పిల్లలిద్దరూ మంచంమీద పడుకొన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని నిశ్చింతగా గాఢ నిద్రలో మునిగిపోయాడు. వేణుగోపాల్ అరుగుమీద కూర్చున్నాడు. వంట ఇంట్లో కటిక నేలమీద కొంగు పరుచుకొని కన్నీరు కారుస్తూనే ఉంది భారతి. "అక్క!" పదేపదే అనుకొంటూంటే మనసంతా కృతజ్ఞతా భావంతో నిండిపోతూంది.
"భారతీ!" ఖంగారుగా వచ్చారు అవధానిగారు. చటుక్కున లేచి కూర్చుంది భారతి రాజ్యలక్ష్మి గదిలోకి అందరూ ఒక్కొక్కరుగా ప్రవేశించారు.
రాజ్యలక్ష్మిలో చలనం లేదు. శ్వాస ఆగిపోయింది. వాడి ఆగి ఆగి కొట్టుకుంటూంది. తల్లి ఎక్కడికో ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతూందని పిల్లలు రాజ్యలక్ష్మిమీద పడి ఏడుస్తున్నారు. అంతకంతకు వర్షం ఎక్కువైపోతూంది. చూరులోంచి నీటిబొట్లుపడి ఇల్లంతా తడిపేస్తున్నాయి. గూట్లో అంతవరకూ వెలుగుతూన్న ఆముదం దీపం కాస్తా బయట హోరు గాలికి తట్టుకోలేకపోయింది. దూరాన ఎక్కడో పిడుగు పడింది. తీతువుపిట్ట ఇంటిమీంచి ఎగిరి పోయింది. భొతికదేహం వదిలి రాజ్యలక్ష్మి అంత రిక్షానికి దాటిపోయింది.
పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని భారతి స్థాణువులా జాగారం చేయసాగింది. వేణుగోపాల్ కాలుకాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు. అవధానిగారు రాజ్యలక్ష్మి తల పక్కన కూర్చుని గడిచిన పాతిక సంవత్సరాల వైవాహిక జీవితాన్ని నెమరు వేసుకుంటూ ఉంటే భూమిలోంచి అతని బాధను అందుకొనేందుకు ఏదైనా శక్తి ఉంటే వచ్చి ఈ సమయంలో అవధాని గారిని హృదయానికి హత్తుకొని ఓదార్చేది.
చూస్తూండగానే తూరుపురేఖలు తెల్లబడ్డాయి. దగ్గర్లో ఉన్న నాలుగైదు కుటుంబాల బంధువులు వచ్చి అవధానిగారికి ఓదార్పు వచనాలు పలికారు.
"ఇలా అయితే ఎలా, అన్నగారూ! మీ రింక లేవక తప్పదు." వేణుగోపాల్ దగ్గరగా వచ్చి అన్నాడు.
వార్ధక్యంతో బాటు హృదయాన్ని కూడా అనుభవాల వార్ధక్యాన్ని చేర్చి గుండెల్లో రగిలే మంటను మౌనంగా అనుభవిస్తూ చేయవలసిన కార్యక్రమాల్ని క్రమ క్రమంగా చేస్తూ నలుగురు మోసే పల్లకిలో ఆనాటి అత్తింటిసారెతో వచ్చిన రాజ్యలక్ష్మి ని అత్తింటినుంచి శ్మశానవాటికకు సాగనంపి అవధాని గారు రిక్తహస్తాలతో, వ్యథిత హృదయంతో ఒంటరి తనాన్ని పదిలంగా మూటగట్టుకొని గృహోన్ముఖులయారు సపరివారంగా.
* * *
"నేను చెప్పింది మరిచిపోకు. వాళ్ళు చిన్నపిల్లలు. మాట మీరవచ్చు. రెండు వేసి దారికి తీసుకురావడంలో బెదిరిపోకు. నీకు అలవాటు ఉండదు.
