సుమారు ఆరునెలలైనా పంపించిన వ్యాసాలు అతీ గతీ లేదు. ఇలా లాభం లేదనుకుని, సునీత ఆవేళ తిప్పి పంపించెయ్యమని వ్రాద్దామనుకున్నది. ఆఫీసుకు వెళుతూ కార్డులుకూడా కొన్నది. ఆఫీసుకు వెళ్ళిన వెంటనే వ్రాయడానికి వీలులేకపోయింది. జేవీ సెలవు పెట్టడంచేత పని ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం తీరిక చేసుకుని వ్రాద్దామని వాటిని డెస్కుతో వేసుకున్నది.
ఆరోజే నాలుగు పత్రికలు నీలకంఠం పేరుమీద కాలేజీకి వచ్చాయి, అన్నిటికీ చిరునామా అతనిదే కావటంచేత. పత్రికలేగాక పత్రికలనుండి వచ్చిన పారితోషికాలు మొత్తం నూటపది రూపాయలూ అందాయి.
నీలకంఠం గందరగోళంలో పడ్డాడు. తను వేటినీ ఒక్క పత్రికకూ పంపలేదు. ఇవెలా ప్రచురించబడ్డాయి? పెద్దమ్మ అప్పుడెప్పుడో వ్యాసాలయితే తీసుకుంది. తెచ్చినప్పుడల్లా తీసుకుంటూనే ఉంది. మళ్ళీ తనకు ఇస్తున్నదో లేదో? అయినా తనకు చెప్పకుండా పంపుతుందా? ఏమో? ఈ ఇంగ్లీషు పత్రికలన్నిట్లో తన పేరే కనబడుతూ ఉండె!
మధ్యాహ్నం ఒక్కటే క్లాసు ఉంది. దాన్ని కాన్సిల్ చేసేసి ఆ పత్రికలతోసహా ఆమె దగ్గిరికి బయలు దేరాడు. గేటులో ఫ్యూనును అడిగాడు-"మా పెద్దమ్మ లోపల ఉందా?" అని.
ఆ ఫ్యూను నీలకంఠాన్ని ఇదివరకు చూశాడు. కానీ అతని పెద్దమ్మ ఎవరో తెలియక అతి తెలివిగా, "ఎన్నేళ్ళు ఉంటాయి? కళ్ళు కనబడతాయా?" అని అడిగాడు.
"నీ కళ్ళకు కొవ్వెక్కింది. అందుకే ఎవరూ కనబడరు." తోసుకుని లోపలకు వెళ్ళాడు. ఆ మానవుడు కిమ్మనలేదు. ఆరడుగుల నీలకంఠంతో పోట్లాట పెట్టుకోవటం మాటలా, మరి!
తిన్నగా వేణు రూమ్ లోకి వెళ్ళాడు. కుర్చీ లాక్కుని కూర్చుంటూ, "సునీత, సునీతాదేవి కావాలి. పిలిపించండి" అన్నాడు.
వేణుకు అతని హావభావాలు తెలిసి ఉండటంవల్ల "పిలిపిస్తాను. కూల్ డ్రింక్ తీసుకుంటారా?" అంటూ బజ్జర్ స్విచ్ నొక్కాడు.
తనకోసం ఎవరో వచ్చారని విన్న సునీత ఎవరబ్బా అని తలపోస్తూ వచ్చింది. నీలకంఠం ఆమెను చూడగానే తాగుతున్న డ్రింక్ టేబిల్ మీద పెట్టి, కోటు జేబులో ఉన్న పత్రికలు తీశాడు. అవి చూస్తూ, 'ఇంకా నయం. త్వరపడి అనవసరంగా కార్డులు వేస్టు చెయ్యలేదు' అనుకుంది.
"ఈ వ్యాసాల్లో భాష, వివరణలు, ఉదాహరణలు నేను రాయలేదు. నేనింత మంచిగా రాయలేదు. ఏ పత్రికకూ పంపలేదు. నా వ్యాసాలన్నీ ఏం చేశారు? ఇది మీపనే! ఇలా ఎందుకు చేశారు, పెద్దమ్మా?"
