జనార్దనం ముందుగా హోటల్ కు వెళ్ళి టిఫిన్ చేశాడు. తర్వాత ధైర్యం చేసి ఇంటికి వెళ్ళాడు.
ఇంటి దగ్గర ఏమీ హడావుడిగా లేదు. చుట్టుపక్కల వాళ్ళు తనను చూసి ఏ విధమైన విచిత్ర భావాలు ప్రకటించ లేదు. అంతా మాములుగానే వుంది వాతావరణం.
ఇంటి తలుపులు తాళం వేసి లేవు. అంటే ఇంట్లో ఎవరో వున్నారన్న మాట. బహుశా హంతకుడుండి వుంటాడు. జనార్దనం తలుపులు తట్టాడు.
తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తీసిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాడు జనార్దనం.
అతనెవరో కాదు . ఒకరాత్రి తన గదిలో హత్య చేయబడి వుండగా చూసేడతను. అతను అనంతం!
జనార్దనం భయపడ్డాడు. కొంపలు దీసి ఈ యింట్లో దెయ్యాలు చేరలేదు కదా! "రండీ జనార్దనం గారూ ,లోపలకు రండి !" అన్నాడు అనంతం. ఇంట్లో ఇంకా చాలా మంది మసలుతున్నట్లు తోస్తోంది. జనార్దనం సందేహిస్తూనే లోపల అడుగు పెట్టాడు.
"ఎవరూ " అందొక స్త్రీ కంఠం. జనార్దనం అ కంఠన్ని గుర్తు పట్టాడు. ఆ స్త్రీ గదిలోకి ప్రవేశించింది. అమె లలితారాణి.
"జనార్దనం వచ్చేశాడు!' లలితారాణి గట్టిగా అరిచింది. అప్పుడా గదిలోకి చాలా మంది వచ్చేశారు. కంగారుగా. అనుమానంగా అందర్నీ చూస్తున్నాడు జనార్దనం. అతని కేమిటో భయంగా వుంది. వాళ్ళలో అతను హంతకుడిని, శంకర్రావు గారినీ, సీతనూ గుర్తుపట్టాడు.
సీతను చూస్తూనే జనార్దనం తడబడ్డాడు. అతనికి నోటమాటరాలేదు.
సీత మాట్లాడింది "మిమ్మల్ని నేను ప్రేమించాను. అందుకని అయిన వాళ్ళందర్నీ వదులుకుని వచ్చావు. కన్న తండ్రిని తృణీకరించాను. కానీ కన్నతండ్రీ ప్రేమకీ ప్రపంచంలో సాటి అయినదేదీ లేదని చాలా ఆలశ్యంగా గ్రహించాను."
సీత ఆగింది. శంకర్రావు ముందుకు వచ్చాడు. "ఈ ప్రపంచంలో కవులూ, రచయితలూ ధనవంతులు కాకపోవడం ధనవంతుల దురదృష్టం. డబ్బు సంపాదించడం కోసం రచనలు చేసే వీళ్ళు డబ్బు సమస్త పాపాలకు మూలహేతువనీ డబ్బున్న వాళ్ళ గుండెలు రాతీ బండలనీ , అనురాగం, ఆప్యాయత అన్న పదాల కర్ధం పేదవారిళ్ళలోనే దొరుకుతుందని రాసి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. చిన్నప్పట్నించి సాహిత్యమంటే అపారమైన ఆశక్తి గల నాకూతురు సీతలో ఇదే అభిప్రాయాలు బలపడ్డాయి.
వాటినే నా ముందు వర్ణించి నామాట కాదని నాతొ తెగ తెంపులు చేసుకుని నీ ఇల్లాలుగా వుందామని వచ్చింది. కానీ నువ్వందుకొచ్చిన ప్రతిఫలమేమిటి?"
జనార్దనం ఆశ్చర్యంగా మామగారి వంక చూస్తున్నాడు. అయన చెప్పే దేమిటో అతనికి పూర్తిగా అర్ధం కావడం లేదు కానీ తన పన్నాగం వాళ్ళందరికీ తెలిసిపోయిందని మాత్రం తెలిసింది.
"చూడు నాయనా ఒక ఆడదాని అందం , పది లక్షల రూపాయలు నిన్ను హత్యకు పురిగొల్పాయి. ఈ పొరపాటు డబ్బుదని అంతా అంటారు. డబ్బుకు ప్రాణం లేదు. డబ్బులో జీవం లేదు. డబ్బు తనంతట తానేమీ చేయలేదు. మనిషి బలహేనతే అన్ని పాపాలకూ మూలకారణం. పేదింటివారెవ్వరూ బలహీనతలకు లోనుకాడని ఇల్లు వదిలే ముందు నా కూతురు నన్ను సవాలు చేసింది. డబ్బుకు లొంగేది పేదవాడే అందువల్లనే ధనవంతుల ఆటలు సాగుతున్నాయని నేనూ సవాల్ చేసాను" శంకరరావు గారాగి "నిన్ను ప్రలోభ పెట్టడానికి , నిన్ను తప్పు దారిలో మళ్ళించడానికి నేను లలితారాణిని , హంతకుడిని నియోగించాను. డబ్బునుపయోగించాను. నేననుకున్న ప్రకారమే నువ్వు దారి తప్పావు. ఇదంతా ఎందుకు చేశాననుకుంటున్నావ్! సవాలులో నేగ్గడానికా.... కాదు, సీతకి జీవితమంటే ఏమిటో తెలియజేయడానికి , కలల్లో తేలిపోకుండా వాస్తవ జీవితాన్నర్ధం చేసుకునేలా చేయడానికి. ఆమె జీవితానికి శాశ్వత రక్షణ కల్పించడానికి!" అన్నాడు.
జనార్దనం అవాకై పోయాడు. అతనికంతా అర్ధమై పోతోంది. తను పెద్ద వలలో చిక్కుకున్నాడు తనకు తెలియకుండానే!"
"నువ్వు సీతను హత్య చేయామని హంతకుడితో చెప్పిన మాటలనతను రికార్డు చేశాడు, ఎప్పుడైనా సీత ప్రాణాలకు హాని సంభవించిందా ఆ సాక్ష్యాధారం చాలు నిన్ను దోషిని చేయడానికి. అందుకని ఆమె జీవితం పట్ల ఇప్పుడు నీ బాధ్యత పెరిగింది. ఆమెను నువ్విప్పుడు వెయ్యి కళ్ళతో కాపాడవలసిన అవసరం ఏర్పడింది."
జనార్దనం రెండు చేతులతో ముఖం కప్పుకుని నేల మీద కూలబడి ఏడవసాగాడు. సీత అతన్ని సమీపించింది. అతని ముఖం మీద చేతులు వేసి అతని కన్నీరు తుడిచింది.
"మీమీద నాకసహ్యం లేదు. నేను ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సవాల్ మా నాన్నగారి చేతిలో ఓడిపోవడం నాకు బాధగా వున్నా మానవుడి బలహీనతల నర్దం చేసుకునే తెలివి వచ్చింది. మనకింకా నూరేళ్ళ జీవితముంది. పాత సంగతులు మరిచి పోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ క్షణం నుంచీ నిజమైన ప్రేమికులుగా మారుదాం.'
హంతకుడు ముందుకు వచ్చి 'అవును ఆ అవసరం చాలా వుంది. మళ్ళీ ఎప్పుడైనా ఈ ఊరొస్తే మీ దంపతులే మళ్ళీ నా కాతీధ్యమివ్వాలి" అన్నాడు.
జనార్దనం కళ్ళు తుడుచుకున్నాడు. అతని కళ్ళ ముందు సీత కనపడింది. తలెత్తి పైకి చూశాడు. అప్పుడే వెనుతిరిగిన లలితారాణి కనపడింది.
చుట్టూ చూస్తున్నాడతను. కొద్ది రోజులుగా తన జీవితరంగంలో ప్రవేశించిన ఒకో పాత్రే నిష్క్రమిస్తోంది. మరో అయిదు నిమిషాల్లో ఆ యిల్లు కాళీ అయిపొయింది.
గదిలో సీత, జనార్దనం మిగిలారు!
"కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ క్షణం నుంచి నిజమైన ప్రేమికులుగా మారుదాం" అన్న సీత మాటలు జనార్దనం చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అతను సీత ముఖంలోకి చూశాడు.
పరీక్షలో ఫెయిలైన విద్యార్ధిని చూస్తె కలిగే జాలి తనను చూస్తున్న ఆమె కళ్ళలో జనార్ధనానికి కనిపించింది. జాలి లోంచే ప్రేమ పుట్టుకోస్తుందన్న ఒక రచయిత మాటలతనికి గుర్తు కొచ్చాయి.
సీతను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు జనార్దనం. ఆ బంధం ఇక ఎన్నటికీ విడిపోనీ బంధం.
-----: అయిపొయింది :----
