Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 44

 

    "ఇస్తున్నామనుకో -- కానీ మన వాలకాలు చూడు మనలాంటి వాళ్ళను హోటల్లో చూస్తె -- ఇదీ తక్కువ రకం హోటలనుకుని గొప్పవాళ్ళు రావడం మానేస్తారు-" వెంకడింకా మాట్లాడుతుండగా లోపల్నుంచి ఒకాయన వచ్చి బిల్లు చెల్లించాడు. మొత్తం రూపాయి పది పైసలు బిల్లుకి ఇరవై రూపాయల నోటిచ్చాడు. కౌంటర్ దగ్గిర వెంకడిని ఆటకాయించిన మనిషి మారుమాట్లాడ కుండా నోటు తీసుకుని చిల్లరిచ్చేశాడు.
    అక్కడ తమకున్న స్థానం తెలిసి వెంకడూ, సుబ్బడూ అందులోంచి బయటపడ్డారు.
    ఇద్దరికీ బాగా ఆకలి వేస్తోంది...." దగ్గరున్నది ఒక్క రూపాయే --ఇద్దరికీ భోజనం దొరకాలి. ఈ పూటకి అవ్వ దగ్గర పకోడీలు కొనుక్కుందాం...." అన్నాడు వెంకడు సుబ్బడు తలూపాడు.
    కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఉంటుంది అవ్వ. పకోడీలు, బజ్జీలు, జంతికలు , మసాల వడలు వగైరాలు తయారు చేసి ఓ అంగడిలో పెట్టుకుని ఓ విసనకర్రతో ఈగలను తోలుకుంటూ కూర్చుంటుంది అవ్వ -- అవ్వ దగ్గర పదార్ధాలు కాస్త చౌకగా దొరుకుతాయి -- కానీ అవ్వ కస్టమర్స్ అంతా వెంకడి స్థాయి వాళ్ళే.
    వీళ్ళు వెళ్ళేసరికి అవ్వ చాలా సంతోషంగా వుంది. ఆ రోజు అవ్వ మనుమడి పుట్టిన రోజట. తనకు బాగా పరిచయమైన వెంకడికీ, సుబ్బడికీ అవ్వ కొద్దిగా వడ, పకోడీలు వగైరాలు వేసి -- చెరో పొట్లం కట్టి ఇచ్చి -- "ఈ వీళ్ళకివి ఉత్తినే ఇచ్చేస్తున్నాను. పోయి భోం చేయండి " అంది.
    మిత్రులిద్దరూ చాలా సంబరపడ్డారు -- మొత్తం మీద అదృష్టవంతులమే ననుకున్నారు. దగ్గరలో వున్న పంపు దగ్గరకు వెళ్ళి పొట్లాలు రెండూ గట్టు మీద పెట్టి చేతులు కడుక్కుంటున్నారు. వాళ్ళు చూస్తుండగా , చేతులు కడుక్కుంటుండగా మెరుపు వేగంతో ఒక కుక్క ఆ రెండు పోట్లలనూ ఎగరేసుకు పోయింది. తెల్లబోయిన మిత్రులిద్దరూ తెరుకుకనేలోగా ఘోరం జరిగిపోయింది. కుక్క కనుచూపు మేరలో లేదు.    
    మిత్రులిద్దరూ పరస్పరం నిందించుకున్నారు. కాసేపలా తిర్రుకున్నాక అలసిపోయి కర్తవ్యమేమిటా అని ఆలోచించసాగారు.
    "ఆ పద్మనాభం గారు రూపాయిచ్చాడు. మనవి శని పట్టుకుంది" అన్నాడు వెంకడు. సుబ్బడికి నిజమేననిపించింది.
    "ఎప్పుడూ ఇవ్వనివాళ్ళు ముష్టిస్తే అచ్చి రాదని ఓ గుడ్డి తాత అటుండేవాడు. అదే నిజమైనట్లుంది...." అన్నాడు వెంకడు నిస్పృహగా.
    "తొందరగా దీన్ని ఖర్చు పెట్టేస్తే పీడ విరగడవుతుంది పద" అంటూ సుబ్బడు అక్కణ్ణించి కదిలాడు. వెంకడు వాడిని అనుసరించాడు.
