"నేను నీ సవతి కొడుకుని కదా! అలాగే చెప్పు-'వాడు నన్ను డగా చేశాడు-నన్ను నమ్మించి, తర్వాత నా మాట కాదన్నాడు' అని వాళ్ళకిచెప్పు-నిజంగా నినేవ్వరూ ఏమీ అనలేరు పిన్నీ! ఆ దేవుడు కూడా నిన్నేమీ అనలేదు పిన్నీ!" భాస్కరం ఆవేశంగా అని అటు మొహం తిప్పుకుని అక్కణ్ణించి లేచిపోబోయాడు.
జానికమ్మ శరీరమంతా దహించుకుపోతున్న ట్లుంది.
భాస్కరాన్ని పిచ్చిగా చూసింది. వెళ్తున్న వాణ్ణి అలాగే రెండు క్షణాలు చూసి "ఆగు" అని భయంకరమైన కేక వేసింది.
అప్పటికే భాస్కరానికి ఉద్రేకం చల్లార్చుకుని నిగ్రహం తెచ్చుకోవాలనే తెలివి వచ్చింది. ఆమె కేకతో స్తంభించినట్లు నిలబడిపోయాడు. పులి పిల్ల మళ్ళీ మేక పిల్లగా ఐపోయాడు.
జానికమ్మకు దుఃఖం వెక్కుళ్ళుగా వస్తున్నది.
రాక్షసుడా!.......ఇంత కటిక వాడినని తెలిస్తే ఆనాడే నిన్ను......ముక్కలు ముక్కలు......"

ఆమె అంతలో మాటలు మింగి "నిన్ను కాదు, కాదు కాదు నిన్ను ఎందుకు? నన్నే ముక్కలు ముక్కలు చేసుకోవాలి......నేను నీ నోట ఏమాట రాకూడదని ఇంత కుమిలిపోయానో ఆ మాటే నువ్వు అన్నావు?....." ఆమెకు దుఃఖమూ, ఆవేశమూ, ఉక్రోషమూ పెనవేస్తున్నందున భాస్కరం భయపడ్డాడు. వచ్చి "పిన్నీ పిన్నీ!" అని పట్టుకోబోయాడు.
ఆమెకు భాస్కరం చెయ్యి తగలగానే కోపం విపరీతమైపోయింది.
"ఛీ! నన్ను తాకేవో ఛంపేస్తాను.......ఫో అవతలికి" అన్నది.
భాస్కరం స్పృహతప్పిన ఆమెను మంచం మీదకు తీసుకువెళ్ళే ధైర్యం లేక వణికే చేతులతో వణికే గుండెలతో అక్కడే ఉంచి తలగడ తెచ్చి తలక్రింద పెట్టాడు. వసంతను అత్తవారింటికి వాళ్ళు ఉదయే తీసుకువెళ్ళారు. పిల్లలు లేరు. సుబ్బారావుగారు లేరు. భాస్కరానికి డాక్టర్ ని పిలవడానికి జానికమ్మగారి నొక్కర్నీ వదిలి వెళ్ళడానికి ధైర్యం లేదు.
భాస్కరానికి తెలుసు. తనను తల్లివి కావు అంటే జానికమమగారు శూలాలతో పొడిచినట్లు బాధపడుతుంది. కాని నోరు జారిపోయింది! చన్నీళ్ళు తెచ్చాడు. వేరే గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చాడు. తన ఇష్టదైవం తన కళ్ళముందరే కన్నీరు మున్నీరై పోయి, ఇలా స్తంభించిపోవడంతో భాస్కరం కళ్ళు కట్టలు తెగి పారాయి. దేవుణ్ణి ప్రార్ధించడం భాస్కరం అదివరకెన్నడూ బుద్దిపూర్వకంగా తప్ప మనస్ఫూర్తిగా చెయ్యలేదు. అప్పుడు మాత్రం అతని నెత్తురు దైవాన్ని తల్చుకున్నది. ఆవిడ కళ్ళు తెరిచింది. మళ్ళీ నీరసంగా మూసుకుంది.
జానికమ్మగారిని ఆశగాచూసి "అమ్మ!" అన్నాడు భాస్కరం.
"చచ్చిపోయింది మీ అమ్మ!" ఆమె అటు తిప్పుకుంది మొహం.
"నన్ను క్షమించు పిన్నీ! నన్ను క్షమించు పిన్నీ!" భాస్కరం ఆమె గుండెల్లో తలదూర్చి పసిపిల్లా డిలా వెక్కి వెక్కి ఏడిచాడు.
