Previous Page Next Page 
ఉన్నతశిఖరాలు పేజి 31

   
    "భార్య భర్తలకు అది వర్తించదు"
    "భార్యాభర్త లైతే అడగనే అక్కర్లేదు."
    "ఇంతకీ చెపుతారా లేదా?"
    "అంత దబాయించి అడిగితె చెప్పక తప్పేదుందా? ఆరువందల యాభై అని మొదటే చెబితే లెక్కలడిగేదానిని-- సంగతి బైట పడేది అంతేగా?"
    "నాల్గు వందల ఏభై అనుకున్నాను."
    "అది నీ ఇష్టం నీవెంత అనుకుంటే అంతే....డానికి ణా ప్రతి బంధకం ఏమీ లేదు"
    ఇద్దరూ నవ్వుకొన్నారు. నల్లని బరువైన రాత్రి తేలిమబ్బు లాగా తేలిపోయింది.

                                 34

    సంధ్యా సమయం. అరుణ కాంతులు వ్యాపించిన పిల్ల తెమ్మరుల మధురిమ లో-- పుష్ప సౌగంధ సమ్మిళితమైన ఆ తోటలో నిర్మలమైన వాతావరణం లో భార్య భర్తలు సుభాసీనులై ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు.
    టాక్సీ దిగి పాపతో వస్తున్న ప్రేమను చూచి తల్లి లేచి వెళ్లి పాప నందుకుంది.
    "ఏమ్మా -- ఒంటరిగా వచ్చావు?" తండ్రి పలకరింపు కు తల్లి జవాబిచ్చింది.
    "అల్లుడు ఎప్పుడో గాని రాడు. ప్ర్రేమకు గుబులు మళ్లగనే వస్తుంది.....రాత్రి కైనా వస్తారా?"
    "రారు........నేను కూడా భోం చేసి వెళ్ళిపోతాను."
    "అదేం" తల్లి ఆశ్చర్యంతో చూచింది.
    "ముఖ్యమైన పని మీద వచ్చాను. ఈ ఆదివారం అందరం వస్తాం లెండి అంటూ ఖాళీగా ఉన్న కుర్చీలో కూచుంది.
    ప్రేమ బేగ్ తెరచి కవరు అందించింది తండ్రికి.
    రామారావు ఆత్రంగా అందుకుని తెరిచి చూచాడు. అది చెక్కు అని తెలియగానే సంభ్రమాశ్చర్యం తో కూతురి వైపు చూచాడు.
    "ఏమిటి ప్రేమా ఇది?
    "అల్లుడి గారికి ఇచ్చిన అప్పు" ప్రేమ గుంభనంగా నవ్వింది.'    
    "అప్పు అయినా ఆనాడు నిరంజన్ కు ఆరు వేలు మాత్రమె ఇచ్చాను ఈ చిల్లర దేనికి?"
    "అది బ్యాంక్ లో వున్నప్పుడు వచ్చిన వడ్డీ నాన్నా. అది మీదే కదా!'
    తల్లి మౌనంగా వుండలేక పోయింది. పాపను కుర్రాడితో పంపించి వేసి కుర్చీలో కూచున్నది.
    "అల్లుడు అప్పు తీసుకోవడమేమిటి? తండ్రి గాని కూతురు గాని మాట్లాడలేదు.
    "ఎందుకు తీసుకొన్నారు?"
    "నాకు తెలీదు.....అంటూ ముఖం చిట్లించింది.
    రామారావు బిగ్గరగా నవ్వేశాడు. "ప్రేమ ఇంకా నీ బిడ్డనే అనుకొంటూన్నావా? ఇప్పుడామె ఆ భార్యకు తగిన భార్య. ఆనాడు ఆ డబ్బు ఎండుకవసరమైందో నిరంజనూ చెప్పలేదు. ఇప్పుడు అతని భార్య కూడా చెప్పడు.
