"అయినా ఆ తర్వాత కూడా కిషోర్ని మీ మేనేజరే వెతికి పట్టుకున్నాడు."
"అది కాకతాళీయం ."
"ఇన్ని విషయాలు కాకతాళీయంగా జరగవు. ఇదంతా మీ మాస్టర్ ప్లాన్. కిషోర్ మీరు కావాలనుకున్నప్పుడు తప్పించుకున్నాడు. కావాలనుకోగానే దొరికాడు."
"కానీ లాక్షా రూపాయల కోసం బ్యాంకు దొంగతనాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకే బోలెడు లక్షలున్నాయి."
"ఏమో ఆ లక్షలన్నీ ఇలాగే వస్తున్నాయేమో - ఎవరు చెప్పగలరు ?'
"ఇన్ స్పెక్టర్ మీరు మీ హద్దులు మీరుతున్నారు.'
"హద్దులు మీరిన వారిని హద్దుల్లో ఉంచడానికి నేను హద్దులు మీరవచ్చు . నా డ్యూటీ నా ప్రాణం...."
"మీ ఆరోపణలకు అధారముందా?"
"జరిగిందాన్ని బట్టి ఒక తెలివైన బుర్ర ఏమూహిస్తుందో మీకు చెప్పాను. నా ఆరోపణలను మీనుంచి సంతృప్తి కరమైన సమాధానాలు రాకపోతే అదే నిజమై ఊరు కుంటాయి " అన్నాడినస్పెక్టరు తాపీగా.
"నేను నేరం చేసి డబ్బు సంపదిన్చాలనుకుంటే అందుకు నాకీ పిచ్చివాడి సాయమే కావాలా?" అన్నాడు సోమేశ్వర్ విసుగ్గా.
'అతడు పిచ్చి వాడన్నది మీరు చేస్తున్న ప్రచారం కావచ్చుగా ."
"ఇన్ స్పెక్టర్ కిషోర్ కి నిండా పాతికేళ్ళు లేవు. మీరు చెప్పినట్లే నేను నాటకమాడాలనుకున్నా అందులో పిచ్చి వాడి పాత్ర నేను తీసుకుంటాను తప్ప నా మేనల్లుడి కేండుకిస్తాను ?"
ఇన్ స్పెక్టర్ చలించలేదు. "డబ్బుతో ఎలాంటి పనైనా చేయొచ్చు. రేపు పిచ్చి నయమయిందంటే మీ మేనల్లుడి కందరూ బ్రహ్మరధం పడతారు. డబ్బు కనక ఉంటె! మీది చాలా తెలివైన పధకం. పిచ్చివాడన్న ముద్రతో కిషోర్ బ్యాంకు దొంగతనం చేయాలనుకుంటాడు. దొరికాడూ -- అతడేలాగూ పిచ్చివాడు కనుక .....కోర్టు వదిలి పెడుతుంది. లేదూ లక్షరూపాయలు మీ వశమవుతాయి .."
సోమేశ్వర్ కాసేపెం మాట్లాడకుండా గంభీరంగా ఉండిపోయాడు.
"నా ఆరోపణలను మీరొప్పుకుంటారా ?"
సోమేశ్వర్ నెమ్మదిగా 'అసలు నిజం మీకు చెప్పేస్తాను." అన్నాడు. అయన తర్వాత గొంతు సవరించుకొని "కిషోర్ దుబారా మనిషి. హద్దూ, అదుపూ లేకుండా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తుంటే భయపడి తలిదండ్రులతడికి కొన్ని అబద్దాలు చెప్పారు. వారు చెప్పిన ప్రకారం వారి ఆస్తి కరిగిపోతోంది. వ్యాపారంలో నష్టం వస్తోంది. ఏదో ఒకరోజున తమ జీవితం వీధిన పడుతుందని వారు భయపడుతున్నారు. ఇది విన్న కిషోర్ నిజమే ననుకున్నాడు. అతడి స్నేహితులు మంచిచివారు కాదు. అతణ్ణి తేడాలను ప్రోత్సహించారు.