సునీత దేన్ని అయితే వేణునుండి గోప్యంగా ఉంచాలనుకుందో, అది వేణు ముందే అతనికి తెలిసేలా చేశాడు నీలకంఠం.
"అందువల్ల మీకేమైనా నష్టం కలిగిందా?"
"లేదు గానీ...."
"మరింకేం? కొంత విజ్ఞానం ప్రజలకు అందజేసిన వారయ్యారు."
"నిజమే! కాని నేను మూలసిద్దాంతాలు, ముఖ్య విషయాలుతప్ప ఏదీ రాయలేదు. ఇంత చక్కగా రాసి నా పేరు పెట్టారు. నా కది నచ్చలేదు. మీ పేరు ఉంచితే బాగు. డబ్బుకూడా పంపారు. శ్రమమీది, ఫలం నాదా?"
"కష్టించి సేకరించినవారు మీరు. నన్ను దాన్ని దొంగిలించమంటారా? అనువాదంలో మీ పేరుతోబాటు నా పేరు ఉండనే ఉంది."
వేణు రివాల్వింగ్ చైర్ లో అటు ఇటు ఊగుతూ ఇద్దరి సంభాషణా వింటున్నాడు.
సునీత అతనికి నచ్చచెప్పజూసింది. "మీరు సేకరిస్తున్న ఈ విజ్ఞానాన్ని మీలోనే దాచుకోవాలనటం స్వార్ధం. ప్రజలకు ఈ రకమైన రచనల ద్వారా విజ్ఞానాసక్తి కలగజేయవచ్చు. వాళ్ళు ఉత్తేజితులై పురోభివృద్ధివైపు దృష్టి మరల్చేందుకు ఇవి ఎంతో ఉపకరిస్తాయి. అప్పుడే మీ రనుకునే గమ్యం చేరుకున్న వారవుతారు. దేశాభ్యుదయానికి రచయిత చేసినంత దోహదం మరెవ్వరూ చెయ్యలేరు."
చిలకలా వింటున్నాడు నీలకంఠం.
'రచనలద్వారా సాధించిన దెంతో ఉన్నది. ఉంటుంది. ఉండబోతుందికూడాను. ఈ రచనల చేయడంవల్లనే చరిత్రలో ఎన్నో విప్లవాలు లేవదియ్య వచ్చును! రచనలు చరిత్రగతిని మార్చాయన్నా అసంబద్ధం కాదు. మీవంటివారు అజ్ఞాతంగా ఉండకూడదు. అందులో వైజ్ఞానిక విషయాలను చర్చించే మీబోటి వాళ్ళ అవసరం దేశానికీ ఎంతో కొంత ఉండి తీరుతుంది. ఒక్కసారి పదిమందికి నోటితో చెబితే, తెల్లవారేసరికి గాల్లో కలిపేస్తారు. అదే అచ్చయితే ఎన్నో వేలమంది పత్రికలు వెళ్ళే చోటల్లా పంపుతారు. మరవడానికి అవకాశం ఉండదు. ఎక్కడో చోట అది చదివినవారయినా ఉంటారు. ఆ అచ్చు లయినా కొన్ని ఏళ్ల దాకా జీవించి ఉంటాయి."
'మరి నేను రాయడంలేదు. అన్నీ మీరే రాశారు. పేరెందుకు?"
"నాకా మహా గ్రంథాలు సుబోధకమవుతాయా! వ్రాసేది నేనయినా, వ్రాత సామగ్రి, ఆ ప్రేరణ మీవి. అటువంటప్పుడు..."
"సరే, కరుణ నడుగుతాను. "నీలకంఠం సగం తాగిన పానీయం అలాగే టేబిల్ మీద వదిలి వెళ్ళాడు.
"ఊఁ, విజ్ఞాన వ్యాసాంద్రీకరణ బావుంది. రచయిత్రివని నా కిన్నాళ్ళూ తెలీదు, నీతా!"
"నాకూ తెలియదు. అది నీలకంఠంగారే ఒకవిధంగా తెలిపారు."
