11
"అమ్మవారే చేస్తోందో - మనిషే చేస్తున్నాడో కానీ హత్యలు మాత్రం చాలా పకడ్భందీగా జరుగుతున్నాయి. ఎక్కడా వేలిముద్రలు కూడా దొరకడం లేదు. కృష్ణమూర్తి , నువ్వు కుర్రాడివి. చాలా జాగ్రత్తగా వుండాలి. ఎవర్నీ నమ్మకు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. స్కూలు కు వెళ్ళగానే వెంటనే ఇంటికొచ్చేసేయ్. అమ్మతో నాన్నతో అలా అంటిపెట్టుకునే వుండు. నీకు కాపలాగా మా కానిస్టేబులు కూడా ఒకడుంటాడు ...." అన్నాడు ఇన్ స్పెక్టర్.
కృష్ణమూర్తి భయంతో వణికిపోతూ -- "ఇంతమందిని రక్షించలేని మీరు ....నన్ను మాత్రం ఎలా రక్షించగలరు ? ఇది అమ్మవారి పగ. దీన్నుంచి తప్పించుకోలేనేమో " అన్నాడు.
'అలాగానకురా -- నీకేం భయం లేదు. అమ్మవారికి పూజలు చేయిస్తాను. దండిగా కానుకలిచ్చుకుంటాను" అన్నాడు చంద్రయ్య.
కృష్ణమూర్తికి నమ్మకం కలిగినట్లు లేదు. అతడికి ఆ రాత్రే జ్వరం వచ్చింది. జ్వరం నిండా పలవరింతలు.... తల్లీ, మహాకాళీ ....నన్ను చంపకు....అంటూ కేకలు పెట్టాడు. ఓ రాత్రి వేళ లేచి కూర్చుని వెర్రి చూపులు కూడా చూశాడు. అతని పరిస్థితి చూస్తూ తల్లి భయపడి పోయింది. చంద్రయ్య కూడా బాగా కలవరపడిపోయాడు.
మర్నాడు మునసబు గారి పాలేరు కు మహాకాళి పూనింది. "ఒరేయ్ వెధవల్లారా! నేను బలి తీసుకున్న దేవర్నో ముందుగా మీకు తెలియనిస్తాననుకున్నారుట్రా.... నేను ఈ పర్యాయం కుర్రవాడ్ని బలి తీసుకొను.... పెద్ద వాడ్నే"
ఈ పూనకంతో ఊరంతా గగ్గోలెత్తిపోయింది. అంతా ప్రాణాలరచేతిలో పెట్టుకున్నారు.
ఇన్ స్పెక్టర్ కిదంతా అగమ్య గోచరంగా వుంది. దేవతలు మనిష్యుల్తో కలిసిపోయి కక్షలు తీర్చుకోవడమూ, తమ మాటలు మనుషుల చేత చెప్పించడమూ.... అతడికి నమ్మశక్యం కాలేదు. మునసబు గారి పాలేర్నో పట్టు పట్టాలని అతను అనుకొన్నాడు.
అతడినో సారి పిలిపించి ప్రశ్నల పేరుతొ ఓ గదిలోకి తీసుకెళ్ళి -- "పోలీసులు పెట్టె చిత్రహింసలు సంగతి నీకు తెలియదు. అమ్మవారు పూనిందంటూ వూళ్ళో నువ్వన్న మాటలు నేను నమ్మడం లేదు. నిన్ను చావ గొట్టకుండా నిజం చెబితే సరేసరి....లేదా దెబ్బలు, జైలు వగైరాలు చాలా వుంటాయి. అసలు సంగతి చెప్పు అమ్మవారి పూనకం నటించమనీ , ఆ మాటలు చెప్పమని నీన్నేవరు ప్రోత్సహించారు ?" అనడిగాడు.
ఎంతో శ్రమ లేకుండానే పాలేరు అసలు విషయం బయటపెట్టాడు.
అతగాడినలా ప్రోత్సహించింది మునసబు శేషావతారమేనని తెలిసేసరికి ఇన్ స్పెక్టర్ కి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాలేదు. తక్షణం అతడు మునసబు ను కలుసుకున్నాడు. ఇన్ స్పెక్టర్ ప్రశ్నకు మునసబు కంగారు పడలేదు.
"చంద్రయ్య నా కావలసినవాడు. అతను తన గోడు చెప్పుకున్నాడు- కొడుకు బెంగ పెట్టుకున్నాడని. అ భయం తగ్గించడానికి నేను మా పాలేరు చేత అలా చెప్పించాను."
"ఇది మంచి పని కాదు. మీరు చేసిందాని వల్ల వూరంతా హడలి పోతోంది. అలాగే ఆ అబ్బాయి కృష్ణమూర్తి కూడా ఆజాగ్రత్తగా ఉండవచ్చు. ప్రజలకు నిజం తెలియడం చాలా అవసరం...." అన్నాడు ఇన్ స్పెక్టర్.
"మీరేది మంచి అనుకుంటే అదే చేయండి" అని వూరుకున్నాడు మునసబు.
ఇన్ స్పెక్టర్ వెంటనే మునసబు గారి చేత, పాలేరు చేత వారందరికీ నిజం చెప్పించాడు. ఊళ్ళో ఎవ్వరూ శేషావతారాన్ని తప్పు పట్టలేదు. ఓ కుర్రాడ్ని రక్షించడం కోసం ఆయనలా చేయడం మంచిదన్నట్లుగా చాలామంది అభిప్రాయ పడ్డారు.
కృష్ణమూర్తి కీ విషయం తెలియగానే మగతలోకి వెళ్ళిపోయాడు. తనకు చావు తప్పదన్న విషయం అతనికి రూడి అయింది. అతని శరీరం సలసల కాగిపోతోంది.
ఊళ్ళోని నాటు వైద్యుడు కృష్ణమూర్తి ని చూసి కంగారు పడి" నావల్ల కాదు పట్నం తీసుకు పొండి" అని చెప్పేశాడు.
12
కృష్ణమూర్తి ని పట్నం తీసుకు వెళ్ళారు.
డాక్టర్ పరిశీలించి ఏవో ఇంజక్షన్స్ చేశాడు. ఫలించలేదు. వివరాలన్నీ తెలుసుకుని అయన "కుర్రావాడు బాగా భయపడ్డట్టున్నాడు. ఏదో విధంగా ఆ భయం పోగొట్టే మార్గం చూడాలి" అన్నాడు.
ఎవ్వరికీ ఏమీ దారి తోచలేదు. చంద్రయ్య కు మతి మతిలో లేదు. కొడుకు దగ్గరకు వెళ్ళి "ఎందుకురా అలా భయపడతావ్ - నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేను నీకు కాపాలాగా వుండగా ...." అని ఏదో అనబోగా --
"నాన్నా -- అమ్మవారిని నువ్వేం చెయ్య గలవ్? మా క్లాసులో తెలివయిన వాళ్ళందర్నీ ఒక్కొక్కరినే వరసగా పొట్టన పెట్టుకుంటుందా మహాకాళి. అదుగో నాకేసి చాలా కోపంగా చూస్
తోంది.....అయిపొయింది నా పని అయిపొయింది ...బాబోయ్ ..." అని అరిచాడు కృష్ణమూర్తి.
డాక్టర్ అతడి నాడి పరీక్షించి -- "ఇది హోప్ లెస్ కేసు అనిపిస్తోంది" అన్నాడు.
"ఏం చెయ్యాలి డాక్టర్?" అన్నాడు చంద్రయ్య.
"కుర్రాడు షాక్ తిన్నాడు. తను మానవాతీతశక్తికి బలి కాబోతున్నానన్న భ్రమలో వున్నాడు. ఆ భ్రమ తొలగించే మార్గం కనబడడం లేదు " అన్నాడు డాక్టర్.
"ఏమీ ఆశలు లేవంటారా?" అన్నాడు చంద్రయ్య దిగులుగా.
"లేనట్టే అనిపిస్తోంది..." అన్నాడు డాక్టర్.
ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఇన్ స్పెక్టర్ అన్నాడు చంద్రయ్య -- "నా కొడుకు నాకు దక్కకపోతే నా బ్రతుక్కర్ధం లేదు. నేను అమ్మవారి పేరు చెప్పి నాటక మాడితే ఆ దేవి నా వేలితో నా కన్నేపోడిచింది. ఇంతవరకూ మా ఊళ్ళో జరిగిన నాలుగు హత్యలూ నేనే చేశాను."
కృష్ణమూర్తి తో పాటు హాస్పిటల్ కు వచ్చిన ఇన్ స్పెక్టర్ చంద్రయ్య మాటలు విని ఆశ్చర్యపడ్డాడు.... ఏమిటి, ఈ హత్యలు నువ్వు చేశావా?" అన్నాడు.
"అవునండీ -- ఎవరికీ నామీద అనుమానం రాకుండా ఉండడం కోసం పూజారి రంగయ్య అన్నబెదిరింపు మాటల్ని పట్టుకుని, ఇంతవరకూ నలుగురు కుర్రాళ్ళ ను చంపాను. మొట్టమొదట మునసబు గారబ్బాయి మాణిక్యాలరావు కు అమ్మవారి వేషంలో కనిపించి బెదిరించాను. వీలు చూసుకుని ఒక్కొక్కరినే చంపాను...."
"ఎందుకు ?'
"నా కొడుక్కు క్లాసులో పోటీగా ఉంటున్నారు వాళ్ళు. నీళ్ళు నలుగురూ లేకపోతె మావాడేప్పుడూ క్లాసులో ఫస్టు వచ్చేవాడు."
"అందుకోసం ఇంత దుర్మార్గం చేస్తావా? ఇది మనుషులం చెయ్యాల్సిన పనేనా? అందులోనూ నువ్వు మునసబు గారి నమ్మిన బంటుని విన్నాను. అయన కొడుక్కే....
"అదే బాబూ! నా కొంప ముంచింది. మాణిక్యాలరావు మునసబు గారికి పుట్టిన కొడుకు కాదు. ఆ విషయం ఆయనకు చాలా ఆలస్యంగా తెలిసింది. మునెయ్య నేవాడి వల్ల తన భార్యకు మాణిక్యాలరావు కలిగాడని మునసబు గారికి తెలిసింది. ఆ విషయం తెలిశాక పరిశీలిస్తే మాణిక్యాలరావు లో మునెయ్య పోలికలూ, లక్షణాలూ చాలా కనబడ్డాయాయనకు.
వెంటనే మానిక్యాలరావునీ, మునెయ్య కొడుకు రమణారావు నీ చంపెయమనీ మునసబు గారు నన్నాదేశించారు. ఆ విధంగా తన భార్యనీ, మునేయ్యనీ కూడా మానసికంగా హింసించాలనీ అయన అనుకున్నాడు.
నేనీ పనికి వెంటనే ఒప్పుకున్నాను. మా అబ్బాయి పోటీగా వున్న నలుగురుల్లో ఈ ఇద్దరూ వున్నారు. నేరాన్ని అమ్మవారి మీద పెట్టి ఇంకో ఇద్దరు కుర్రాడు కూడా చంపేస్తానని మునసబు గారికి చెప్పాను.
మాణిక్యాలరావు నాయన చంపమని చెప్పక పొతే మిగతా హత్యల జోలికి నేను వెళ్ళి వుండేవాడ్ని కాదు. ఏమయితేనేం -- దురదృష్టం నన్ను వరించి నా కొడుకు అమ్మవారికి భయపడుతున్నాడు. ఎవరి కోసం ఇదంతా చేశానో వాడేదక్కక పొతే ఎలా? ఈ హత్యలు చేసినది నేనేననీ అమ్మవారు కాదనీ వాడు తెలుసుకుంటే చంద్రయ్య ఆగాడు. అప్పుడే కృష్ణమూర్తి కళ్ళు తెరిచాడు.
చంద్రయ్య కొడుకు దగ్గరకు పరుగున వెళ్ళి -- ఈ హత్యలన్నీ చేసింది నేనురా! క్లాసులో నువ్వే ఫస్టు రావాలని ఒక్కొక్కళ్ళనే నీకు పోటీగా వున్న వారందర్నీ చంపేశాను. ఏ అమ్మవారూ ఈ హత్యలు చేయలేదు. నీకు ప్రాణభయం లేదు, మనూర్లో యింక హత్యలు జరగవు" అన్నాడు ధైర్యం చెపుతూ.
ఈ మాటలు విని కృష్ణమూర్తి ఏదోలా నవ్వాడు. స్వార్ధానికి అతీతమైన ప్రేమలోని పచ్చి స్వార్ధం చూశాననో, ఇప్పుడు హంతకుడి కొడుకుగా క్లాసులో ఎలా వెళ్ళగలననో, తన ప్రాణాలెలాగూ దక్కనప్పుడు ఇతరుల ప్రాణాలతో తనకు నిమిత్త మేమిటనో - ఆ నవ్వుకు అర్ధం ఎవరికీ సరిగ్గా తెలియదు.
'డాక్టర్ , నా కొడుకు బ్రతుకుతాడా?" అన్నాడు చంద్రయ్య.
డాక్టరు మాట్లాడలేదు.
ఇన్ స్పెక్టర్ చంద్రయ్య చేతులకు బేడీలు వేశాడు. ఆ దృశ్యాన్ని కృష్ణమూర్తి చూడలేదు. తన స్నేహితుల ప్రాణాలు తీసిన తండ్రి ముఖం చూడలేకనో, అటువంటి మనుషులున్న ఈ లోకంలో వుండడం ఇష్టం లేకనో అతను కన్నులు మూసుకునే వున్నాడు.
ఎందరో కన్నతల్లుల ఉసురు చంద్రయ్యను వదిలి పెడుతుందా ?"
---అయిపొయింది ------