కిషోర్ మరింతగా పతనమవుతుంటే భరించలేక ఒక రోజున తలిదండ్రులిద్దరూ "నీ పద్దతి మాకు నచ్చలేదు. నువ్వు నేరాలు చేసి సంపాదించకు. ఆ నేరాలేవో మేమే చేస్తాం "అని ఒక కార్లో బయల్దేరారు.
కిషోర్ ఎంత వారించినా వినలేదు. ఆ కారుకు యాక్సిడెంటై ఇద్దరూ మరణించారు. ఆ షాక్ కిషోర్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అతడు బ్యాలన్సు తప్పి నేరాలు చేయడానికి పూనుకున్నాడు. డాక్టర్ల కి చూపిస్తే మతి భ్రమించిందన్నారు. నా మేనల్లుడు నేరస్థుడనుకోవడం కంటే పిచ్చివాడనుకోవడం మెరుగనిపించింది. వైద్యం జరిపిస్తున్నాను. వాడిలో మంచి మార్పు వస్తున్నట్లే కనబడింది. కానీ తప్పించుకుని మళ్ళీ నేరం చేశాడు. ఈ ఒక్కాసారికీ వాడిని మన్నించండి. మళ్ళీ ఇలాంటిది జరక్కుండా చూస్తాను " అన్నాడు.
"మీ మాటలు నమ్మవచ్చా?"
'అందుకు సాక్ష్యం - చాలా ఏళ్ళుగా తిరుగులేకుండా నడుస్తున్న మా వ్యాపారం -- తలిదండ్రులు పోయినప్పటి నుంచీ కిషోర్ కు వైద్యం చేస్తున్న డాక్టర్లు...."
"సరే - మీ మాటలు నమ్ముతాను. కానీ కిషోర్ని అరెస్టు చేయక తప్పదు " అన్నా డినస్పెక్టర్.
"చిన్నాతనం నుంచీ సుకుమారంగా పెరిగాడు. వాడు జైల్లో ఉండలేడు. ఇన్ స్పెక్టర్ ....వాడి ఈ ఒక్క తప్పునూ కాయండి...."
"మిస్టర్ సోమేశ్వర్ ....జరిగింది చాలా పెద్ద నేరం ...." బ్యాంకు దొంగతనం.... నేరస్తుడ్ని తెలికిగా వదిలిపెట్టలేము" అన్నాడు ఇన్ స్పెక్టర్.
సోమేశ్వర్ దీనంగా, దిగులుగా "మీ యిష్టం " అన్నాడు.
కిషోర్ అరెస్టయ్యాడు. అప్పుడతడేమీ మాట్లాడలేదు. పోలీసులు బేడీలు వేస్తుంటే --అతడు శాంతంగా చేతులు ముందుకు చాపాడు.
4
జైల్లో ఓ గదిలో ఇన్ స్పెక్టర్ , కిషోర్ ఉన్నారు.
ఇన్ స్పెక్టర్ చేతిలో లాఠీ ఉంది.
కిషోర్ కళ్ళలో భయం లేదు.
"నువ్వు పిచ్చి వాడివి కాదు. అలా నటిస్తున్నావు. నీ కంటే జమా జెట్టీలచేతనే నిజం చెప్పించాను. మర్యాదగా నిజం చెప్పు."
"వినండి ఇన్ స్పెక్టర్ ...." అన్నాడు కిషోర్ నిర్భయంగా.
ఇన్ స్పెక్టర్ వినసాగాడు.
"ఇక్కడ మీరు. నేను తప్ప ఇంకేవ్వరం లేము కదూ !" అడిగాడు కిషోర్.
"ఊ"
"ఇక్కడ మామయ్య నీడ కూడా పడదు కదూ!"
ఇన్ పెక్టర్ ఆశ్చర్యంగా "పడదు ....ఏం?" అన్నాడు.
"స్వంత అన్నగారన్న జాలి కొద్దీ ఏ దారీ లేకుండా ఉన్న మామయ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది మా అమ్మ. అయన ఆశ పోతు. నమ్మకద్రోహం చేశాడు. అయన అసలు రంగు నేనే కనిపెట్టాను. నా తలిదండ్రులు కాయన గురించిన నిజం చెప్పాను. వాళ్ళది రూడి చేసుకుని తీవ్రంగా హెచ్చరించారు మామయ్యని. ఆ వెనువెంటనే నా తలిదండ్రులు యాక్సిడెంట్లో మరణించారు. యాక్సిడెంటేల జరిగిందని నే నారా తీయబోయాను. నిజం తేలిసింది. అందులో కూడా మావయ్య హస్తముంది.
నేను మామయ్యను పోలీసులకు అప్పగిస్తానన్నాను. మామయ్య నాకు మతి భ్రమించిందని గదిలో బంధించాడు. హిప్నోటిస్టూల ద్వారా నా బుర్ర లోని భావాలు చేరి పెయాలని చూశాడు. ఒకటి రెండు నెలలు ప్రతిఘటించి ఘోర శిక్షలకు గురయ్యాను. ఆ తర్వాత నుంచి నేను పద్దతి మార్చి అన్నీ మరిచిపోయినట్లు నటించాను.
నా నటన బాగా పనిచేసింది. మామయ్య మీద ప్రేమ ఒలకబోస్తున్నాను. మామయ్య నన్ను నమ్మాడు. గత రెండు మాసాలుగా నా గదిలో నేను బంధనాలు లేకుండా తిరిగే అవకాశం వచ్చింది.
అయితే మామయ్య నన్ను వదిలిపెట్టే ఉద్దేశ్యంలో లేడు. నేను పిచ్చివాడినన్న ముద్ర వేసి ఆస్తినంతా తానె అనుభవించాలని అయన పధకం. ఆయనుండగా నేను పిచ్చి వాడ్ని కాననిపించుకునే అవకాశం లేదు. అయన అంతటి మహానటుడు. నా బాధను అయినవాళ్ళు, స్నేహితులు కూడా అర్ధం చేసుకోలేదు. ఒక్క పనివాడు తప్ప వాడు చిన్నప్పట్నించి నన్నెత్తుకు పెంచాడు. పేరు సీనయ్య, వాడి సాయంతో ఇంట్లోంచి తప్పించుకుని బ్యాంకు దొంగతనం చేశాను. సమయానికి ఫోన్ చేసి వాడు సహకరించాడు.
ఆ తర్వాత కావాలనే మళ్ళీ మామయ్యకు దొరికిపోయాను. అతడికి నా స్వేచ్చను తనకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటానన్న అనుమానం కలక్కూడదు."
అతణ్ణి మధ్యలో ఆపి "బ్యాంకు దొంగతనమెందుకు చేశావు ?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"నేను పిచ్చివాడ్ని కానని నిరూపించు'కుందుకు. ఆ డబ్బు కూడా భద్రంగా ఒకచోట దాచాను. దాంతో నాకు పని లేదు. ఇన్ స్పెక్టర్ .... నేను పిచ్చి వాణ్ణి కాననీ -- నాకు మాములుగా అందరికిలా బ్రతికే హక్కుందనీ మీరు ప్రపంచానికి చాటి చెప్పండి. మామయ్య మిమ్మల్ని డబ్బుతో కొనే ప్రయత్నాలు చేస్తాడు. అవి సాగనివ్వకండి. నేను చేసిన నేరానికి నాకే శిక్ష విధించినా ఫరవాలేదు. నాకు స్వేచ్చ కావాలి. అందుకోసం కొన్నాళ్ళు జైల్లో ఉండడానికీ నేను సిద్దమే! నన్ను నా మామయ్య బారి నుంచి రక్షించండి ..."
ఇన్ స్పెక్టర్ ఆశ్చర్యంగా కిషోర్ వంక చూశాడు.
తాననుకున్నదొకటి.....జరిగినదొకటి....
ఇలా కూడా జరుగుతుందా?
ఇన్ స్పెక్టర్ పరిశోధన ప్రారంభమయింది.
కొద్ది రోజుల తరువాత కిషోర్ తనింట్లో ఉన్నాడు. సోమేశ్వర్ కటకటాల వెనక్కు వెళ్ళాడు.
***