    ప్రేమ కుర్చీని తండ్రికి దగ్గరగా లాక్కుంది.  అతని ముఖం లోకి పరిశీలనగా చూస్తూ అడిగింది. "నాన్నా వారు డబ్బు అడిగినప్పుడు ఈ విషయం రహస్యంగా వుంచమన్నప్పుడు నిజంగానే మీరే మనుకున్నారు."
    రామారావు కూతురు ఇలాంటి ప్రశ్న వేస్తుందనుకోలేదు. ఆనాడు తనకు బాగా జ్ఞాపకం. మిట్ట మధ్యాహ్నం వచ్చాడు. ప్రేమను పంపించి నెల కూడా కాలేదు. ఆ అడగడం ఎంత సూటిగా అడిగాడు. "మామయ్యా! ఆరువేలు కావాలి. ఇవ్వటానికి కభ్యంతరం లేకపోతె చెక్కు రూపంలో ఇవ్వండి. లేకపోతె వెళ్ళిపోతాను. తనకు తెలుసు ఇలాంటి దేదో జరుగుతుందని .....ఎందుకు కావాలి? -- అని అడిగితె మాట్లాడలేదు....డానికి జవాబే మిచ్చాడు? మీ డబ్బుకు వడ్డీ వస్తుందో లేదో చెప్పలేను , కానీ కొన్ని సంవత్సరాలకు తప్పక తీరుస్తాను....
    ఈ తరానికి చెందిన వారంతా అంతే తాను మాత్రం పెళ్ళికి ముందే అల్లుడికి పదిహేను ఇరవై వేలు ఇవ్వాలని ఆశించాడు. తనేం వెనుదీయలేదు! కాని ఈ విధంగా మూడవ కంటికి కనబడ కుండా తీసుకునే అవస్త ఎందుకో?....అంత డబ్బు పైగా అప్పుగా కావాలంటూన్నాడు. తీర్చే రకమేనా? తీర్చలేక పొతే తీర్చమని నిర్భంధించటానికి తనకు దమ్ము ల్లేవు అప్పు అంటే అప్పే. తన మనసులోని శంక ను గ్రహించినట్లు. మామయ్యా మీకు రాసిస్తాను- సాక్షుల సమక్షంలో రాసివ్వమన్నా తయారుగా వున్నాను. ....అంటాడు? అల్లుడు-- ఒక్కగానొక్క అల్లుడు. నిష్కర్షగా రాసివ్వమని చెప్పలేక పోయాడు -- "అబ్బే అది కాదు బాబూ! నగదు కావాలేమో  బ్యాంకుకు ఈ ఎండలో వెళ్ళాలా అని--" అతి తేలిగ్గా అనేశాడు. అతను చెక్కు వ్రాసి ఇమ్మన్నాడు. మారు మాట్లాడకుండా ఆరు వేలకు చెక్కు రాసిచ్చాడు. భార్యకు చెబితే ముక్కు మీద వ్రేలేసుకుంది. అప్పుగా ఎండుకిచ్చారు? ఊరకనే ఇవ్వక పోయారా....వాళ్ళ నాన్నగారికి అప్పు లున్నాయేమో? తీర్చే మార్గం కానరాక కొడుకును పంపించాడెమో! లేకపోతె అంత రహస్యం దేనికి? చివరికి ప్రేమకు కూడా తెలియదు. భార్యకు తెలియకుండా చేస్తున్నాడంటే అది తప్పక వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయమై వుంటుంది. అది ఒక బహుమానంగా ఇచ్చి వెయవలసింది. అంది. తనకు తట్టలేదు. ఆ తరవాత వియ్యంకుడితో ఎన్నిసార్లు సంభాషించినా ఈ సొమ్ము ఇంటి గురించి వాడినట్లు ఎక్కడా ఆచూకీ దొరకలేదు. తానై వియ్యంకుడి తో "నిరంజన్ కు ఆరు వేలిచ్చాను అది మీ కొరకైతే - అప్పుగా భావించకండి....' అని అన్నప్పుడు ఆయనెంత ఆశ్చర్య పడ్డాడు?

                                 
    ఆనాటి సంభాషణ ద్వారా అది నిరంజన్ స్వంత విషయమని తేలిపోయింది.
    నిరంజన్ ఆ సొమ్ము తిరిగి ఇవ్వడనీ, యువతరం మీది తన అభిప్రాయాలు సరైన వే ననీ విజయ గర్వంతో ఆనందించాడు. అయన ఇన్నాళ్ళుగా మీ తరం వారంతా ఇంతే-- అంతా వేదికల పైననే గాని వాస్తవికత లో ఒట్టి చవటలు- అనాలనుకున్నాడు.... కానీ అతన్ని ఏ పరుష వాక్యంతో తూలనాడినా కూతుర్ని అన్నట్లే -----
    ఇవ్వాళ ప్రేమ ద్వారా పంపిన ఈ చెక్కు ?-- ప్రేమకు ఇదంతా చెప్పాలా? చెప్తే ఆమె చాలా బాధపడుతుంది. ఈ విధంగా భర్తను గూర్చి తండ్రి తేలికగా అలోచించి నందుకు.
    "ప్రేమా" అని ఆర్ద్రంగా పిలిచాదాయన కూతుర్ని" ఇంత డబ్బు ఎందుకు తీసుకున్నట్లు? తీర్చేశారుగా. ఇంక చెప్పవచ్చు" వ్యర్ధంగా నవ్వాడు. ప్రేమ తటపటా యించింది. తల్లి వైపు తండ్రి వైపు మార్చి మార్చి చూసింది.
    "ప్రేమా ఇదంతా నీకు ముందుగానే తెలుసా?"
    "ఉహూ . నాకు ఇవ్వాళే గీత ఉత్తరంలో రాసింది. ఏమిటిదంతా అని నేను అడిగితేనే అయన చెప్పారు. డబ్బు మామయ్య గారైన, నరేంద్ర అయినా యిచ్చారేమో అనుకున్నాను గానీ మీ ద్వారా వచ్చిన డబ్బను కోలేదు"
    "గీత కోసం అన్నట్లయితే -- అతన్ని గూర్చి యింత ఇదిగా అనుకునేవారం కాదే?' తల్లి బాధగా అంది.
    పని కుర్రాడు లైటు వేశాడు.
    ఆ వెలుగులో భార్య ముఖంలోకి నిశితంగా చూచాడు. అర్ధనిమీలిత నేత్రుడై మెల్లగా - తనలో తాను అనుకుంటూన్నట్లుగా అన్నాడు......"గీత కోసం అంటే ఆలోచనే అక్కర్లేదు. దానిలో అనాధారణం ఏమీ లేదు..........' అయన కుర్చీ వెనక్కు చేరబడ్డాడు.
    "సరే ! డబ్బు బ్యాంకులో మూలుగుతోంది -- ఆ మొత్తాని కన్నా ఈ స్వల్ప మైనది ఇంతమందికి ఆనందాన్ని ప్రసాదించింది. స్వాంతన వాక్యాల్లా ఉన్నాయి. ఇంతలో పాప ఏదో అరుస్తూ కేకలేస్తూ వచ్చింది. ఆమె కెదురుగా వెళ్లి తల్లీ ఇది నీకు-- ఇది నువ్వు తీసుకో ' అంటూ ఆ చెక్కు ను పాప కందించబోయి చేయి చాచాడు. పాప తాతగారి చేతిని విసురుగా ప్రక్కకు తోసి అమ్మమ్మ దగ్గర కెళ్ళి పని కుర్రాడ వైపు వ్రేలు చూపి ఏదో ఫిర్యాదు ఇస్తోంది.
    "చూచావా ప్రేమ ఎలా త్రోసి వేసిందో! అంతా తండ్రి బుద్ది!"

                                *    *    *


    "ఊ.... కనిపిస్తూనే వుంది వాడి వాలకం. నేను చూస్తున్నానని పసిగట్టి తల త్రిప్పేశాడు నంగనాచి. చెప్తా నుండు వాడి పని నువ్వు మాత్రం మళ్ళీ వాడి వైపు చూడకు. ఆ ! ఆవిడ తన ప్రక్కనే కూర్చున్న మొగుడి చేతిని పట్టుకుని గుంజింది.
    సీరియస్ గా పేపరు చూస్తున్న పరమేశం గారు భార్య ధాటికి తల్లడిల్లిపోయాడు.
    "ఏమిటే నీ గొడవ అంటూ చిరాగ్గా ప్రశ్నించాడు.
    ఏమిటని అంత నెమ్మదిగా అంటారేమండీ? ఎవడో పోకిరి వెధవ మన అమ్మడి ని చూసి వెకిలి వేషాలేస్తుంటే?
    ఇంత జరుగుతున్నా చీమ కుట్టినట్లయినా లేదేం మీకు? ఆయన్ని దులిపోదిలి పెట్టింది నాంచారమ్మ గారు.
    "అరవకే" నలుగురూ వింటే అప్రతిష్ట లేనిపోని గొడవ తెచ్చి పెట్టకు" అయన భార్యను మందలిస్తూ వెనక్కి తిరిగాడు.
    'అడుగో చూశారా! మీరు చూస్తున్నారని యెలా తల త్రిప్పేసు కున్నాడో దొంగ వెధవ అంది నాంచారమ్మ గారు అయన వీపు మీద గోకుతూ.
    అయన కుర్రాడిని పరిశీలనగా చూశారు . అతనను తన ప్రక్కనే కూర్చున్నావీడితో ఏదో మాట్లాడుతున్నాడు. ఆమె అతని తల్లి కాబోలు. తండ్రి కూడా వీళ్ళతోనే ప్రయాణం చేస్తూ వుండోచ్చు. కుర్రాడి ముఖం లో మంచి కళ వుంది. బాగా చదువు కున్న వాడిలాగే కనిపిస్తున్నాడు. మంచి ఉద్యోగంలో కూడా ఉండి వుండాలి. ఇది అమ్మడికి తగిన సంబంధం ...అయన ఆలోచనలు క్రొత్త పంధాలో పడుతున్నాయి.
    అమ్మడు పదహారో వసంత మో, వర్షమో అందులో అడుగు పెట్టీ అప్పటికి యెన్నో రోజులు కాలేదు. అందంతో పాటు అమాయకత్వం కూడా ఆమెలో వుంది. అయిదో క్లాసు దాకా యెలాగో చదివి అందులోనే వుంచాను సరదా పడుతున్నట్లు కనిపించడం వల్ల. పరమేశం గారు ఆమెను చదువు మానిపించేశారు. పెళ్లి చేసి పంపించయ్యాలని వుద్దేశం కూడా పడ్డారు. అందులోనూ కుటుంబం తో బంధువుల యింట్లో పెళ్ళికి వెళ్లి యిప్పుడు తిరిగి వాళ్ళ వూరు వెడుతున్నారు. పెళ్లి కూతురిని పీటల మీద చూసి నప్పటి నుండీ అమ్మడు కూడా అలా యెప్పుడు కూర్చుంటుందా అనే ఆరాటం ఆయనకు పట్టుకుంది. పెళ్లి పందిట్లో నే వరుల కోసం వెతికారు. ఒకరిద్దరు వున్నా , ఆయనకు నచ్చలేదు. కాబోయే అల్లుడి విషయంలో సతమత మౌతున్న పరమేశం గారికి నాంచారమ్మ గారు చూపించిన కుర్రాడు అన్ని విధాలా నచ్చాడు. ఎలాగైనా అన్నీ కలిస్తే ఈ సంబంధం ఖాయ పరచాలని అయన కనిపించింది. సైలెంటు గా ఏవేవో ప్లానులు కూడా వెయ్యనారంభించాడు . పైకంటే భార్య వురిమి చూస్తుందని భయం.