జానికమ్మగారు భాస్కరం తల నిమిరింది.
"నేను బ్రతికే ఉన్నాను-చచ్చిపోయాక ఏడుద్ధువుగానిలే.....ఏడుపు దాచుకో" మన్నది.
భాస్కరాన్ని ఐదో ఏటినించి అలాగే వ్యక్తిత్వం ఎరగకుండా ఆమె అదుపు చేసింది. పాతికేళ్ళవాడైన ఇప్పుడూ అలాగే చేస్తానంటుంది.
భాస్కరం ఏడవలేదు. "పిన్నీ! మంచినీళ్ళు తాగుతావా?" అన్నాడు.
లేచి కూచుని పయిట సవరించుకుని విడిపోయిన జుట్టు ముడివేసుకుని "సవితి కొడుకు కదూ నువ్వు నాకు?" అన్నదామె. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోపం అహం వాటిలో తాండవ మాడుతున్నది.
"కాను" అన్నాడు మంచినీళ్ళ గ్లాసిచ్చి.
"పిల్లలొస్తారు-మీ నాన్నగా రొస్తారు! లేచి మొహం కడుక్కొనిరా! లేకపోతే నేను సవతి తల్లి ప్రాపకంగా నిన్ను కొట్టాననుకుంటారు!" అన్నదామె.
భాస్కరం విలవిల లాడిపోయాడు. భగవంతుడు పిన్నికి ఇంత శూలల్లాంటి మాటలాడగల శక్తి నిచ్చినందుకు వాణ్ణి తిట్టుకున్నాడు.
"నన్ను చంపనేనా చంపవు పిన్నీ! చంపినా బాగుణ్ణు" అనుకుంటూ మొహం చన్నీళ్ళతో కడుక్కున్నాడు. వచ్చి కూచున్నాడు. ఆమె లేచి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది.
జానికమ్మగారిక రోజంతా ఎవరో ఉండి ఉండి శూలాలతో గుండెల్లో పొడుస్తున్నట్లే ఉంది. భాస్కరం నోటంటేగాదు. తాను సవతి తల్లిని అన్న మాట ఎవరి నోటి వెంట ఆమె వినలేదు. "వాడు నా భాసడు. వాణ్ణి నేను చేశాను" అన్నదే ఆమె విశ్వాసం. 'భాస్కరం కోసరం తను తన సర్వస్వాన్ని ఇస్తున్నాను ఇవ్వగలను' అన్నదే ఆమె నమ్మకం. భాస్కరం తన కోసరం ఏ త్యాగమూ చెయ్య నక్కరలేదు అనుకునే దామె.
"కాని ఇప్పుడో.......ఇప్పుడో వాడు నన్ను పాతికేళ్ళ తర్వాత సవిత్తల్లి వనేస్తున్నాడు" అనే ఆమె బాధ.
"అంతే కాబోలు లోక ధర్మం" అనకుందామె. ఆ మాటే ఆమెకు నచ్చనిది. లోకం తీరు దేవునిచేతా కూడా తనకూ "భాసడి"కీ మధ్య అడ్డు గోడలై నిలవరాదు. అన్నదే ఆమె ఆవేదన. కాని భాస్కరం తిరుగుబాటు చేసేశాడు! ఇక ఏం లాభం?......
కాని ధనమ్మకు ఇచ్చిన మాట?
"మా భాస్కరం సురేఖా ఇద్దరూ ఈడొచ్చిన పిల్లలు. ఆ ఇద్దరికీ ఇష్టముంటే నాదేముంది. వదినా" అన్నది తను.'అంతకన్నాతనేమన్నది. గనుక?' అనుకున్నదామె. కాని ఈ సంజాయిషీ తనకే నచ్చలేదు. "ఇవాళ భాసడు నా మాట కాదన్నాడూ అని ఎలా చెప్పడం?"-అప్రతిష్ట కాదూ?
భాస్కరం అంత ఈడొచ్సిన వాడయ్యాడా? అదే ఆమె ఆవేదన.
ఆ రోజు రాత్రి 'ససేమిరా' నేను వూరికి వెళ్ళనన్నాడు భాస్కరం. జానికమ్మగారు సుబ్బారావుగారికి ఫిర్యాదు చేసింది. "చూడండీ! వాడు అవతల పరీక్షలు పాఠాలూ దగ్గిర కొస్తున్నాయి, ఐపోతున్నాయి అంటూ, ఇవతల నా కేదో జబ్బు చేసిందని అంటూ ప్రయాణం మానేస్తున్నాడూ" అని.
సుబ్బారావుగారు భాస్కరాన్ని ఏమీ అడగలేదు. "అమ్మ వెళ్ళమంటోందోయ్" అన్నాడు.
"రేపు వెళ్తానని చెప్పండి" అన్నాడు భాస్కరం. ఆ రాత్రి భాస్కరం జానికమ్మగారికి దగ్గరికి వెళ్దామనుకున్నాడు. పిల్లలిద్దరి దగ్గరా ఆమె పడుకుంటే బాగున్నుకాని, ఆమె నేరుగా భర్త దగ్గరకివెళ్ళి అక్కడ కూచున్నది.
భాస్కరం అటువెళ్ళలేదు. అతనికి తల్లీ, తండ్రీ ఇద్దరూ కూచున్నప్పుడు వెళ్ళడం అలవాటులేదు. విసుక్కున్నాడు.
"అబ్బా! తలకాయ నొప్పి" అనుకున్నాడు. కాని జానికమ్మగారింక వాడితో మాతాడి ఏ విషయమూ కదప దల్చుకోలేదు. అలాగే భాస్కరం మగతగా కన్ను మూసేదాకా వూరుకున్నది.
పదిన్నర గంటలవేల ఆమె కొడుకు మంచం దగ్గరగావచ్చి చూసి తిరిగి వెళ్ళి అంజనం సీసా తెచ్చి కాస్త తలకి రాసింది. వెళ్ళి పడుకున్నదేగాని, ఆమెకు నిద్ర పట్టనేలేదు.
భాస్కరం సురేఖను ఇష్టం లేదన్న మాట ఇన్నాళ్ళు మాని ఇప్పుడు ఎందుకు బయట పెట్టాడో ఆమెకు అవగాహన కాలేదు.
"ఒకవేళ ఇవాళ ధనమ్మగారి ఇంట, ఎమేనా జగడం జరిగిందా?" అన్న అనుమానం రాగానే ఆమె, ఆ ఒక్క ఆలోచనకే అవకాశమూ, వాతావరణమూ కల్పించుకున్నది.
"బహుశా ధనమ్మగారు గర్వంగానూ స్వాతిశయంతోను ఏమేనా అన్నదేమో వీడికి మనసు విరిగిపోయింది" అనిపించింది.
"ఏది ఏమైనా వాడు రేపు బళ్లోకి వెళ్ళాల్సిందే. పాఠాలు పరిక్షలు ఈ విషయాల ప్రమేయంతో పాడవకూడదు"అని నిర్ణయించుకుని ఆమె బలవంతంగా కనులు మూసుకున్నది.
46
ధనమ్మగారు సురేఖను పిలిచింది. "బాగా చిక్కిపోయావు కాని.......నువ్వు అలా 'రాను' అని నిష్కర్షగా అన్నందుకు ఆ అబ్బాయి భాస్కరం నొచ్చుకోలేదు..కదా? అనే ఆలోచిస్తున్నాను' అన్నది దగ్గర కూచో పెట్టుకుని.
సురేఖ పొడిగా నవ్వింది.
"ఎందుకు నొచ్చుకోడం-ఒకవేళ నొచ్చుకున్నా మనకేం దొడ్డమ్మా!" సురేఖ పొడి నవ్వు ధనమ్మగారికి చాలా కొత్తగా కనిపించింది.
"అదేమిటమ్మాయ్! అలా అంటావు......భాస్కరం కాబోయే ఇంటి అల్లుడు తెలుసునా?"
"ఎవరింటి అల్లుడు దొడ్డమ్మా?" బరువుగా బిడియ పడుతూ అన్నది సురేఖ.
ధనమ్మగారు ఉలిక్కిపడి పరిశీలనగా చూసింది సురేఖను. తన సురేఖేనా? ఇలా మాట్లాడుతున్నది! ఆమె చకితయైంది.
"ఏం జరిగిందే! అమ్మాయ్!?"
"ఏమీ జరుగలేదు.....భాస్కరం గారిని పెళ్ళి చేసుకోమనకు దొడ్డమ్మా! నాకు పెళ్ళేవద్దూ..." సురేఖ అక్కణ్ణించి లేచి చరచరా వెళ్ళిపోయింది!
ధనమ్మగారికి తల కొట్టినట్లైంది. సురేఖ వెనుకనే వెళ్ళి మంచంమీద బోర్లా పడున్న ఆ పిల్లను గద్దించింది.
"అసలేం జరిగిందే?" నని.
సురేఖ తల ఎత్తకుండానే "భాస్కరం అనే అతను మరో అమ్మాయీ...."
మధ్యలోనే ఆందోళనతోను, ఆవేశంతోను ధనమ్మగా రందుకుని "ఆఁ ఆఁ......భాస్కరం మరో అమ్మాయీ?......ఊఁ ఊఁ.....ఏం చేశారేమిటి?...... చెప్పు చెప్పు........ఇంకా మించి పోలేదులే...." అన్నది ఆమె సురేఖ మంచంమీద కూచుని ఆమె వీపుమీద చెయ్యి వేసింది.
సురేఖ భయపడ్డది. దొడ్డమ్మ ఇక విజ్రుంభిస్తుందేమోనని!
"చెప్పమ్మాయ్! ఆ వ్యవహారం ఇప్పుడే తేల్చేయమని నలుగురి పెద్దలతోనూ చెప్పించుతానూ?"
"అది కాదు దొడ్డమ్మా!.........వాళ్ళు ప్రేమించుకున్నారూ....."
"ఛీ! నోర్ముయ్! ప్రేమట! ఎవడిచ్చాడే ఆ హక్కు? ఒహోహో...." ధనమ్మగారావేశంలో అంగ విన్యాసం కూడా ప్రారంభించి "నేను దీని అంతు చూస్తేగాని వదల్ను ఇల్లలకగానే పండుగా అని.....చెల్లి పెళ్ళి ఐంధనగానే సంబరం అనుకుంటున్నాడేమో....."
ఆమె అక్కణ్ణించి విస విసా వెళ్ళిపోయింది. సురేఖ సరిగ్గా అనుకున్నంతా అయింది. దొడ్డమ్మ మూర్ఖత్వం ఆ పిల్లకు బాగా తెలుసును!- కాని అలాగే వూరుకుంది.
"కనీ! ఏం జరుగుతుందో అదే అవనీ.....ఎన్నాళ్ళిలా స్నేహం, త్యాగం అనే రంపపు కోతల మధ్య, హాలాహలంలా "భాస్కరం పద్మావతినే తప్ప తనను పెళ్ళాడలేడూ అన్నమాట దాచడం?"
"అసలెందుకు అలా చెయ్యాలీ?"
ఆ విషయం ఇవతలికి చెబితే కొన్ని జీవితాలు నాశనమవుతాయేమో తెలియదుకాని లోపల లోపల దాచుకోడంవల్ల గుండెలు నమిలేస్తున్నది.
సురేఖకు ఇంకేం జరిగినా ఫర్వాలేదనిపించింది! హృదయం తేలిక పడ్డట్లుంది. ఇక తనను పద్మావతి నిందించనక్కరలేదు. నిందవేయనక్కరలేదు. భాస్కరం దొంగ వేషాలు, కుతంత్రాలు పన్నుతూ "సురేఖగారూ!" అంటూ నక్క వినయం అభినయించ నక్కరలేదు.
సురేఖకు కష్టమనిపించింది. భాస్కరాన్ని తాను పెళ్ళాడటానికి గల అవకాశాలున్నాయని ఎంత వారించుకున్నా మనసు ఎందుకనో ఘోషించసాగింది! "నిగ్రహించుకోవాలి"
సురేఖ కాదనుకున్నది. వాస్తవానికి సురేఖకు ఈ తలంపు ఇంతవరకూ అణుచుకున్నందున దాగిందే తప్ప ఇదివరకూ కలగక పోలేదు. కాని అదేనా? సంస్కారం!...... "అదీగాక నేను ఈ వ్యక్తిని-ఇంత పిరికివాణ్ణి కట్టుకుని ఏం సుఖపడతాను? అటు పద్మావతి కూడా సుఖపడదు" అనుకుంది!
భాస్కరం పిరికివాడేనా? అన్న ప్రశ్న మరోసారి ఆలోచించింది. "పాపం! అతని బలహీనత తకు అసలు కారణం బాధ్యత......అదే వసంత పెళ్ళి" అనుకున్నది మళ్ళీ. "కాని అధై
పోయిందిగా"
సురేఖకు ఎటూ పాలుపోలేదు. వాల్తేరు వెళ్ళగానే, మొదట క్లాసులో కనిపించేది పద్మావతి కదా!
"ఛీ! దాన్ని చూడగానే అదేమేనా అనొచ్చును. నేను దాన్ని కొట్టినా కొడతాను. ఇదో అప్రదిష్ట! ఉహూ....పోతే పోయింది! వాళ్ళంతా కలిసి ఏ సముద్రంలో దూకితే నాకేం! ఇక నాకీ చదువు వద్దు. నేను మా వూరు పోతాను" అనుకుంది వెంటనే.