"పరుల పిల్లలనే భావాన్ని మరిచిపో. పెట్టినప్పుడు తల్లివై క్రమశిక్షణలో పెంచడంలో కూడా తల్లి నయ్యాను అనిపించుకో.
"నువ్వు సవతి తల్లి బాధలకు తట్టుకోలేక రాజ్యం దగ్గర చేరావు. దేవుడికి మారుపేరుగా తమ్ముడుగారు నిన్ను చేసుకున్నారు. ఆయనకు నేను ఇప్పటికే ఋణపడి ఉన్నాను. ఆ ఋణభారాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఈవేళ నీకీ పిల్లల్ని అప్పజెపుతున్నాను." పిల్లలిద్దరి భుజాలమీద చేతులు వేసి స్టేషన్ లో నిలబడి రాబోయే రైలువంక చూస్తూ కంఠంలో గరళాన్ని దాచుకుంటూ భారతికి పిల్లల అప్పగింతలు చెబుతున్నారు అవధానిగారు.
"తల్లీ తండ్రీ మీరే అయిరి నేను చేసిన పనులన్నిటికీ తప్పైనా, ఒప్పైనా అర్ధం ఉందని చెప్పి నన్ను పెంచి పెద్ధచేసి నా గౌరవాన్ని కాపాడుతూ వచ్చారు, బావా! పిల్లల విషయం మీరేమీ బెంగపెట్టుకోకండి. అక్క పోయింది, ఆమె పిల్లల్ని నా కడుపులో దాచి-" భారతి భుజంమీదుగా కొంగు తీసుకొని వంగి అవధాని గారికి నమస్కరించింది.
భారతిని ఆశీర్వదించి లేవనెత్తి, "చూడమ్మా, భారతీ! ఈ జీవితంలో నే నిక కనిపించననుకొంటాను . భగవంతుడంటూ ఉంటే నీకే కష్టం రాదు, పిల్లలు జాగ్రత్త" అని పిల్లల వైపు తిరిగారు. "చూడు, రామూ! రవి నీకన్న చిన్నవాడు. ఇద్దరూ జాగ్రత్త. పిన్నిమాట వినండి." అవధానిగారి మాటలమీద రైలు చక్రాలను దొర్లిస్తూ వచ్చి ఆగింది.
సామానంతా సర్దేసి పిల్లల్ని చెరోవైపూ పట్టుకొని రైలెక్కించాడు వేణుగోపాల్. మూగపోయిన హృదయంతో అంతు తెలియని, అర్ధంలేని ఆరాటంతో కళ్ళను మెల్లగా అవధాని గారివైపు తిప్పింది భారతి.
కంట్లో పడ్డ నలుసు మిషతో కన్నీళ్ళను గోప్యంగా దాచుకొని పిల్లల్ని తదేకంగా చూస్తూ వేణుగోపాల్ కు చిరునవ్వుతో వీడ్కోలిస్తూ ఫ్లాట్ ఫారమ్ మీద అలాగే నిలబడ్డారు. కొత్త ఊరు, కొత్త మనుషులు, కొత్త సంఘటనలు పాతవి మరిపించేస్తాయి తేలికగా. రైలు ఎక్కినా సంబరంలో తండ్రికీ తల్లికీ దూరమయ్యామన్న సంగతి కూడా మరిచిపోయారు పిల్లలు.
చెవిగూబల్ని బద్దలు చేస్తూ రైలు ఖంగుమంది. అంతకంతకు రైలు వదిలిన పొగ ఆకాశాన్నీ భూమినీ చుట్టేసి అవధానిగారు నీడను మింగేస్తూ దూరదూరతీరాలకు ప్రయాణం సాగించింది.
"ఇవేమిటండి, బాబాయిగారూ?" కారమ్ బోర్డు మీద కాయిన్స్ ఉంచి మరీ అడిగాడు అర్ధంకాని రవి.
"నీకేం తెలియదురా, తమ్ముడూ నేను చెపుతున్నా విను. నీకంటే, బాబాయిగారికంటే కూడా నేనే బాగా ఆడగల్ను!" రాము పెద్దరికపు హోదాను నిలుపు కొంటూ తమ్ముడికి అదే పద్ధతి చూపిస్తున్నాడు, ఎక్కడో చూసిన మిడిమిడి జ్ఞానంతో.
"అయితే పిన్ని నా జట్టు." భారతి కొంగులో తల దూర్చి గారాలు తీశాడు రవి.
"ఉహుఁ పిన్ని నాది. కాదు, పిన్నీ?" రాము కొంగు పట్టుకున్నాడు.
ఇద్దర్నీ దగ్గరకు తీసుకొంటూ అంది: "ఇద్దరూ నాదే మరి నేను చెప్పినట్టు వింటారా?"
ఇద్దరూ తలలు ఊపారు.
"నిజంగా?" భారతి రెట్టించింది.
"ఒట్టే, పిన్నీ!" ఇద్దరూ ఏకకంఠంతో అన్నారు.
"అయితే నన్ను పిన్నీ అని పిలవడం మానేసి 'అమ్మా' అని పిలవాలి." పెళ్ళయి కాపరానికి కాలు మోపిన రోజునుంచీ మోస్తున్న భారాన్ని మోయలేక పోయింది. ఇన్నేళ్ళుగా దాచిఉంచిన కోరికలకు సమాధి కట్టడం భారతికి చేతకాలేదు. వేణుగోపాల్ సన్నిధిలో పెన్నిధి లభించని భారతికి పిల్లల రాక సంతోశాన్ని ఇచ్చింది. కళ్ళలో కారే కన్నీటికి ఆనకట్టలు వెలిశాయి. మనసులో పగిలే నిరంతర బడబాగ్నులు ఒక్కసారిగా చల్లారిపోయాయి.
అయోమయంగా మాతృప్రేమతో తల్లడిల్లిపోతున్న భారతివైపు బిక్కమొహాలతో చూస్తున్నారు అన్నదమ్ములిద్దరూ భారతి కూర్చున్న చోటికి దగ్గరగా వచ్చి వేణుగోపాల్ అన్నాడు:
"నీకేం పిచ్చా, భారతీ! తల్లి నెరగని పిల్లలైతే అది వేరే సంగతి. బంకమట్టితో చేసే బొమ్మలకి పాకం సరిగా ఉన్నప్పుడే మన ఇష్టం వచ్చినట్టు మలుచుకో వచ్చు. కానీ, భారతీ, ఎండిపోతే అది మనల్నే ఎదిరించి చేసే బొమ్మ రాదు సరికదా కళ్ళలో రాళ్ళు పడ్డా అనుకోవలసిందేమీ లేదు!"
భారతికి అర్ధం అయింది. ఆనందభాష్పాలో, మరి దుఃఖాశ్రువులో అంతుతెలియదు కానీ చెంపల మీదుగా వచ్చి రాము, రవి ఇద్దరి చేతుల్ని తడిపే స్తున్నాయి.
"అమ్మ, అమ్మ." రాము పదే పదే అనుకొంటున్నాడు. రవి భారతిని కౌగలించుకొని, "ఆమ్మా" అంటూనే ఏడ్చేశాడు.
దూరంగా జరిగి నిలబడి భారతి మొహంలోకి పరీక్షగా చూడసాగాడు రాము. 'అమ్మ-మనసు పదే పదే అంటూంది. భారతి మొహంలో రాజ్యలక్ష్మి నవ్వుతూ రామును నడిపిస్తూంది. చంకలో రవి కూర్చున్నాడు, "నిన్ను ఎత్తుకోనా, బాబూ?" రాజ్యలక్ష్మీ చేయి చాపింది ఇద్దర్నీ ఎత్తుకోవాలని. కానీ, సాధ్యం కాలేదు. "పోనీలే, అమ్మా నేను నడుస్తా." అలా ఎంతో దూరం నడిచి వెళ్ళాడు. అలిసిపోయిన రామును గుండెలమీద పడుకోపెట్టుకొని కాళ్ళు సున్నితంగా నొక్కసాగింది. తల్లి గుండెల్లో అలాగే నిద్రపోయాడు.
కారులోంచి దింపి ఇద్దర్నీ చెరో భుజాన వేసుకుని నవ్వుకొంటూ మెట్లెక్కి పందిరి మంచం మీద పడుకోపెట్టారు పిన్నీ, బాబాయీ తను మెల్లగా కదిలాడు దొంగనిద్ర నటిస్తూ పిన్ని నిండు మనసుతో పాపల్ని జోకొట్టినట్టు జోకొట్టుతూంది. బాబాయి నవ్వుతూ అన్నారు-"నీ పిల్లలు బుద్ధి మంతులే" అని. పిన్ని కూడా కవ్వింది. "బాబాయి పెంపకం, మరి!" ఆ పిన్ని కళ్ళు అచ్చు అమ్మ కళ్ళలాగా ఉన్నాయి. అమ్మ లాగే పిన్ని ఇప్పటికీ ఇంత పెద్దగా అయినా అన్నం నోట్లోనే పెడుతుంది.' రాము ఆలోచనలు గుండెల్లో పెరిగి పెరిగి వటవృక్షంలా ఎదిగి భారతిపై మమత ఊడల్లా విజ్రుంభించి పాతుకుపోతున్నాయి- "అమ్మా!" అంటూ భారతిని చుట్టేశాడు. భారతి నవ్వుకొంది. "ఏమిట్రా, బాబూ, ఇంతసేపూ అలా నిలుచుండి పోయావు?"
పిల్లలిద్దరూ ఆలోచించడం మానేశారు. భారతి అనురాగ హృదయం చిందులు తొక్కుతూ వరద గోదావరిలా విజ్రుంభిస్తూ ప్రవహించసాగింది. "చూశారా, నా పిల్లలు!" భారతి వేణుగోపాల్ వంక చూసిందే కానీ మాట్లాడకుండా సందేశాన్ని పంపింది.
* * * *
పిన్నిని "అమ్మా" అని పిలవడం నేర్చుకొన్న పిల్లలు ఒకళ్ళ ప్రోద్బలం లేకుండానే బాబాయిని "నాన్నా" అని పిలవడం సులభంగా నేర్చుకొన్నారు.
"నువ్వు చెప్పావా, భారతీ?" మొదటి రోజునే ప్రశ్నించాడు వేణుగోపాల్. తలతిప్పింది భారతి. "లేదండీ కొన్ని కొన్ని విషయాలు బహుశా ఒకళ్ళు చెప్ప నవసరం లేదేమో?" ఆలోచిస్తూ ఉండిపోయింది.
కాన్వెంటు స్కూలులో క్రమశిక్షణతో ఐశ్వర్యాన్ని కౌగలించుకొని ఏపుగా ఉన్న ఏళ్ళకు రెండేళ్ళు ఎక్కువగా కనిపించేట్లు పెరిగారు గత ఆరు మాసాల్లోనే పిల్ల లిద్దరూ.
* * *
"వచ్చావా, రాధా!" టాక్సీలోంచి దిగిన ఆడబిడ్డను అప్యాయంతో పలకరించింది భారతి, "అంతా బాగున్నారా?" అంటూ.
"ఆఁ బాగానే ఉన్నాను." తల వంచి టాక్సీలోంచి తెచ్చిన సామానంతా లోపల పెట్టమని పురమాయించి వదినగారి వెనకే తనూ దారి తీసింది.
రాధ చేతిలో ఆరేళ్ళ పాప భారతిని చూసి ఆరిందాలా నవ్వింది పలకరింపుగా. చేతులు చాచి భారతి ఎత్తుకొన్నా ముద్దులు మూట గడుతున్న పిల్లను పరిశీలనగా చూసి హృదయానికి హత్తుకొంది.
బుట్టల నిండా పూలూ పళ్ళూ, వదినగారికీ అన్న గారికీ బట్టలూ తీసుకు వచ్చింది రాధ.
"ఇప్పుడివన్నీ ఎందుకమ్మా?" భారతి నిష్టూరంగా అంది.
"వట్టి చేతులతో రావడం ఏం బాగుంటుంది, వదినా? మీ అన్నగారే స్వయంగా తీసుకొచ్చి తీసుకెళ్ళేవరకూ చంపారు."
చేతుల్లేని గౌను తొడిగి జుట్టును ముందుకు గుండ్రంగా కత్తిరించింది. చూడముచ్చటగా గుండ్రటి కళ్ళతో మిసమిసలాడే మేలిమిచ్చాయతో కెంపురంగు చెంపలతో అమాయకంగా మాట్లాడిస్తే కిలకిలా నవ్వేసే విష్ణుప్రియ సంరక్షణ భారాన్నంతా మోయాలనే ఆశ భారతిని కవ్విస్తూంది. కోర్టునుంచి వస్తూనే చెల్లెల్ని ప్రేమగా పలకరించాడు వేణుగోపాల్.
"ఏం, రాధా! నీ కూతురు ఇప్పుడే డబ్బాలా ఉంది. రేపు పెళ్ళిఈడు వస్తే ఎవరూ చేసుకోరు."
"అంత చేసుకోనివాళ్ళని దేవిరించనవసరంలేదన్నయ్యా. మా పిల్ల మొహం చూసి ఎగరేసుకు పోతాడు. "గంభీరంగా అంది.
"అంతే, అంతే మొహం చూసి ముందుకు వచ్చి శరీరం చూసి భయపడి వెనక్కు పారిపోతాడు. కదు, పాపా?" వేణుగోపాల్ పిల్లను పైకి ఎగరేసి అందుకొన్నాడు.
* * *
రాధ పనిగట్టుకొని విశాఖనుండి రావడంలో ఎంతో అర్ధం ఉంది. తన అన్నగారు కొత్తగా ఎవరో పిల్లల్ని తీసుకువచ్చి పెంచుకొంటున్నాడనేది గాలికబురేమో అనుకొంది, కానీ వాస్తవం అని తెలిసి స్థాణువైపోయింది. పైకి ఎలాంటి భావం కనబరచకుండా వారం రోజులు గడిపేసింది.
స్కూల్ నుంచి రాగానే పిల్లలు "నాన్నగారూ" అంటూ అన్నగారిని చుట్టేయడం, రాత్రుళ్ళు స్వయంగా పాఠాలు చెబుతూంటే ఒళ్ళంతా తేళ్ళూ, జెర్రులూ పాకుతున్నట్లు వినిపించింది. మద్రాసులో అంతెత్తు భవనం అన్నగారి తదనంతరం విష్ణుకే అనుకొంది. కానీ ఈ ఇద్దరూ ఎక్కడినుంచి బయలు దేరారో అర్ధం కాక కడుపులో బయలుదేరే బాధను బయటకు ఎప్పుడెప్పుడు వెళ్ళగక్కాలా అని ఎదురు చూస్తూనే ఉంది.
మేడ ఒకటే కాదు, వంద ఎకరాల మాగాణీకి వారసులు వాళ్ళేనంటే సలసలా కాగే నూనెలో నిలుచున్నట్లనిపిస్తూంది. ఇదేం పిత్రార్జితం కాదు. స్వయంగా అన్నగారి కష్టార్జితం. తనేం లావాదేవీలు చేయలేదు.

"చూడు, విష్ణుపాపను ఒకసారి ఆడించవూ?" చదువుకొంటున్న రామును లేపి పిల్లను అందించింది, పక్కనే నడిపించుకొంటూ మైదానంలో ఆడిస్తున్న కొడుకును చూసి ఆశ్చర్యపోయాడు వేణుగోపాల్. చదువు కొనే టైములో కదలని రాము ఒకరోజు కాదు, వరసగా ఎన్నో రోజులు ఇంచుమించు ఇంట్లో ఉన్నంత సేపూ విష్ణును ఆడించడంతో పిల్లలు చదువు మానేశారు.
