Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 43

 

                              శని రూపాయి ?

                                                                         వసుంధర
    వాళ్ళ అసలు పేర్లు ఏమైతేనేం - అందరూ వాళ్ళని వెంకడు, సుబ్బడు అని పిలుస్తారు. ఇద్దరూ ముష్టివాళ్ళు. కూలి వాళ్ళూ అన్ని రకాల వాళ్ళు.
    కొన్ని బస్సులు రద్దీగా ఉన్న సమయంలో యిద్దరూ బస్ స్టాండ్ లో వుంటారు. ఉదయం లేచింది మొదలు పది గంటలదాకా నాలుగు వీధులూ తిరిగి అడుక్కుంటారు. అడుక్కునేటప్పుడు చెరొక వీధికి పోతారు కానీ  ఉత్తప్పుడు సాధారణంగా కలిసే వుంటారు.
    ఆరోజు మాత్రం సుబ్బడికి లేచినప్పటి నుంచీ ఏదోలా వుంది. ఒక్కడికీ యెక్కడికి వెళ్ళాలని లేదుట. "నీతో పాటే నేనూ వస్తాన్రా వెంకా --" అన్నాడు సుబ్బడు.
    వెంకడు  కాసేపాలోచించి -- 'అలాగే కానీ - ఇద్దరమూ కుర్రాళ్ళవే కదా -- కలిసి అడుక్కుంటే మనకెవరు డబ్బు లిస్తార్రా -- అందుకేదయినా ఉపాయం చూడాలి --" అన్నాడు. ఆలోచించడాని కెంతో సేపు పట్టలేదు. అందరు వేవే ట్రిక్కే వాడు వేసాడు. ఫలితంగా సుబ్బడు గుడ్డి వాడయ్యాడు.
    వెంకడు అడుక్కునే వీధిలో కొంతమందికి పరిచయం కూడా వున్నాడు. ఒకళ్ళీద్దరు పలకరించి -- "ఈ గుడ్డాడేవర్రా వెంకా ---" అనడిగాడు.
    "నా తమ్ముడు బాబూ -- ఎప్పుడూ ఏ గుడి దగ్గరో కూర్చుని అడుక్కోవడమే కానీ తిరగడం అలవాటు లేదు వీడికి. బొత్తిగా కాలు సాగడం లేదని నేనే నాలుగు కేకలు వేసి నాతొ తీసుకువచ్చాను. నాలుగిళ్ళు తిరగందే ఈ రోజుల్లో డబ్బు లేవరిస్తారు బాబూ?-- " అంటూ జవాబు చెప్పాడు వెంకడు.
    అలా ఇద్దరూ వీధిలో నడుస్తున్నారు. సుబ్బడు కళ్ళు తెరిచే గుడ్డి వాడిలా ఆకాశం కేసి చూపులు చూస్తూ వెంకడి చేయి పట్టుకుని నడుస్తున్నాడు. అయితే వాడికి అన్ని బాగా కన్పిస్తున్నందువల్ల ప్రతి యింటి ముందు వెంకడు చెప్పకుండానే ఆగిపోతున్నాడు.
    అలాగే ఒక యింటి ముందాగబోయిన సుబ్బడిని వెంకడు వారించి -- "ఇక్కడాగడం అనవసరం. ఇంటాయన పరమ లోభి. పిల్లికి బిచ్చం పెట్టడు. బాగా వున్నవాడేనని చెప్పుకుంటారు కానీ మనలాంటి వాళ్లాకాయన డబ్బు దొరకదు. అందుకని ఇక్కడాగడం వల్ల మనకు సమయం వృధా -- " అన్నాడు.
    'అలాగా -- " అని సుబ్బడు అక్కణ్ణించి కదిలాడు వాళ్ళిద్దరూ నాలుగడుగులయినా వేశారో లేదో -- "ఒరేయ్ యిలా రండిరా --" అన్న కేక వినిపించింది. ఇద్దరూ వెనుదిరిగారు.
