ఉన్నట్లుండి తన పెద్దరికం మీద ఆయనకు అసహ్యమేసింది. ఇంతమంచి జంటను విడదియ్యటాని కెందుకింత తాపత్రయ పడుతున్నానా అనిపించింది.
కాని గతంలో తాను చూసిన సంఘటనలు, స్నేహితుల పిల్లల దారుణమైన అనుభవాలు, ఆత్మహత్యలు గబగబా గుర్తుకొచ్చాయి. తొందరపాడు! తొందరపాటు తానేమాత్రం భరించలేడు. తన ప్రాణానికి ప్రాణమైన జీవితం ఉజ్వలంగా వెలగాలి గాని హరించిపోకూడదు.
"ప్రేమించటం గొప్పనుకున్నావా?" అని అందామనుకుని ఆ డైలాగ్ ఇందాక చెప్పిన విషయం గుర్తొచ్చి "నువ్వేనా హరిణిని ప్రేమించానని బడాయిలు చెప్పుకుంటూ దాని జీవితం పాడుచేస్తున్నావు?" అన్నాడు.
"మీరన్న మాటలో రెండు తప్పులున్నాయండీ."
"తప్పులా? ఏమిటవి?"
"ప్రేమించానని బడాయిగా చెప్పుకుంటున్నాననటం ఒకటి. జీవితం పాడుచేస్తున్నానన్నది రెండోది."
"అలాగా? అవి ఎలా తప్పులయ్యాయి?" అన్నాడు అర్జునరావు వ్యంగ్యంగా.
"దీనికి సమాధానం చెప్పాలంటే ముందు మీరెవరో చెప్పాలి."
"అంతేనంటావా?"
"అంతేనండి మరి."
అర్జునరావు కోపాన్ని దిగమ్రింగుకుంటూ "నేను....హరిణి తండ్రిని" అన్నాడు బింకంగా.
"అయ్యో! మీరా? నమస్కారమండీ" అన్నాడు మహేష్ వినయంగా.
"ఇందాకొకసారి నమస్కారం పెట్టావు."
"పెడితే పెట్టాను. హరిణి తండ్రిగారని తెలిశాక ఎన్నిసార్లయినా పెట్టవచ్చు. ఆ మాటకొస్తే పెద్దవాళ్ళంటే నాకు చాలా గౌరవమండీ. మన తెలుగు సంప్రదాయంలో లేదని సిగ్గుపడతాను కాని లేకపోతే పాదధూళి తీసుకోవటం నాకు చాలా ఇష్టమండీ."
"ఈ కుర్రాడు బెంగాలీ నవలలు చాలా చదివినట్లున్నాడు" అనుకుంటూండగా "అయ్యో! నిలబడే వున్నారు కూర్చోండి" అన్నాడు కుర్చీ చూపిస్తూ.
అర్జునరావు కాళ్ళు బలహీనంగా వున్న ఆ కుర్చీవంక అనుమానంగా చూసి తేలిగ్గా కూచోబోతుండగా "ఆగండాగండి" అని ప్రక్కనున్న ఓ పాత తువాలు తీసుకుని "దుమ్ముందండీ. పెద్దవారు కదండీ. దానికి తోడు ఎలర్జీ అవీ వుంటే తుమ్ములూ అవీ వస్తాయండీ" అన్నాడు.
"దుమ్ముకు లొంగిపోయి తుమ్ములు తెచ్చుకునే ఘటం కాదులే యిది" అంటూ అర్జునరావు కుర్చీమీద తేలిగ్గా కూర్చున్నారు.
"మరికాస్త బలం ఆనించవచ్చునండి. ఫర్వాలేదు.
"ఆ విషయం నాకు వదిలెయ్యి. ఆఁ ఇప్పుడు చెప్పు. ఏమిటవి నా మాటల్లోని రెండు తప్పులు?"
"ఒకటి_ప్రేమిస్తున్నానని బడాయిలు చెప్పుకోవటం కాదండీ. నిజంగా ప్రేమిస్తున్నానండీ. రెండు హరిణి జీవితం పాడుజేస్తున్నానన్న మాట వొట్టి అబద్ధమండీ."
"మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పరీక్షలు తప్పే స్థితికి వచ్చిందంటే దీని అర్థమేమిటంటావు?"
"అది ప్రేమలో ఓ భాగమండీ. తాత్కాలికంగా అలావుంది మళ్ళీ దానంతట అదే సర్దుకుంటుంది?
"ఈ ప్రేమల్నీ గీమల్నీ నే నమ్మను" అన్నాడు అర్జునరావు కొంచెం గట్టిగా అరుస్తూ.
"ఇదివరకు నేనూ నమ్మేవాణ్ణికానండీ. కాని యిప్పుడల్లా చిక్కుకుపోయిన వారి పరిస్థితి అర్థం చేసుకునే స్థితికి వచ్చేశానండీ."
"అంతేనంటావా?"
"అంతేనంటావా?"
"అంతేననుకుంటానండీ."
"కాని ఇక్కడ నువ్వు అర్థంచేసుకోవలసిన పాయింటు ఒకటుంది."
"ఏమిటండీ?" అనడిగాడు మహేష్ నిజాయితీగా.
"ఈ సందర్భంలో ప్రేమను గురించి నమ్మాల్సింది నేనుగానీ నువ్వు కాదు."
"ఆ పాయింటు కొంతవరకూ నిజమేననుకోండి. కాని యీ సందర్భంలో మీరు కూడా అర్థంచేసుకోవాల్సిన పాయింటు ఒకటుంది."
"ఏమిటది?"
"హరిణి డాక్టరు కావాలని మీరెన్నో ఆశలు పెట్టుకున్నారు కదా?"
"అయితే ఏమిటి?"
"నేనంటూ తారస పడకపోతే తను ఎమ్.బి.బి.యస్.లో చేరే ప్రసక్తే వుండేది కాదు. మెడిసిన్ అంటే వున్న ఎలర్జీని ఆమె ఎవరికోసమైతే వదిలించుకుని, మెడికల్ కాలేజీలో చేరిందో, ఆ వ్యక్తికి.... అదే.... ఆ యువకుడికి కొంత విలువ ఇవ్వాలి మీరు."
ఈ మాట కొంతవరకూ సమంజసమే అర్జునరావుకు. ఈ యువకుడి....అదే ఈ కుర్రాడి కోసమే తను మెడికల్ కాలేజీలో సీటు సంపాదించిందంటే అది గొప్ప విషయమే. కాని ఇదికూడా పైపై ఆకర్షణే కావటానికి అడ్డేమిటి?
"అయితే నీ ప్రేమ అంత గొప్పదంటావా?" మహేష్ నిజాయితీగా తల ఊపాడు.
"హరిణి కోసం ఏమన్నా చెయ్యగలవా?"
"నదిలోకి దూకటం, కొండమీద నుంచి క్రిందపడటం లాంటి పిచ్చిపన్లు చెయ్యమంటే చెయ్యలేను కానండీ-ఉదాత్తమైనవేమైనా చేసెయ్యగలనండీ."
"నదిలోకి దూకటం, కొండమీద నుంచి క్రిందపడటం నాకూ అసహ్యం. ఉదాత్తమైనవే. తనను నువ్వు కలుసుకోకూడదు. తనతో మాట్లాడకూడదు."
"ఈ పరీక్ష బాగానే వుంది కానండీ కొన్నాళ్ళవరకైతే భరిస్తానండీ. శాశ్వతంగా ఈ రెండూ చెయ్యాలంటే అసలు ప్రేమించడం దేనికండీ?"
శాశ్వతంగా అని నేను అనడంలేదు. మీ చదువులు, నువ్వు ఎట్లా అయినా ప్యాసయిపోతావులే. తన చదువు పూర్తయ్యేదాకా తనని నువ్వు కలుసుకోకూడదు.
"ఓస్! ఇంతే కదండీ. ఆ మాత్రం ఓర్చుకుంటానండీ. ఎందుకంటే హరిణి బాగా చదువుకోవటం నాకూ ఇష్టమండి. ఉండుండండి. ఎమ్.బి.బి.యస్ పూర్తయ్యేదాకానా? ఆ తర్వాత ఎం.డి.ఎమ్.ఎస్ అంటూ పొడుగిస్తారా?"
"అబ్బే! అంత పొడిగించనులే ఎం.బి.బి.యస్. అయితే" ఆయన వాక్యం పూర్తిచెయ్యలేకపోయాడు. మనసులోంచి వుబుకుతోన్న బాధ గొంతు కడ్డుపడి మాటను పైకి రానివ్వలేదు.
మహేష్ ఆయన ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళలోని భావం, వేదన అతనికర్థమయింది. పిల్లల భవిష్యత్తు మీద పెద్దవాళ్ళు పెట్టుకునే ఆశలు, నమ్మకాలు అతనికి తెలుసు. ఆ సమయంలో అతన్ని చూస్తే అతనికి చాలా జాలీ, బాధా కలిగాయి.
తను పెద్దవాడయి, తనకు పిల్లలు పుట్టి వాళ్ళు ఇలాచేస్తే తాను మాత్రం భరించగలడా అన్నంత దూరం ఆలోచించాడు. ఆయన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాలనిపించింది.
