2
ఆ రెండు బెడ్ రూముల యింట్లో రెండో పడకగది చూపించి, "చాలా రాత్రయింది పడుకోండి. అక్కడే బ్లాంకెట్ వుంది బెడ్ మీద ఉదయం లేపుతాను గుడ్ నైట్" అని ఆమెకి యింకేం మాట్లాడడానికి అవకాశం యియ్యకుండా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. పడుకున్నా అప్పటి వరకు వున్న మత్తు కాస్త దిగజారిపోయి నిద్ర పట్టలేదు రాజేష్ కి-ఈమె ఇంత అందమైన ఈమెని పువ్వుల్లో పెట్టి పూజించాల్సింది పోయి ఆ రాస్కెల్ ఎందుకిలా ఆమెని బాధిస్తాడు! అదే తనయితే ఈ అందాన్ని ఎంతలా ఆరాధించేవాడో అంత అంధమైన భార్యను పొందినందుకు ఎంత గర్వించేవాడో ఆమె పేరు అర్చన! మనిషిలాగే పేరూ అందమైంది. పూజించకపోయినా భార్యగా, ఆదరించి అభిమానించనుకూడా చేయకుండా అందమైన ఆ పుష్పాన్ని నిర్దయగా నేల రాస్తున్నాడు మూర్ఖుడు.
గత రెండేళ్ళుగా పక్క ఫ్లాట్ లో వుంటున్న రాజేష్ మొదటి సారి అర్చనని గుమ్మం దగ్గర నిలబడి గిన్నె చేతిలో పట్టుకుని పాలుపోయించుకుంటూవుంటే, బయటి నుంచి వస్తూ-అలాగే ఆ రెండో మెట్టుమీద నిలబడే చూశాడు. చూడగానే కళ్ళముందు ఒక్క మెరుపు మెరిసినట్లనిపించింది-అబ్బ ఏం అందం-యీవిడ మిసెస్ రావా అనుకున్నాడు. సన్నజాజి పువ్వులాంటి రంగు, అంతటి సౌకుమార్యం, నల్లని వత్తయిన జుత్తు, సంపెంగలాంటి ముక్కు, చక్కటి పలువరుసతో చిన్న నోరు ఇంట్లో పనిచేసుకునేటప్పుడు కట్టుకునే ఆకుపచ్చ వాయిల్ చీర అదే రంగు జాకెట్టుతో వున్న ఆమెని చూడగానే ఆకుల మధ్య సన్నజాజి పూవనిపించింది. వాడికి ఆ రావు గాడికి యింత అందమైన భార్య? ఆమెని చూస్తూ ఆ మెట్టు మీదనే అరక్షణం నిలబడిపోయాడు రాజేష్. పాలు పోయించుకుంటూనే తలెత్తి రాజేష్ ని చూసి అతను తనవైపే చూస్తూండడంతో కాస్త తడబడి చిన్నగా సిగ్గుపడి చక చక గిన్నెతో లోపలికెళ్ళిపోయింది. దూద్ వాలా 'బాబూజీ, అప్ కా దూద్' అనే వరకూ అలా నిల్చుండిపోయాడు రాజేష్. 'అ అ' అంటూ తడబడి, తలుపు తీసి గిన్నెతో లోపలికి వెళ్ళాడు. ఈలోగా ఎప్పుడు మూసుకుంది ఆ యింటి తలుపు మూసుకుంది. పాలు పోయించుకుంటూ, 'ఓ అమ్మా....మిసెస్ రావ్ హైక్యా' అన్నాడు పాలవాడితో. "హాసాబ్ అమ్మా కల్ ఆయా బచ్చే కోలేకే" అన్నాడు. ఓహూ అందుకా తనిన్ని రోజులు ఆమెని చూడలేదు. పుట్టింటికెళ్ళి వచ్చిందన్న మాట-అనుకున్నాడు. బిడ్డ తల్లి అయినా కన్నె పిల్లలాంటి ఆ అందాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు.
రాజేష్ డి.సి.యం కంపెనీలో యింజనీరు. ఉద్యోగంలో చేరి రెండేళ్ళయింది. ఇంజనీరింగు డిగ్రీతోపాటు ఎం.బి.ఏ. కూడా వుండడంతో మంచి జీతంతో వున్నాడు. ఇరవై ఆరు వచ్చిన రాజేష్ ని పెళ్ళి చేసుకోమంటూ తల్లి పోరు పెడ్తున్నా యింకో ఏడాది అంటూ గడువులు పెట్టాడు. చూసిన ఒకరిద్దరు అమ్మాయిలు అతని ఊహా సుందరి ముందు నిలబడలేక పోయారు. తండ్రి రిటైర్డ్ జడ్జి-కాకినాడలో స్వంత యిల్లు వుంది యిద్దరు కొడుకులు, కూతుళ్ళు మధ్య రాజేష్ ఆఖరివాడు. కంపెనీ యింటద్దె యిస్తుంది కనక బాచిలర్ అయినా మంచి టూ బెడ్ రూము యిల్లు తీసుకున్నాడు. తల్లి తండ్రి వచ్చి ఎప్పుడన్నా ఒక నెల రోజులుంటారని యింట్లో యింట్లో యించుమించు సామానులన్నీ చేర్చాడు-హాయిగా బాచిలర్ లైఫ్ అనుభవిస్తూ, క్లబ్బులు, ఫ్రెండ్సుతో గడుపుతున్నాడు. ఆ మూడంతస్థుల బిల్డింగులో మొత్తం పన్నెండు ఫ్లాట్స్ వున్నాయి. తన యిటు అటు ఫ్లాట్స్ వాళ్ళతో పరిచయం చేసుకోవాలనిపించి పక్క యింటికెళ్ళి పరిచయం చేసుకున్నాడు. ఓ పక్క మెహతా అని గుజరాతీలు-భార్యా భర్త యిద్దరు పిల్లలు-అతను ఓ పెద్ద కంపెనీలో పర్సనల్ మేనేజర్. భార్య ఓ జూనియర్ కాలేజీలో లెక్చరరు-ఇద్దరూ ఉద్యోగస్థులు అవడంతో ఉదయం లేచింది మొదలు వురుకులు పరుగులతో యింట్లో పని చేసుకుని పిల్లలని స్కూలులో దింపి ఉద్యోగాలకి వెళ్ళి సాయంత్రం ఏ ఆరుకో యిల్లు చేరుతారు. ఏ ఆదివారమో తప్ప ఎవరూ కనపడరు. అయినా యిద్దరూ సరదాగా వుంటారు. రాజేష్ ని అభిమానంగా పలకరించి ఆదివారం పూట అప్పుడప్పుడు తమతో బ్రేక్ ఫాస్ట్, లంచో తీసుకోమని పిలుస్తుంటారు. మెహతా పిల్లలు కూడా 'అంకుల్' అంటూ చనువుగా వచ్చి పోతుంటారు. ఇవతల ఫ్లాట్ గుమ్మం ముందు నేమ్ ప్లేట్ ఎస్.ఆర్.కె,రావు అని వుండడం చూసి తెలుగు వాళ్ళు, పరిచయం చేసుకోవాలని కుతూహల పడ్డాడు రాజేష్. కానీ ఎప్పుడూ యిల్లు తాళం వేసి వుండేది. ఏ రాత్రో యింట్లో లైట్లు వెలిగేవి. ఉదయం మళ్ళీ ఎనిమిది కల్లా తాళం వుండేది. యింట్లో మనుషుల అలికిడి వినపడక పోయేసరికి ఎవరో తనలాంటి బాచిలర్ అయి వుంటాడు అనుకున్నాడు. అనుకోకుండా ఓ ఆదివారం బయటికి వెళ్ళాలని తలుపు తీసుకుని రాగానే పక్క యింటాయన కూడా తన ఫ్లాట్ కి తాళం వేస్తూండడం చూసి చప్పున రాజేష్ ముందుకు వెళ్ళి "హలో.....మీరు తెలుగు వాళ్ళేనా, మీ నేమ్ ప్లేట్ చూసి మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఐ యామ్ రాజేష్" అంటూ చనువుగా చేయిచాపాడు. అతను రాజేష్ వంక చూసి గ్లాడ్ టు మీట్ యూ-ఐ యామ్ రామకృష్ణారావు -ముభావంగా అంటూ షేక్ హాండ్ యిచ్చాడు. ప్రసన్నంగాలేని అతని మొహం చూసి రాజేష్ యింకేం అనాలో తెలియక తడబడ్తూ "నేను డి.సి యమ్ టయోటాలో పనిచేస్తున్నాను. మీరు.....మీరు ఇంజనీరా.....ఎన్నాళ్ళుగా వుంటున్నారు యిక్కడ" అన్నాడు.
ఓళ్టాస్ లో పనిచేస్తున్నాను. ఒక ఏడాది అయింది యిక్కడికివచ్చి, సారీ ఒకచోటికి వెళ్ళాలి ఆ యామ్ ఆల్ రెడీ లేట్, మరోసారి కలుద్దాం" అంటూ మాటతుంచేసి వెళ్ళిపోయాడు రావు.