    ప్రమలోభిగా పేరుబడ్డ పద్మనాభంగారు ఇంటరుగు మీద కూర్చుని ముష్టి వాళ్ళిద్దరినీ పిలుస్తున్నాడు. అయన ముఖంలో ఎన్నడూ లేని ఆప్యాయత కనబడుతోంది. వెంకడి ముఖంలో ఆశ్చర్యం కనపడింది. ఇద్దరూ నడచుకుంటూ వెళ్ళారాయన దగ్గరకు.
    "మీకోసమే చూస్తున్నాన్రా -- ఇంటి ముందాగినట్లే ఆగి వెళ్లి పోయారేం?" అన్నాడాయన.
    వెంకడు ఏమీ మాట్లాడలేదు.
    "వీడెవడ్రా ?" అన్నాడు పద్మానాభం.
    "నా తమ్ముడండి. అడుక్కుందుకీ వీధికి రావడం ఇదే మొదలండి. చాలా మంచివాడండి. అందుకే - యెన్నడూ లేనిది-- మీరు కూడా ఈరోజు మమ్మల్ని వెళ్ళిపోతున్నా వెనక్కు పిలిచేరేమో " అన్నాడు వెంకడు.
    "రోజూ ఏదో హడావుడి పనిలో వుండగా వస్తావురా, రేపట్నించి రోజూ రండి. ఒక నిమిషం అలష్యమైనా ఇంటి ముందు నిలబడండి -- కాస్త గట్టిగా కేక వేయండి. లేకపోతె నేను మీకోసం అరుగు మీద నిలబదాల్సుంతుంది." అన్నాడు పద్మానాభం.
    ఎప్పుడూ చీదరించుకునే పద్మానాధం యిలా మాట్లాడడం వెంకడికి చాలా ఆశ్చర్యంగా వుంది. ఏమైతే నేం వాడు గిన్నెలో వున్న చేతిని ముందుకి చాపాడు. ఖంగు మంటూ పడింది అందులో నాణెం.
    ఆయనకు నమస్కరించి అక్కణ్ణించి కదిలారిద్దరూ.
    "రూపాయి కాసురా" అన్నాడు సుబ్బడు.
    "అదే నాకూ ఆశ్చర్యంగా వుంది" అన్నాడు వెంకడు. ఇద్దరూ నాలుగడుగులేశాక -- "ఈ ఇంటి తల్లి అన్నపూర్ణమ్మరా. ఒక్క నిమిషం అగు" అంటూ -- 'అమ్మా- అన్నపూర్ణమ్మతల్లీ " అంటూ అరిచాడు.
    లోపల నుంచి అన్నపూర్ణమ్మ తల్లి రాలేదు. ఓ యిరవ ఏళ్ళ కుర్రాడు వచ్చి -- "ఇంట్లో ఎవరికీ స్థిమితంగా లేదు. నీ అన్నపూర్ణమ్మ కి ఒళ్ళు తెలియని జ్వరం -- ఇంకో ఇంటికి పో --" అన్నాడు.
    "ఎప్పుడూ ఇలా అనలేదు-- ఆ చల్లని తల్లి గుప్పెడు బియ్యం పెట్టకుండా ఎప్పుడూ నన్ను పంపలేదు ...." అని బాధపడుతూ అక్కణ్ణించి కదిలాడు వెంకడు.
    సుబ్బడికి వెంకడి మాటలు ఆశ్చర్యంగా వున్నాయి. ఒకాయన్ని చూపించి పరమలోభి అన్నాడు. అయన రూపాయి దానమివ్వడమే కాక -- రోజూ రమ్మని చెప్పాడు. ఇంకొక ఆవిడ ప్రతినిత్యం దానం చేస్తుందన్నాడు. ఆ యింట్లో తిరస్కారం లభించింది. వెంకడు తనకు తన వీధి రహస్యాలు తెలిసిపోతాయనే భయంతో అబద్దాలు చెబుతున్నాడా -- లేక ఈరోజు కాకతాళీయంగా ఇలా జరిగిందా?