    ఇద్దరూ కలిసి ఒక మిఠాయి బండి దగ్గరకు వెళ్ళారు. జేబులోని డబ్బులు బయటకు తీయకుండానే --" రూపాయకు సరిపడా ఏమైనా సరే - కారం సామాను పొట్లం కట్టి ఇవ్వు" అన్నాడు వెంకడు.
    బండివాడు పొట్లాలు కట్టివ్వగానే -- రూపాయి కాసు బండిలో పడేసి మళ్ళీ ఏం ప్రమాదం ముంచు కొస్తుందోనని అక్కడ నిలవకుండా ఇద్దరూ పరుగెత్తుకు పోయారు. ఒకచోట కూర్చుని పోట్లాలలోని సరుకులు తిన్నారు. దగ్గరలోని పైపు దగ్గర మంచినీళ్ళు తాగేసరికి వాళ్ళ కడుపు నిండి -- శరీరంలో కాస్త సత్తువ వచ్చింది.

                                   3
    
    మిత్రులిద్దరూ మళ్ళీ బస్ స్టాండు కు వెళ్ళారు. కాసిని బేరాలు దొరికాయి. సాయంత్రం దాకా వుండగా చెరో అరవై పైసలూ దొరికాయి. ఇద్దరూ కూరల మార్కెట్ కు వెళ్ళారు. మార్కెట్ దగ్గర ఒక శాస్త్రి గారు వెంకడిని పలకరించి -- " "వస్తావురా" అనడిగాడు. వెంకడు తెలిసిన దుకాణం లోంచి బుట్ట ఒకటి తీసుకున్నాడు. దానికి అయిదు పైసలు అద్దె చెల్లించాడు. తర్వాత శాస్త్రి గారితో బయల్దేరాడు.
    శాస్త్రి గారు భార్యతో మార్కెట్ కు వచ్చాడు. అవీ ఇవీ చాలా కొన్నాడు. అన్నీ వెంకడి బుట్టలో వేయించాడు. వెంకడు బుట్ట నెత్తి మీద కెత్తుకున్నాక శాస్త్రి గారు ఇంటి ముఖం పట్టాడు. భార్య భర్తలిద్దరూ కబుర్లాడుకుంటుంటే వెంకడు వింటున్నాడు.
    "నీకు చెబుదామనుకుని మరిచిపోతున్నాను -- పద్మనాభం గారు తెలుసుగా నీకు ...." అన్నాడు శాస్త్రిగారు.
    "తెలియకేం -- పిసినారి పద్మనాభం గారి నీ ఊళ్ళో ఎరిగనివారెవరు?"
    'ఆయనకు అంతుపట్టని రోగమేదో వచ్చింది. చాలా రకాల మందులుమింగాడు కానీ అవన్నీ చిట్కా మందులు . ఎవరి సహాయమూ అవసరం లేకుండా తనకు తనే అవి తెలుసుకుని మింగాడు. పెద్ద పనేమీ జరగలేదు.
    ఒకరోజు నేనాయన్ను కలిసినపుడు అనారోగ్యకారణం అడిగాను. అంతుపట్టడం లేదనీ-- తిన్న మందులేవీ పని చేయడం లేదని అన్నాడు. డాక్టరు గారిని కలుసుకున్నారా అనడిగాను. అయన అభిప్రాయంలో డాక్టరు దగ్గర కెళ్ళడం వల్ల అటు ఫీజు లకూ ఇటు మందులకూ కూడా ఖర్చయిపోతుంది.
    ఒక డాక్టరాయన జబ్బు గురించి చూచాయగా తెలుసుకుని కనీసం అయిదు వందలైనా ఖర్చు చేస్తేనే కానీ ప్రాణాలు దక్కవన్నాడుట. అయిదు వందలూ ఖర్చు చేస్తే నా ప్రాణాలేలాగూ దక్కవని అయన బయటపడ్డాడట. డబ్బు ఖర్చు చేయకుండా తన జబ్బెలా నయమవుతుందనీ అని ఆలోచిస్తున్న ఆయనకు నేనో ఉపాయం చెప్పాను...."
    శాస్త్రి గారి భార్యతో పాటు వెంకడు కూడా అంతా ఆశ్చర్యంగా వింటున్నాడు.
    "యేమని చెప్పారేమిటి?" అంది శాస్త్రి గారి భార్య.
    "ముందు నాకో అయిదు రూపాయలివ్వాలన్నాను. జబ్బు తగ్గితే ఇంకో పది రూపాయలు ఖర్చవుతుందన్నాను. అయన అంగీకరించాడు. నాకు అయిదు రూపాయలూ ఇచ్చాడు. ఆ తర్వాత నేను కొన్ని మంత్రాలు చదివి , పూజ లాంటిది చేసి -- పది రూపాయ నాణేలయన దగ్గర తీసుకుని అయన తల చుట్టూ తిప్పి దిష్టి తీసి - ఒక డబ్బాలో వేశాను. ఆయనకు ఒంట్లో సులువుగా వుందనిపించిన రోజున మొదలుపెట్టి వరుసగా పది రోజులు ఎవరైనా లేని వాడికి దానం చేయమన్నాను...."
    'అలా ఎందుకు చేశారు?" అవి కూడా మీకే దానమివ్వలేకపోయారా?"
    'అందును కానీ నాకూ నా మంత్రాల మీద నమ్మకముంది. నా మంత్రాలతో అయన ఆరోగ్యానికీ, అదృష్టానికీ పట్టిన శనిని ఆ రూపాయలోకి రప్పించి దిగదుడిచి డబ్బాలో వేశాను. ఆ శని డబ్బులూ మనకెందుకూ? మనం సంపాదించేదంతా శుభ కార్యాల మీదే సంపాదించుకుంటున్నాం. అపశకునప్పను లెందుకు చెప్పు -- ఇంతకీ ఎందుకు చెప్పానంటే - నా మంత్రం నిజంగానే పని చేసి అయన ఆరోగ్యం కుదుటపడింది. ఈరోజే అయన మొదటి రూపాయ దానం చేశాడు...."
    "పద్మనాభం నిజం గా దానం చేశాడా -- నమ్మడం కష్టం.
    "నేనూ నమ్మలేకపోయాను. కానీ అయన నన్నూ నా పాండిత్యాన్నీ ప్రావీణ్యతనూ అదేపనిగా పొగిడేసి -- నా లాంటి వాళ్ళుంటే కానీ ఈ దేశంలో బల్ల కట్టిన డాక్టర్ల అత్యాచారాలాగవన్నాడు. ఈరోజు ఉదయమే రోజూ తన వీధిలోనే అడుక్కునే ఓ కుర్రాడికి రూపాయ దానం చేశాడుట. ప్రతిరోజూ రమ్మనమని కూడా చెప్పాడట. ఎరిగిన వాడైతే తన్ను మహాదాతగా గుర్తించుకుంటాడని అయన మహా మురిసిపోతున్నాడు...."
    వెంకడింక వాళ్ళ మాటలు వినలేదు. పద్మనాభం చేసిన దానంలోని రహస్యం వాడికి అర్ధమైపోయింది. ఆ రూపాయనిజంగా శని రూపాయే! అదుండగా తిండి దొరకలేదు. బేరాలు దొరకలేదు. సరిగదా ఉత్తి పుణ్యాన దెబ్బలూ -- అయాచితంగా వచ్చిన తిండి దక్కకుండా పోవడమూ జరిగాయి.
    ఆ రూపాయ చేతిలోంచి బయటకు వెళ్ళాకనే మళ్ళీ తమపని బాగుపడింది. అది తమ దగ్గర్నుంచీ మిఠాయిబండీ వాడి దగ్గరకు వెళ్ళింది. పాపం వాడే ఇబ్బందులూ పడుతున్నాడో -
    వెంకడు శాస్త్రి గారింట్లో బుట్ట దింపాడు. వాళ్ళు సరుకులు తీసుకుని నలభై పైసలిచ్చారు. అవి తీసుకుని వాడు మళ్ళీ మార్కెట్టుకు బయలుదేరాడు. అక్కడ ఇంకో గంట గడిపేడు -- సుబ్బడూ, వాడూ మళ్ళీ కలిశారు. తను శాస్త్రి నోట విన్నదంతా సుబ్బడికి చెప్పాడు. వెంకడు. సుబ్బడు ఆశ్చర్యంగా విని --"పద - ఆ బండి వాడినోసారి చూసివద్దాం" అన్నాడు.
    ఇద్దరూ సాధారణంగా ఆ బండి ఉండే ప్రదేశానికి వెళ్ళారు. వాడిని పలకరించి -- "మేము నీ దగ్గర పకోడీలూ వగైరాలు కొనుక్కుతిన్నాం -- ఓ రూపాయి పెట్టి . ఆ తర్వాత నాకేం ప్రమాదమూ జరగలేదు కదా " అనడిగారు.
    వాడాశ్చర్యంగా ---"ఏం ---అలా అడుగుతున్నారు?" అన్నాడు.
    వెంకడూ నవ్వుతూ తన కధంతా చెప్పాడు.
    బండివాడు చటుక్కున జేబులోంచి రూపాయ కాసు తీసి -- "అదన్నమాట కధ " అన్నాడు.
    బండివాడికి వెంకడి తోనే బోణీ అయిందిట. బోణీ డబ్బులు గల్లా పెట్టెకి ఓసారి కొట్టి కళ్ళ కద్దుకుని జేబులో వేసుకుంటాడట. ఆ డబ్బు మిగతా డబ్బులతో కలసి పోకుండా ఉండడానికి అలా చేస్తాడన్నమాట.
    వెంకడు బోణీ  చేసి వెళ్ళిన అయిదు నిమిషాలకు వాడి బండిని రిక్షా గుద్దేసి కొన్ని తినుబండారాలు నేలపాలయ్యాయట. తగిలిన బోణీ బేరాన్ని తిట్టుకుంటూ తన మాములూ చోటుకి వెళ్ళాడు. బేరాలు కూడా అంతంత మంత్రంగానే తగిలాయి.
    రూపాయి వాళ్ళకిచ్చేస్తూ "ఇది నిజంగా శని డబ్బే -- ఏ సినిమా వాడికైనా ఇచ్చి సినిమా చూడండి" అన్నాడు బండివాడు. వాడికీ ఇలాంటి నమ్మకాలు బాగా ఉన్నాయి. అతని నమ్మకాలను నిజం చేస్తూ వెంకడూ, సుబ్బడూ అక్కణ్ణించి కదలగానే అతని బండి చుట్టూ జనం మూగేశారు. క్షణాల మీద సరకంతా అమ్ముడైపోయింది.
    వెంకడూ, సుబ్బడూ ఓ హోటలు దగ్గరకు వెళ్ళారు. దగ్గరున్న డబ్బులతో కడుపు నిండా అవీ ఇవీ తిన్నారు. సెకండ్ షో కి ఓ పాత సినిమాకి వెళ్ళాలనుకున్నారు. ఆ సినిమా హల్లో గేటు కీపరు వాళ్ళకు తెలిసినవాడే రష్ పెద్దగా లేని రోజుల్లో వాడు ఈ మిత్రులిద్దరినీ సినిమా చూడనిస్తుంటాడు.
    ఇద్దరూ సినిమా హల్లో కూర్చుని అయిదు నిమిషాలు చూసేక హల్లో కరెంట్ పోయింది. సుమారు అర్ధగంట సేపు ప్రేక్షకులు కరెంట్ వస్తుందని ఎదురు చూశారు. ఆఖరికి హల్లో వున్నవారందరికీ ఫ్రీప్యాసులిచ్చి పంపించేశారు.
    "లాభం లేదు -- ఈ శని డబ్బును తొందరగా వదుల్చుకోవాల్సిందే...." అన్నాడు వెంకడు. అంతవరకూ తినుబండారాలు కొనుక్కునేందుకు దాన్ని వాడు బయటకు తీయలేదు. కారణం వేరే ఏమీ లేదు. తనకు తిండి దొరకదేమోనన్న భయం. పుచ్చుకున్నవాడేమై పోతాడోనన్న జాలి!
    "ఇది ఎవరికైనా పరం దుర్మార్గుడిని వెతికి పట్టి దానమివ్వాలి ...." అన్నాడు సుబ్బడు. చివరకు ఆలోచనలో పడ్డారు మిత్రులిద్దరూ. కానీ అలాంటి వాడు ఎవడు ?-- అన్న ప్రశ్న కిద్దరికీ వెంటనే సమాధానం దొరకలేదు .

                                  ---------- 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS