అందరు ఓపికగా వింటే నిరంజన్ ఏకధాటిగా పెద్ద ఉపన్యాసం ఇచ్చేవాడు. మనోహర్ తీగ లాగితే.....అనుకుని నిరంజన్ జబ్బ చరచి "నిజమే....నువ్వు చెప్పిందాన్లో ఎంతైనా సత్యం వుంది....అక్షరాలా నిజం" అంటూ ఒప్పేసుకుని దాటిపోయాడు.
ఎందుకోగాని ఎవరికికూడ నిరంజన్ ను చులకనచేసి మాట్లాడే ధైర్యం గాని, అతన్ని ఎదిరించి నిలబడే యోగ్యత గాని తెలివిగాని వున్నట్లు తోచేదికాదు. అందరికన్నా ఓ మెట్టుపైగా వుండేవాడు. అది గుర్తించి తగినరీతి వ్యవహరించేవాడు.
చిన్నతనం నించీ నిరంజన్ కు చెట్లు చేమలపై శ్రద్ధ అధికం. తండ్రి ఏ డాక్టర్ కోర్సో ఇంజనీరింగో చదివించాలని ఆశపడ్డాడు గానీ నిరంజన్ కు ఈ రకమైన విద్యపై మనస్సుండటంతో అతను బోటనీ తీసుకున్నాడు-చదువు ప్రారంభమైంది. ఇంతలో విప్లవాలు-అతి ఘోరమైన పరిణామాలకు గురియై రెండు సంవత్సరాలు! చదువు సాగింది కాదు. హిందూ దేశానికివచ్చి స్థిరపడటానికే సంవత్సరం పట్టింది అందుకే నిరంజన్ వయస్సు అప్పటికి ఇరవైనాల్గు సంవత్సరాలు. ఎప్పుడుకూడా అతను వృధాగా మాట్లాడేవాడుకాదు. అమ్మాయి లలో అందర్నీ గౌరవించేవాడు. తను చక్కగా డ్రాయింగ్ వేసేవాడు ఎవరయినా నోరు తెరచి అడిగితే- కాదనక బొమ్మలు వేసియిచ్చేవాడు. నిండుగా హుందాగా కనిపించే విగ్రహం నింజన్ ది. పొడవైన తిన్నని నాసికాగ్రభాగం కొద్దిగా వంపు తిరిగి కాశ్మీరీవాళ్ళ ముక్కులా అందంగా అగుపించేది, వంకీలు తిరిగి వత్తుగావున్న జుట్టులోంచి రెండు చిన్న ముంగురులు నుదుటిమీద నాట్యం చేసేవి వ్యాయామం చేసి శరీరాన్నొక తీరులో మలచుకున్న అతని దేహం దృఢంగా వుండేది.
అందుకే ఒకసారి గీత ఉద్రేకంతో అంది. "అవిశాల వక్ష స్థలంపై తలమోపి హాయి ననుభవించే అదృష్టం ఎవరిదో అవి ఆ మాట పై మిగతావారు చర్చించలేదు. గీతను వేళాకోళం చేయలేదు. ఎవరో ఆ అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలు. అని అనుకున్నారు.
క్రొత్తపాత కలసిపోయి అంతా శ్రద్ధగా పాఠాలు చదువుతున్న సమయంలో హఠాత్తుగా వారికి మరొక అవాంతరం కల్గింది. యూనివర్శిటీలో స్వాతంత్ర్య దిన సందర్భంలో పోటీలు జరుగుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభం, ఆరోజు క్లాసులో అడుగుపెడ్తూనే చిన్నపుకారు చెవిని బడింది. అది పుకారేగాని అది విన్న ప్రేమలత క్షణం స్తబ్ధయైన మాట మాత్రం వాస్తవం?
టెన్నిస్ పోటీల్లో వాళ్ళ యూనివర్శిటీలో పేరు పొందిన సుధాకర్ ఎం. ఏ. విద్యార్ధి మరో అతను జట్టుగా రెండేళ్ళనుంచి అందరిని ఓడిస్తున్నారు? ఈ సంవత్సరం వాళ్ళజట్టు విడిపోతుందేమో ఎందుకంటే నిరంజన్ కు వారిద్దరికి పోటీలు జరుగుతాయి. గెలిచినా ఇద్దరూ- వాళ్ళటీమే అవుతుంది.
ఈ కబురు నిన్న ప్రేమ అచేతనంగా నుంచుండిపోయింది. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. సుధాకర్ పై ఓ విధమైన అభిప్రాయం ప్రేమకుంది. ఆ అభిప్రాయం ప్రేమగా మారటం మొదలుపెట్టిందికూడా.
నిరంజన్ గెలిస్తే సుధాకర్ జట్టులో వుండడు స్థానభంగమై పోతుంది తన ప్రియుడావిధంగా దిగిపోవటానికి ఆమె సహించలేకపోయింది. గెలిచినప్పటి మాట కదా ఐనా నిరంజన్ ను చూస్తుంటే తప్పక గెలుస్తాడనే అనిపిస్తోంది. ఆమె........ - పోనీ ఆ ఎం, ఏ. విద్యార్ధిగా విడిపోవచ్చుగా! అల్లా జరుగదు, అతను కూడా బాగా ఆడతాడు. తను ప్రేమించిన వ్యక్తి మంచి టెన్నిస్ ఆటగాడని గర్వించేది. అది భంగమయ్యే సూచనలు కనబడగానే ఆమె భీడువై పోయింది.
సుధాకర్ మంచి ఆటగాడేకాదు. అందగాడు కూడా. నిరంజన్ లో లోపించిన పసిమిఛాయ అతనికుంది. నింజన్ మామూలు తెలుపు ఛామన ఛాయ కన్నా మెరుగైన రంగు సుధాకర్ శరీరం పచ్చగా వుంటుంది. సన్నగా పొడవుగా కోమలంగా అగుపిస్తాడు హుషారుగా తిరుగుతు ఎప్పుడు కూడా నవ్వుతూ త్రుళ్ళుతూ మాట్లాడుతూ సరదాగా పదిమందిలో మసలే వ్యక్తి ఎంతో కలుపుగోరు తనంగా వ్యవహరిస్తాడు అంతేకాదు సుధాకర్ ధనవంతుడు తండ్రి ప్లీడర్ బాగా ఆర్జించాడు. ప్రస్తుతం హృద్రోగంవల్ల ప్రాక్టీసు మానుకున్నాడు. సుధాకర్ కు ఒక అక్క. ఒక అన్న. ఒక తమ్ముడు వున్నారు. పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళయింది.తమ్ముడు డాక్టర్ చదువుకున్నాడు. డబ్బు విచ్చల విడిగా ఖర్చుచేయటంలో అందెవేసిన చేయి ఖరీదైన సిగరెట్ ఆ వ్రేళ్ళమధ్య అస్తమానం కాలుతుండాలి అది వో ......... వెళ్ళటం ఒకటి రెండుసార్లు మాత్రమే. అతను చదివి ఉద్యోగం చేయ నవసరం లేదుట.
పెద్దన్న ఎం ఏ చదివి ఆస్తి చూచుకుంటున్నాడుట!
వదిన లక్ష రూపాయలు ఏభై ఎకరాలు తెచ్చిందిట.
అక్కకు ఏభై వేలిచ్చి పెళ్ళిచేసి పంపారట.
సుధాకర్ తమ్ముడు. కూడా యిలాంటి అమ్మాయిలను చేసుకుంటే ఆ డబ్బును కాపాడటమే వారి లక్ష్యం అట. అని ప్లీడరు గారు కొడుకుల చెవిలో ఇల్లు గట్టుకుని చెబుతారుట.
