Previous Page
వసుంధర కధలు-5 పేజి 41

 

    "ఇంకా యిప్పుడు కాస్త నయం. తండ్రి దగ్గర బాగా చేరిక వాడికి. అయన లేకుండా ఎప్పుడూ భోం చేసేవాడు కాదు. అయన అరెస్టయిన నాలుగు రోజులసలు వీడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మరి దక్కుతాడనుకోలేదు నేను."
    ప్రస్తుతం బసవరాజు , అతని భార్య, ముగ్గురు పిల్లలు, ఉమ రాజు బజారుకు వెళ్ళడం కోసం ఒక బస్ స్టాపు లో నిలబడి వున్నారు. హటాత్తుగా రాజు తల్లి దగ్గరగా వచ్చి నెమ్మదిగా, "అమ్మా, అక్కడ నిలబడి వున్నాయన చేతి ఉంగరం నాన్నది" అన్నాడు.
    ఉమ ఉలిక్కిపడింది. హత్య  జరిగిన నాటి రాత్రి తిరిగి వచ్చిన మురళీధర్ చేతి వ్రేలుకి ఉంగరం లేదు. ఎక్కడ పడిపోయిందో అతనికి గుర్తులేదు. ఆ ఉంగరం హత్య జరిగిన ప్రదేశంలో ఎవ్వరికీ దొరకలేదు.
    ఉమలో ఏదో ఆశ తళుక్కు మనగా, ఆమె కొడుకు చూపించిన వ్యక్తిని పరిశీలనగా చూసింది. అతని కుడి చేయి వ్రేలాడుతూ వుంది. ఆ చేతి చూపుడు వ్రేలు కుంది ఉంగరం.
    అది ప్రత్యెక మైన ఉంగరం. దాని మీద త్రిమూర్తుల బొమ్మ స్పష్టంగా కనపడుతుంది. ఉంగరం సైజు కూడా పెద్దదే. ఆ త్రిమూర్తుల బొమ్మను తీసేస్తే ఉంగరం మీద మురళీధర్ పేరు కూడా వుంటుంది. ఆవ్యక్తి చేతి వ్రేలికి అటువంటి వుంగరమే వుంది.
    రాజుకి ఆ ఉంగరం గురించి బాగా తెలుసు. అతని కదంటే ఎంతో యిష్టం. ఆ కారణంగా యేన్నోసార్లు తండ్రి దగ్గర్నుంచి తీసుకుని, కాసేపు ఆదుకుని మళ్ళీ ఇచ్చేస్తుండేవాడు. కొడుకంటే విపరీతమైన ప్రేమ గల మురళీధర్ అడిగినప్పుడల్లా అభ్యతరం చెప్పకుండా ఉంగరాన్నిస్తుండేవాడు. ఇప్పుడు రాజు దాన్ని దగ్గర కంటా వెళ్ళి చూసొచ్చాడు. అతను పొరపాటు పడలేదు.
    ఉమ నెమ్మదిగా బసవరాజు కి ఆ వ్యక్తిని చూపించి, "అతడెవరో , ఏం చేస్తుంటాడో తెలుసుకోవాలి. బాపిరాజు గారిని చంపిన హంతకుడతనే అయినా ఆశ్చర్యం లేదు" అని చెవిలో చెప్పినట్లు చెప్పింది.
    బసవరాజు చకితుడై "నీకేం మతికానీ పోలేదు కదా" అన్నాడు.
    "నాకు పోయింది మతి కాదు, మంచితానం మీద నమ్మకం. మళ్ళీ ఇప్పుడిప్పుడే నాలో ఆశలు చిగురిస్తున్నాయి. సరిగ్గా హత్య జరిగిన నాటి రాత్రి మాయమైన ఉంగరం , అయన ఉంగరం, ఆ వ్యక్తీ వ్రేలికి వుంది. ఏమో, అదృష్టం బాగుంటే, ఎలాంటి రహస్యం బయటపడుతోందో."
    బసవరాజు ఉలిక్కిపడి, "బస్సు వస్తోంది, మీరు ఇంటికి వెళ్ళండి. నేను ఇతని ఆచూకీ తెలుసుకుని వస్తాను" అన్నాడు.
    ఒకగంట తర్వాత బసవరాజు ఇంటికి వచ్చాడు.
    'అతని చిరునామా సంపాదించాను" అన్నాడు.
    "భానోజీరావు గార్కి, వెంటనే కబురు చెప్పాలి" అంది ఉమ.
    "వాడికి అనుమానం రాకుండా వాడ్నానుసరించి వెళ్ళాను. వాడి మకాం తెలియగానే, వెంటనే భానుజీరావు గారికి అన్నీ వివరంగా ఫోన్ చేసి చెప్పేశాను. అయన తను వ్యవహారం చేస్తానన్నారు" అన్నాడు బసవరాజు.
    మర్నాడుదయం భానోజీరావు స్వయంగా ఉమ ఇంటికి వచ్చాడు. అతను వస్తూనే ఉత్సాహంగా రాజుని గట్టిగా కౌగలించుకుని ఎత్తేసుకున్నాడు.
    "ఎమిటన్నయ్యా యిది !" అంది ఉమ అర్ధం కాక.
    "ఎంత అదృష్టవంతుడమ్మా వీడు, తండ్రికి జైలు శిక్ష తప్పించాడు?" అన్నాడు.
    ఉమకు సంతోషంతో మాట రాలేదు. తమాయించుకుని , "వివరంగా చేప్పండన్నయ్యా?" అంది.
    "ఏముంది? అసలు హంతకుడు అవలీలగా దొరికేశాడు. నిన్న మీ అన్నయ్యగారి టెలిఫోన్ విన్నాక నాకు నమ్మకం లేకపోయినా ఆ ఇంటికి మఫ్టీలో వున్న కానిస్టేబుల్ని కాపలా వుంచి, ఇంట్లోని వాడు బయటకు పోగానే ఇల్ల సోదా చేయమన్నాను. అనుమానించదగ్గ వస్తువులు దొరికితే వెంటనే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయమన్నాను. వాడి గదిలో చాలా దొంగ వస్తువులు దొరికాయి. అదలా గుంచితే ఆ వెధవకి డైరీ రాసే అలవాటుంది. అందులోని వివరాలు ఇటీవల నగరంలో జరిగిన ఎన్నో ఛిల్లర దొంగతనాల వివరాలు తెలియబర్చాడమే కాక, బాపిరాజు హత్య జరిగిన నాటి రాత్రి వాడా ఇంట్లో ప్రవేశించి అనుకోకుండా బాపిరాజు గారి తల మీద మ్రోది పారిపోయిన వివరం కూడా తెలిసింది. వాడి వ్రేలిముద్రలు తీసుకుని చూస్తె, నగరంలో ఇదివరకు జరిగిన కొన్ని దొంగతనాల సందర్భంలో దొరికిన వ్రేలిముద్రలతో సరిపోయాయి. మేము వెతుకుతున్న దొంగ నీ మూలంగా  నీ రాజు మూలంగా దొరికిపోయాడు. కాకతాళీయంగా మీ రాజు ఆ ఉంగరాన్ని చూసి వుండకపోతే వీడిప్పటిలో మా చేతికి చిక్కి ఉండేవాడు కాదు..."
    "ఇంతకీ వాడి వ్రేలికా ఉంగర మెలా వచ్చింది? హత్యా ప్రదేశంలో దొరికిన ఉంగరాన్నంత ధైర్యంగా పెట్టుకుని తిరగ గలుగుతున్నాడు వాడు?" అన్నాడు బసవరాజు.
    " అదే తమాషా" అన్నాడు భానోజీరావు. "బాపిరాజుగా ఇంటి నుంచి బయటపడ్డాక వాన కారణంగా తాత్కాలికంగా కాసేపు ఒకరి యింట్లో బస చేశాడు మురళి. అక్కడ తువ్వాలుతో ఒళ్ళు కూడా తుడుచుకున్నాడు. ఆ ఇంట్లో మురళి ఉంగరం పడిపోయింది. తర్వాతెప్పుడో ఆ విషయాన్ని గమనించిన ఆయింట్లో ని వాళ్ళే ఉద్దేశ్యంతో నైతేనేం ఆ ఉంగరాన్ని దాచి ఉంచారు. బాపిరాజును హత్య చేసిన చిల్లర దొంగ ఒకరోజు రాత్రి ఆ ఇంట్లో జొరబడి దొంగతనం చేశాడు. వాడీ కక్కడా ఉంగరం దొరికింది..."
    ఉమా ఆనందతరంగాల్లో తేలిపోవడం, "ఇంతకీ అయన కచ్చోచ్చిన ఉంగర మది. అదే ఇప్పుడు " అంటూంటే "అయినా నేనెప్పుడూ ప్రతీ విషయం లోనూ కాస్త లేటనీ, ట్యూబు లైటుననీ మురళీ, వేళాకోళం పట్టిస్తుండేవాడు. ఇప్పుడూ అంతే అయింది" అన్నాడు భానోజీరావు.
    ఆతర్వాత కొన్ని రోజులకు మురళీధర్ జైలు నుండి విడుదలై తిరిగి వచ్చిన సందర్భంగా మిత్రులు ముగ్గురూ భానోజీరావింట్లో పార్టీ చేసుకున్నారు. ఎటొచ్చీ ఆ పార్టీలో ఈ పర్యాయం అసాధ్యపు టబద్దాల ప్రస్తావన రానేలేదు.

                      -----అయిపొయింది.------    


 Previous Page

WRITERS
PUBLICATIONS