    అమ్మడికి మళ్ళీ అతను గుర్తు కొచ్చాడు. వెనక్కి చూసింది. అతనూ యిటే చూస్తున్నాడు. నవ్వుతున్నాడు. నెమ్మదిగా రహస్యంగా మాట్లాడుతున్నట్లు కూడా అనిపించింది. అమ్మడి లో ఎన్నో సందేహాలు తలెత్తాయి. తననుద్దేశించే అలా సంకేతంగా మాట్లాడుతున్నాడా? ఏమిటో అతని వుద్దేశం తనకేం అర్ధం కావడం లేదు. తనిప్పుడెం చెయ్యాలి.    
    "చూడే అమ్మా!....." అంది చివరికి గునుస్తూ.
    నాంచారమ్మ గారి కంతా అర్ధమై పోయింది. ఆవిడ భర్తను మోచేత్తో పొడిచింది.
    "అబ్బ.....చంపేసావే....మళ్ళీ యేమొచ్చింది ఆమె పొడిచిన చోట రుద్దుకుంటూ అన్నారాయన చిరాగ్గా.
    మీదో అడివి బుర్ర ఆమాత్రం గ్రహించలేరూ! వాడు మళ్ళీ చూస్తున్నాడు. ఆవిడ పళ్ళు కరచుకుంటూ అంది.
    "చూడ నియ్యవే అంతా మన మంచికే " ఆయన తనలో ప్లాను కదులుతోంది.
    "అవ్వ మీకే మైందండీ ! ఎవడో పరాయి వెధవ పళ్ళికిలిస్తూ అలా చూస్తుంటే మీరనే మాట యిదా?"
    "ఇప్పుడు పరాయి వాడైనా రేపు మనవాడు కాకూడదుటే పిచ్చి దానా?"
    "అంటే.......
    "మనమ్మడికి తగిన వాడు కాదుటే?"
    "వీడా ! చాల్లెండి ! ఈ పోకిరి వెధవ గాక ఇంకెవరూ దొరకలేదా?" ఆవిడ గద్దించింది.
    పరమేశం గారు కిమ్మన కుండా వూరుకున్నారు. తన ప్రయత్నాన్ని వదిలి పెట్టడం మాత్రం అయన కిష్టం లేదు.
    తల్లి దండ్రుల మాటలు అమ్మడి కి వినిపించాయి ఆమె ఒళ్ళు జలదరించింది. ముఖం ఎర్రనైంది. తను చస్తే ఈ పెళ్ళికి వొప్పుకోదు.
    బస్సు దబదబ లాడుతూ గమ్యం చేరుకుంది. నాంచారమ్మ గారు, ఆవిడ మొగుడూ, అమ్మడూ బస్సు దిగారు. ఆ ముగ్గురి కళ్ళూ ఆ అబ్బాయి కోసమే వెతికాయి. వాళ్ళ కుటుంబంతో యెలా పరిచయం చేసుకోవడమా? అని పరమేశం గారు తెగ ఆలోచిస్తున్నారు. వాడింకా తన కూతురి వైపు చూస్తున్నాడేమో తెల్సుకుందా మని నాంచారమ్మ గారి ప్రయత్నం. తనను చూసి అతను నవ్వి తే యేమి చెయ్యాలా?' అని అమ్మడు అనుకుంటోంది.
    కూడా వున్నామే ఆసరా వల్ల అతను బస్సు దిగాడు. తడబడుతున్నట్లుగా అడుగులేస్తూ ఆమె తో కలిసి నడవ సాగాడు. అతడు గుడ్డి వాడు.
    విధి విలాసం అనుకున్నారు పరమేశం గారు వేదాంత ధోరణి లో. అతనిని గురించి అన్న మాటలకు తన కళ్ళు పోతాయేమోనని భయపడింది నాంచారమ్మ గారు. అమ్మడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS