ఆగింది.
"దిగండి!" అన్నాడు రిక్షావాడు వచ్చే నవ్వును ఆపుకొంటూ.
మంగమ్మ హఠాత్తుగా మేలుకొన్న దానిలాగా ఉలిక్కిపడింది ఎదురుగా నాగమణి ఇల్లు. లోపలనుంచి ఒకటి రెండు ముఖాలు తొంగిచూసి పక్కకు తప్పుకొన్నాయి. మంగమ్మ ఓ రూపాయినోటు రిక్షావాడి కిచ్చి చిల్లరకోసం ఎదురు చూడకుండానే లోపలికి వచ్చింది. వీధిలో ఉండగా, తొంగి చూసిన రెండు ముఖాలు మంగమ్మను ఎగా దిగా చూస్తున్నాయి.
"అమ్మలేదూ?" అన్నది మంగమ్మ ఆ కొత్త ముఖాల కేసి తిరిగి., పరిశీలనగా చూస్తూ.
"ఎవరు?" అన్నది వాళ్ళలో చిన్నావిడ, మంగమ్మను ఎగాదిగా చూస్తూ.
మంగమ్మ ఏ జవాబు చెప్పలేదు. ఆ ఇంటినంతా కళ్ళతో వెదికింది. ఇల్లు లోగడలాగాలేదు. గోడలకు మంచి మంచి రంగులతో బాటుగా అందమైన పఠాలుకూడా ఉన్నాయి. హాలు మధ్య సోఫాలు, ఓ మూలగా రేడియో గ్రాం ఇంకో ప్రక్కన పుస్తకాలు, పత్రికలూ, ఎదురుగా ఉన్న బీరువాలో పింగాణి సామాను, నేలమీద మెత్తని తివాచీ - తనుగానీ పొరబాటు పడలేదుగదా అనుకొంది మంగమ్మ. ఆవిడ నోటినుండి మాట వచ్చేలోగానే మరో అరడజను మంది అమ్మాయిలు చుట్టూ ఉన్న గదుల్లోంచి మధ్య హాలులోకి వచ్చారు. వారందరూ మంగమ్మకు కొత్తవారే!
"మీరు మంగమ్మగారేకదా?"
అన్దో అమ్మాయి. కళ్ళు ఇంత చేసుకొని మంగమ్మ కేసి ఆప్యాయంగా చూస్తూ.
"ఆఁ"
"వస్తా" అంటూ ఆపిల్ల లేడిలాగా దూసుకుపోయింది లోపలకు.
"కూచోండి అక్కయ్య ఇప్పుడే వస్తుంది" అన్నదింకో అమ్మాయి కుర్చీని మంగమ్మ నించున్న చోటుకు జరుపుతూ.
మిగిలిన వాళ్ళు మంగమ్మను చూస్తూ ఏమిటేమిటో గుసగుడా లాడుకొంటున్నారు ఒకటి రెండు నిమిషాల్లో నే ఇందాక లేడిలాగా దూసుకుపోయిన పిల్ల, అంత వేగంగానూ, మళ్ళా హాల్లోకి వచ్చింది. ఆ పిల్ల వెనకనే మరో ఆవిడ నెత్తినిండా ముసుగు వేసుకుని, నడకా పరుగూ కాకుండా వచ్చింది. వస్తూనే రెండు చేతులు చాపి "మంగమ్మా!" అంటూ కావలించుకొంది. ఆగొంతు విననకగానీ రాజమణిని గుర్తుపట్టలేక పోయింది మంగమ్మ. రాజమణి బొమ్మ మనస్సులో మేరవడంతోనే, ఎవరో పట్టకారులో నరాలను మెలిపెట్టి లాగినట్లనిపించింది. మంగమ్మకు, ఉవ్వెత్తుగా లేచి తన సర్వశక్తులతోటి రాజమణిని తనలోకి హత్తుకొంది. ఇద్దరికళ్ళూ నీటితో నిండిపోయాయి. చాలా సేపటివరకూ ఇద్దరూ అలానే ఉండిపోయారు.
లేడిలాగా లోపలికి పరుగెత్తుకుపోయిన వాసంతి ముఖం ఎందుకో మబ్బు కమ్మినట్లయిపోయింది. మిగతావాళ్ళు ఏమిచెయ్యడానికి తోచక అలాగే నిశ్చేష్టులయి చూస్తున్నారు.
"చాలా చిక్కిపోయావు రాజ్యం" అన్నది మంగమ్మ ముందుగా తనే కౌగిలిని విడిపించుకుంటూ.
రాజమణి మాట్టాడలేదు, ఆవిడ చేతులు పూచిక పుల్లల్లాగా నవిడిపోయాయి.
