భాను చదువు మానేస్తుందనుకొంటే నాకళ్ళు నిండిపోయాయి. ఇక నాకు భాను స్నేహం దూరమైనట్టే. ఈ విషయం ఎలా మాట్లాడాలో...అసలు భాను మొహం ఎలా చూడాలో అర్ధంకాలేదు. అయినా...భానును నేను ఓదార్చాలి. దైర్యం చెప్పాలి. పిన్ని ఏదో పనిలో ఉంటే బయటకు వచ్చేశాను.
గదిలో భాను ఉదాసీనంగా కూర్చుని ఉంది. నేను నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. నోరు పెగల్చుకోని ఏదో అందామనుకొంటూండగా నాచెయ్యి పట్టుకొంది. నామొహంలోకి చూస్తూ అంది-"ఇక మనం విడిపోతున్నాం అన్నయ్యా! నన్ను మరిచిపోతావు కదూ?"
"భానూ!" నాలో ఏదో బాధ వ్యక్తమైంది.
"నువ్వు అదృష్టవంతుడివి అన్నయ్యా! నువ్వు ఎన్నో డిగ్రీలు సంపాదించాలి. వృద్దిలోకి రావాలి. అవునా?"-నేను భాను దగ్గరే టేబుల్ కు ఆని నిలబడ్డాను- "ఇద్దరం కలిసి చదువు కుందామని ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం భానూ! నువ్వు మానేస్తే నేను ఒక్కడినీ.....నేనూ మానేస్తే బావుంటుందేమో అనిపిస్తూంది" -నిజంగా అలాగే అనిపించింది. ఏం? అపారమైన తెలివి తేటలు గల భాను చదువే విరమించుకుంటే నేను కాలేజీల్లో చదివి ఉద్ధరించేదేమిటి?
భాను నవ్వింది. "నేనంటే నీకెంత అభిమానం అన్నయ్యా! నువ్వు గొప్పవాడివైతే నాకు సంతోషం కదూ? నేను ఉండగా నిన్ను చదువు మాననిస్తా ననుకొంటున్నావా? ఏ దిగులూ పెట్టుకోక ఉత్సాహంగా చదువు. నాకు ఉత్తరాలు రాస్తూండు." భాను అప్పగింతలు పెట్టినట్టు చెప్పుతూంటే సహించలేననిపించింది. నేను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను.
భాను కోరిక తీర్చటానికి బాబాయికి శక్తి లేదు. నిజమే. కాని భానువంటిదాన్ని ఒక్కదాన్ని కాదు, పదిమందిని చదివించగల శక్తీ-బాబాయికి లేని ఆ తాహతూ- నా తండ్రికి ఉన్నాయి. అయన కొడుకు నైన నాకోసం తాతయ్య దగ్గర నుంచీ సంపద పోగుపడుతూంది. కాని నేనేం చెయ్యగలను? ఏమీ చెయ్యలేను. నాన్నకు చెప్పలేను. చెప్పి ఒప్పించలేను. ఆయనకు ఆడ పిల్లల చదువుపట్ల సదభిప్రాయం లేదు. అందుకే మాచెల్లి ఐదవతరగతి కూడా పూర్తిచెయ్యకుండా అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆ అన్యాయానికి ఒక పసి హృదయం బావురుమని ఏడ్చిందని నాన్నకు తెలీలేదు. అంతే! ఈనాడు మరో చెల్లి విషయంలో కూడా నేను చెయ్యగలిగింది ఏమీలేదు. భానువంటిరత్నం మరుగునపడితే అది దేశానికే నష్టం కదూ! కావచ్చు. రత్నాలపట్ల నష్టపోయే దేశమే మౌనం వహిస్తున్నప్పుడు నావంటివాళ్ళు చెయ్యగలిగిందేమీ లేదు. బాధే మిగులు.
"ఏమిటి ఆలోచిస్తున్నావు?"
"భానూ! ఆస్తి వ్యవహారాలు ఇప్పుడునా చేతిలోనే ఉంటే మనం ఇలా విచారించే అవసరమే వచ్చేదికాదు. కాని నాన్న.... నీకూ తెలుసు కదా? ఆయనకు చెప్పి లాభం లేదు."
భాను ఆశ్చర్యపడ్డట్టు తదేకంగా చూడసాగింది. "ఈ చెల్లిని ఇంత ప్రేమించే అన్నయ్య ఒకడు ఉన్నాడని నాకు ఈ క్షణంవరకూ తెలీలేదు, అన్నయ్యా! నీ లో ఈభావం ఈ ప్రేమ ఎప్పటికీ, మనం పెద్దవాళ్ళమై చచ్చిపోయే వరకూ ఇలాగే ఉండిపోవాలి. అంతకన్నా ఏ సహాయమూ ఎక్కువ కాదు. నువ్వు..." భాను కళ్ళు చెమర్చాయి.
నేను భాను చెయ్యి పట్టుకున్నాను. "భానూ! నా మనసులో నీకు ఉన్నస్థానం నాస్వంతచెల్లి శారదకు కూడా లేదంటే అబద్ధంకాదు. శారదకూ నాకూ ఉన్న అనుబంధం సహోదరత్వం. దాన్ని నేను తేలికగా తీసివెయ్యను. కానీ నీకూ నాకూ ఉన్నది బలీయమైన మానసిక స్నేహం. దీనికిసాటి వేరొకటి లేదు. ఎప్పుడూ - నీ సంతోషం-నీ శ్రేయస్సూ కోరే అన్నయ్యను నేను ఉన్నానని నువ్వు గుర్తుఉంచుకో. ఏ దిగులూ పెట్టుకోకుండా మామూలుగా తిరుగు. నీకు ఏది కావాలన్నా నాకు రాయి. నువ్వు ఇవాళ అన్నం తినలేదంటే అమ్మ ఎంత బాధ పడుతూందో గ్రహించావా? మనం పరిస్థితులకు లొంగిపోవాలి. తప్పదు భానూ! అన్ని విషయాలూ నీకు తెలుసు-" భానుకు ఓదార్చుతూంటే నేను ఏదో చెయ్యలేకపోయానని బాధ వేధించింది. రేపు నా చేతిలోకి రాబోయే సంపదకు-వేలాది రూపాయలకూ చిల్లిగవ్వ విలువలేదు. అవసరాలు తీర్చుకోలేనివిధానం ఉందనే సంతృప్తి లేదు.
ఆరాత్రి భాను స్వయంగా ఇద్దరికీ అన్నాలు పెట్టింది. భానుకు ఆవేశమేకాదు. వివేకం కూడా ఉంది. భాను తల దించుకు అన్నం తింటూంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి.
* * *
భానుస్నేహం తరిగి పోయిందనుకొంటే మనసు భారమైంది. భవిష్యత్తు మీద ఎన్నో కలలు గని గాలిమేడలు కట్టిన భాను ఈ భంగపాటు ఎలా భరించింది? కలలు కరిగిపోయినా ఊహలు చెదిరిపోయినా ఓర్చుకోగలిగేంతటి శక్తి కలదా భానుహృదయం?
ఏ కాలేజీలో చేరేదీ-ఏ గ్రూపు తీసుకొనేదీ-ఎక్కడ బస పెట్టేదీ-చదువుకు సంబంధించిన అన్ని విషయాలలోనూ భాను సలహాలు పాటించాను. కాలేజీ గేటులో కాలుమోపిన క్షణంనుంచీ ఎప్పుడేం జరిగేదీ-లెక్చరర్లు ఎలా వచ్చేదీ- అమ్మాయిలు ఎలా ఉండేదీ-అబ్బాయిలు అల్లరి పెట్టేదీ-అక్షరాలా కాలేజీ స్వరూపాన్ని విపులీక రిస్తూ ఉత్తరాలు వ్రాశాను. ఏది చూసినా అది భానుకు రాయకపోతే మనసుకు తృప్తి లేదు. భానుకు నవలలు చదవటం మహా ఇష్టం. ఎన్ని ప్రయత్నాలైనాచేసి పేరు పొందిన నవలలుకొని భానుకు పంపితే ఏమిటో ఆనందం! క్లాసు పుస్తకాలనుంచి కొన్ని కొన్ని విషయాలు ఎత్తి రాస్తే భానుతోకలిసి చదువుకొంటున్నట్లు ఏదో అనుభూతి. భాను హృదయంలో దిగులు పోగొట్టి సంతోషం కలిగించాలనే నాతాపత్రయం! కృతజ్ఞతతో-ఆనందంతో భానురాసే లేఖలు చదువుతూంటే కళ్ళు చెమర్చేవి. భాను నాతో పాటే చదువుకొని ఒకనాటికి గ్రాడ్యుయేట్ అయినా నాకీ అనుభూతి కలిగేది కాదేమో!
క్రమంగా భాను ఉత్తరాలలో విచారరేఖలు మాయ మయ్యాయి. హిందీ పరీక్షకు చదువు తున్నాననీ లైబ్రరీ పుస్తకాలు తెచ్చుకుంటున్నాననీ-ఎప్పటిలా తీరకలేకుండానే ఉంటున్నా ననీ రాస్తూన్నకొద్దీ నా మనసు కూడా తేలిక పడసాగింది.
* * *
ఇంటర్ పరీక్షలు వ్రాశాను. క్లాసు వచ్చింది. ఆ సంతోష సమయంలోనే మరో శుభవార్త! భాను శుభలేఖ పంపుతూ ఉత్తరం రాసింది. నాకు ఆశ్చర్యం వేసింది. భానుకు ఇంత ఆకస్మికంగా పెళ్ళేమిటి? వరుడు రాజశేఖరం బి. ఏ. ట. బాగానే ఉంది. కానీ ఎందుకో ఎక్కడో నాకు వెలితి అనిపిస్తూంది. భాను డాక్టర్ కావాలని కాంక్షించింది. ఫలించలేదు. పోనీ డాక్టర్ భార్య అయితే? ఏమిటో నాకీ భ్రమ! డాక్టర్ ఎంత ఖరీదనీ! ఈ నాటి వరుళ్ళూ-కట్నాలూ నాకు తెలియనివి కావుగా? ఒక డాక్టర్ని కొనగలిగే బాబాయి కూతుర్ని చదివించలేడూ? ఇప్పటికి బి.ఎ. ను బేరం చెయ్యటానికే చాల ఖర్చు చేసి ఉండాలి. మరి పెళ్ళి నాలుగు రోజులే ఉంది. రెండు రోజల క్రిందటే మళ్ళా కాలేజీ లకు వెళ్లేందుకు, ఇంకా బట్టల కోసం నాన్న మూడు పచ్చనోట్లు ఇచ్చాడు. నేరుగా పట్టణానికి వెళ్ళి భానుకు ఖరీదైన రిస్ట్ వాచీ, కాబోయే బావ గారికి మంచి పెన్నూ తీసుకున్నాను.
భాను చేతికి స్వయంగా నేను వాచ్ కడుతూ ఉంటే ఆ అందమైన కన్నుల్లో మెరిసిన ఆనందం-ఆశ్చర్యం-ప్రత్యేకించి తన మీద నా అభిమానానికి గర్వం-అవిచాలు- నాటి కోసమే నేను భానుకు ఏమైనా చేస్తాను.
"అన్నయ్యా! ఈ బహుమతికి ఇంత విలువంటూ లేదు. కాని, నీకు నేనేం ఇవ్వగలను?"
"అప్పుడు నేనే అడుగుతాను సరేనా?"
పెళ్ళికొడుకు గురించి వివరాలు తెలుసుకోవాలని మహా ఆతృతగా ఉంది నాకు. భానుకు భర్త కాబోతూన్న ఆ వ్యక్తి ఎంత......ఎంత గొప్పవాడై ఉండాలి!
"మరి భానూ! పెళ్ళిచూపులు చూశావు కదా, బావగారు ఎలా ఉన్నాడేమిటి? బంగారు వన్నె శరీరం-నొక్కు నొక్కుల జుట్టు-విశాలమైన ఫాలభాగం-బలిష్టమైన వక్షస్థలం..."
"భుజకీర్తులూ - పాంకోళ్ళూ.....నాలుగు చేతులూ..."
"అలాగా? ఇంకా నేను మనిషేనేమో అనుకొంటున్నాను స్మీ!"
"భ! పోరా! నీగడసుతనం.." నవ్వేసింది భాను.
"కాదు భానూ! నాకు పిసిరంతన్నా చెప్పకుండా మీ ఆయన్ను నిర్ణయించేసుకున్నందుకే నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. పైగా నేను అడిగినా కూడా నువ్వు చెప్పకపోతే.....భస్! నాకేం నచ్చలేదు." అలిగి కూర్చున్నాను.
భాను నవ్వి నా గడ్డం పట్టుకొంది-
"బాబ్బాబు! చెప్తానుగానీ, నువ్విలా మూతి బిగించుకు కూర్చోకు. మాటలు విన్పించవు."
"ఓహూ! మీ ఆయనైతే మూతితోవింటాడు, చెవులతో మాట్లాడుతాడు కాబోలు. అందుకే నీకు మహానచ్చాడు."
"నిజంసుమీ! అన్నయ్య కెలా తెలిసిపోయింది చెప్మా?" వాచ్ కట్టుకున్న చెయ్యి గడ్డం క్రింద పెట్టుకొని ఆలోచన అభినయించసాగింది. ఇక అలిగి లాభం లేదు. చెయ్యి లాగేసి అన్నాను- "చెప్పు భానూ, నీకు బాగా నచ్చాడా?"
నవ్వి క్షణం మౌనం వహించింది-"బాగా నచ్చటం ఏమిటి? నాన్నావాళ్ళూ భానుకు తగిన వాడు అనుకున్నారు, నేనూ చూశాను. ఇష్టపడ్డాను. అనుకోకుండా కుదిరింది. అతనికి దూరపు బంధువులెవరోతప్ప కావలసిన వాళ్ళెవరూ లేరుట. ఆ బంధువులు అతనికి ఉన్న కొంచెం ఆస్తితో పెంచి పెద్దచేసి వదిలేశారు. ఆస్తి హరించింది. డిగ్రీ దక్కింది. ఇప్పుడు ఉద్యోగం ఒక్కటే ఆధారం. అమ్మ అందుకే కొంచెం వెనకాడింది. మనిషికి మనిషే విలువగానీ ఆస్తి పాస్తుల దేముంది అన్నయ్యా?"
"నిజం భానూ! మంచి పని చేశావు. అదీ మంచిదేలే. వెనక అంత బాదరబందీ లేకుండా ఉంటే స్వేచ్చగా హాయిగా బ్రతకటానికి వీలౌతుంది. ఇక మమ్మల్ని మరిచిపోతారు కాబోలు!"
