"ఓ పట్టుచీర తాకట్టు పెట్టాం అయన దగ్గిర. అదిప్పుడు విదిపించుకోవాలి...."
"యెంత కాలమయింది?"
'చాలా ఏళ్ళయింది!" అన్నాడు శాస్త్రి.
"ఇప్పుడు వడ్డీ వ్యాపారం జరగడం లేదిక్కడ...." అన్నాడతడు.
"అదంతా నాకెందుకు? నా పట్టుచీర నాకు వాపసు కావాలి...."
అతడో క్షణం అలోచించి -- "వెంకటేశ్వరరావుగారిప్పుడు బ్రతికి లేరు . అయన పిల్లలు వేర్వేరు ప్రాంతాల స్థిరపడ్డారు. నేను వారి దూరపు బంధువుని. ఈ యింట్లో అద్దె కుంటున్నాను. మీ పట్టుచీర వివరాలు తెలియాలంటే ...." అని ఆగాడు.
"ఊ చెప్పండి --" అన్నాడు శాస్త్రి.
అతడు తటపటాయిస్తూ -- "చెప్పాలంటే పట్టుచీర ఈ యింట్లో గదిలోనే ఉందని నేననుకుంటున్నాను...." అన్నాడు.
శాస్త్రికీ, శర్మ కూ అతడు చెప్పేది అర్ధం కావడానికి కాసేపు పట్టింది.
వెంకటేశ్వరరావు పద్దతులు పిల్లలకు నచ్చలేదు. అయన సంపాదించిన కొద్ది యింకా సంపాదించాలనుకునే వాడు. సంపాదించిన డబ్బు అనుభవించాలన్న కోరిక అయన కుండేది కాదు. అయన భార్య కానీ పిల్లలు కానీ ఆ డబ్బు వల్ల సుఖాలు పొందలేదు. సరిగదా ఊళ్ళో వాళ్ళాయన్ను గురించనుకునే పరిహాస వాక్యాలు విని బాధ పడుతుండేవారు.
వెంకటేశ్వరరావు తను కూడా బెట్టిన డబ్బుని బంగారంగా, వజ్రాలుగా మార్చి ఇనప్పెట్టె లోకి తోసేస్తుండేవాడు. మొదట్లో ఊళ్ళో చాలా చిన్న యిల్లుండేది. అది సెంటర్లో యిల్లు. అదమ్మేసి ఆ డబ్బు తోనే అప్పట్లో చవగ్గా వస్తుంటే మువ్వలవాని పాలెం లో యిల్లు కట్టి అక్కడకు మారాడు. కనీసం పెద్ద మేడైనా కట్టలేదని అంతా బాధపడేవారు.
అయితే అయన పిల్లలకు మంచి చదువులు చెప్పించాడు. ఉన్న ఒక్క కూతురికీ ఎన్నికైన సంబంధం చేశాడు. వాళ్ళెవరికీ ఈయన దారి నచ్చక రెక్కలు రాగానే ఎగిరిపోయారు. భార్య మాత్రం తప్పనిసరై ఆయనతో ఉండిపోయింది. ఆమె అదృష్టం కొద్ది అయన పోయాడు.
పోయే ముందాయన "నేను నా పిల్లలకు చేసిన లోటేమి లేదు. వాళ్ళను పైకి తెచ్చాను. నా సంపాదన మీద ఆశ కొద్దీ వాళ్ళు నాకు దూరమయ్యారు. బ్రతికుండగా నేను వాళ్ళ కక్కర్లేక పోయాను. చచ్చేక నా సంపాదన అనుభవించాలని వాళ్ళకుండవచ్చు. అది సాగనివ్వను. నా ఇనప్పెట్టె ఎప్పటికీ యీ యింట్లోనే ఉంటుంది. దానికి గట్టి కాపలా కూడా ఏర్పాటు చేస్తాను...."అని భార్యకు చెప్పాడు.
అయన పోయాక ఓ ముసలి వాడు ఇనప్పెట్టి కి కాపలాగా ఉంటున్నాడు. వాడెంత గట్టి వాడంటే వారంతా ఊరొదిలి పెట్టి పోయినా ఇనపెట్టి గదికి ఏ భద్రతా అవసరం లేదు.
"మీ పట్టుచీర ఆ ఇనప్పెట్టి లోనే ఉంటుంది. కాపలా వాడికి నచ్చజెప్పి ఇనప్పెట్టి లోంచి ఆ పట్టుచీర తీసుకోండి--"అన్నాడా ఇంటి యువకుడు.
"పట్టుచీర ఇనప్పెట్టె లో ఉంటుందా?" అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా.
"తాకట్టు వస్తువులందులో ఉంటాయి మరి...."
"తాళాలు....?"
"అవి ఇనప్పెట్టెకే ఉంటాయి...."
