Previous Page
స్త్రీ పేజి 53

 

    "అమ్మా! ఏమిటో నాకంతా అయోమయంగా ఉందమ్మా! నువ్వెందు కిలా మారిపోయావమ్మా?" భయంభయంగా చూసింది సుజాత.
    నిండుగా నవ్వింది కామేశ్వరమ్మ , "జీవితం మార్చేస్తుందమ్మా మనిషిని. చిత్రమైన అనుభవాలు కలిగిస్తుంది. ఒకే ఆలోచనలూ, ఒకే అభిప్రాయాలూ కలకాలం నిలిచి పోవు. అంతం లేదనుకున్న ఈ అశాంతి బ్రతుకు మారిపోయిందమ్మా! నా బిడ్డలా కోసం నేను బ్రతక గలుగు తున్నాననే ఈ తృప్తి చాలమ్మా! ఎన్ని జన్మల కైనా చాలు."
    "అమ్మా!' సుజాత ఆ ప్రయత్నంగా తల్లి పాదాల మీద చేతులు వేసింది. "జన్మజన్మలకి నీ కడుపునే నేను పుడతానమ్మా! అక్కయ్య కి కూడా ఈ మాతృమూర్తి విలువ తెలుసు."
    "సుజా" కామేశ్వరమ్మ కూతుర్ని గుండెలకు చేర్చుకుంది. పొత్తిళ్ళ లో పసి బిడ్డే అయింది తల్లి కౌగిట్లో సుజాత.

                               *    *    *    *
    చెవుల మీదుగా ముసుగు వేసుకుని, ఒళ్ళంతా పాత చీర కప్పుకుని, కాళ్ళు నేల మీద అన్చుకుని , నులక మంచం మీద కళ్ళు మూసుకుని కూర్చుని వుంది పార్వతి. అలా ఎంత సేపటి నుంచి కూర్చుని వుందో ఆమెకే తెలీదు. రెండు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నా పార్వతి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు.
    ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక రకంగా శ్మశానం లా ఉంది. తీవ్రంగా అదురుతున్న పార్వతి గుండెల చప్పుడు కూడా ఆ నిశ్శబ్దాన్ని భంగ పరచ లేకపోతుంది. రెండు రోజులుగా ఆ యింటి తలుపులు తెరచుకోలేదు. ఇంటికీ బయటికీ పూర్తిగా సంబంధాలు తెగిపోయి నట్టయింది. ఇక లోకంతో తనకే బాంధవ్యమూ లేదేమో ననిపిస్తుందామెకు.
    నిట్టూర్చటం కూడా కష్టమై పోయింది. తల కిందికి దించుకుని అలాగే కూర్చుని వున్న పార్వతి ఏదో గ్రహించగలిగినట్టు నెమ్మదిగా తల ఎత్తింది. వీధి తలుపుల కేసి తదేకంగా చూసింది. ఆ తలుపుల వెనక ఎవరో తచ్చాడు తున్నట్టు, బరువుగా గాలి పీల్చు కుంటూన్నట్టు భ్రమ కలిగింది. భ్రమల మీద నమ్మకం ఏనాడో సన్నగిల్లి పోయిన పార్వతి కూర్చున్న చోట నుంచి కదల లేకపోయింది. అలాగే కూర్చుని కప్పుకున్న చీర సర్దుకుంది. ఆ తలుపుల మీద నుంచి పార్వతి దృష్టి మళ్ళలేదు. వాటి వెనక ఎవరో ఉన్నారు. నిజంగా ఉన్నారు. అబద్దం కాదు. ఎందుకో మనస్సు కంగారు పెడుతుంది. బలంగా నమ్మకం కుదురుతుంది. తనకోసం ఎవరో వచ్చారు.....తన కోసం.....
    ముసుగు జారుతుంటే తడబడుతూ అడుగులు వేసుకుంటూ నడిచింది. మూసిన తలుపులు తెరిచింది. అడిరిపడలేదు. ఉలిక్కి పడలేదు. తన భ్రమ భ్రమ కానందుకే విస్తుపోయింది. తన మనస్సలా ఆరాట పెట్టి నందుకే ఆశ్చర్య పడింది.
    "ఎవరూ? ఎవరదీ?' అతి నీరసమై పోయిన పార్వతి కంఠస్వరం గుస గుసలాడి నట్టే ధ్వనించింది. ఆ క్రీనీడ లో కూర్చుని వున్న మనిషి ఆకారం తెలీటం లేదు. ఒత్తుగా పెరిగిపోయిన గడ్డం అతని రూపాన్ని రహస్యం చేస్తుంది. వదులై వెళ్ళాడుతున్న బట్టలు అతన్ని తమలో దాచు కుంటున్నాయి. అతను స్థాణువు;లా నిలబడి వున్నాడు. పార్వతి కంపిస్తున్న గొంతుతో రెట్టించి ప్రశ్నించింది. "ఎవరదీ? ఎవరంటే మాట్లాడరేం?"
    చీకటిలో ఆ ఆకారం చలించింది. "నేను.....నేను....."
    "నేను.....నేనంటే....?"
    "నేను....నేనే, పార్వతీ!"
    త్రుళ్ళి పడింది పార్వతి. చీకటి లోకి కళ్ళు చిట్లించుకుని చూసింది. "ఏవరూ? ...ఎవరూ....రఘుబాబూ!"
    జవాబు రాలేదు.
    "రఘూ బాబూ! నువ్వేనా?"
    ఆ వ్యక్తీ మాట్లాడలేదు.
    పార్వతి నమ్మకం స్తిర పడి పోయింది. పార్వతి శరీరం కంపించసాగింది. తూలి పడబోయి గుమ్మాన్ని పట్టుకుంది. "రఘూ బాబూ! లోపలికి రా!" తను లోపలికి నడిచింది. చీకటిని చీల్చేందుకు చిన్న దీపమైనా వెలిగించాలనుకొంది. వంటిల్లంతా తచ్చాడుతూ తిరిగింది. నీరసంగా చేతులు చాచి తుడుముళ్ళాడింది. చేతి కందిన లాంతరు లో నూనె లేదు. వెలిగి వెలిగి కొడి గట్టి ఆరిపోయింది ఏనాడో. మరి వెలిగేందుకు ఆహారం లేదు. వెలిగించెందుకు అయుధమూ లేదు. లాంతరు వదిలి లేచి ఇవతలికి వచ్చింది!
    రఘుబాబు బల్ల మీద కూర్చుని వున్నాడు.
    సందెవెన్నెల తాలుకూ కాంతి గుడ్డి గుడ్డిగా గదిలోకి ప్రసరిస్తుంది. పార్వతి ఎప్పటిలా నులక మంచం మీదే కూర్చుంది. ఎప్పటిలా పాత చీర ముసుగు కప్పుకుంది. ఎప్పటిలా కాళ్ళు కిందికి ఆన్చి తల దించుకొంది.
    ఎప్పటి లాగే నిశ్శబ్దంగా గడుస్తుంది కాలం.
    ఎప్పటికో ....... ఎప్పటికో.... తలెత్తింది పార్వతి. వేడి కన్నీటి బొట్లు పాత చీరలో రాలి పడ్డాయి.
    "రఘు బాబూ? అన్నం తిన్నావా?"
    "లేదు."
    "ఊ . నేనూ తినలేదు. నాకు రెండు రోజుల నుంచి జ్వరం.... రేపు తగ్గిపోతే మళ్ళా అన్నం వండుకోవాలి. " పిచ్చి పిచ్చిగా మాట్లాడింది పార్వతి.
    రఘుబాబు వినే వుంటాడు. ఊరుకున్నాడు.
    "సుశీల చచ్చిపోయింది." హటాత్తుగా అంది పార్వతి. వింటున్న రఘుపతి మాట్లాడలేదు.
    "ఎందుకు చచ్చిపోయింది?" సుశీల స్మృతి తో ఆవేశం రేగింది. రెట్టించి అడిగింది : "సుశీల ఎందుకు చచ్చి పోయింది, రఘుబాబూ?"
    "నాకు తెలీదు."
    ఎర్రగా చూసిన పార్వతి చూపు రఘు బాబుకు కనిపించలేదు. కదలని విగ్రహం లా బల్లకు అంటుకు పోయాడు.
    "రఘూ!' పార్వతి పిలుపులో స్పష్టమైన తీవ్రత! పార్వతి గొంతులో చిత్రమైన ఆవేశం!
    రఘుబాబు సూటిగా చూడలేకపోయాడు. చూడటానికి ప్రయత్నించ లేకపోయాడు. "నీకు కోపం వస్తోంది, పార్వతీ! నేనేం చెయ్యను?"
    "కనిపించే ప్రతి ఆడదాని కంఠనికి ఉరి బిగించి చంపేయ్! చంపేయ్, రఘూ! అది నువ్వు బాగా చెయ్యగలవు."
    "పార్వతీ!"
    "సుశీల ఎందుకు చచ్చిపోయిందో నాకు తెలుసు. ఎవరు చంపెశారో కూడా నాకు తెలుసు. జీవించాలనే కోరిక లేని వ్యక్తీ చావటం లో విశేషం లేదు. నీ సాహచర్యం తో ఆ కోరికే నశించి పోయిందామెలో , రఘూ బాబూ! ఒక్కసారి నీ అంతరాత్మ ని ప్రశ్నించుకో! ఒక్కసారి అంతరంగంలోకి తొంగి చూసుకో. సుశీల ఎందుకు చచ్చిపోయిందో నీకు తెలీటం లేదూ?"
    ".........."
    "మాట్లాడవేం , రఘూ బాబూ? సుశీల ని ఏనాడైనా భార్యగా ఆదరించావా? తోటి ప్రాణి పట్ల చూపించవలసిన కనీసపు సానుభూతైనా చూపించావా? మాట్లాడు, రఘూ! ఇప్పటికీ నీ మనస్సు విప్పి చెప్పుకోలేవా/ ఇప్పటికీ....."
    "లేదు, పార్వతీ, లేదు. నా బలహీనతలకి అంతు లేదు. సుశీల మెడలో తాళి కట్టిన నేను ఆ తాళి  కట్టినందుకు ఏడవని రోజు లేదు. సుశీలని నేను కోరి బాధించకపోయినా తను బాధతో మగ్గి పోతోందని నాకు తెలుసు. దానికి బాధ్యత నాదేనని కూడా నాకు తెలుసు. కాని పార్వతీ! సుశీల ని ఓదార్చే పాటి సానుభూతి కూడా ఈ హృదయం లో కరువై పోయింది. నా కరుణ కోసం కలవరిస్తోన్న తోటి ప్రాణిని గుర్తించే వివేకమే ఈ దౌర్భాగ్యుడి లో నశించి పోయింది. నన్ను నేను శిక్షించు కొంటూ బ్రతకటం ఒక్కటే నాకు సంతోష మైంది." దోరణి లా చెప్పుకుపోతున్న రఘుబాబూ ఆగాడు ఒక్క క్షణం. "నేను చేసింది ఒకే ఒక తప్పు, పార్వతీ. నా మనస్సు నా అధీనం లో ఉందని భ్రమ పడ్డాను. నన్ను నేను శాసించు కోగలని అపోహ పడ్డాను."
    నిర్జీవంగా నవ్వింది పార్వతీ. "అది భ్రమ కాదు, రఘూ! నీ అహంకారం! నువ్వు చేసిన ఆ ఒక్క తప్పూ ఎంత ఘోరమైనదో ఇప్పటికీ గ్రహించి ఉండవు. పువ్వు లాంటి మనిషి లోనే ముల్లు లాంటి అమానుషత్వం దాగి వుండ వచ్చును."
    "పార్వతీ!' రఘుపతి పిలుపు దీనాతి దీనంగా ధ్వనించింది. "ఒక్కసారి నన్ను నేను విమర్శించు కుంటే నీకూ సుశీలకూ ఎంత అన్యాయం చేశానో గ్రహించుకో గలను , పార్వతీ! తెలిసి కూడా ఈ పాపిష్టి ప్రవర్తన దిద్దుకోలేని దౌర్భాగ్యం నన్నావరించింది."
    "దయచేసి నీ దౌర్భాగ్యాల ప్రసక్తి నా ఎదట తీసుకు రాకు, రఘు బాబూ! రెండు నిండు జీవితాలతో చెలగాటాలాడుకున్న నీ బలహీనతలని నేను సమర్ధించలేను. నేను సమర్ధించలేను."
    "పార్వతీ!" పశ్చాత్తాపాగ్ని దహించుకు పోతున్న రఘుబాబు హృదయం ఆ పిలుపులో ప్రతిబించింది. "నన్ను క్షమించలేవా, పార్వతీ?"
    "ఆ ప్రశ్న అడగవలసింది చచ్చిపోయిన సుశీలని. చివరి క్షణాల లోనైనా నీ నోటి నుంచి ఈ మాట వింటే పుట్టెడు బలంతో బ్రతక గలిగేది. ఆ దేవత ప్రసాదించే క్షమా భిక్షతో నీ జీవితం పునీతమై పోయేది. ఎంత పొరపాటు చేశావు, రఘూబాబూ! భిక్ష అర్ధించటానికైనా అర్హతానర్హతలు నిర్ణయించు కోలేక పోయావా?"
    "పార్వతీ!"
    "మన్నించు, రఘుబాబూ! నాకు స్వార్ధమే లేదంది లోకం! కాని, నాలో త్యాగం మాత్రం లేదు. ఎంతమాత్రం లేదు. క్షమాభిక్ష అర్దిస్తోన్న వ్యక్తిని మనసారా క్షమించి స్వీకరించే త్యాగధనం ఎంతటి వాళ్ళకి? నేనంతటి అతీతు రాలీని కాను, రఘుబాబూ! ఈ జీవితాన్నిలా వెళ్ళ మార్చుకోనీ! ఈ బాధతో, ఈ వ్యధలతో , ఈ నిరాశలతో సంతృప్తి పడనీ! గడిచిన జీవితం నెమరు వేసుకుంటూ మిగిలిన బ్రతుకు గడిపి వేస్తాను . వెళ్ళు రఘూబాబూ! వెళ్ళిపో."
    హటాత్తుగా చీకటి గది మూగబోయింది. ఆ ఇద్దరి మధ్య మరి మాటలు జరుగలేదు. నిట్టుర్పుల శబ్దం కూడా వినిపించలేదు.
    సందే వెన్నెల మాసిపోయినది. చీకటి గది మరీ చీకటైంది. లేచాడు రఘుబాబు ఎప్పటికో. నిర్జీవంగా నడిచాడు -- చీకటి గదిలోంచి చిమ్మ చీకటి లోకంలోకి, అంధ కారపూరితమైన ప్రపంచంలోకి. దుఃఖం పొంగి వచ్చింది పార్వతికి.
    నిస్తేజమైన దృక్కులతో ఆ కారు చీకటి లోకి తరచి తరచి చూసింది. ఏమీ కనిపించలేదు . ఏమీ, రఘుబాబూ ఆజ్ఞాపించరాదూ? నిష్టూరపెట్టరాదూ? నిట్టూర్చింది పార్వతి.
    "నా హృదయం బద్దలవుతుంది. నా శరీరం తూలీపోతుంది. నాకు పిచ్చి పడుతుంది. ఈ బాధ భారమై పోతుంది . నేనేం చెయ్యను? పిచ్చి రఘుబాబు నన్ను అర్ధం చేసుకోలేదు. ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. కాదు, కాదు, నేనే పంపించి వేశాను. జీవితంలో నా విలువ తెలిసిపోయింది. బ్రతుకులో నా గమ్యం నిర్ణయ మైంది.
    'నేను సహించిన వాళ్ళంతా నన్ను అసహ్యించు కున్నారు. నేను ఓదార్చిన వాళ్ళంతా నన్ను బాధించారు.
    'కాని, నాకేదో సంతృప్తి లభించింది. ఈ గుండెలో ఏ మూలనో సంతోషం కూడా తల దాచుకుంది. నా కన్నీళ్ళేంతో  కమ్మగా ఉన్నాయి.  ఈ కమ్మటి కన్నీళ్ళ తోనే నా గమ్యం చేరుకుంటాను. పద్మా , నీ కూతుర్ని నేను పెంచుతాను. నువ్వు విదేశాల నుంచి వచ్చే వరకైనా నా దగ్గర వుంచి వెళ్ళు."
    ఎంత ప్రయత్నించినా చీకటి లో ఉత్తరం వ్రాయలేక పోయింది పార్వతి. గదిలో దీపం లేదు.
    నిశ్చలంగా కూర్చుని వుందా స్త్రీ!

                                  సమాప్తం


 Previous Page

WRITERS
PUBLICATIONS