జనార్ధనానికి అంతవరకూ ఏమీ అభ్యంతరం కాలేదు. కానీ, ఆమె తరువాతీ మాట అతన్ని కంగారు పెట్టాయి.
"నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను."
అతనికి నోట మాట రాలేదు.
"నాకు అందముంది. డబ్బుంది, పలుకుబడుంది. వీటన్నింటితో పాటు సంపూర్ణ స్త్రీత్వముంది" అందామె.
జనార్దనం అవాక్కైపోయాడు.
లలితారాణి తో వివాహం జనర్ధనానికి చాలా ఆనందం గానే వుంది.
"మాట్లాడకుండా అలాగే చూస్తూ వుండిపోయావు" అంది లలితారాణి."
'చెప్పు- నేనేం సాహాసం చేయాలో?"
"నీ భార్య పేరున పది లక్షలు బ్యాంకులో వుందని విన్నాను, నిజమేనా?"
"ఎలా తెలిసింది ?"
"చూడు డియర్! నీ ,మామగారు కుబేరుడు. ఎప్పుడో ఒకప్పుడిలాంటి జరక్కపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మనమిద్దరం పెళ్ళి చేసుకోవాలంటే ఎలాగూ నీ భార్య చావాలి! వ్రతం చెడ్డా ఫలం దక్కాలని నీ భార్య చస్తే నీక్కాస్త ఆస్తి కలిసి రావాలి గదా -- అలాగైతే నీకూ చిన్నతనంగా వుండదు. మనమిద్దరం సమఉజ్జీలమవుతాం " అంది లలితారాణి.
'అంటే?" అన్నాడప్రయత్నంగా జనార్దనం.
"ఎవరికీ అనుమానం రాకుండా నీ భార్య చావాలి - అప్పుడీ లలితారాణి నీడవుతుంది. అంతులేని సంపదతో, అనంతమైన సౌందర్యంతో...."
జనార్ధనానికి ఆమె మాటలు వినబడడం లేదు. అతని మెదడు గజిబిజిగా తయారైంది.
లలితారాణి చటుక్కున వచ్చి అతన్ని కౌగలించుకుంది. "ఇంకా ఎన్నాళ్ళూ డియర్! త్వరగా తేల్చేయి. ఆగడం నాకూ కష్టం గానే వుంది."
జనార్ధనానికి ఆ కౌగిలి చాలా హాయిగా వుంది. ఎక్కడ తప్పించుకుంటుందో నన్నట్లు బలంగా ఆమెను అదిమి పట్టుకున్నాడు. "కానీ ఎలా?" అన్నమాట అప్రయత్నంగా అతని నోటి నుంచి వచ్చినపుడు అతని మెదడులో హంతకుడు మేదుల్తున్నాడు.
13
"వారం రోజులుగా ఏదోలా వుంటున్నారు మీరు!" అంది సీత.
"జనార్దనం నీళ్ళు నమిలి "ఏమీ లేదు- కాస్త నీరసంగా వుంటోంది " అన్నాడు. సీతను చూస్తుంటే అతనికి జాలి వేస్తోంది. సీత చూడ్డానికి చాలా సంసార పక్షంగా వుంటుంది. ముఖం మరీ అంత అందమైనది కాదు కానీ, కళగా వుంటుంది. ఆమె అమాయికత్వానికి ఆకర్షించబడి ఆమెతో పరిచయం పెంచుకున్నాడతను. డబ్బున్నవాళ్ళమ్మాయని తెలిసేక అతని పరిచయం ప్రేమలోకి దిగింది.
జనార్దనం చాలా అందంగా వుంటాను. అతనికి ఆకర్షనీయమైన కళ్ళున్నాయి. అతని ముఖం చూస్తుంటే అమాయకుడనిపిస్తుంది. సీత జనార్ధనాన్ని ప్రేమించేసింది అతని సత్ప్రవర్తన ఆ ప్రేమను రోజురోజుకి పెంచింది. చివర కతని కోసం కన్న తండ్రిని కాదనే స్థితికి వచ్చిందామె.
జనార్దనం దుర్మార్గుడు కాదు, కానీ, మానవుడు, అందులోనూ ఆదర్శాల కోసం ప్రాణాలు బలిపెట్ట గల గుండె నిబ్బరం కలవాడు కాడు. రెచ్చగొట్టే వాళ్ళంటే బలహీనతలకు లొంగిపోయే సామాన్య మానవుడు.
సీత తండ్రి వద్ద నుంచి పదిలక్షలు తీసుకున్నది కానీ, ఆ డబ్బు పట్ల ఆమెకు ఆసక్తి లేదు. ఆ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే ఆమె కళ్ళలో అసంతృప్తి స్పష్టంగా కనబడుతుంది. జనార్ధనాని కది నచ్చడం లేదు. ఆ డబ్బును హాయిగా దర్జాగా ఖర్చు చేయాలనుందతనికి. అందుకు సీతే అడ్డుగా వుంది!
సీత అడ్డు తొలిగితే లలితారాణి జనార్దనం స్వంత మవుతుంది. అది మధురాతి మధురమైన జీవనం. మనిషై పుట్టాక అలాంటి బ్రతుకు బ్రతకాలి! అలాంటి బ్రతుకు కోసం ఏమైనా చేయాలి!!
అతనిలో సీతను చంపాలన్న కోరిక బలపడిన కొద్దీ ఏదో మూల దిగులావరించుకుంటోంది. అది సీత కనిపెడుతూనూ వుంది. ఆమె అడిగినప్పుడల్లా ఏదో జవాబూ చెప్పి తప్పించుకుంటూన్నాడు జనార్దనం.
ఆ రాత్రి జనార్దనం హంతకుడిని కలుసుకుని , "నీతో కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి!" అన్నాడు.