"ఎవరు తెలిసినా, నువ్వు మాత్రం ఆర్టిస్టువి. ముక్కూ మొగమూ లేని కఠిన పాషాణలను సైతం విశ్వసుందరిగా తీర్చిదిద్దగల శిల్పివి, అగోచరమైనదృశ్యాలను కన్నులకు కట్టేలా చిత్రించగల చిత్ర కారిణివి, లోకాన్నే మరమ్మత్తు చెయ్యగల మెకానిక్ వి. నీ కలాన్ని అందుకే వినియోగించు. యాంత్రికంగా మోగే ఈ టైపు రైటరు దిమ్మల శబ్దంకింద నీ భావలహరిని అణిచివెయ్యకు. నిన్ను అభినందిస్తున్నాను, నీతా! శుభాకాంక్షలు."
"ఏమిటో ఆ పారవశ్యం!" వేణు కళ్ళు మూసు కున్నది చూసిందామె.
"పారవశ్యమా? కాదు. నీవశమే! నా హృదయరాణి వృద్ధిలోకి వస్తున్నది. అంతకన్నా కావలసిందేమిటి? నీతా, నా కళ్ళలో మెదిలే ఈ రూపం చూడు, ఎంత భువన మోహన కాంతులతో మెరిసిపోతున్నదో! నీతా ... నీతా..." వేణు కళ్ళు తెరిచాడు. సునీత లేదు. స్వింగ్ డోర్ కదలాడుతూంది.
ఆవేళ ఆఫీసునుండి విశ్వం దగ్గిరికి వెళ్ళింది సునీత. ఈమధ్య విశ్వం కలవక చాలారోజులు అయింది.
అప్పటికే వేణు వచ్చాడు. మలుపు తిరుగుతూనే కారు చూసి వెనక్కు వచ్చేద్దామనుకుంది. వేణు విశ్వం ఇంట్లోనుండి అప్పుడే వస్తూండటంవల్ల తప్పించుకునే వీలు కలగలేదు. ఆమెకూడా కారులో ఎక్కింది.
"మాకు కూడా చెబితే సంతోషిస్తాం కదా? కనీసం డాక్టర్ గారి ముద్దు తమ్ముడినని అయినా అనుకోలేదు. అయినా ఏం చేస్తాం అనుగ్రహం లేనపుడు?" వేణు తలా తోకా లేకుండా మొదలు పెట్టాడు. అదెవరినిగురించో కనుక్కోవటానికి అట్టే సేపు పట్టలేదు సునీతకు.
"వ్యక్తిగతంగా ఏదన్నా చేసుకుంటే చెప్పి తీరాలన్న రూల్ మీ ఆఫీసులో కొత్తగా ప్రవేశపెట్టారేమో? విశ్వం, మీ ఆఫీసరుగా రలాంటి దేమైనా చేశారా?"
"ఉందో లేదో నాకు తెలియదు, మరి!"
"రేయ్! నువ్వు గోడమీది పిల్లివాటంగా తప్పుకోకూడదు, తెలుసా?"
"ఇవన్నీ రూల్స్ కాబోలు!" అధిక్షేపణగా అంది సునీత.
"నా తలకాయ! ఎవరూ మాట్లాడకూడదు. రూల్." వేణు ఓటమి తెలుస్తూనే ఉంది.
అనాథాశ్రమమూ, కొత్తగా వేసిన తోటా అన్నీ చూశాడు విశ్వం. ఆర్తి కళ్యాణిని పరిచయం చేసింది. ఆశ్రమంలో కొత్తకావటంవల్ల ఓ పదిమందికన్నా ఎక్కువ లేరు. కళ్యాణి తనకు వచ్చిన పనులను నేర్పుతూంది. సంఖ్య పెరిగితే సునీతను, మరికొందరు టీచర్లను పిలిపిస్తానంది ఆర్తి. అప్పుడే ఆ పది మందిలో ఒకామెను గ్రామసేవికల శిక్షణ కేంద్రానికి, మరొక ఇద్దరిని నర్స్ ట్రెయినింగ్ కు సిద్ధపరిచింది కళ్యాణి. ప్రకటన వెలువడగానే దరఖాస్తులు పంపడమే తరవాయి.
విశ్వం వేణు నడిగాడు అది చూసి వచ్చాక-"కళ్యాణి దేవి గర్భవతిలా ఉంది. ఆమె మీ కెలా పరిచయమైందిరా?" అని.
