కరుణించని అరుణ!
వసుంధర
పెద్దలు సంపాదించిన ఆస్తి వుంది కాని పెద్దలేవ్వరూ లేరు నాకు. పెద్దరికం చేయాలనుకున్న బంధువుల్నిమేజరు కాగానే తరిమేసాను.
ఒంటరి జీవితమే చాలా బాగుంది నాకు. బాధ్యతలు లేవు, సమస్యలు లేవు , ఆంక్షలు లేవు.
పియ్యూసీ దాకా చదివాను కానీ ఇంగ్లీషు బాగా వచ్చు కాన్వెంట్ చదువు కారణంగా నన్ను పెంచిన పెద్దతుల్లోనూ , నా మనస్తత్వం లోనో ఎక్కడో లోపముండి వుండాలి. సంఘంలో నా హోదా కు తగ్గ బుద్దులు లేవు నాకు. అడ్వెంచరస్ లైఫ్ అంటే చాలా యిష్టం. అలా గని మంచు కొండలు ఎక్కలేదు, ఈత పందాల్లో పాల్గొనలేదు.
నేను నడుపుతున్న సాఫీ జీవితానికి విరుద్దంగా బ్రతకాలని పిస్తుంది. అలాంటి కోరిక నాలో యెందుకోచ్చిందో తెలియదు. ఈ విషయాన్ని ఒక పర్యాయం నా స్నేహితుడితో చర్చించాను. అతను నవ్వుతూ "వడ్డించిన విస్తరి లాంటి నీ జీవితంలోని మాధుర్యం తెలుసుకోవడం కోసం నువ్వు పెళ్ళి చేసుకోవాలి" అన్నాడు.
పెళ్ళి చేసుకోవాలన్న కోరిక నాకెప్పుడూ కలుగలేదు. స్నేహితుడలా అనగానే పెళ్ళి గురించి ఊహించుకున్నాను. నాకు తెలిసిన దంపతులెందరో కళ్ళ ముందు మెదిలారు. పెద్ద ఉత్సాహంగా అనిపించలేదు.
పెళ్ళి గురించి నాకాట్టే ఉత్సాహం లేకపోవడానికి కారణం అంతవరకూ సరయిన ఆడపిల్ల నాకళ్ళ బడక పోవడ మేనని నేను అనుకున్నాను. ఆరోజు నుంచీ నాకంట పడే ప్రతీ అమ్మాయినీ పరిశీలనగా చూస్తూ ఇది నా పెళ్ళాం అయితే ఎలా వుంటుందీ అని అలోచించసాగాను. అలా అయిదారు నెలలు గడిచాయి కానీ నా మనసుకు ఉత్సాహం కలిగించే ఆడపిల్ల లెవ్వరూ ఇంకా కనిపించలేదు.
దగ్గర బంధువులు, దూరపు బంధువులు అన్న పేర్లతో అయిదారుగురు నన్ను పెళ్ళి చూపులకు పిలిచారు. చూపులకు వెళ్ళి పిల్లల్ని నఖశిఖ పర్యంతం పరీక్షించి , ప్రశ్నలతో హింసించి ఆ తర్వాత నచ్చలేదని చెప్పాను.
వాళ్ళు నాకు నచ్చని మాట నిజమే కాని ఆ విషయం చెప్పడానికి నేను ఎన్నుకున్న పద్దతి బాగోలేదని నాకే అనిపించింది. అయినా అలాగే చేశాను. అయితే నా ఈ ప్రవర్తన కారణంగా నన్ను పెళ్ళి చూపుల కాహ్వానించే బంధువులు తగ్గిపోయారు.
ఇలా వుండగా ఒకరోజు సినిమా హల్లో నాకు అమ్మాయి కనిపించింది.
అమెఎవ్వరో నాకు తెలియదు. పేరు కూడా నాకు తెలియదు.
సినిమాలో నాకు ముందు వరుసలో కూర్చుంది. చిన్న పువ్వుల పరికిణీ కట్టుకుంది. దానిమీద లేతాకుపచ్చ ఓణీ వేసుకుంది. ఇందుమించు అదేరంగు జాకెట్ వేసుకుంది. చెవులకు బుట్టలోలకులు , ముఖానికి పొడుగాటి యెర్ర బొట్టు. కళ్ళకు కాటుక. ఒక చేతికి గాజులు. ఇంకో చేతికి వాచీ , శాండాక్ జోళ్ళు వేసుకుంది.
ఆమె శరీరం బంగారు ఛాయలో వుంది. నవ్వుతున్నప్పుడు ఆమె పళ్ళు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆమె నవ్వినప్పుడు -- నవ్వు ఆమె నవ్వడం కోసమే పుట్టిందనిపించింది. ఆనవ్వు చూడని వాడి జన్మ వ్యర్ధమని పించింది. చూసిన వాడి జన్మ ధన్య మనిపించింది. ఆమె అలా నవ్వుతూ వుండిపోతే నేను చూస్తూ వుండి పోవాలనిపించింది.
ఇంత అందమయిన అమ్మాయిని నేనింతవరకూ చూడలేదు. దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్య అనిపించడం వల్ల ఆమెను గురించి తప్పుగా ఊహించడానికి కూడా భయపడ్డాను. భార్య అనే పదాన్ని ఆమెకు నా వరంగా లభించడం గురించి ఊహించడానికి సంకోచం కలిగింది.
నేను కవిని కాను. ఆమాట కొస్తే కధల్లో కవిత్వముంటే చదవను, కధ చదువుతూ వర్ణనలు రాగానే ఆ పేజీలు చకచకా తిప్పెస్తాను. అలాంటి నాకు ఆమెనీ చూడగానే ఎన్నో భావనలు స్పురించాయి. ఎన్నో రకాలుగా ఆమెను మనసులో వర్ణించుకున్నాను.
ఎన్నో జన్మలుగా నేను చేస్తున్న తపస్సు కారణంగా ఆమె నా కళ్ళబడి వుంటుంది. ఇంకా ఈమె యెవ్వరో తెలుసుకోవాలి. ఈమెతో పరిచయం కలిగించుకోవాలి. ఆలోచిస్తున్నాను.
కొంతలో కొంత అదృష్టం . ఇంటర్వ లలోఒకమ్మాయి ఎక్కణ్ణించో ఈ అమ్మాయి దగ్గర కొచ్చింది. సూర్యుడి ముందు దివిటీలా వున్నదామే.
'అరుణా!" అని పిలిచింది దివిటీ.
అరుణ ఉలిక్కిపడి "నువ్వంటే విజయా!' అన్నది.
దివిటీ పేరు విజయ అన్నమాట. విజయకు మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను. ఆమె కారణంగానే ఆమె పేరు తెలుసుకోగలిగాను.
సినిమా అయిపోయాక అరుణను అనుసరించాను. కొంతదూరం అనుసరించాక ధైర్యం చేయాలనిపించింది. 'అరుణా!" అని పిలిచాను.
ఆమె వులిక్కిపడి వెనక్కు తిరిగింది. ఆమె దృష్టికి నేనకర్శించలేదు. వెనకాల వున్న చాలామంది జనంలో పరిచిత ముఖం కోసం వెతుకుతోందామే.
నేను మరో రెండడుగులు ముందుకు వేసి "అరుణా" నువ్వేనా?" అన్నాను.
అరుణ ఆశ్చర్యంగా నావంక చూసి "ఎవర్నువ్వు?" అంది.
ఏమనాలో తెలియక "నేను, అరుణా నన్నింకా గుర్తు పట్టలేదా?" అన్నాను.
అరుణ రెప్పలు టపటప కొట్టుకున్నాయి. కళ్ళలోని ఆశ్చర్యం క్రమంగా ఆనందంగా మారడం గమనించాను. ఆ అమాయకమైన ముఖానికి ఏ భావమైనా అందంగానే వుంటోంది. ఆమె నెమ్మదిగా పెదవులు కదిపి "బావా!' అంది.
ఉలిక్కిపడ్డాను. ఏమనాలో తెలియలేదు. ఆమె నన్ను బావా అని ఎందుకు పిలిచింది? నేను వేళాకోళ మాడుతున్నానని గ్రహించేసిందా లేక ఆమె బావకూ నాకూ దగ్గర పోలికలున్నాయా? రెండూ అసాధ్యమేనని నాకో తోచినప్పటికీ అరుణ నాతో బావ అని వరస కలపడం నాకు చాలా నచ్చింది.
ఏమయితే అయిందని 'అమ్మయ్య గుర్తు పట్టావన్న మాట. గుర్తు పట్ట వేమోనని చాలా భయపడ్డాను....' అన్నాను.
"నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను బావా. పద ఇంటికి పోదాం. నిన్ను చూసి అమ్మా, నాన్న ఎంతో సంతోషిస్తారు...." అంది అరుణ.
నాకు మతి పోయినట్లయింది. కధ ఇలా మారిందేమిటి?
"పద బావా!" అంది అరుణ.
"ఇప్పుడు రాలేను అరుణా!" అన్నాను ఏదో వుపాయమాలోచిస్తూ.
'అలాగంటే ఎలా బావా? అమ్మా, నాన్నా నిన్ను చూసి ఎంతో సంతోషిస్తారు? అసలు నువ్వీ వూరెప్పుడోచ్చావు?" అంది అరుణ.
తాత్కాలికంగా చిన్న వుపాయం దొరికింది. "ఒక పని మీద ఇక్కడకు వచ్చాను. ప్రస్తుతానికి యింటికి రాలేను. నేను వచ్చినట్లు అత్తయ్యకీ, మావయ్యకీ చెప్పకు. అంతా రాహస్యం. నన్ను కలుసుకోవాలనుంటే మాత్రం రేపు సాయంత్రం గ్రీన్ పార్కు కి రా. అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈ విషయం యింట్లో ఎవ్వరికీ చెప్పకూడదు" అన్నాను చనువుగా.
అరుణ కళ్ళు మెరిశాయి. "అప్పుడు మాత్రం నాకు అన్నీ చెప్పేయాలి."
"అలాగే - మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం ఒకే" అన్నాను అరుణతో.
అరుణ నాదగ్గర సెలవు తీసుకుంది. ఆమె ముఖం చూస్తుంటే నాతొ వేళాకోళ మాడుతున్నట్లు అనిపించలేదు. అలాగని నమ్మడానికి లేదు. ఎందుకంటె నా ముఖంలో ఆమెకూ అనుమానాస్పదకరమయిన భావాలు కనబదినట్లు లేదు. ఆమె కూడా నా అంత సామర్ధ్యం కలిగినదై బాగా నటిస్తోందనుకోక పోవడానికి కారణం లేదు.
నాకు నచ్చిన నా మనసు మెచ్చిన అరుణ అనబడే ఆ అందాల రాశిని అంత సులభంగా నేను వదిలి పెట్టదల్చుకోలేదు. వీడ్కోలు పుచ్చుకున్నట్లే పుచ్చుకుని ఆమెను రహస్యంగా అనుసరించి ఆమె ఇల్లు తెలుసుకొని వచ్చాను.
2
గ్రీన్ పార్కు లో అరుణ కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తున్నాను.
ఈ అరుణకు నిజంగా బావ వున్నాడా? ఉంటె నేనే తన బావానని ఎందుకు భ్రమ పడింది? ఆమె నిజంగా భ్రమ పడిందా లేక నాటక మాడుతోందా? ఇప్పుడు తనిక్కడకు వస్తుందా లేక ఏమయినా ఎత్తు వేస్తుందా? రహస్యం గా తనవాళ్ళ నేవరినీ తీసుకురాదు కదా?
నా కళ్ళకు దూరంగా అరుణ కన్పించింది. అంత దూరంలో వున్న అరుణను చూడగలగడం నా కళ్ళ గొప్పతనం కాదు. జిగేల్మనిపించే ఆమె రూపాన్ని ఎవరయినా ఎంత దూరాన్నించయినా కనిపెట్టేయవచ్చు.
అరుణను చూస్తూనే నేను పొదల చాటున దాక్కున్నాను. అరుణ అనుకొన్న ప్రాంతానికి వచ్చి నాకోసం అటూ ఇటూ చూస్తోంది. ఆమెతో ఇంకెవ్వరూ వచ్చిన జాడ లేదు.
"నిజంగానే వచ్చేశావే?"
ఈ పలకరింపు విని అరుణ వులిక్కిపడి అటు తిరిగి - "నువ్వెవరో నాకు తెలియదు" అంది.
"ఇప్పుడు తెలుసుకుందువు గాని, నాపేరు శోభ. ప్రఖ్యాత రచయిత్రిని' అంది అరుణను పలకరించిన అమ్మాయి.
"నమస్కారం" అని అటూ ఇటూ చూడసాగింది అరుణ.
"నా రచన లేమీ చదవలేదా నువ్వు?" అనడిగింది శోభ.
"లేదు, నీ పేరు కూడా వినలేదు" అంది అరుణ.
'అయితే దేవదూత చదవ్వా నువ్వు?" అంది శోభ.
"దేవదూత అంటే?"
"అందులో నా సీరియల్ వస్తోంది. దేవదూత ఒక ప్రముఖ మాసపత్రిక."
"అలాగా-- " అంది అరుణ నిరాసక్తంగా.
"నువ్విక్కడి కేందుకోచ్చావో నాకు తెలుసు. అందుకే నేనూ ఇక్కడికి వచ్చాను. నీకూ నా నవలలోని పాత్రకూ చాలా పోలికలున్నాయి" అని ఆగింది శోభ.
"నిన్న ఒకడు నిన్ను అరుణా అని పెద్ద ఎరుగున్నట్లు పిలిచాడు. వాణ్ని నువ్వు బావా అని పిలిచి దెబ్బ తీనిపించావు. ఏం చేయాలో తోచక వాడు నిన్నిక్కడకు రమ్మన్నాడు. నువ్వు నిజంగానే వచ్చావు. నా కధ లోని పాత్ర అచ్చు ఇలాగే చేసింది" అంది శోభ.
"అతను మోసగాడని అనుకోను. అతను నిజంగానే నా బావ" అంది అరుణ.
శోభ నవ్వి, "నిజంగానే నీ బావ అయితే వెంటనే ఎందుకు గుర్తుపట్టలేదు" అంది.
"నాకు బావ ఎలాగుంటాడో తెలియదు. మేమిద్దరం ఒకరినొకరు చూసుకొని పదిహేనేళ్ళకు పైగా అయింది" అంది అరుణ.
