మహేష్ కొంచెం ఖాళీగా కనిపించగానే అతని దగ్గరకువెళ్ళి ఎదురుగా కూర్చునేది.
"ఇదేమిటి? అప్పుడే అయిపోయిందా? యిందాక చాలామంది పేషెంట్స్ కనిపించారుగా."
"చూసి పంపించేశాను."
"అప్పుడే అంతమందీ అయిపోయారా?"
"ఎంతసేపు మహేష్! నేను చాలా స్పీడ్ గా పనిచేస్తానని తెలుసుగా."
"అయితే కూచుని మెడికల్ జర్నల్స్ చదువు. నాలెడ్జి ఇంప్రూవ్ అవుతుంది."
"నేను చదవను. నీతో కబుర్లు చెబుతూ కూచుంటాను."
"ఇప్పుడా? కబుర్లు చెప్పటానికి మూడ్ కావద్దూ?"
"నన్ను చూస్తే నీకు మూడ్ రావటం లేదా మహేష్!" అంది అతని కళ్ళల్లోకి చూస్తూ.
అతనూ ఆమె ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళు కవ్విస్తున్నాయి.
"మూడ్ వస్తోందనుకో. కాని కబుర్లు చెప్పడం కంటే అలా....అలా చూడాలనిపిస్తుంది."
"పోనీ అలా చూస్తూ వుండిపో. చూపులతో కబుర్లు చెప్పుకుందాం."
"బాగానే వుంటుందనుకో. కాని మధ్యలో ఎవరయినా వచ్చి డిస్టర్బ్ చేస్తోంటే విసుగ్గా వుంటుంది."
"అయితే ఒకపని చెయ్యి. నన్ను ఎగ్జామిన్ చెయ్యి."
"నిన్నా? ఎందుకు? బాగానే వున్నావుగా."
"నీకలా కన్పిస్తున్నాను గాని_బాగాలేను."
"ఏమిటి నీ సుస్తీ?"
"అబ్బో! చెప్పాలంటే చాలావుంది."
"ఓపిగ్గా వింటానులే చెప్పు."
"రెండు పూటలా బాగానే తింటానుగాని _ ఏమిటోనండీ నీరసంగా వుంటుంది."
"యింకా,"
"గుండె దడగా కూడా వుంటుంది."
"ఈ రోజుల్లో ఆడవాళ్ళకున్న లక్షణాలే అవన్నీ_యింకా!"
"మనోవ్యధగా వుంటుంది."
"మనోవ్యధా? దేనికి?"
"దేనికోనండి మరి కారణం తెలీదు. అన్నీ వున్నా యింకా ఏదో కావాలని, యింకా ఏదో పొందాలని, అనుభవిస్తోన్న ఆనందం చాలదని, యింకా సంతోషం కరువయిందనీ...."
"అబ్బో! చాలా లక్షణాలున్నాయి. డీప్ గా ఎగ్జామిన్ చెయ్యాలి. టేబులెక్కు."
"అంతేనంటారా?"
"అంతేమరి."
"ఆమె విధి లేనట్లుగా టేబులెక్కికూచుంది.
"పడుకో. సిస్టర్నీ పిలుస్తాను."
"పడుకుంటానుగాని మధ్యలో ఆవిడెందుకండీ?"
"నువ్వు ఆడ పేషెంటువికదా. అందుకని...."
"అది బయటివాళ్ళ విషయం. సిస్టర్ని పిలవకండి" అని టేబుల్ మీద బుద్ధిగా పడుకుంది.
"అవును. ఒక విషయమడగటం మరిచిపోయాను."
"అడగండి."
"కొంచెం వికారంగా వుంటుందా?"
"లేదండీ."
"కడుపులో త్రిప్పటం, అన్నం సహించకపోవటం, పులుపు తినాలనిపించడం."
"సినిమాల్లో లాగానే అండీ? హీరోయిన్ పెళ్ళయ్యాక మూడోనెలకి మామిడికాయో, చింతకాయో ఆ సీజన్ ప్రకారం తింటూ, మధ్య మధ్య ఓక్ అని వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తుతూ, హీరో గదిలోకి వచ్చి యీ సీనంతా చూసి "వాట్? నిజమా?" అని ఆవిడగార్నెత్తుకుని గిర్రున గాల్లో తిప్పటం, తర్వాత 'అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలా?' అని చెవిలో గుసగుసల్తో కూడిన డైలాగులు...."
"కరెక్టు."
"కాని అలాంటిదేమీ లేదండీ."
"సరే. మాట్లాడకు. ఎగ్జామిన్ చేస్తాను" అంటూ స్టెతస్కోప్ గుండెలమీద పెట్టాడు.
"ఎలా వుందండీ?"
"ఏమిటీ?"
"గుండె."
"ఉండు సరిగ్గా చూడనియ్యి."
"చూడనియ్యి కాదు విననియ్యి అనాలండీ."
"సరే విననియ్యి."
స్టెతస్కోపు గుండెల కానించి వింటున్నాడు.
లబ్ డబ్ _ లబ్ డబ్ _ లబ్ డబ్ _ లబ్ డబ్.
ఆనాటి సంఘటన గుర్తొచ్చింది. అయితే ఆ సన్నివేశంలోని టెన్షన్ వేరు. అప్పుడూ అలాగే యీ గుండె చప్పుళ్ళు, ఆ స్పర్శ....
"అదేమిటండీ అలా వున్నారు."
"ఎలా?"
"మీ వొళ్ళు వేడిగా తగుల్తుందండీ."
"లేదే."
"మీ నుదురు చెమటలు పడుతున్నాయి."
"లేదే."
"మీ కళ్ళలో చూపు మారుతోంది."
"ఎలా వుంది?"
"రంగులు మారుతున్నాయి. కొన్ని నవలల్లో కథానాయికలకు జరిగినట్లు."
అతను ఉలికిపడి గుండెమీద నుంచి స్టెతస్కోప్ తీసేశాడు.
"అదేమిటండీ తీసేశారు? ఇంకాసేపు ఎగ్జామిన్ చెయ్యండి."
"ఇక్కడ చూడటమైపోయింది ఇహ...." అంటూ కదలబోతున్నాడు.
"ఎక్కడికండీ?"
"స్పెక్యులమ్ తీసుకొస్తాను. పి.వి. చెయ్యటానికి."
"వాట్" అంటూ అదిరిపడి లేచి కూర్చుని చెయ్యిపట్టుకుని ఆపింది.
అదే సమయానికి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని సిస్టర్ లోపలికి వచ్చింది. అక్కడ కనబడిన దృశ్యం చూసి గతుక్కుమని మెదలకుండా నిలబడిపోయింది. మహేష్ కూడా గిల్టీగా ఫీలవుతూ ఆమె చేతినుండి చెయ్యి విడిపించుకున్నాడు. హరిణి ప్రశ్నార్థకంగా చూసింది.
"కేసొచ్చిందండీ."
"ఇప్పుడా? ఈ సమయంలోనా? డాక్టరుగారు యింటికి వెళ్ళిపోబోతున్నారని చెప్పకపోయావా?"