"సారీ బావా - నాకీ రోజు తీరుబడి లేదు. విషయమేమిటో చెప్పు" అన్నాడు చిరాగ్గా హంతకుడు.
జనార్దనం తెగించి , "ఒక హత్య విషయం" అన్నాడు.
హంతకుడు కళ్ళేగరేసి , "ఎంతివ్వగలవు?' అన్నాడు.
"చేస్తావా?" అన్నాడు జనార్దనం.
'తప్పకుండా - కానీ , ఒక అరగంట పోయేక రా - అప్పుడన్నీ వివరంగా మాట్లాడుకుందాం . ఈలోగా నాకింకో చిన్నపని వుంది" అన్నాడు హంతకుడు. జనార్దనం లేచి వెళ్ళిపోయాడు.
సీతను పడుకోమని చెప్పి అతను సరిగ్గా అరగంట అనంతరం హంతకుడి గదిలోకి వెళ్ళాడు.
"వివరంగా చెప్పు - ఇన్నాళ్ళు మీ ఇంట్లో చక్కని ఆతిధ్యమిచ్చావు. అందుకు ప్రతిఫలంగా నీకేదైనా సాయం చేయాలని అనుకున్నాను. ఈలోగా నువ్వే అడిగావు. ఎవర్ని చంపాలో చెప్పు. ఫీజు అడక్కుండా పని చేసి పెడతాను ."
జనార్దనం తడబడ్డాడు. "పధకం ఎలా వేస్తావో నాకు తెలియదు. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియకూడదు. ఏమైపోయిందో ఎవరికీ తెలియకూడదు. నా మీదకు ఎవరికి అనుమానం రాకుండా మాయమై పోవాలి."
"ఎవరా మనిషి!" అన్నాడు హంతకుడు కుతూహలంగా.
"నా భార్య సీత!" అన్నాడు జనార్దనం. అతని కంఠం వణికింది.
హంతకుడి ముఖంలో ఏమాత్రం ఆశ్చర్యం కనబడలేదు. "ఓస్ ఇదేనా చాలా సులువైన పని చెప్పావ్. అలాగే చేస్తాను. సీత మాములు ఆడది. భర్తే దైవమనీ నమ్ముకున్నది. ఇలాంటి వాళ్ళను మాయం చేయడం చాలా సులువు. చచ్చేముందు కూడా భర్త ననుమానించరు వాళ్ళు ఇలాంటి వాళ్ళను చంపడం చాలా సులభం. సుమారు వారం రోజుల క్రితం ఇలాంటి కేసు...." అని ఆగి 'అవన్నీ నీకెందుకులే చెప్పడం కానీ.... పెళ్ళాన్నేందుకు చంపాలనుకుంటున్నావ్?" అన్నాడు హంతకుడు.
"లలితారాణి ని పెళ్ళి చేసుకో బోతున్నాను నేను...." అన్నాడు జనార్దనం.
"వండ్రఫుల్ చాలా మంచిది, మీ పెళ్ళయ్యాక ఎప్పుడైనా ఇదే విధంగా మీ ఇంట్లో మకాం పెట్టి నా పనులు చూస్కోవచ్చు. ఎటొచ్చీ విశేషమేమిటంటే నా అనుభవానికి సంబంధించినంతవరకూ నేను మకాం పెట్టిన ప్రతి ఇంట్లోని మగాడూ తన భార్యను చంపించేశాడు" అన్నాడు హంతకుడు నవ్వుతూ.
జనార్దనం మళ్ళీ తడబడ్డాడు. 'సరేలే కార్యం ఎలా సాధించాలో చెప్పు" అన్నాడు.
'చాలా సింపుల్ !" అన్నాడు హంతకుడు . "పని మీద బయల్దేరి పొరుగూరు వెళ్ళు నువ్వు. వారం రోజుల అనంతరం తిరిగి రా, ఎవ్వరూ అనుమానించలేని పరిస్తితుల్లో నీ భార్య మాయమవుతుంది. ఇంక మరెన్నడూ నీకంటబడదు."
ఆ మాటలు బాగా గుర్తు పెట్టుకున్నాడు జనార్దనం. అందుకే అతను రెండ్రోజుల అనంతరం పని వంక పెట్టి పొరుగూరు వెళ్ళుతున్నానని చెప్పేటప్పుడు భార్య ను తనివి తీరా చూశాడు. తప్పు చేస్తున్నావన్న భావన అతన్ని కాల్చింది.
అతను వెళ్ళేటప్పుడు హంతకుడు "నువ్వూరికెళ్ళి పోతున్నావు. ఈ వారం రోజుల్లోనూ ఎప్పుడైనా ట్రంకు మోసి రిక్షాలో పెట్టడానికి ఎవరి సాయం అడగను!" అన్నాడు.
ట్రంకు లో తన భార్య సీతను తలచుకుంటే ఒళ్ళు జలదరించింది జనార్ధనానికి.
14
రైల్వే స్టేషన్లో దిగిన జనార్దనం ఇంటికి వెళ్ళడానికి చాలా భయంగా వుంది. ఏమీ ఎరగనట్లుగా ఇంటికి ఓ టెలిగ్రాము కూడా ఇచ్చాడు తను వస్తున్నట్లు.
కానీ ఇంటి దగ్గర భార్య తన కోసం ఎదురు చూస్తూ వుండదు. ఆమె ఈపాటికి మరోలోకం చేరుకొని వుంటుంది. తను పొరుగూరు వెళ్ళిన సమయానికి ఆమెను హంతకుడు "పొరుగూరు" పంపించేసి వుండాలి ! తను ఈ వారం రోజులు పటిష్టమైన ఎలిబీ సంపాదించుకొని వున్నాడు.