"అదేమిటి? అవి వెంకటేశ్వరరావు గారి భార్య దగ్గరుంటాయనుకుంటాను."
"ఆమె కొడుకుల దగ్గరుంటోంది...."
శాస్త్రి, శర్మ జరిగిందానికి, విన్నదానికీ చాలా ఆశ్చర్యపడుతూ లోపలకు వెళ్ళి ఆ యువకుడు చూపిన గది వైపుకి వెళ్ళారు.
"జోళ్ళు విప్పుకుని లోపలకు వెళ్ళండి. ఇనప్పెట్టి గది ఆయనకు దేవాలయం కంటే ఎక్కువ --" అన్నాడా ఇంటి యువకుడు.
ఇద్దరూ జోళ్ళు విడిచి లోపలకు వెళ్ళారు.
గది విశాలంగానే వుంది. అక్కడ వారికేవ్వరూ కనపడలేదు.
ఓ మూలగా నిలువెత్తు ఇనప్పెట్టి ఉంది. తాళాలు దానికి వేలాడుతున్నాయి.
శాస్త్రీ ఇనపెట్టి సమీపించి తాళం తిప్పబోయాడు.
శర్మ గదిలో చుట్టూ చూస్తున్నాడు.
అప్పుడతడికి ఓ మూల కనిపించాడు.... సుమారు అరవై ఏళ్ళ వృద్దుడు. నెరిసిన జుట్టు. కానీ బట్ట తల కాదు. అయిదడుగుల పదంగుళాల పొడవుంటాడు. మనిషి కండలు తిరిగి లేడు. కానీ దృడంగా ఉన్నాడు.
"ఏయ్--" అన్నాడా వృద్దుడు.
అతడెక్కడి నుంచి వచ్చాడా అని శర్మ ఆశ్చర్యపడుతున్నాడు.
శాస్త్రి ఆగిపోయాడు తాళాలు తీయకుండా.
వృద్దుడు వారిద్దర్నీ సమీపించి -- "ఎవరు మీరు?' అనడిగాడు.
శర్మ తడబడ్డాడు. శాస్త్రి మాత్రం వెంటనే -- "నీ కోసమే వచ్చాం....' అన్నాడు.
"నా కోసం వచ్చినవాళ్ళు -- ఇనపెట్టే తాళాల జోలికెందుకు వెళ్ళారు?" కొట్టిచ్చినట్లు అడిగాడు వృద్దుడు.
"గదిలో ఎవ్వరూ కనపడలేదు. ఇనప్పెట్టె తాళాల మీద చేయి వేస్తా ఎవరైనా రాకపోతారా అనుకున్నాను. నువ్వు వచ్చావు...."
వృద్దుడు నవ్వుతూ -- "అంతా అబద్దం. నన్ను చూసి భయపడి మాట మారుస్తున్నావు...." అన్నాడు.
"నీ వయసులో కూడా నిన్నే దిరించగల శక్తి మాకుంది. ఈ వయసులో నువ్వంటే మా కెందుకు భయం ?' అన్నాడు శాస్త్రి.
"బహుశా నా శక్తి తెలిసి వుండదు...."
"ఏమిటి నీ శక్తి?"
"ఇనపెట్టి తాళాల మీద మరోసారి చేయి వేసి చూడు. అప్పుడు నీకు నా శక్తి తెలుస్తుంది...."
ఏం జరుగుతుందో చూడాలని శాస్త్రి ఇనపెట్టి తాళాల మీద చేయి వేశాడు. వృద్దుడు మెరుపు వేగంతో అతణ్ణి సమీపించి గట్టిగా లాగాడు. ఆ విసురుకు శాస్త్రి అక్కణ్ణించి మరో మూలకు వెళ్ళి పడ్డాడు.
శాస్త్రి పాటు చూసి శర్మ కూడా రియాక్టయ్యాడు. కానీ వృద్దుడు వెంటనే అతణ్ణి మరో మూలకు విసిరేశాడు.
ఇద్దరికీ మామూలు మనిషి కావడానికి చాలాసేపు పట్టింది.
వృద్దుడు నవ్వుతూ వారినే చూస్తున్నాడు.
"మాకు చాలా విద్యలు తెలుసు. కానీ నీ ముందు చాలలేదు. నీకు శిష్యరికం చేస్తాం. ఈ విద్య నేర్పుతావా?' అన్నాడు శర్మ.
"ఇది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. డ్యూటీ పట్ల బాధ్యత ఉండాలి. అదే నీకు కొత్త విద్యలు నేర్పుతుంది--" అన్నాడు వృద్దుడు.
"కానీ...." అని ఆగాడు శర్మ.
"ఏం -- మరో ప్రయత్నం చేస్తారా?' అన్నాడు వృద్దుడు.
"వద్దు -- " అన్నాడు శాస్త్రి.
ప్రత్యర్ధిని బలంతో జయించలేమని అతడికి తెలిసిపోయింది.
"ఇప్పుడు చెప్పు ఇక్కడి కెందుకు వచ్చావు?' అన్నాడు వృద్దుడు.
"పట్టుచీర కోసం...." అన్నాడు శాస్త్రి.
"పట్టుచీర అంటే సోమయాజులు భార్యదా?" అన్నాడా వృద్దుడు వెంటనే.
"అంత వెంటనే ఎలా చెప్పగలిగావు?' అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా.
"ఇనప్పెట్టి లో ఉన్న పట్టుచీర అదొక్కటే!" అంటూ వృద్దుడు తనే వెళ్ళి తాళం తీసి తలుపు తెరిచాడు.
ఇద్దరికీ కళ్ళు జిగేల్మన్నాయి.
పెట్టిలో ప్రతి అరలోనూ నోట్ల కట్టలు, బంగారునగలు జిగేల్మనే వజ్రాలు....
బహుశా అ ఇనపెట్టేతో ఓ నగరాన్ని కొనిపారేయవచ్చు నెమో!
మిత్రులిద్దరూ తెల్లబోయి చూస్తుండగా వృద్దుడు ఇనపెట్టి లోంచి ఓ పట్టుచీర తీసి -- "ఇదే కదూ!" అన్నాడు.
"అవునో కాదో తెలియకపోయినా -- ఊ" అన్నాడు శాస్త్రి.
వృద్దుడు పట్టుచీర మడత లోంచీ ఒక కాగితం తీసి దానికేసే శ్రద్దగా చూసి -- "ఇది వెనక్కు పట్టుకుని వెళ్ళాలంటే పదహారు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి డెబ్బై నాలుగు పైసలివ్వాలి . అంత డబ్బూ తెచ్చారా?' అన్నాడు.
"పట్టుచీరకు అంత డబ్బా!"
"లేకుంటే నా దగ్గిరే ఉంటుంది. అప్పు తీసుకున్నాక సోమయాజులు పైసా కూడా తీర్చలేదని ఈ కాగితంలో ఉంది. వడ్డీ పెరక్కేమవుతుంది!"
"నీ దగ్గర డబ్బు దాచుకుంటాను. ఇదే వడ్డీ ఇస్తావా?' అన్నాడు శర్మ వెంటనే.
"నేను వడ్డీ వ్యాపారం చేయడం లేదు. ఉన్నదానికి కాపలా-- అంతే!" అన్నాడు వృద్దుడు.
"నువ్వు చాలా గొప్ప కాపలావాడివి. అందుకే కాబోలు ఆమె నిన్ను రమ్మంది...." అన్నాడు శాస్త్రి.
"ఆమె ఎవరు?' అన్నాడు వృద్దుడు.
"పేరు మాకూ తెలియదు. చెంగాల్రావు పేటలో ఉంటోంది...."
"ఆమెకు నాతో పనేమిటి?"
"తనింటికి కాపలా కాయాలంట?"
"కాపలా కాస్తే ఏమిస్తుందిట!"
"తన యిల్లే వదిలి వెడుతుందిట...."
వృద్దుడి కళ్ళు చిత్రంగా మెరిశాయి-- "వదలాలనుకుంటున్న ఇంటికి కాపలా ఎందుకు?"
"అదే మాకూ అర్ధం కాలేదు...."
"మీరు నిజమే చెబుతున్నారా?' అన్నాడు వృద్దుడు.
"నీకు అబద్దమెందుకు చెప్పాలి!"
"ఎందుకంటె -- నన్నిక్కడినించి తరిమేయ్యడానికి!" అని నవ్వాడు వృద్దుడు-- "కానీ ఇనపెట్టిని నేను లేకున్నా మీరు తెరవలేరు. అది తెలుసుకోండి...."
"బలంలో చాకచక్యంలో మేము నీకు సాటి రాకపోవచ్చు . కానీ మా శక్తి యుక్తులను నువ్వు తక్కువ అంచనా వేయవద్దు...." అన్నాడు శాస్త్రి.
"అదీ చూద్దాం -- తర్వాతెప్పుడైనా ...." అని -- "చెంగాల్రావు పేటలో ఇల్లంటే అది నా అదృష్టమే! కానీ మీ మాటలే నాకు నమ్మతగ్గవిగా లేవు...." అన్నాడు వృద్దుడు.
"ఒక్కసారి వెళ్ళి రావచ్చుగా --' అన్నాడు శాస్త్రి.
"మరోసారి ఆమెను కనుక్కురండి. తన ఇంటికి కాపలా వాడి కేందుకివ్వాలను కుంటుందో...."
"అదీ నువ్వే కనుక్కోవచ్చు గదా!"
"ఆ అవసరం నాకు లేదు...."
"నువ్వీ గదిని వదిలి వెళ్ళడానికి భయపడుతున్నావు." అన్నాడు శర్మ చిరాగ్గా.