ఈ విషయం పేనుకు తెలీదు. తను డబ్బు కోసం సుధాకర్ ను ప్రేమించటం లేదు సుధాకర్ ఆమెని ప్రేమించాడు. ఒకానొక శుభ సమయంలో ప్రేమికుడిగా పిచ్చి వాడై ఆమెకు తన పరిస్థితిని నివేదించుకున్నాడు. ప్రేమకు నచ్చింది. ఆమె కూడా అతడంటే యిష్టపడింది-చదువు పూర్తయ్యే వరకు గప్ చిప్ అనుకుని మౌనంగా కనుసనల్తో చిరునవ్వులతో కాలం గడుపుతున్నారు. నిరంజన్ రాకముందే వాళ్ళిద్దరు మాట ఇచ్చి పుచ్చుకున్నారు. సుధాకర్ హృదయం నిరంజన్ రాగానే ఈర్ష్యతో కుమిలిపోయింది. ఇతడెక్కడినించి ఊడి పడ్డాడు స్వచ్చమైన పాలలో విరుగుడు చుక్క-చిగిరించి వికసించబోయే లతలో చీడపురుగు! అతనిలో ఈర్ష్య తావు చేసుకుందని ఆమెకు తెలియదు. స్త్రీ సహజగుణం పర పురుషులను గూర్చి ఇతరుల సమక్షంలో ముఖ్యంగా తనకు కాబోయే పతి ముందర స్వేచ్చగా మాట్లాడకపోవటం - ప్రేమలత చేసిన మంచి పనుల్లో ఒకటి నిరంజన్ ను గూర్చిన విషయాలేమీ సుధాకర్ దగ్గర మాట్లాడేది కాదు, ఈ వార్త చెవిని బడగానే పరధ్యాన్నంగా నడుస్తూ వెళ్తోంది.
ఎదురుగా నిరంజన్ రావటంతో ఆమె వర్తమానంలోకి వచ్చింది.
"మీకు టెన్నిస్ లో మంచి ప్రవేశం ఉందని ఇప్పుడే తెలుసుకున్నానండి" అంటూ తనే పలుకరించింది.
నిరంజన్ తేలికగా నవ్వేశాడు "అంత మంచి ఆటగాడిని కానేమో కాని అసోసియేషన్ వాళ్ళు వదలటంలేదు. రేపు వస్తారుగా?" నిరీక్షణతో చూచాడు.
ఆమె తడబడింది. "మునుపటి టీమ్ లో ఎవరు ఓడిపోతారో? చూడాలని ఆశగా వుంది. తప్పక వస్తాను."
అదేమిటి - నేను ఓడిపోవచ్చుగా?"
"అలా అనిపించటం లేదు సుధాకర్ గారు ఇక పోటీల్లో పాల్గొనరేమో అనిపిస్తోంది.. వస్తాను...బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సాగిపోయింది. థేంక్యూ అన్న అతని మాటలు వెనకనించి వినబడ్డాయి.
కాస్త దూరంగా వెళ్ళి ఆలోచిస్తుంది. ఇదేమిటి? బెస్ట్ ఆఫ్ లక్ అని తనెందుకనాలి? అవి పొడిపొడిగా పెదాలనించి వూడిపడిన మాటలు ఎంత విపరీతం?పైపైకి - అదొక లాంఛనంగా మనసులో మరొక ఉద్ధేశంతో. పైకి అతని గెలుపు కాంక్షిస్తున్నదానిలా ఎందుకీ - వేషధారణ బూటకం అతను ఓడిపోవాలనే - సుధాకర్ గెలవాలనే కోరుతోంది- ఛీ ఛీ ఊరుకున్నా పోయేది. ప్రేమలత వెళ్ళిపోయిన దిక్కుకేసి క్షణం చూచి - స్పోర్ట్స్ ఏర్పాట్లు చేస్తున్న దగ్గరకు వెళ్ళిపోయాడు. వెళ్ళాడే గాని అతని హృదయంలో అల్లకల్లోలం అశాంతి - తను పసిగట్టగలిగాడు. ఆమె మాటలోని గూడార్ధం బోధపర్చుకున్నాడు. మనస్ఫూర్తిగా తన గెలుపు కాంక్షించటం లేరు. సుధాకర్ పేరెత్తి మాట్లాడింది. ఒకటి ఒకటి కలుపుకుని రెండని తెల్సుకోటాని కెంతసేపో పట్టలేదు.
సుధాకర్ - ప్రేమలత ప్రేమించుకుంటున్నారని అతను కనుగొని చాలారోజులైంది.
ఆ వేళ లైబ్రరీలో కూచుని వున్నాడు. సుధాకర్ ఏదో పుస్తకం వెతుకుతున్నాడు. అంతలోకి ప్రేమలత. గీత ఆ వేపుగా వచ్చారు. పుస్తకాల బీరువాలకు అవతలగా వెళ్ళిన ప్రేమ ఎంతకు ఇవతలికి రాలేదు సహ విద్యార్ధులు మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోలేదు వాళ్ళు. దీక్షతో చదువుతున్నట్లు నటిస్తున్న తనను చూడగానే గీత బిగ్గరగా తుమ్మింది. మరుక్షణంలో ప్రేమలత ఇవతలికి వచ్చేసింది. ఆ వేళ సెలవు కాబట్టి లైబ్రరీలో ఎవ్వరూ లేరు. తను ఆలస్యంగా జేరటంవల్ల స్వయం కృషి తప్పని సరైంది నిరంజన్ నవ్వుకున్నాడు. వారిని గమనించనట్లే పుస్తకంలో తల దూర్చుక్కూచున్నాడు.
అప్పటినించి గమనిస్తూనే వున్నాడు. ఒకరిచే మరొకరు ఆకర్షించబడ్డారని క్లాసులో అందరికి తెలుసు. ఎవరూ అంతగా ఆశ్చర్యపడలేదు చాల సహజమైన విషయం క్రింద తీసుకున్నారు తనూ అలాగే భావించాడు.
ఆమె అతన్ని ప్రేమిస్తున్నంత మాత్రాన ఆ విధంగా తన నెందుకు మాట్లాడిస్తుంది అట! ఎవరికైన తను ప్రేమిస్తున్న వ్యక్తిహీనపర్చబడటం సహించరానిది అది వాళ్ళను కృంగదీస్తుంది. నిరంజన్ దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. మరుసటి రోజు ప్రేమ ముచ్చటగా ముస్తాబై టెన్నిస్ కోర్టు వైపు వెళ్ళింది హృదయంలో అదొక విధమైన భయం. సుధాకర్ ఓడిపోతే తనే విధంగా ఓదార్చాలా? ఎలా నచ్చచెప్పాలి?....హృదయం బిగుసుకు పోయినట్టవుతోంది...అయినా అదేమి చిత్రమో తను సుధాకర్ ఓడిపోతే అనే ఆలోచిస్తోంది గాని. గెలుస్తాడన్న దృష్టి అసలు లేదు.
టెన్నిస్ కోర్ట్ వైపు నించి వస్తున్న ఒకరిద్దరు కుర్రాళ్ళు ఆమెను కుశల ప్రశ్నలు వేశారు. అప్పటికి ప్రేమ చాలా రోజులుగా రానట్లు.
ఆ ప్రదేశంలో హడావిడి లేదు. అక్కడ ఎవ్వరూ లేరు. దూరంగా గీత కనబడింది. ఎవ్వరిని ఏమీ అడగటానికి మనస్కరించలేదు సరాసరి స్నేహితురాలి దగ్గర కెళ్ళింది.
"నువ్వంత కంగారు పడనవసరం లేదు ప్రేమా గీత ప్రేమ చేతిని పట్టుకుని మృదువుగా నొక్కింది ప్రేమ చేయి చల్లగా వుంది.
"ఏం జరిగింది? సుధాకర్ రాలేదా?"
గీత చిలిపిగా చూస్తూ నవ్వింది "అదేం లేదు నిన్న సాయంత్రం నిరంజనే వెళ్ళి. తనకు ప్రాక్టీస్ తప్పిందని- చాల రోజులనించి రాకెట్ ముట్టలేదని ఈ పోటీ మానవలసినదని సెక్రటరీకి చెప్పాడుట....ఎందుకో నీకేమైనా తెలుసునా?" గీత గుచ్చి గుచ్చి ప్రేమ ముఖంలోకి చూచింది.
ప్రేమ నేరస్తురాలిగా బాధపడ్తూ క్రితం రోజు జరిగిన సంభాషణను విశదీకరించింది.
"ఐతే అతను నిన్ను నిరాశ పర్చటాని కిష్టం లేక మానుకొన్నట్టుంది.
"నన్ను నిరాశపర్చకుండా నేనావిధంగా బతిమాలుకోలేదే!"
"నీనోటిమాటలు కాదు- నీ హృదయమే యిలా వాంఛించింది అతను గ్రహించాడు ఫలితం నిన్ను సంతోష పెట్టాలని వదులుకున్నాడు.
"నా సంతోషం అతనికంత ముఖ్యమా! మరేదికారణం అయ్యుండాలి! గీత ముఖం గంభీరమైంది. ప్రేమ కళ్ళలోకి సూటిగా చూచింది.
"మరే కారణంలేదు ప్రేమా! నిన్ను చూస్తే అందరికీ నిన్ను మెప్పించాలన్న కోరిక జనిస్తుంది. అది నీలోని ఆకర్షణ. పురుషుడిలోని బలహీనత....మరేదో కారణముందని నిన్ను నీవు మభ్య పెట్టుకోకు. అతనికి నీపైగల అభిమానమెంతనో దీనివల్ల తెలుస్తోంది....పద మిగతా ఆటలు చూద్దాం"
అల్లకల్లోలమైన హృదయంలో నాలుగడుగులు వేసి ప్రేమలత-గీతలకు సుధాకర్ కనిపించాడు. ప్రేమకు ఆ సమయంలో అతన్ని చూడాలనిపించలేదు! అతని విశాలపాలభాగంపై స్పష్టంగా అగుపిస్తున్న చారలు అతను ఏదో దీర్ఘాలోచనలో మునిగివున్నట్లు అర్ధంచేసుకో గల్గారు వారు. ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు గీత ఏదో పనిమీద వెళ్తున్నట్లు తప్పు కుంది!
"అలా వున్నారేం ప్రేమ ప్రశ్నించింది.
అతను త్రుళ్ళి[పడ్డట్లు చూచాడు....ఆ.....ఏం లేదు....అకస్మాత్తుగా ఈ పోటీలు జరగటం లేదు.....పాత టీమ్ అలాగే వుండిపోతుంది. నిరంజన్ ను ఓడించి మేమిద్దరం మా స్థానం నిలబెట్టుకోవాలని ఆశ పడ్డాం తీరా చూస్తే - నిరంజన్ వదులు కున్నాడు....కారణం తెలియదు....అతడి ఆటచూచిన వారు ఫర్వాలేదంటారు........ఓ మంచి ఛాన్సు పోయింది..... నిన్ను సంతోషపెట్టాలనుకున్నాను." అతను ముఖం ముడుచుకున్నాడు.
ప్రేమ మందహాసం చేసింది. గీత. వస్తూండడం చూసి అంది మీ ఆట చూడాలన్న ఆశతో వచ్చాను..... వీడని బంధంలాంటి జుట్టుమీది ఇంకొకళ్ళ అవకాశం కల్పించేరన్న నమ్మకంలో వచ్చాను....కానీ అతను గ్రహించినట్లు ముందే తప్పుకున్నాడు?
గీత సమీపించటంతో ఎక్కడి వారక్కడ సద్దుకున్నారు.
ప్రేమ అతనికేసి మౌనంగా చూస్తూ కూచుంది అతను దూరంగా కూచుని వున్నాడు ఆప్పుడప్పుడు ఆమెను చూస్తున్నాడు.
ప్రేమను ఒకే ప్రశ్న వేధిస్తోంది. "ఎంత నమ్మకంతో వున్నాడు వాళ్ళే గెలుస్తారన్న అహంకారం - ధైర్యం - ఎంతటి ఆట గాళ్ళైనా - జయాపజయాలు దైవాధీనం అన్న విషయం అతనికి తెలీదా పోటీలు జరిగివుంటే ఎంతైనా బావుండేది.....ఈ ఆటలు ఆ తల్లిత త్రిల్లింగా వుండవు.... పరోక్షంగా ఆమె నిరంజన్ గెలుపును కోరుతోంది. ఏమిటది. ఆమె తన్ను తాను సమాధాన పర్చుకోలేక పోయింది.
* * *
