Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 35


    బాధపడకండి సార్. నేనాడిన మాట తప్పను. హరిణి ఫైనలియర్ పరీక్షలు పాసయ్యేదాకా తనతో పలకను" అన్నాడు అభయమిస్తున్నట్లుగా.
    అర్జునరావు ఆ కుర్రాడి వంక ఆప్యాయంగా చూశాడు. అతనంటే ఎంతో గౌరవం కలిగింది. అన్నమాట నిలుపుకుంటే ఆ కుర్రాడికే హరిణినిచ్చి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి హరిణి మనసు మారకుండా వుంటే.


                                  11


    మాట యివ్వటమయితే తేలిగ్గా ఇచ్చాడుగానీ, ఆచరణలో అది ఎంత కష్టసాధ్యమైన విషయమో క్రమక్రమంగా తెలుసుకుంటున్నాడు మహేష్.
    ఒకరోజూ, రెండురోజులూ కాదు. ఇంచుమించు మూడు సంవత్సరాలు.
    ఎంత తప్పించుకొని తిరుగుదామన్నా ఎంత జాగ్రత్తగా వుందామన్నా రోజూ ఒకటి రెండు సార్లయినా హరిణి ఎదురయ్యేది. తల ప్రక్కకి త్రిప్పుకుని వెళ్ళిపోయేవాడు.
    ఆశ్చర్యమేమంటే హరిణి కూడా అతనివంక కన్నెత్తి చూసేది కాదు. అంతవరకూ ఎంతో అల్లరి చిల్లరిగా, చిలిపిగా తిరిగే హరిణి ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది. వీళ్ళిద్దరి ప్రవర్తనలో మార్పు తోటి విద్యార్ధులలో చాలా ఆసక్తి రేకెత్తించింది. ఆమెనుగాని, అతన్నిగాని కుతూహలంతో రకరకాల ప్రశ్నలు వేసేవారు. సరైన సమాధానాలు రాకపోయేసరికి ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుని వింతవింత వ్యాఖ్యానాలు చేసుకునేవారు.
    మహేష్, హరిణి ఎడం ఎడంగా వుండటం సునంద కనిపెట్టింది. ఇలాంటి గొప్ప విషయం తెలిశాక ఆ రహస్యమేదో రాబట్టాలని ఆమె మనసు తహతాహలాడింది. ఓ సాయంత్రం పనికట్టుకుని హరిణికోసం లేడీస్ హాస్టల్ కెళ్ళింది.
    "హరిణీ! ఈ మధ్య మహేష్ తో కలసి కనిపించటంలేదేం? ఇదివరకయితే సాయంత్రాలు ఎక్కడచూసినా మీరిద్దరే సాక్షాత్కరిస్తూ వుండేవారు" అంది.
    హరిణి సునంద ముఖంలోకి చూసింది. ఆమె ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో అర్థమయ్యాక ఆమెని ఏడిపించాలన్న చిలిపి ఆలోచన ఆమె మనసులో ప్రవేశించింది.
    "ఎందుకంటే...."
    "ఎందుకు? ఎందుకు?" తెలుసుకోవాలని సునందకు చాలా ఆరాటంగా ఉంది."
    "నేనే మనసు మార్చుకున్నాను!"
    "అదే ఎందుకు?"
    "ఎందుకంటే...."
    అబ్బ! త్వరగా చెప్పదేమని సునంత ఆతృతనాపుకోలేక పోతోంది.
    "అతను నాకు నచ్చలేదు."
    "అదేమిటి? అంత గాఢంగా....యిద్దరూ అల్లుకుపోయారుగా."
    "ఏదో అప్పుడలా అల్లుకుపోయాం కాని అతన్లో ఏముందని....?"
    "అంటే...."
    "తొందరపడ్డాననిపించింది. అంత గొప్ప నాకేం కనిపించలేదు."
    "నిజంగా గొప్పతనమేమీ లేదంటావా?"
    "నాకేం కనిపించలేదు మరి. అంతేగాకుండా నాకోసం గొప్పగొప్ప సంబంధాలెదురు చూస్తున్నాయి. ఫారన్ రిటరండ్స్. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు...."
    "పాపం అతను బాధపడతాడేమో."
    "పడితే నాకేం?"
    "అన్నాళ్ళు క్లోజ్ గా వుండి...."
    "ఉంటేవున్నాం. ఎంతమంది క్లోజ్ గా వున్నవాళ్ళు విడిపోవటంలేదు?"
    "అంటే నా వుద్దేశం.... చాలా క్లోజ్ గా ఒకరినొకరు ముట్టుకుంటూ.... బహుశా కొన్నిసార్లు ముద్దులు కూడా పెట్టుకుంటూ."
    "పెట్టుకుంటే పెట్టుకున్నాం. అయితే జీవితాంతం పెనవేసుకోవాలని వుందా?"
    "....అంటే నిజంగా కొన్నిసార్లు ముద్దులు...."
    "ఆఁ అయితే కొంపేమీ మునిగిపోలేదని చెప్పానుగా."
    "ముద్దులూ అవీ జరిగి వుంటే యింకా సన్నిహితంగా వచ్చి వుంటారు. అంత సన్నిహితంగా వచ్చీ...."
    "వొస్తే వొచ్చాం. నాకలాంటి చాదస్తాలేం లేవు. అంతకంటే గొప్పవాడు కనిపించినప్పుడు అతన్తోబాటు అవన్నీ గాల్లో కలసిపోయినట్టే...."
    పాలిపోతున్న సునంద ముఖం వింత వింత ఆలోచనలు సోకి వికసిస్తోంది.
    అక్కడ్నుంచి సరాసరి మహేష్ రూమ్ కెళ్ళింది.
    మహేష్ వొంటరిగా చాపమీద పడుకొని వున్నాడు.
    "మహేష్! ఏమిటంత దిగులుగా వున్నావు?" అంది కుర్చీలో కూర్చుంటూ.
    అతను నవ్వటానికి ప్రయత్నించాడు. నవ్వు రాలేదు.
    "మహేష్! నిన్ను చూస్తే జాలేస్తుంది."
    "దేనికి?"
    "నాకంతా తెలుసు మహేష్! నా నుంచి దాచటానికి ప్రయత్నించకు. హరిణి నిన్ను మోసం చేసింది. అవునా?"
    అతనేమీ జవాబు చెప్పలేదు.
    అక్కడ్నుంచి సునంద విజృంభించింది. హరిణి తనతో అన్నమాటలకు రంగులు మార్చి, హంగులు పేర్చి కసితీరా చెప్పిపారేసింది.
    అంతా విని కూడా మహేష్ మౌనంగా వూరుకున్నాడు.
    "మహేష్!"
    "ఊ"
    "మాట్లాడవేం?"
    "నీ బాధ నాకు తెలుసు మహేష్" అంటూ కుర్చీలోంచి లేచి అతని ప్రక్కకు వచ్చి కూచుంది. అలవాటు లేకపోవటంవల్ల చాపమీద కూచోటం చాతకాలేదు. అలాగే అవస్థపడుతూ పాదాలు ఓ ప్రక్కగా పెట్టి అందంగానే కూచుంది.
    చొరవగా అతని చేతిని చేతిలోకి తీసుకుంది.
    "మహేష్! నీ కష్టంలో, బాధలో ఓదార్చటానికి స్నేహితురాల్ని నేనున్నానని మరిచిపోకు. రెండో చేతిని అతను జుట్టులోనికి పోనిచ్చి దువ్వుతోంది.
    అతను మౌనంగా కళ్ళుమూసుకుని పడుకుని వున్నాడు.
    చాలాసేపలా కూచుని సునంద యింటికెళ్ళిపోయింది. చంద్రం వస్తున్న సవ్వడి వినిపించాక.
    ఆ రాత్రి మహేష్ కు ఎంతకీ నిద్రపట్టలేదు.


                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS