"మామయ్య తాగుతున్నాడా?" పెద్ద రాక్షసి లాంటి ప్రశ్న. రాధకేమీ తోచలేదు.
అప్పుడెప్పుడో పుట్టినరోజు పండుగప్పుడు తన గదికి సంబంధించినంతవరకు రెండు మూడు తాళం చేతులు ఇచ్చినట్లు గుర్తు. రాధ గబగబా తను ఉండే గదిలోకి వెళ్ళి సొరుగు లాగి చూసింది. రెండు తాళం చెవులు రింగ్ లో ఉన్నాయి. అవి తీసుకువచ్చింది. అందులో ఒకటి గది తలుపులది. రెండవది బట్టల బీరువాది.
బీరువా తెరిచి సీసాలు ఏమైనా ఉంటాయేమోనని చూసింది. ఆమె అంచనా తప్పింది. మూడు అరల్లో బట్టలు, పుస్తకాలు తప్ప మరొకటి లేదు. రాధనేదో సందేహం పీడిస్తూనే ఉంది.
మూడు రోజుల తరవాత, సూటును డ్రై వాషింగ్ కు ఇస్తూ, అలవాటు ప్రకారం జేబుల్లో ఏమైనా మరిచిపోయాడేమోనని, జేబులో చెయి పెడితే కోటు పై జేబులో రెండు కాగితాలేవో తగిలాయి. చూస్తే అవి బిల్లులు. పోయిన వారానిదీ, ఈ వారానిదీ - రెండు కలిపి రెండువందల పై చిల్లర. అన్నీ వేణు పేరుమీదే ఉన్నాయి. నగదు అమ్మకాలకు నగరంలో పేరుమోసిన బ్రాందీ షాపువాళ్ళు ఇచ్చినవి.
ఏడుపు ఆగలేదు.
రాధ అదోవిధంగా ఉండటమేకాక, ఇట్లా అర్ధాంతరంగా రాదు. ఆర్తి బుజ్జగిస్తున్నట్లు అడిగింది. రాధ గుప్పిటలో ఉన్న రెండు బిల్లులను ఆర్తిముందు ఉంచింది.
"ఊఁ, అనుకున్న మార్పుకు కారణం ఇది..." రాధవైపు చూస్తూ, "నువ్వెళ్ళు, నేను అంతా చక్కబరుస్తాను" అంది ఆర్తి. పేషెంట్లు అందరినీ పంపివేసి, ఇంటికి రాకుండానే ఆఫీసుకు ఫోన్ చేసింది. రిసీవరు వేణు అందుకున్నాడు.
"సునీతను పిలిపించు."
నిమిషం సేపటికి సునీత, "నమస్తే, డాక్టర్" అన్నది.
"నమస్తే! సాయంత్రం ఇక్కడికి వచ్చి ప్రార్ధనకు ముందు నన్ను ఒంటరిగా కలుసుకో!"
"ఎందుకు?"
"అంతా తరవాత."
ఆర్తి చెప్పిన ప్రకారం ముందుగానే వెళ్ళి ఆమెను చూసింది. సంగతి విని నిర్ఘాంతపోయింది.
"పాపా! ఇంత నైచ్యానికి పాల్పడుతున్నాడని నేను విచారించడంలేదు. మనసులో బలహీనతకు తట్టుకో లేనంత స్థితికి దిగజారాడు. ఏ ఎదురు దెబ్బను ఓర్చుకోలేని హీనుడయ్యాడు. ఇది ఆత్మద్రోహం కిందే లెక్క. జీవితమంటే కష్టసుఖాల సమ్మేళనమే."
సునీత అంతర్ద్రుష్టిలో విజయగర్వంతో నవ్వుతున్న వేణు. 'దైవత్వం మీలో ఉందని ఆరాధించాను. ఆరాధిస్తున్నాను. కాని....కాని .... మీ రెందుకింతగా పతనంకావాలని కోరుకుంటారు, వేణూ?' వేణుకు చెప్పుకున్నది స్వగతంగా.
"పాపా, నేను వేణును దండించి శాసించే దశ ఏనాడో పోయింది. నువ్వు ... నువ్వు వేణు మనసు మార్చాలి. ఆ భారం నీదే!"
"డాక్టర్ ..."
"అవును, పాపా! ఉండు ..." అంటూ బీరువా దగ్గిరికి వెళ్ళి అందులోనుండి పిస్తోలు తీసింది. దానిని సునీతముందు పడవేసి, "పిరికితనంగా దేనికో బానిసై బతికినదానికన్నా మృత్యువు నయం. బాధను ఓర్చుకుని భరించడంలో ఆనందం ఉంది. అమ్మ మరణిస్తూ వేణును బామ్మ, పెద్ధక్కయ్యల చేతుల్లో పెట్టి అప్పజెప్పింది. అక్కయ్య అత్తవారింటికి వెళుతూ, వయసులో ఎక్కువ తేడా లేకున్నా నాకు ఒప్పగించింది. ఇంతవరకూ నాకు వేణుమీద మాతృస్థానంలో ఉన్న అధికారాలన్నీ నీకు ఇస్తున్నాను. వేణు తన మార్గాన్ని మార్చుకునేందుకు ఇష్టపడక పోతే కాల్చిపారవెయ్" అంది.
వణుకుతున్న చేతులతో దాన్ని బాగ్ లో వేసుకుంది సునీత.
"ప్రార్ధన అయ్యాక బంజారాహిల్సుకు వేణును తీసుకువెళ్ళు. చెప్పగలిగిన విధంగా చెప్పి చూడు, లేక పోతే ..." అర్దాంతం చేసింది మాటను.
బంజారాహిల్సులో తమ ఇంటికి వెళదామని సునీత అన్నపుడు వేణు విస్తుపోయాడు. కారును గేటు దగ్గిర ఆపి, తాళంచేతులు తేవటం లేదని గుర్తుకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వాటిని తెచ్చాడు.
ఆ ఇల్లంతా శబ్దరహితంగా ఉంది. పైన బాల్కనీ లోకి వెళదామంది. వెళ్ళారు. చాలాసేపు తెచ్చిన పత్రిక తిరగేస్తూ కూర్చుంది సునీత. విసుగు ప్రదర్శిస్తూ, "సస్పెన్సులో పెట్టక వచ్చిన పనేమిటో చెబితే సంతోషిస్తాను" అన్నాడు.
"మనం ఇద్దరమూ ఇప్పుడు ఏకాంతంగా ఉన్నాం. ఈ చల్లని వెన్నెల, అందమైన మీరు నాపక్కన, నేను మీ పక్కన..."
"షటప్! ఏమిటా మాటలు?"
"ప్రియాప్రియుల ప్రేమ బాటలు. ఇది నిషా, ప్రేమనిషా అంటారు."
"నీకేం పిచ్చెక్కలేదు గదా?"
"అలాగే అనుకోండి. బ్రాందీ, బీరు, విస్కీ లిచ్చే మత్తుకన్నా, ఈ ప్రేమ అనే మత్తు తక్కువంటారా, వేణూ!"
వేణు కుర్చీలో ఎగిరిపడ్డాడు.
"చెరో రెండు డ్రాములు బీరో, బ్రాందీయో వేసుకుంటే మన ఈ ప్రేమసమాగమం మరింత శోభస్కరంగా ఉండవచ్చు!"
"సునీతా!" బల్లమీద శక్తికొద్దీ బాదాడు. "ఏమిటీ నాటకం?"
"నాటకమా?! ఛ, పచ్చి నిజం. పోనీ, ఈ కాయితాలు చూస్తే ..." అని బాగ్ తెరిచి ఆర్తి ఇచ్చిన బిల్లులు అతనిముందు ఉంచింది.
వేణు మొహం మాడిన పెనమైంది. తల పట్టు కుంటూ జుట్టులో వేళ్ళు దూర్చి, రెండు మోచేతులను టేబిల్ మీద పెట్టాడు. సునీత కుర్చీ అతఃని దగ్గిరికి జరుపుకుంటూ అంది: "నావైపు చూడండి, వేణూ. తల పట్టుకుని ప్రయోజనం లేదు."
వేణు చూడలేదు. పిస్తోలు బల్లమీద ఉంచింది.
"డాక్టరుగారు అన్నారు మీరెప్పటిలా మీ అలవాటు మానుకొని ఉండలేనంటే మిమ్మల్ని.....మిమ్మల్ని...."
"కసిదీరా కాల్చివెయ్యమన్నది." అందుకున్నాడు వేణు. "బహుశా మీ అందరూ ఈ శని గ్రహం వదిలి..."
"ఓహ్, ప్రభూ!"
"నీకే అడ్డూ ఉండదు! నా నులివెచ్చని రక్తం, పాడు తాగుళ్ళు జీర్ణించుకున్న విషతుల్యమైన నెత్తురు .....శాంతినిస్తూ ప్రవహిస్తుంది. కాల్చెయ్యి, నీతా! నీ చేతితో మృత్యుసన్నిధికి పంపుతానంటే నాకూ..."
సునీత వేణు కాళ్ళ దగ్గిర కుప్పలా కూలింది. "మీరు లేనినాడు నేనూ లేను. కాని ఒకటి, వేణూ! వ్యసనాల నేవి మనిషి కెన్నడూ తాత్కాలికంగా తప్ప సుఖాన్ని ఇవ్వవు. వాటికి బానిసకావడం సులభం. ఎంత క్షణికానంద కారకాలో, అంత నిరాశను పెంపొందిస్తాయి. మీ పేరు చెబితే తాగుడు, జూదం అన్నీ ఓడిపోతాయనుకున్నాను. అది తాగినప్పుడే మీరు ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఆ నిషా దిగాక మీరు నిర్విచారంగా ఉండగలుగుతున్నారా?"
"లేదు!"
"అటువంటప్పుడు ఎందుకిది? డబ్బు, ఆరోగ్యం అన్నీ నాశనమవుతాయి. శరీరంలో ప్రతి అణువునూ పీల్చి పిప్పిచేస్తుంది. ఎన్ని కుటుంబాలు దీని పై శాచిక నృత్యం కింద పడి, నామరూపాలు లేకుండా పోయాయో..."
"డబ్బున్నవాళ్ళు అంటే నీకు కోపం గదా? సంతోషించు." తల కొద్దిగా ఎత్తాడు.
"నా హృదయానికి తెలుసు, నేనెవరి వినాశనాన్నీ కోరనని. నా అనాథ జీవితం గుర్తువచ్చి, కలతగా అన్న మాటలు. నా అధిదేవులైన మీ సుఖంకన్నా నాకు కావలిసింది లేదు, వేణూ!"
"కావచ్చు. మనం ఇద్దరమూ సమాంతరరేఖలమే అన్న భావము, ఆ దూరం ఎన్నటికీ దగ్గిర కాదనీ, రాధ కోసం నువ్వు మన ఇద్దరి మధ్యా ఈ దూరం సృష్టించానని తెలిసినప్పుడే...."
"నేను తప్పు చేశానా? నాది తప్పా, వేణూ ?"
'రాతినీ, రత్నాన్నీ సమానంగా చూసే నీ విశాల దృష్టికి కాకపోవచ్చు. కాదుకూడాను. కాని అల్ప మనస్కుడినైన నాకిది భరంచరానిదయింది. పగలు నా కళ్ళ ఎదట ఉంటావు. ప్రతి చేష్టతోను నాలో ముద్ర వేస్తావు. కాని రాత్రిళ్ళు నీగురించిన తలంపులు నిద్ర పట్టనివ్వవు..."
"తాగితే ఇవన్నీ జరగవా?"
"మనసుకు హాయిగా ఉంటుంది. నీతో విహరిస్తున్నట్లు గాలిలో దూదిపింజల్లా ఎగురుతున్నట్లు .... అలాగే నిద్రపడుతుంది...
"ఉదయం లేచాక మళ్ళీ దిగులు. బరువు ....
"కానీ ఆఫీసూ, రాధా, నువ్వూ - రొటీన్ లో పడిపోతాను. అప్పుడెప్పుడో నాకు నువ్వు రాసినట్లు రాధలో నీ రూపం చూసుకుందామనుకుంటాను. ఆ రోజు రాధ నల్లని కళ్ళలో లీలా మాత్రంగా నువ్వున్నావనిపించింది. కానీ ఆమె కళ్ళూ నన్నే ప్రతిబింబిస్తున్నాయి. రెండుమూడుసార్లు చూసినా అంతే....దాన్ని విరమించుకున్నాను."
"నైతికంగా దిగజారటం ఎంత త్వరగా జరుగుతుందో, ఆ ఊబిలోకి దిగాక వెలుపలికి రావడం అంత కష్టం. ఇప్పటికీ మించిపోయింది లేదు. నాకోసం .... రాధ కోసం అయినా తప్పదు."
"మీకొరకే దీన్ని అలవాటు చేసుకున్నా!"
"మీరు తప్పుగా అభిప్రాయపడ్డారు. మేం వీటిని హర్షిస్తానూ?"
"....పోవచ్చు! నాకు మనశ్శాంతి కావాలంటే ఇదే దారి."
"మనశ్శాంతి! మనశ్శాంతి! దీనికోసం డాక్టరు గారు తాగుతున్నారా? నేను తాగుతున్నానా? కళ్యాణి తాగుతూందా?"
"మీరంటే స్త్రీలు .... అన్నీ గుండెల్లో దాచుకో గలరు. నేను అక్కయ్యలాంటి యోగినిని కాదు, నీతా. కళ్యాణిలా అన్ని బంధాలకూ అతీతుణ్ణి కాదు."
"మీరు పురుషులు! ఒక్క ప్రశ్నకు జవాబు వెతుక్కోలేకపోవడం మీ పురుషత్వానికే సిగ్గుచేటు."
సవాలు చేస్తున్నావా?"
"చివరిసారి అడుగుతున్నాను, మానేస్తారా, లేదా?"
"చూద్దాం. ఇకనుంచీ నువ్వు ఎవరి వ్యక్తిగత విషయాలతోనూ జోక్యం తీసుకోవద్దు."
సునీత తోకతొక్కిన తాచు అయింది. సర్రున నిల్చున్నది. "తప్పకుండా కల్పించుకుంటాను. ఎవరు అడ్డురాగలరో చూస్తాను ..." వదనం ఎర్రగా అయింది. కోపంవల్ల మాట పెగలలేదు. చేతులతో ముఖం కప్పుకుని కుర్చీలో కూలబడింది. "నన్ను, నా మనసును మంచితనంతో దోచుకున్నారు. వేణూ .... వేణూ....మాలో ఎందుకీ చిచ్చు పెడుతున్నారు? ఎందుకు? ఎందుకు, వేణూ?"
"నువ్వు .... కాదు .... నా కెదురైన నైరాశ్యానికి ప్రతీకారం."
"కాదు ఇది కాదు.....ఆ పిస్తోలు తో నన్ను చంపెయ్యండి. నా రక్తాన్ని మీరు తాగే సీసాల్లో కలుపుకుని తాగండి..."
"ఏది చేసినా, ఒక్కటే మార్గం. నువ్వు నన్ను పెళ్ళాడటమే. అంతవరకూ..."
నరనరాల్లోని రుధిరం సువ్వున పొంగింది. వేణు, చెంప ఫెడీమని మోగింది! ఒకటి....రెండు....మూడు..... నాలుగు.....వేణు సునీత చేతిని ఒడిసి పట్టుకున్నాడు.
"దుర్మార్గుడా! అమాయికుల బ్రతుకులను ఆట బొమ్మలుగా చేసి ఆడుకుంటావని తెలిస్తే నీకేనాడో బుద్ధి చెప్పి ఉందును. వదులు...నా చెయ్యి వదులు...."
సునీతకు అంత కోపం రాగా వేణు ఎన్నడూ చూడలేదు. అపర కాళీమాతలా ఉన్నది. ఆమె కొట్టిన దెబ్బ లకు వేణు కళ్ళముందు మెరుపులు దుమికాయి. ఆ మెరుపుల్లోనే ఏవో సందేశాలు. జవదాటలేని ఆజ్ఞలు, అనురాగార్ధ్రమైన వేడికోలు అతని మస్తిష్కాన్ని మెల్లిగా తట్టి లేపాయి. కళ్ళముందున్న పొరలాంటి మైకం మంచుతెరలా విడిపోజొచ్చింది.
సునీత పిస్తోలు తీసుకుంది. ఎండిన సరస్సుల్లా ఉన్న కళ్లలోనుండి నిశ్చలమైన చూపులు ప్రసరించాడు వేణు. "చావుకు నేను భయపడను, నీతా! నీ రక్తదాహం యధేచ్చగా తీర్చుకోవచ్చు." సరిగా కూర్చున్నాడు.
