-: చిమరీమృగ హస్త లక్షణము :-
తా: ముష్టీముద్రాహస్తము, చమరీమృగముకు వినియోగించును. (ఎడమచేత ముష్టిహస్తమును, కుడిచేత ముద్రాహస్తమును మణికట్టుతో చేర్చి క్రిందుమొగముగా బట్టిన ముష్టీముద్రా హస్తము వచ్చును.)
-: గోధాహస్త లక్షణము (ఉడుము) :-
తా: తలపతాక హస్తము ఉడుమునందు చెల్లును. (పతాకహస్తమందలి కవిష్టికాంగుష్టములను కొంచెము మీదికెత్తినచో తలపతాక హస్తమగును.)
-: శల్యమృగ హస్త లక్షణము :-
తా: చంద్రమృగ హస్తము శల్యమృగమందు వినియోగించును. (మృగశీర్ష మందలి చూపుడువ్రేలు పైకెత్తినచో చంద్రమృగ హస్తము వచ్చును.)
-: కురంగహస్త లక్షణము (జింక) :-
తా: మృగశీర్ష హస్తము జింకయందు చెల్లును.
-: కృష్ణసార హస్త లక్షణము (నల్ల జింక) :-
తా: ముష్టిమృగ హస్తము నల్లజింకకు వినియోగింపబడును. (ముష్టీహస్త మందలి కనిష్టాంగుష్టములను చాచినచో ముష్టీమృగ హస్తము వచ్చును.)
-: గోకర్ణ హస్త లక్షణము :-
తా: నాగబంధ హస్తములు మీదికి చలింపచేయుచు పట్టిన గోకర్ణ మృగమందు చెల్లును.
-: మూషికహస్త లక్షణము (ఎలుక) :-
తా: ఖండముకుళ హస్తము మూషికమునకు వర్తించును. (ముకుళ హస్తమందలి చూపుడువ్రేలును చాచిపెట్టినచో ఖండముకుళ హస్తము వచ్చును.)
-: గిరికాహస్త లక్షణము (చిట్టెలుక) :-
తా: ఖడ్గముకుళ హస్తము చిట్టెలుకకు వర్తించును. (ముకుళహస్త మందలి చూపుడువ్రేలును వంచి అడ్డముగా పట్టినయెడల ఖడ్గముకుళము వచ్చును.)
-: శశహస్త లక్షణము (కుందేలు) :-
తా: తలపతాక హస్తము అడ్డముగ త్రిప్పబడిన కుందేలుకు చెల్లును.
-:వృశ్చికహస్త లక్షణము :-
తా: పద్మకోశ మందలి మధ్యమాంగుళిని ఉంచి తక్కిన వ్రేళ్ళన్నింటిని అంగుష్టముతో మధ్యపతాక హస్తము వచ్చును.)
-: ఉష్ట్రహస్త లక్షణము (ఒంటె) :-
తా: ఖండాంజలి హస్తము ఒంటె యందు వినియోగించును. (అంజలి హస్తమందలి అంగుష్టములను వంచి చేర్చి పొడవుగాచాచి అథోముఖముగ చలింపచేయుచు పట్టిన ఖండాంజలి హస్తము వచ్చును.)
-: అజహస్త లక్షణము (మేక) :-
తా: శిఖర హస్తములను ముఖభాగమున చెరబట్టినయెడ మేకయందు వినియోగించును.
-: గార్థభహస్త లక్షణము (గాడిద) :-
తా: భిన్నాంజలి హస్తము గార్ధభముకు వర్తించును. (ఖండాంజలి హస్తమందలి తర్జనీ ద్వయమును చేర్చి వంచిపట్టినయెడ భిన్నాంజలిహస్తము వచ్చును.)
-: వృషభహస్త లక్షణము (ఎద్దు) :-
తా: మధ్యమ, అనామికలను కొంచెము అరచేతిలోకి వంచి, వానిమీద అంగుష్టమునుచేర్చి తక్కిన రెండువ్రేళ్ళను చాచిపట్టిన తలసింహహస్తమగును. ఈ హస్తము వృషభమునకు వినియోగించును.
-: ధేనుహస్త లక్షణము (ఆవు) :-
తా: సంకీర్ణ ముద్రహస్తము ఆవుకు వినియోగించును. (చేతి యందలి నడిమివ్రేలిని వంచి తక్కినవ్రేళ్ళను చాచియుంచినచో సంకీర్ణ ముద్రహస్తము వచ్చును.)
-: పక్షి హస్త లక్షణములు :-
-: పారాపత హస్త లక్షణము (పావురము) :-
తా: కపోతహస్తము వుంఖతాకారముగ పట్టిన పావురముకు వినియోగించును.
-: శశాదన హస్త లక్షణము (డేగ) :-
తా: బ్రహ్మోక్తశుకతుండ హస్తము డేగయందు వినియోగించును.
-: ఉలూకహస్త లక్షణము (గుడ్ల గూబ) :-
తా: సంకీర్ణ గజదంత హస్తము ఉలూకముకు చెల్లును. (గజదంత హస్తమునలను చేర్చిపట్టిన, సంకీర్ణ గజదంత హస్తము వచ్చును.)
