తన వుత్తరానికి జవాబు వెంటనే రాయలేక పోయినందుకు క్షమాపణ కోరాను. తన కోరికగా రోజూ పువ్వులూ - కుంకుమా అలంకరించుకొంటున్నానని తెలియజేశాను. శాంత వచ్చిందనీ చాలా సర్దాగా గడిపామనీ జరిగిన సమాచారమంతా పూసగుచ్చినట్లు వెల్లడించాను.
"కాని మాధవ్! నా ప్రసక్తి లేకుండానే వాళ్ళిద్దరూ ఎందుకటువంటి నిర్ణయాని కొచ్చారో అర్ధం కావటంలేదు. చిత్రంగా ఆరేణు మనకి లేనిపోని సంబంధం అంటగట్టింది. వాదించలేక వూరుకున్నాను. మీరైతే ఏం సమాధానం ఇస్తారు మాధవ్?
క్రిందటి సారి మీరు రాసిన వుత్తరం కూడా చాల గుంభనంగా తోచింది. మీరేదో మనసులోనే వుంచుకు మధనపడతారు. స్నేహితురాలిగా మీకష్టసుఖాలు తెలుసుకోదగనా? అవి ఎటువంటి విషయాలైనా అడగకుండా వుండలేకపోతున్నాను.
మరొక్క విషయం. నన్ను అపార్ధంచేసుకోరనే నమ్మికతో మనసులో మాట వెల్లడిస్తున్నాను.
"రోజూ నీ ఫోటో చూస్తూంటాను. అంతటితో సంతృప్తి పడతాను. దేనికైనా భాగ్యం వుండాలి కృష్ణవేణీ!" అంటూ రాశారు. మీరనుకున్నదే భాగ్యమే ఐతే అది మీకు అందరానిది కాదు మాధవ్! మీరేది మాట్లాడినా దాని గూఢార్దాలు నాకు బోధపడటం లేదు. "ఈ వుత్తరంలో మితిమీరి ఏదైనా రాస్తే ........ అంటూ మన్నించమని కోరారు. నాకేమీ మితిమీరినట్లనిపించలేదు. అనిపించినా మన్నించగలననుకుంటున్నాను. నాదగ్గిర జంకుగొంకులతో గాకుండా గౌరవాభి మానాలతో స్నేహం పెంచుకోమని కోరుతున్నాను.
శాంత అడిగిన విషయం నాకూ నిజమే అనిపిస్తున్నది. మీరెన్నో విషయాలు చెప్తానని కలం స్నేహం అంటూ దించారు. మరి ఏమీ చెప్పకుండా వూరుకుంటున్నారు. మీకు సమస్యలని పించే కొన్ని సామూహిక విషయాలు ఎత్తి చెప్పండి. మారేణు మీతో వాదిస్తుంది. త్వరలో పరీక్షలు ముగిసిపోతే ఈవేసవి సెలవుల్లో చాల చక్కటి విషయాలు మీనుంచి తెలుసుకోవాలి. మీ ప్రాజెక్ట్ కబుర్లే మైన చెప్పండి ఈసారి."
అంటూ ముగించాను. అప్పట్లో ఆవుత్తరం నాకంత ప్రత్యేకత కలదిగా అనిపించనేలేదు. ఆక్షణాలమహత్వం అటువంటిదై వుండాలి.
వెంటనే జవాబు వస్తుందనుకొన్నాను. వారం రోజులవరకూ ఆ సూచన లేవీలేకపోయేసరికి నేను చాలా చిన్నబోయాను. తొందరపాటు చూపించి తేలికయ్యాననుకున్నాను. తర్వాత జవాబువచ్చిందీ అంటే అది నా ఉత్తరానికి సంబంధించినట్టే లేదు. నావుత్తరం అందినట్టు మాత్రం తెలియపర్చింది. నాకు చాలా సిగ్గుచేటనిపించింది. ఆడదాన్ని. మంచికో చెడ్డకో మనసువిప్పి మాట్లాడితే అంత నిర్లక్ష్యమా? తనేదో మధనపడుతున్నట్టు నాకు రాయడం - తీరా నేను సాహసించి ధైర్యం చెప్పబోతే అంటీ అంటనట్లు తప్పు కోటం. ఏమనుకోవాలి? నాకెంత గౌరవం వుందనుకోవాలి? నిజంగా ఆభావన కల్గిన క్షణం కళ్ళు నిండుకున్నాయి-మరి రెండు ఉత్తరాలు వచ్చినా జవాబు రాయకుండా వూరుకున్నాను.
శాంత మళ్ళా అత్తవారింటికెళ్ళిపోయింది. రేణూ నేనూ శ్రద్ధగా చదివి పరీక్షలు సంతృప్తిగా రాశాము. వదిన పురిటికి పుట్టింటికెళ్ళే సన్నాహంలో వుంది- ఆరోజు వదిన్ని రైల్లో విడిచి తిరిగి రావటానికి అన్నయ్య కన్నా ఎక్కువ బాధపడ్డాను. సెలవులు ప్రారంభమై ఇంటిదగ్గర కూర్చుంటే మరీ ఏమీ తోచకుండా పోయింది.
ఓసారి చాల కష్టంగా రాసేసరికి అంతామరిచి నాపట్టుదలకి నేనే నొచ్చుకున్నాను.
"ఈమధ్య వుత్తరాలు ఆపుజేస్తే పరీక్షల హడావుడేమో అనుకున్నాను. సెలవులిచ్చినా తీరిక చేసుకోకపోతే కారణమేమిటో అంతు పట్టటం లేదు కృష్ణవేణీ! నీ వుత్తరాలు చాల సంతోషంగా వుంటాయి నాకు. ఎప్పుడూ అలా చదవాలని పిస్తుంది. అసలే కరువు చేస్తున్నావు. ఈమధ్య బొత్తిగా తోచటం లేదు. ఇల్లూ, ఆఫీసూ, ఆ క్లబ్బూ తప్ప వేరే ప్రాపకం లేదు. మొన్న లక్ష్మి వెళ్ళిపోతూ రేడియో తీసుకుపోయింది. సరేనంటే ఇల్లుకూడా పెట్టెలో సర్దుకుంటుంది లక్ష్మి. "ఎంతైనా ఆడది." అనిపిస్తుంది నాకు. కానీ స్త్రీగా పుట్టి పెరుగుతూ, కూడా స్త్రీత్వం మర్చిపోయిన వాళ్ళూ వుంటారు.
సరే! లక్ష్మికూడా వెళ్ళిపోయాక ఇంటికే రాబుద్ధి కావడంలేదు. నాకు సినిమాలు కూడా చూడబుద్ధి లేదు. నువ్వు కూడా నామీదే కోపగించి పంతం పట్టావు. ఎంతో దయగా కబుర్లు చెప్తావు ఇంతలోనే ఇంత కోపందేనికి కృష్ణ వేణీ?
సెలవుల్లో తీరిగ్గా వుత్తరాలు రాస్తానన్నావు. శాంత అడిగిన సంగతి విన్నప్పట్నించీ కొన్ని విషయాలలో నీ అభిప్రాయాలు తెలుసుకోవాలని వుంది. తీరిగ్గా వుంటావు కాబట్టి వివరంగా రాస్తూండు. కలం స్నేహం అనే పేరునైనా కొంత సార్ధకం చెయ్యాలికదా?" అంటూ ఏమిటేమిటో రాజకీయమైనవీ, - చారిత్రక మైనవీ, సాంఘికమైనవీ ఐదారు విషయాలు ఎత్తి రాశాడు. వాటికి నా అభిప్రాయాలు తెలియజేయమంటూ, వాటిలో నాచరిత్రకి చెప్పుకో దగ్గని నాలుగు విషయాలు.
వర్ణాంతర వివాహాలపై నీవుద్దేశ్యం ఏమిటి?
బహు భార్యాత్వం (మన లెక్కకి ఇద్దరనుకో) అంటే నువ్వు అసహ్యించుకుంటావా?
నీ దృష్టిలో వ్యభిచార నిర్మూలన సమంజస మేనా?
భార్యా భర్తలమధ్య వుండాల్సిన బంధాలెటు వంటివి?
ఆ వుత్తరం నాకు కొంతపని కల్పించిందని చెప్పుకోవాలి. వెంటనే కార్డు రాశాను ఏమిటో బద్దకించి వుత్తరాలు నిర్లక్ష్యం చేశాననీ - తన వుత్తరానికి తెలిసిన విధంగా త్వరలో జవాబు రాస్తాను ఏమీ అనుకోవద్దనీ.
* * *