వేణు చెప్పబోయాడు. సునీత పడనివ్వలేదు. "విశ్వం, ఆరాలన్నీ తియ్యటం మానుకోవాలి. ఆమె ఎవరైందీ మన కనవసరం. ఒకటిమాత్రం సత్యం. చేసిన పొరపాటు ఆమెకు గుణపాఠం చెప్పింది. కొంత సుఖపడ్డా, తప్పుతోవలు పట్టినవాళ్ళు బాధలు మన అందరికన్నా ఆమెకు బాగా తెలుసు. అంతే. ఆమె మన అందరికీ సోదరి లాంటిది. డాక్టర్ గారే ఆమెను గౌరవిస్తున్నారు. ఆమెకన్నా మనం ఎక్కువా, విశ్వం?"
ఇరుకున పడ్డాడు విశ్వం.
ఆర్తి రావడంతో ఆ సంభాషణ విరమించబడింది.
"నిర్మలకు ఊలుతో రకరకాల పనులు చెయ్యటం వచ్చు. కావాలంటే ఒకటి రెండు గంటలు, ఇక్కడ అవి నేర్పడానికి వెళ్ళమని చెబుతాను." వాగ్ధానం చేశారు విశ్వం.
"అవసరమైతే తెలియజేస్తాలే." ఆర్తి అన్నది.
విశ్వాన్ని కారులో ఇంటిదగ్గిర దిగబెట్టి, సునీత ఇంటివైపు నడుపుతూ, "సునీతా! నీ హృదయాంతరాళాల్లో ఉన్న అమృతమంతా ఒక్కసారి నిన్ను కౌగిలించుకుని నీ పెదవుల ద్వారా తాగివెయ్యాలనిపిస్తూంది. నేను కనీసం నీలో ఒక రక్తకణాన్ని అయినా బావుండేది" అన్నాడు వేణు.
సునీత నవ్వింది. "నే నలా అనుకోవటం లేదు. కోరికలు గుర్రాలైతే మీకీ కారు అవసరం ఉండేది కాదు. నేను వేగంగా మరో గుర్రంమీద ముందుకు వెళ్ళిపోయేదాన్ని. లేదా మీ వేగా న్నందుకోలేకవెనకపడి ఉండి మీకు నిరాశను కలిగించిఉండేదాన్ని."
"నిజంగా? మరి నాదో మనవి!"
"చెప్పండి!"
"మనం ఇద్దరం ఎప్పుడూ కారేజ్ ను మోసే రైలు చక్రాలం. రెండు ఇనపకమ్మీల మీద నడిచే ఆ చక్రాలు తమ మధ్యదూరాన్ని ఎన్నడూ మార్చుకోవు. ఒకదాన్ని మించి ఒకటి వేగం పుంజుకోదు. అలా జరిగితే ఒక్క కారేజ్ మాత్రమే కాదు, ట్రెయిన్ అంతా నాశనం కావచ్చు. అలాగే మనం. నీ రేఖలో సాగిపోయే వేగం, నేను నా రేఖలో నడుస్తున్న వేగం ప్రస్తుతానికి రెండూ సమానంగా ఉన్నాయి. చివరికంతా మనం ఇలాగే సమంతరరేఖల్లా పయనించాలి. మన మార్గాలు ఎన్నడూ కలుసుకోవని తెలుసు. కాని మన ఈ జంట ఎప్పుడూ ఇలా సాగుతూనే ఉండాలి."
"నా ప్రయత్నలోపం ఉండకుండా చూసుకుంటా!"
"ప్రేమ అనే కనబడని అనుబంధమే మన ఇద్దరి మధ్యా దూరం. దీనిని తెంచుకోగల సాహసం, ముందుకు పోగల నిబ్బరం, ఆత్మశక్తీ నీకు ఉన్నాయి. అయితే నామీద కరుణఉంచి ఎన్నడూ వేగాన్ని పుంజుకోవద్దని ప్రార్ధిస్తున్నాను. అలా జరిగితే పర్యవసానం నీకు తెలియంది కాదు." బ్రేక్ వేశాడు కారుకు.
* * *
