Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 6

 

    "ఇది నా హాబీ-- రాంకుల ప్రకారం మా క్లాసు వాళ్ళ పేర్లన్నీ నోట్ చేస్తాను. పాత మార్కులని బట్టి వచ్చే పరీక్షల్లో ఎవరేవరికీ ఏయే రాంకులోస్తాయో ముందు గానే ఊహిస్తాను. పరీక్షలయ్యాక నా వుహలోని జాబితానూ అసలు జాబితాను పోల్చి చూస్తాను. నూటికి తొంబై పాళ్ళు నా వూహ రైటావుతుంటుంది.
    ఈవేళ రాత్రి కూర్చుని వచ్చే పరీక్షలకు రాంకింగ్స్ లిస్టు తయారు చేస్తున్నాను. అయితే మా క్లాసులో ముగ్గురు చచ్చిపోవడం వల్ల ఆ పేర్లు తీసేయవలసి వచ్చింది. అవి కొట్టేద్దామని లిస్టు తీసేసరికి ఈ విషయం స్పురించింది . మా ఇంట్లో అందరూ పడుకున్నారు. నేనీపనిలో వుండి పోయాను. టైము తెలియలేదు. ఈ విషయం స్పురించగానే వెంటనే మీ దగ్గరకు పరుగెత్తుకొచ్చాను. ఇలా జరగడం నాకే ఆశ్చర్యం గా వుంది."
    ఇన్ స్పెక్టర్ మెచ్చుకోలుగా రవి కుమార్ వంక చూసి , " నిరాధారంగా పయనిస్తోన్న మాకో ఆధారం చూపించావు. చాలా థాంక్స్. కానీ ఇంత రాత్రి వేళ బయల్దేరి వచ్చావ్. భయం వేయలేడూ?" అన్నాడు.
    "నాకూ భయానికీ ఆమడ దూరం. నేను పరుగెత్తుకు రావడాని క్కారణం వెంటనే ఈ విషయం మీకు తెలిస్తే నాలుగో మనిషిని రక్షించగలుగుతారని ...." అన్నాడు రవికుమార్.
    "ఎవరా నాలుగో మనిషి ?" అంటూ లిస్టు చూశాడు ఇన్ స్పెక్టర్. అక్కడ చిన సోమయాజులు పేరుంది.
    "సోమయాజులు గారబ్బాయండి. పక్క వీదిలోనే వాళ్ళ యిల్లు."
    ఇన్ స్పెక్టర్ ఓ కానిస్టేబుల్ ని తోడిచ్చి రవి కుమార్ ని ఇంటి వద్ద దిగవిడిచి రమ్మన్నాడు. వెళ్ళే ముందు రవి కుమార్ తో "ఈ విషయం ఇంకెవ్వరికీ చెప్పకు సుమా ,' అన్నాడు. రవికుమార్ అలాగేనని తలూపాడు."
    ఇన్ స్పెక్టర్ రవికుమార్ యిచ్చిన స్టేట్ మెంట్ వంకే తదేక దీక్షతో చూస్తూ ఆలోచించసాగాడు. ఆలోచిస్తున్న కొద్దీ కేసు స్వరూపం కొద్ది కొద్దిగా అతనికి అర్ధం కాసాగింది.
    "ఎవరికో అమ్మవారి ఆదాయం వల్ల ప్రయోజనముంది. అమ్మవారి ప్రభావానికి ప్రచారాన్నివ్వాలనుకున్నారు. అందుకు విద్యార్ధులను బలిగోనాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎవరిని చంపాలి? అందుకోసం తొమ్మిదవ తరగతి విద్యార్ధుల నేన్నుకుని రవికుమార్ వద్ద నున్న జాబితాను మార్గదర్శకంగా పెట్టుకున్నారు. ఇలా ఎన్ని కొనసాగిస్తారు? ఇప్పటికే ప్రజల్లో చెప్పుకోదగ్గ సంచలనం వచ్చింది. అందరూ అమ్మవారంటే భయపడుతున్నారు.
    ఇన్ స్పెక్టర్ శరీరం గగుర్పోడిచింది. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెంచుకున్న పసి ప్రాణాలను బలి గొంటున్నాడు హంతకుడు.
    రవి కుమార్ దిగవిడిచి కానిస్టేబుల్ తిరిగి రాగానే "మనం ఒక పర్యాయం సోమయాజులు గారింటికి వెళ్ళి వద్దాం. విషయం తెలిశాక హెచ్చరించడం మన విధి" అన్నాడు.

                                    10
        
    చినసోమయాజులు అల్పాదమనానికి లేచాడు. అతడికి కొద్దిగా భయం వేసింది. అటువైపు తిరిగి తల్లిని తట్టి లేపి 'అమ్మా -- సాయం వస్తావా ?" అన్నాడు. ఆవిడ మంచి నిద్రలో ఉన్నట్లుంది - " పెద్దాడివౌతున్నావు ఇంకా భయ మెండుకురా ?" అంది.
    "ఏమోనమ్మా చాలా భయంగా వుంది ...." అన్నాడు చిన సోమయాజులు.
    "మగపిల్లాడి కంత భయముండకూడదు " అంది తల్లి.
    "పోనీ నాన్నగార్ని లేపనా?"
    "అయన మొదలే విసుక్కుంటారు. ఊర్నించి వచ్చీ రాగానే మంచినీళ్ళు అన్నా తాగకుండా నిద్రకు పడ్డారు " అంది తల్లి.
    చినసోమయాజులు కు భయంగా వుంది. అందులోనూ అమ్మగారు నరబలి తీసుకోవడమూ, తన సహాధ్యాయులు ముగ్గురు చనిపోవదమూ , అతడ్ని భయాన్ని పెంచుతోంది. అయితే తల్లికా విషయం చెప్పడాని కతడికి అభిమానం అడ్డొచ్చింది. తను అమ్మావారిని నమ్మనని అతను ఎన్నో సార్లు చెప్పాడు. కానీ ఇప్పుడు మితిమీరిన అవసరం వల్ల -- "నా క్లాస్ మేట్స్ ముగ్గురు చచ్చిపోయారు అందుకని కాస్త భయంగా వుందమ్మా...." అన్నాడు.
    అతడి తల్లికి బాగా నిద్ర పట్టినట్లుంది. లేకుంటే ఈ మాటల కావిడకు బాగా మెలకువ రావలసిందే. మగతలోనే -- "వాళ్ళ కర్మ కొద్ది వాళ్ళు పోయారు. నువ్వు భయపడకు. గమ్మున వెళ్ళి వచ్చేయ్" అంది.
    తల్లి సాయానికి రాదనీ అతడికి తెలిసిపోయింది. అతడు లేచి నిలబడి "నేను అమ్మా అంటాను. నువ్వు ఊ అంటుండు ...." అన్నాడు.
    అలా చేయడం వాళ్ళిద్దరికీ అలవాటే, ఆ శబ్ద తరంగాలే వాళ్ళిద్దర్నీ సన్నిహితుల్ని చేసినట్లు భావించుకుంటారు.
    'అమ్మా!" అన్నాడు చినసోమయాజులు గుమ్మం లోంచి దొడ్లోకి అడుగు పెడుతూ.
    "ఊ" అంది చినసోమయాజుల తల్లి.
    అతను గట్టిగా అమ్మా అన్నప్పుడల్లా నిద్ర మగతలోనే "ఊ" అంటోందావిడ.
    అయితే ఆవిడ గమనించని విషయం ఆతగాడు హటాత్తుగా అమ్మా అని పిలవడం మానేయడం. అదే నిద్ర ప్రభావం. మగత లో ఆవిడ కొడుకింకా తనను అమ్మా అని పిలుస్తున్నాట్టూ - తను ఊ అని జవాబిస్తున్నట్లూ ఊహించుకుంటోంది. చిన సోమయాజులు అమ్మా అనడం మానేశాడు. లోపలకూ రాలేదు.
    కాసేపటికి ఎవరో తలుపు తడుతున్న చప్పుడు కావిడకు మెలకువ వచ్చి లేచింది. అయితే వెంటనే తలుపు తీయడానికి భయం వేసి భర్తను లేపింది. విసుక్కుంటూనే అయన లేచి వెళ్ళి తలుపు తీశాడు.
    "క్షమించాలి సోమయాజులు గారు! మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాము. మీ అబ్బాయెం చేస్తున్నాడు?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఏం?"
    "మాకు అందిన సమాచారం ప్రకారం ఊళ్ళో మీరందరూ అనుకుంటున్న అమ్మవారి నరబలుల్లో నాల్గువది మీ వాడిది కావచ్చు...." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    సోమయాజులు ఉలిక్కిపడి "ఏమిటన్నారు?" అన్నాడు.
    "మీ అబ్బాయి ప్రాణాలకు ప్రమాదముంది. జాగ్రత్తగా చూస్కోండి ...."
    సోమయాజులు భార్య ఉలిక్కిపడి లోపలకు పరుగెట్టింది. చూస్తె పక్కమీద కొడుకు లేడు. అదే విషయాన్ని ఆవిడ గట్టిగా కేకవేసి చెప్పింది. సోమయాజులు ఇన్ స్పెక్టర్ పరుగెత్తుకుని లోపలకు వెళ్ళారు.
    "సాయం రమ్మని లేపాడు. అమ్మా అంటే ఊ అంటుంటాను. వెళ్ళిరా అన్నాను. అలాగే అమ్మా అన్నాడు, ఎప్పుడూ మానేశాడో గుర్తు లేదు. మళ్ళీ లోపలకు వచ్చినట్లు లేడు. ఏం జరిగిందో ఏమిటో....' అంటూ సోమయాజులు భార్య శోకం మొదలెట్టింది.
    ఆవిడ్ని ఊరుకోమని చెప్పి మగాళ్ళు ఇద్దరూ దొడ్లో కి వెళ్ళారు. అట్టే శ్రమ లేకుండానే వాళ్ళకు చిన సోమయాజులు శరీరం కనబడింది. అయితే ఆ శారీరానికి ప్రాణం లేదు. ఎవరో పీక నులిమి చంపేశారు.
    కొడుకు శవాన్ని చూస్తూనే సోమయాజులు మ్రాన్పడి పోయాడు.
    "ఆలశ్యం కాకుండా హెచ్చరిద్దామనుకున్నాను. కానీ ఆలస్యమై పోయింది" అనుకుంటూ ఇన్ స్పెక్టర్ వీధిలోకి పరుగెత్తాడు. ఆ వీధిలో అతడి కోరికమీద చంద్రయ్య కాపలా కాస్తున్నాడు.
    "చంద్రయ్య -- ఈ వీధిలోకి ఎవరేనా రావడం గానీ వెళ్ళడం గానీ జరిగిందా ?"
    లేదన్నాడు చంద్రయ్య.
    'అయితే ముందు నీ యింటికి పరుగెత్తు. ఈ హత్యలిలా ఎన్ని జరుగుతాయో తెలియదు కానీ అప్పుడే నాలుగో హత్య కూడా జరిగింది. అయిదో హత్య జరిగితే అది నీ అబ్బాయిదే అవుతుంది" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    'అయ్యబాబోయ్ -- నాకయితే ఒక్కడే కొడుక్కూడాను ...." అంటూ పరుగు తీశాడు చంద్రయ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS