"చెప్పానండీ. వినిపించుకోవటంలేదు."
"సీరియస్ కేసా?" అంది హరిణి బిక్కమొహం పెట్టి.
"తెలీదండీ."
"సీరియస్ కేసయితే చూడనని చెప్పకపోయావా?"
"అదే తెలీటల్లేదని చెప్పాను కదండీ."
హరిణి విధిలేక క్రిందకు దిగి తన కన్ సల్టేషన్ రూంలోకి సిస్టర్ వెంట వెళ్ళింది.
గదిలో ఓ ముప్పై ఏళ్ల స్త్రీ కూర్చుని వుంది. పెద్దబొట్టు_సాదాచీరె కట్టుకుని మామూలుగా వున్నా మొహం కళగా వుంది.
హరిణి తన సీటులో కూర్చుంటూ ప్రశ్నార్థకంగా చూసింది.
"మీమీద ఎంతో ఆశపెట్టుకుని వచ్చాను" అన్నదా స్త్రీ.
"ఏమిటి?"
"ఆపని మీవల్ల అవుతుందని"
"అదే ఏమిటి?"
"కడుపు"
"వాట్!" హరిణికి కుర్చీలోంచి క్రిందపడినంత పనయింది.
"అవునండీ. పెళ్ళయి పదేళ్ళయింది. ఒక్క బిడ్డ....నా ఆశ నెరవేరటంలేదు. ఎంతమందో డాక్టర్లని చూశాను. ఒక్కరు కూడా నాకు కడుపు తెప్పించలేకపోయారు. ఎందుకో మీ ఆసుపత్రిమీదనుంచి వెళుతూ వుండగానే మీరాపని చెయ్యగలరనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తోంటే ఆ నమ్మకమింకా బలపడింది. ఆహా, ఏమికళా! ఏమి తేజస్సూ, ఏమి అందం! మీవల్ల తప్పకుండా ఆ పని అవుతుంది."
చీటికీ మాటికీ "మీవల్ల ఆ పని...." అంటుంటే వినలేక పోతోంది.
"చూడండీ. మీరెవరో తెలీక వచ్చివుంటారు. నేను కొత్తగా ప్రాక్టీస్ పెట్టాను. బొత్తిగా ఎక్స్ పీరియన్స్ లేదు."
"ఆ, యీ ఎక్స్ పీరియన్స్ వున్నవాళ్ళను చాలామందిని చూశాను. వాళ్ళెవరివల్లా కాలేకపోయింది. ఈపని మీవల్లే...."
"చూడండీ! నాకు డబ్బు దాహం ఎక్కువ. ఫీజులు చాలా భారీగా తీసుకుంటూ వుంటాను"
"ఓష్! యింతేకదా ఎంతకావాలో చెప్పండి" అంటూ జాకెట్ లోంచి పెద్దనోట్లకట్ట బయటకు తీసింది. "ఎంత కావాలో చెప్పండి. వందలా? వేలా?" అంటూ కట్టలోని నోట్లని మెజీషియన్ పేకముక్కల్ని కదిలించినట్లు కదిలించింది.
'ఈ స్త్రీ సామాన్యురాలు కాదను'కుంది హరిణి. "అదికాదండీ యిలాంటి విషయాల్లో భార్యాభర్తలిద్దర్నీ పరీక్ష చెయ్యాలి" అనబోయింది.
"దానికేముంది, స్పెర్మ్ రికార్డంతా నాదగ్గరుంది. అది చాలకపోతే మీ హస్తవాసిమీద నాకు నమ్మకముంది. కాబట్టి మీ చేతుల్తో మీరే"
"వ్వాట్?"
"అదేనండీ! మీరు మళ్ళీ అన్ని టెస్టులూ చేయించండి"
ఈ మనిషి నుండి తప్పించుకోవట మసాధ్యమని గ్రహించి "సరే, టేబులెక్కు" అంది ఎగ్జామిన్ చేద్దామని.
"హమ్మయ్య" అని ఆమె హరిణి ముందున్న గాద్రేజ్ టేబుల్ మీద ఎక్కబోతూంది.
హరిణి కోపమాపుకోలేక "అక్కడకాదు. నా వొళ్ళో కూచో" అంది విసురుగా.
ఆమె ఒక్కక్షణం సంకోచించి "ఏంచేస్తాను? మీరు డాక్టరుగారు! మీ మాటను కాదనకూడదు" అంటూ ధబాల్న ముందుకొచ్చి నిజంగానే వొళ్ళో కూచోబోతోంది.
హరిణికి మతిపోయినట్లయింది. "నీతో ఏంమాట్లాడినా ప్రమాదంగా వుందే. ఇక్కడ కాదు, అక్కడ" అంటూ ఎగ్జామినేషన్ టేబుల్ చూపించింది.
కాసేపటికి ఎగ్జామిన్ చెయ్యటం పూర్తయింది. హరిణి తిరిగివచ్చి తన సీట్లో కూచుంది. "నీకు డివిండ్ ని చేస్తాను. రేపు ప్రొద్దుట పెందరాళే వచ్చెయి. ఇదిగో యీ మెడిసిన్స్ కూడా వాడుతూ వుండు. అని ప్రిస్కిప్షన్ రాసి ఆమెకందించింది. ఆమె 'ఉండండి' అన్నట్టు సౌంజ్ఞచేసి జాకెట్ లోంచి నోట్లకట్టతీసి లెక్కబెడుతోంది.
హరిణి ప్రిస్క్రిప్షన్ అంతసేపు పట్టుకోవటం విసుగనిపించి ఆ కాగితాన్ని టేబుల్ మీదపెట్టి ఫ్యాన్ గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టింది. ఆ పేపర్ వెయిట్ పెద్ద కాప్ స్యూల్ రూపంలో డిజైన్ చెయ్యబడి వుంది.
"ఇదిగో యిందండీ" అని కొన్ని నోట్లు హరిణికి అందించి తర్వాత ప్రిస్క్రిప్షన్ చీటీ, దాంతోబాటు పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుంది.
"ఇదెలా వాడాలీ! ఇదో" అంటూ ఒక్కొక్క పేరూ అడిగి తెలుసుకుంది. తర్వాత పేపర్ వెయిట్ ను చేతిలో అటూ ఇటూ త్రిప్పుతూ "యిదెలా వాడాలీ?" అంది.
"మైగాడ్!" అని హరిణి తలబాదుకుంది.
* * *
ఆ స్త్రీ మూడునెల్లయినా తిరక్కముందే ఒక బుట్టనిండా పళ్ళు, చేతిలో ఖరీదైన పట్టుచీరె వున్న ప్యాకెట్ తీసుకుని హరిణి దగ్గరకు వచ్చింది. ఆమె మొహం సంతోషంతో వెలిగిపోతోంది.
"నేను చెప్పలా పెద్ద పెద్ద డాక్టర్లందరూ మీ ముందు బలాదూరని, ఆ పని మీవల్ల తప్పకుండా అవుతుందని...." అంటూ పళ్ళబుట్ట టేబుల్ మీద పెట్టి చీర చేతిలోపెట్టి "నాకిప్పుడు...." అంటూ ముసిముసిగా సిగ్గుపడుతూ చెవిలో రహస్యం చెప్పింది.
ఆ తర్వాత ఆమె డాక్టరుగా హరిణి నైపుణ్యాన్ని గురించి ఆ వాడకట్టులో ఏమి ప్రచారం చేసిందోగాని, ఒకరోజు ఆమె హాస్పటల్లోకి అడుగుపెడుతూ వులిక్కిపడింది.
బయట హాలంతా ఆడ పేషెంట్లతో క్రిక్కిరిసి పోయివుంది.
13
ఆరోజు మధ్యాహ్నం పన్నెండయినా వొంటిగంటయినా హరిణికి పనితెమల్లేదు. చదువుకునే రోజుల్లో తప్పిపోయినందువల్ల ఆమెకు చెమటలు పడుతున్నాయి. మధ్య మధ్య నీరసమొచ్చి గ్లూకోజ్ కలుపుకుని తాగింది.
మహేష్ కు పన్నెండు గంటలకే పనయిపోయింది. తలుపివతలనుంచి హరిణి చాలా బిజీగా వుండటంచూసి సంతోషంతో నవ్వుకుని తిరిగి తన చెయిర్ లోకి వచ్చి కూర్చుని యాంటి సెప్టిక్ జర్నల్ చదువుకోసాగాడు.
హరిణికి ఆరోజు మూడు నాలుగు సీరియస్ కేసులు కూడా వచ్చాయి.
ఒకటి డిస్ ఫన్ క్షనల్ యుటిరైస్ హేమరేజ్, రెండవది ఫుల్ టరమ్ ప్రెగ్నెన్సీనే గాని బ్రిచ్ ప్రెజెంటేషన్. మూడవది కడుపునొప్పి. పెయిన్ ఎబ్డోమిన్ కేసు.
ఆ మూడు కేసులూ హరిణి ఎడ్మిట్ చేసుకోవల్సి వచ్చింది.
పెయిన్ ఎబ్డోమిన్ కేసు చాలాసేపు ఎగ్జామిన్ చేయాల్సివచ్చింది.
ఆ స్త్రీకి ముప్పయి ఏళ్ళు దాటివుంటాయి. కడుపునొప్పితో ఏడెనిమిదేళ్ళుగా బాధ పడుతోంది. స్పెషలిస్టులచేత ఎన్నోసార్లు ఎగ్జామిన్ చేయించుకుంది. ఆమె చేయించుకోని వెస్టిగేషన్ లేదు. ఏవేవో అనుమానాలతో ఆమెకు ఎపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. తగ్గకపోతే హిస్టిరెక్టమీ చేశారు. అయినా బాధ రోజురోజుకూ పెరుగుతోందేగాని ఉపశమనం కలగలేదు.
