"పుట్టిన ప్రతి మనిషికీ చావేలా తప్పదో పెళ్ళి కూడా అలాగే తప్పదు."
"చావును తప్పించుకోలేం. పెళ్ళిని తప్పించుకోగలం."
"పెళ్ళిని తప్పించుకోలేం. అమలను తలచుకుంటే ఆమె లేకుండా యింతకాలం యెలా బ్రతికామా అనిపిస్తోంది.
అప్రయత్నంగా శాస్త్రికి విమల గుర్తుకొచ్చింది. అతడు లేచి నిలబడి -- "పద -- మువ్వల వాని పాలెం వెడదాం" అన్నాడు.
"అక్కడి కెందుకూ?"
"వెంకటేశ్వర్వావిల్లక్కడే వుంది."
"మువ్వలవాని పాలెంలో వడ్డీ వ్యాపారులా! ఆశ్చర్యంగా వుందే!"
"తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడవచ్చు. ముందు లే ..."
"అయితే ముందు చెంగల్రావు పేట వెళ్ళి ఆ యింటి సంగతి వాకబు చేద్దాం. మువ్వలవాని పాలెం బాగా దూరం కదా. రేపు వెళ్ళవచ్చు.
"మనిషి గ్రహాంతరయానాలు చేస్తున్న ఈ రోజుల్లో మువ్వలవాని పాలెం దూరమంటావా?" అవమానం కదూ!"
"వాళ్ళకు రాకెట్లున్నాయి. మనకు సైకిలు కూడా లేదు."
"సైకిలుంటే గుర్తు కొచ్చింది. రాజారావిప్పుడు ఊళ్ళో లేడు. అతడు గ్యారేజీ తాళం మనకిచ్చి అప్పుడప్పుడు మోటారు సైకిలుకోకిక్కివ్వ మన్నాడు గుర్తుందా?' అన్నాడు శాస్త్రి.
శర్మ చటుక్కున లేచి నిలబడి "నీ బుర్ర అమోఘం. పద....మన మిప్పుడు మువ్వలవాని పాలెమూ వెళ్ళవచ్చు చెంగాల్రావు పేటా వెళ్ళవచ్చు. కానీ ముందు చెంగాల్రావు పేటె వెడదాం. అక్కడ పని చూసుకుని మువ్వలవాని పాలెం వెడదాం. ఎందుకంటె వడ్డీ వ్యాపారు లెప్పుడూ తిన్నగా నిద్రపోరు. ఎప్పుడూ వెళ్ళినా లేస్తారు. ఇళ్ళద్దే కిచ్చే వాళ్ళలా కాదు" అన్నాడు.
ఏ కళనున్నాడో శాస్త్రి అంగీకరించాడు.
4
మోటారు సైకిలా యింటి ముందు ఆగింది.
ఇంటి చుట్టూ గోడ. గోడలో ఓ చిన్న తలుపు. తలుపుకు గడియ లేదు. తోయగానే తెరుచుకుంది.
లోపల చాలా ఆవరణ వుంది.
ఎందుకైనా మంచిదని శాస్త్రి, శర్మ మోటారు సైకీలు గుమ్మం లోంచి లోపలకు తోసుకు వెళ్ళారు.
శాస్త్రి తలుపు దగ్గరగా వేసి గొళ్ళెం కూడా పెట్టాడు.
ఇంట్లోఎక్కడా అలికిడి లేదు.
శర్మ టైము చూసుకుని "ఇంకా ఎనిమిదే అయింది" అన్నాడు.
"ఇళ్ళున్న వాళ్ళంతే. హాయిగా నిద్రపోతారు-- ఏ సమయం లోనైనా" అంటూ శాస్త్రి ముందడుగు వేశాడు.
అది డాబా యిల్లు. వాటా పెద్దదే. ఆధునికంగా వుంది. ముందుగా మూడు మెట్లెక్కితే నడవ లా వుంది. నడవ కెదురుగా రెండు గుమ్మాలు. అటూ ఇటూ రెండు గుమ్మాలు. అందులో మూడు గుమ్మాలకు తాళాలున్నాయి. ఓ గుమ్మానికి తాళం లేదు.
శాస్త్రి తాళం లేని గుమ్మం దగ్గరకు వెళ్ళి తలుపు తట్టాడు.
"ఎవరూ?' అంటూ లోపల్నుంచీ సన్నని గొంతు వొకటి వినబడింది.
"ఇంట్లో మగాళ్ళున్నట్లు లేదు"అన్నాడు శర్మ.
"ఆడాళ్ళ కాశ ఎక్కువ అద్దె బాగా ఎక్కువడుగుతుందో ఏమో" అన్నాడు శాస్త్రి బెదురుగా.
"పెళ్ళి చేసుకోబోతున్నాం. మాటిమటీకి అడాళ్ళను తప్పు పట్టకు" అన్నాడు శర్మ అతణ్ణి హెచ్చరిస్తూ.
తలుపులు తెరచుకున్నాయి.
నడి వయసు స్త్రీ వయసు నలభై పైన ఉండవచ్చు. జుట్టు అక్కడక్కడ నెరిసింది. నుదుట రూపాయి కాసంత బొట్టు.
"ఎవరు బాబూ మీరు!' అందామె.
"నా పేరు శాస్త్రి. యితడు శర్మ!" అన్నాడు శాస్త్రి.
"బ్రహ్మలేనన్న మాట.... ఏ పని మీద వచ్చారు?'
"పెళ్ళి చేసుకోబోతున్నాం -- యిల్లు చూసుకుందుకు వచ్చాం."
"మాయదారి కలికాలం. మగాళ్ళ కూ మగాళ్ళకు పెళ్ళేమిటయ్యా" అందా స్త్రీ నవ్వుతూ.
శర్మ తెల్లబోయాడు. శాస్త్రి తమాయించుకుని "పెళ్ళి మా యిద్దరికే గానీ మా యిద్దరికీ కాదు" అన్నాడు.
"నువ్వేం మాట్లాడుతున్నావో నా కర్ధం కాలేదు" అందా స్త్రీ.
"మేమిద్దరం చెరో అమ్మాయినీ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం. అందుకని ఇంటి కోసం వెతుక్కుంటూన్నాం" అన్నాడు శాస్త్రి.
"లోపలకు రండి" అందామె.
ఇద్దరూ వెళ్ళారు.
"జోళ్ళు విప్పుకోండి" అందామె.
"ఎందుకు?" అన్నాడు శాస్త్రి.
"విప్పుకోండి" అందామె గడ్డిస్తున్నట్లు.
ఇద్దరూ జోళ్ళు విడిచారు.
"లోపలకు రండి" అందామె మళ్ళీ.
వాళ్ళు జోళ్ళు విడిచిన చిన్న గదిలోంచి కాస్త విశాలమైన గదిలో అడుగు పెట్టారు. అక్కడ నేలమీద కంబళి పరిచి వుంది. ఒక పక్కగా వ్యాస పీరముంది. అందులో ఏదో పుస్తకముంది.
ఆ స్త్రీ వ్యాస పీరం వెనుక తను కూర్చుంది. శాస్త్రినీ, శర్మనూ తన కెదురుగా కూర్చోమంది.
ఇద్దరూ కూర్చున్నారు.
"ఈ తలుపు మిధ్య. ఈ ప్రపంచం మిధ్య. మనిషి మాయా మోహల నుంచి బయటపడాలి" అందామె.
"అవును" అన్నాడు శర్మ వినయంగా.
ఆమె ఉదాహరణకు ప్రారంభించింది. శాస్త్రికి విసుగ్గా వుంది. శర్మ కోసం భారిస్తున్నాడు.
అలా చాలాసేపు గడిచింది.
శాస్త్రి, టైము చూసుకుని "మరోసారి వస్తాం -- ఈ రోజు మాకు పని ఉంది. ఇప్పుడర్జంటుగా మువ్వలవానిపాలెం వెళ్ళాలి" అన్నాడు.
ఆ స్త్రీ అదోలా అతడి వంక చూసి "మీ యిష్టం వెళ్ళాలను కుంటే వెళ్ళిపొండి" అంది.
"ఇంటి సంగతి చెప్పలేదు" అన్నాడు శర్మ.
"నా వేదాంతం వంటబట్టని వాళ్ళకు నేను -- ఇల్లెలా యిస్తాను" అందా స్త్రీ.
శర్మ వినయంగా "మీ వేదాంతం నాకెంతో నచ్చింది"అన్నాడు.
"అయితే మరి కాసేపు వినోచ్చుగా" అందా స్త్రీ.
"మీరు చెప్పింది జీర్ణించుకున్నాను. మరీ ఎక్కువైతే జీర్ణించుకోవడం కష్టం కదా-- జీర్ణించుకోనప్పుడు వినడం బాగుండదు"
'అయితే విన్నదంతా జీర్ణించుకున్నానంటావు..."
"ఊ" అన్నాడు శర్మ.
"అబద్దం...."
"మీవంటి పుణ్యాత్ములకు నేనబద్దం చెప్పను...."
"నిజంగా అబద్దం చెప్పకపోతే నా వేదాంతం వంటబట్టిన వాడికింకా యిల్లెందుకు?" యిల్లాలెందుకు?" అందా స్త్రీ.
"నిజమే" అన్నాడు శర్మ.
'అయితే యింటి గురించి అడక్కు--"వెళ్ళు" అందా స్త్రీ.
ఇద్దరూ మిత్రులూ వెర్రి ముఖాలతో అక్కణ్ణించి లేచారు.
"అలా మాట్లాడకుండా వెళ్ళిపోవడమేనా? పెద్ద దాన్ని. నా దగ్గర సెలవు తీసుకోవద్దూ ."
"వస్తామండి" అన్నాడు శర్మ.
"మళ్ళీ వస్తానంటే నా కభ్యంతరం లేదు. వచ్చినప్పుడు నా వేదాంతం రెండు గంటలైనా వినాలి" అందా స్త్రీ.
"ఈసారి కూడా రెండు గంటలూ విందుమండి. కానీ మువ్వలవాని పాలెం వెళ్ళాలి గదా" అన్నాడు శాస్త్రి.
"మువ్వలవాని పాలెం కదూ అన్నావు. అక్కడ వెంకటేశ్వర్రావిల్లు నీకు తెలుసా?"
శాస్త్రి తెల్లబోతూ "ఆ యింటికే మేము వెడుతుంటా"అన్నాడు.
"ఆ ఇంటికే అంటావేమిటి-- ఆవిడక్కావలసిన వెంకటేశ్వర్రావేవరో తెలుసుకోకుండానూ" అన్నాడు శర్మ స్నేహితుడ్ని మందలిస్తూ.
"ఆ వెంకటేశ్వర్రావు మహా పిసినిగొట్టులే. పేరు మోసిన వడ్డీ వ్యాపారి. వాళ్ళింట్లో ఓ కాపలావాడున్నాట్ట. వాడొక సారి యిక్కడ కొచ్చి నన్ను కలుసుకుంటే బాగుండును. ఇంటికి కాపలాగా వుంటానంటే యిల్లే వాడికి వదిలేసి పోతాను" అందా స్త్రీ.
"మీ యింటికి కాపలా కావాలంటే ఆయనెవరో ఎందుకు? మేమే ఉంటాం" అన్నాడు శర్మ వెంటనే ఆశగా.
"అద్దెకు వచ్చిన వాళ్ళని కాపలాగా ఉంచుతానేమిటి? అయినా అడ్డమైన వాళ్ళనూ నేనెందుకు నమ్ముతాను?" అందా స్త్రీ.
"మీరిక్కడికి వెళ్ళాలి!" అన్నాడు శాస్త్రి.
"అదంతా నీకనవసరం. నీకు వీలైతే ఆ కాపలా వాడికి చెప్పు...." అందా స్త్రీ. అప్పుడామే మాట గసురుతున్నట్లుగా వుంది.
ఇద్దరూ అక్కణ్ణించి చిన్న గదిలోకి వచ్చి జోళ్ళు వేసుకుని నడవ లోకి వచ్చారు. వారి వెనకనే చిన్న గది తలుపులు మూసుకున్నాయి.
5
మోటారు సైకిలు మువ్వలవానిపాలెం లో ఓ యింటి ముందాగింది.
ఇంటి చుట్టూ నాలుగడుగుల ఎత్తు గోడ వుంది.
"ఓచిన్న గేటు....
శాస్త్రి యింటి నంబరు మరోసారి శ్రద్దగా చూశాడు. తృప్తిగా తలాడించాడు. ఈలోగా శర్మ మోటారు సైకిల్ కు స్టాండు వేశాడు.
శాస్త్రి గేటు తీసి లోపల ప్రవేశించాడు.
శర్మ లోపలకు ప్రవేశించి గేటు వేశాడు.
చుట్టూ మొక్కలున్నాయి. అవన్నీ కాయగూరలవే.
ఇద్దరూ సన్నని బాటలో ముందుకు వెళ్ళారు.
సరాసరి కాలి దార్లోకి వెళ్ళారు.
తిన్నగా ఓ గుమ్మం ఎడమ పక్కగా ఓ గుమ్మం.
తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి.
ఇంటికి కాలింగ్ బెల్ ఉంది. శాస్త్రి బటన్ నొక్కాడు.
కొద్ది క్షణాల్లో తలుపులు తెరచుకున్నాయి.
సుమారు ముప్పై ఏళ్ళ యువకుడు . అతడి ముఖం చిరాగ్గా వుంది.
"శ్రీ వెంకటేశ్వర్రావు గారు -- " అన్నాడు శాస్త్రి.
'ఆయనతో మీకేం పని?"