"కాఫీ పట్టుకురండర్రా!" అని ఎదురుగా నుంచున్న పిల్లకు చెప్పి, "రా లోపలికి పోదాం" అన్నది రాజమణి.
"వొద్దు ఇక్కడే కూచుందాం" అన్నది మంగమ్మ లోపలి గదిలో జరిగే వ్యవహారాలన్నీ జ్ఞాపకంవచ్చి.
"ఫర్వాలేదు లేవే రా, ఇప్పటికిప్పుడే వ్యాపారం మొదలవదు ళే" అన్నది రాజమణి నీరసంగా నవ్వుతూ.
మంగమ్మ తన పాత స్నేహితురాలికేసి చూసింది. బుగ్గలు లోపలికి పీక్కు పోయాయి. ముందు వరసన రెండు పళ్ళు లేవు. నోటి ప్రక్కగా రెండు చారికలు ముసలితనాన్ని ముందుకు లాక్కుపోతున్నట్లున్నాయి. కళ్ళకింద లోతులు నల్లకప్పేశాయి. వార్ధక్యాన్ని అలంకారాలతో కప్పాలన్న వ్యర్ధ ప్రయత్నాలన్నీ రాజమణి ముఖంలో కానవస్తున్నాయి!
రాజమణి మంగమ్మ చెయ్యిపట్టుకొని లోపలికి నడిపిస్తూ ఉంది ఆ వరండాలో అడుగులు వేస్తూ మంగమ్మ వణికిపోయింది. ఆ గదులన్నీ తనకు పరిచితమైనవే., వాటిల్లో తాను నెలలకు నెలలు గడిపింది. ఇప్పటికి ఏగదిలో,  ఏ రోజున ఏమి జరిగిందీ మంగమ్మకు జ్ఞాపకముంది.
లోగడ నువ్వుండేగదిలో ఇప్పుడు వాసంతి అనే పిల్ల ఉంటుందే. నువ్వు చూశావుగా, సన్నగా, పొడుగ్గా  ఉంటుందే అదే అన్నది రాజమణి.
మంగమ్మ మాట్లాడలేదు.
"దానికి, నీ అంతపేరు తెచ్చుకోవాలని ఉంది. ఎంత బాగా పాడుతుందని! ఒక్కసారి సినిమా చూసిందంటే చాలు, ఆ పాటలన్నీ ఇట్టేనోటికిపట్టేసుకొంటుంది. ఉన్నవాళ్ళందరిలోకి దానికే కాస్తంత గిరాకి ఉంది. ఆ శకుంతల ఉంది చూశావూ, మాలావు దొంగది, మాటలతో మనిషిని మైదుపుట్టి అవతలకు పంపుతుంది.....ఏమిటే నువ్వు చెప్పేది వింటున్నట్టూ?" అన్నది రాజమణి. స్నేహితురాలి కేసి తిరిగిచూస్తూ.
"అవును గానీ, నాగమణి కనిపించలేదే?"
"నీ కింకా తెలియదా?" అన్నది రాజమణి. "అదీ ఇంటిని విడిచిపెట్టి రెండేళ్ళయింది, ఇప్పుడు ఆ మూలెక్కడో ఇంకో ఇల్లు తీసుకొని ఉంటోంది"
ఇద్దరూ రాజమణి గదిలో కూచున్నారు. వాసంతి, రెండు కప్పులతోనూ కాఫీ తెచ్చి బల్లమీద పెట్టింది. ఆ బల్లమీద రకరకాల మందు సీసాలు, ఓ ఔన్సుగ్లాసు ఉన్నాయి. ఓ మూలగా ధర్మామీటర్ కూడా ఉంది.
"ఏమిటే ఇదంతా?" అన్నది మంగమ్మ.
రాజమణి మాట్లాడలేదు మెల్లగా జాకెట్ గుండీలు విప్పి పొట్టను చూపించింది. రూపాయి కాసంత మచ్చలు, నెత్తురోడుస్తూ కనిపించాయి.
"ఇదంతా ఆ బద్మాష్ చేశాడు. వాడేదో వొరగ పెడతాడను కొని రానిచ్చాను. శరీరం కుల్లిపోయింది., అంతదాకా,. అదిచేస్తా, ఇది చేస్తానన్నవాడు డబ్బుకనిపించగానే రావడంమానేశాడు. ఆఖరికి వాణ్ని ధ్వంసం చేసిందాకా నేనూ వదల్లేదనుకోం కానీ ఏంలాభం మంగమ్మా! వాడు హాయిగా చచ్చాడు, నేను బ్రతికుండికూడా, చావు బాధ పడుతున్నాను" అన్నది రాజమణి.      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS