-: గండభేరుండ హస్త లక్షణము :-
తా: స్వస్తిక చంద్రహస్తము గండభేరుండ పక్షికి వినియోగించును. (అర్థచంద్ర హస్తములు మణికట్టుచేర్చి అథోముఖముగబట్టి వ్రేళ్ళను విరళముగ చేసిన స్వస్తిక చంద్రహస్తము వచ్చును.)
-: చాతకహస్త లక్షణము :-
తా: లాంగూల హస్తములు పుంఖితముగ పట్టినచో చాతకపక్షియందు చెల్లును.
-: కుక్కుటహస్త లక్షణము (కోడి) :-
తా: భ్రమరహస్తము కోడికి వినియోగించును.
-: కోకిల హస్త లక్షణము :-
తా: అరాళ హస్తము పుంఖితముగ బట్టినచో కోకిల హస్తము వచ్చును. ఇది కోయిలకు వర్తించును.
-: వాయసహస్త లక్షణము (కాకి) :-
తా: చందంశ ముకుళహస్తము కాకియందు చెల్లును, (భ్రమరహస్తాంగుష్టమును, చూపుడువ్రేలి కొనతో చేర్చిపట్టిన తరువాత పుంఖితముచేసినచో చందంశ ముకుళహస్తము వచ్చును.)
-: కురర హస్త లక్షణము :-
తా: సూచీహస్తము అపవిద్ధముగ బట్టిన కురర పక్షికి వినియోగించును.
-: శుకహస్త లక్షణము (చిలుక) :-
తా: శుకతుండ హస్తములు పుంఖితాకారముగ బట్టిన చిలుకయందు వినియోగించును.
-: సారసహస్త లక్షణము :-
తా: ప్రదేశ ముకుళహస్తము సారసపక్షికి చెల్లును. (ముకుళహస్త చిటికెన వ్రేళ్ళు కొంచెము వంకరగా బట్టిన ప్రదేశ ముకుళహస్తము వచ్చును.)
-: బకహస్త లక్షణము (కొంగ) :-
తా: సంకీర్ణ హంసహస్తము బకము (కొంగ) కు చెల్లును. (తర్జన్యంగుష్టములను చేర్చి, మధ్యమ అనామికలను చాచి, కనిష్టను అరచేతిలోకి మడిచి వుంచినచో సంకీర్ణహంస హస్తము వచ్చును.) మంత్ర భేదమందు చెల్లును.
-: క్రౌఞ్చపక్షి హస్త లక్షణము :-
తా: లీనాల పద్మహస్తము క్రౌంచపక్షికి వినియోగించును. (అలపద్మహస్తమందలి చిటికెనవ్రేళ్ళు అరచేతిలోకి వంచినచో లీనాల పద్మ హస్తము వచ్చును.)
-: ఖద్యోత హస్త లక్షణము (మిణుగురు పురుగు) :-
తా: ముఖహంస హస్తము, మిడుగురు పురుగునందు వినియోగించును, (బొటనవ్రేలిచే నడిమివ్రేలి కొనగనుపు ఒరియునట్లు అపవిద్ధముగ బట్టిన ముఖహంసము వస్తుంది.)
-: భ్రమరహస్త లక్షణము (తుమ్మెద) :-
తా: భ్రమర హస్తములు పుంఖితములుగ బట్టిన తుమ్మెదయందు చెల్లును.
-: మయూరహస్త లక్షణము (నెమలి) :-
తా: మయూర హస్తములు పుంఖితాకారములుపట్టిన నెమలియందు వినియోగించును.
-: హంసహస్త లక్షణము :-
తా: హంసాశ్య హస్తము హంసపక్షికి చెల్లును.
-: చక్రవాక హస్త లక్షణము :-
తా: అలపద్మ హస్తములు పుంఖితములుగ పట్టినచో చక్రవాక పక్షి యందు వినియోగించును.
-: కోయష్టిక హస్త లక్షణము :-
తా: అరాళపతాక హస్తము కోయష్టిక పక్షికి వర్తించును. (కుడిచేత అరాళహస్తమును, ఎడమచేత పతాకముతో చేర్చివుంచినచో అరాళ పతాకము వచ్చును.)
-: వ్యాళీహస్త లక్షణము :-
తా: తర్జనీ మధ్యములను చేర్చి ధనుస్సువలేవంచి. అనామికను అంగుష్టసంధియమ దుంచి, కనిష్టను వంచిపట్టినచో వ్యాళిహస్తమగును. ఇది వ్యాళీయను పక్షికి చెల్లును.
-: జల జంతు హస్త లక్షణములు :-
-: భేకహస్త లక్షణము :-
తా: శ్లిష్టచక్ర హస్తము భేకార్దము (కప్ప)నందు చెల్లును. (చక్రహస్తములయొక్క అంగుష్ట తర్జనులను చేతిలోపలికి ముడిచి మధ్యమములను చేర్చి, అనామికలనువంచి, కనిష్టలను చాచిపట్టినచో శ్లిష్టచక్రహస్తము వచ్చును.)
-: కుళీరహస్త లక్షణము :-
తా: లీనకర్కటహస్తము కుళీరార్దమందు వినియోగించును. (కుడి కర్కట హస్తమును, అపవేష్టితముగ ఎడమచేతిమీదికి చాచిపత్తి వ్రేళ్ళను చేర్చిన లీనకర్కట హస్తము వచ్చును.)