    ఇంటివాళ్ళ మాటలను బట్టి వెంకడి మాటలు నిజమనే తెలుస్తోంది. ఆ తర్వాత వాళ్ళు యెన్నిళ్ళు తిరిగినా -- ఒక్క బియ్యపు గింజ కానీ, ఒక్క పైసా డబ్బు గానీ దొరకలేదు.
    "దేవుడున్నాడు లేరా -- ఎక్కడా డబ్బులు దొరకవనే ఈరోజు పద్మనాభం గారికి మనకు రూపాయివ్వాలనే బుద్ది పుట్టించాడు" అన్నాడు వెంకడు.
    "దేవుడంటే మనమిలా అడుక్కోవడ మొందుకురా అసలు౧" అన్నాడు సుబ్బడు.
    
                                     2
    వెంకడూ, సుబ్బడూ అడుక్కోవడం పూర్తయింది. ఇద్దరూ అప్పన్న టీ కొట్టుకి వెళ్ళారు. అక్కడ కాస్త టీ తాగి -- బస్టాండు కి పోతారిద్దరూ , రోజూలా అప్పన్న వీళ్ళీద్దరినీ ఈరోజు ఆప్యాయంగా పలకరించలేదు. అతను దిగులుగా ఒక్కడూ కూర్చున్నాడు. కొట్లో ఒక్కడంటే ఒక్కడు కష్టమర్ లేడు.
    "ఏమిటలా దిగులుగా వున్నావ్" అన్నారు వెంకడు. సుబ్బడు. సుబ్బడిప్పుడు గుడ్డి వాడు కాదు. మామూలు మనిషయిపోయాడు.
    'అదిగో అటు చూడు ...." అన్నాడు అప్పన్న.
    వారిద్దరూ అటు చూశారు. దూరంగా ఇంకో చిన్నపాక కనిపిస్తోంది.
    "సింహాచలం అందులో టీ దుకాణం తెరిచాడు. వెధవ నావ్యాపారం పడగొట్టాడు. నిన్న వాడే కుతంత్రం పన్నాడో తెలియదు గానీ నా దుకాణం లో డికాక్షన్లో బల్లి వుందని చూపించాడు వీడు. క్షణాల మీద యిక్కడంతా ప్రచారమై పోయింది. పరిశుభ్రతకూ, ఆరోగ్యానికి తన హోటల్ మారుపెరుట. వాడి ప్రచారం పనిచేసింది. ఈ రోజు ఉదయం యింతవరకూ నాకు బోణీ అయినాకా లేదు" అన్నాడు అప్పన్న.
    తమకు టీ ఇచ్చే వుద్దేశ్యం అప్పన్నకు లేదని వెంకడికి అర్ధమయింది. బేరాలు తక్కువగా వున్నప్పుడు, మనసు బాగాలేనప్పుడు, దానగుణం లోపించిన రోజున అప్పన్న. వీళ్ళకు చూసినప్పుడు బోణీ అవలేదనీ అబద్ద మడతాడు.
    అప్పన్న ఉద్దేశ్యం గ్రహించిన ఇద్దరూ అక్కణ్ణించి కదిలారు సింహాచలం కొట్టు వైపు. అక్కడ విపరీతమైన రద్దీగా వుంది. అడిగిన వారందరికీ అన్ని సప్లయిచేయలేక సింహాచలం సతమతమై పోతున్నాడు.
    అక్కడ టీ తాగాలంటే -- డబ్బు లిచ్చినా కూడా ఓ షాపు గంట వృధా అయిపోతుందని వెంకడు, సుబ్బడు గ్రహించారు. అందుకని హడావుడిగా అక్కణ్ణించి బస్ స్టాండు కు బయల్దేరారు -- "ఆ తాగే టీ ఏదో బస్ స్టాండ్ లోనే తాగవచ్చున్లే" అనుకుంటూ.
    వాళ్ళు బస్ స్టాండ్ చేరేసరికి అప్పుడే ఒక బస్సు స్టాండ్ లోకి వచ్చింది. ఇంకో అరగంట బయల్దేరుతుందది. టీ సంగతి వదిలిపెట్టి బస్సు చుట్టూ వున్న జనం దగ్గరకు పరుగెత్తారు వాళ్ళిద్దరూ. అక్కడ చాలా హడావుడిగా వుంది చాలామంది కూలివాళ్ళు పోటీ పడుతున్నారు. వెంకడికీ సుబ్బడికి బేరం దొరకలేదు.
    ఇంతలో -- "దొంగ -- దొంగ --" అని కేక వినపడింది. జనంలో కలకలం బయల్దేరింది. వెంకడి చేతిలో బరువుగా ఏదో పడింది. వెంకడు ఉలిక్కిపడి చూశాడు. అది ఒక బరువైన పర్సు . "పర్సు --" అని అరిచాడు కంగారుగా వెంకడు.
    "ఏదీ --" అంటూ ఒకాయన వచ్చి అందుకున్నాడు . డబ్బు లెక్క చూసుకున్నాడు.
    "వెధవా -- కూలి పనికోచ్చావా -- జేబు దొంగతనాల కొచ్చావా ?" అన్నాడు అ పెద్దమనిషి వెంకడి వంక క్రూరంగా చూస్తూ.
    "నాకేం తెలియదు బాబూ -- ఎవరో దొంగ దొంగని అరిచారు. ఎలా వచ్చిందోయిది వచ్చి నాచేతిలో పడింది." అన్నాడు వెంకడు.
    వాడి మాటలు ఎప్పుడూ వినలేదు -- "తన్నండి వెధవని -- అప్పుడు గాని బుద్ది రాదు" అన్నారెవరో.
    అన్నదే తడవుగా ఎవరో వెంకడి వీపు మీద రెండు గుద్దులు గుద్దారు. ఇంకోళ్ళు కాలు విసిరారు. వెంకడు క్రింద పడ్డాడు. ఒక బలమైన మనిషి వెంకడి పొట్టమీద బూటు కాలుతో తొక్కబోతుండగా ఎవరో "ఆగండి" అన్నారు.
    బస్టాండ్ లో కిళ్ళీ కొట్టు భద్రయ్య అతను.
    "ఆ కుర్రాడు నాకు తెలుసు. చాలా నమ్మకస్తుడు. పర్సు దొరికింది గదా -- వాణ్ని వదిలిపెట్టండి ...." అన్నాడు భద్రయ్య.
    వెంకడు లేచి నిలబడ్డాడు. వాడి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. వాడూ, సుబ్బడూ అక్కణ్ణించి కదిలారు. ఇంక కూలిబెరాల ఆశ లేదు. ముందు కడుపులో మండుతోంది. ఆపని చూడాలి.
    ఇద్దరూ కాస్త పెద్ద హోటల్లోకే వెళ్ళారు -- "డబ్బు లున్నాయా ?" అన్నాడా టీ కొట్టువాడు వీళ్లిద్డరినీ చూసి.
    "ఉన్నాయి "-- అంటూ ధీమాగా రూపాయి కాసు తీసి చూపించాడు వెంకడు.
    "చిల్లర లేదు--" అన్నాడు టీ దుకాణం అతను.
    "చిల్లర లేకుండా వ్యాపార మెందుకు" అన్నాడు సుబ్బడు. అయితే వాడా మాటలు గట్టిగా అనలేదు. గొణుక్కున్నట్లుగా నెమ్మదిగా అన్నాడు.
    "మనబోటి గాళ్ళు పెద్ద హోటళ్ళకి వెళ్ళకూడదు. ఇక్కడ మనకు గౌరవముండదు....." అన్నాడు వెంకడు.
    "ఏం ----మనం మాత్రం డబ్బివ్వడం లేదా?" 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS