Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 34

 

    అప్పుడు నేను కాస్త భయపడ్డాను. సీతలో ఏం ప్రభావం వుంది? ఆమె నా ఊహలన్నీ ఎలా చదవగల్గుతోంది? నా పధకాల నెలా తిప్పి కొట్టగల్గుతుంది?
    ముందుగా నేను చేయవలసిన పని ఒకటుంది.
    కొంతకాలం పాటు నేను సీతతో చాలా అన్యోన్యంగా ఉండాలి. మా అన్యోన్యత నలుగురి దృష్టిలోనూ పడాలి. అది కొంతవరకూ అయినా నాకు సాక్ష్యంగా పనికొస్తుంది.

                                    9
    మేము కలిసి సినిమాలు చూశాం. పార్కులకు వెళ్లాం. బీచిలో తిరిగాం.
    ఇప్పటి సీత ఇదివరకటి సీతకాదు. ఆమె బట్టలు కట్టడం లోనే ఓక కొత్త తీరు ప్రదర్శిస్తోంది. ఆమె డ్రస్ చేసుకుని బయల్దేరితే -- అందాల పోటీలో గెల్చి వస్తున్న దానిలా కనబడుతోంది.
    నామటుక్కు సీత పెద్ద అందగత్తె అనిపించదు. కానీ ఇప్పుడామెలో ఆకర్షణ చాలా పెరిగింది. మేమిద్దరం కలిసి బయట తిరుగుతున్నప్పుడు -- ఆమె పక్కన నేను కాస్త తీసినట్లుగా వున్నట్లే అనిపిస్తోంది. అందులోనూ చాలామంది మగవాళ్ళ చూపులు ఆమె వైపే ప్రసరిస్తున్నాయి. అది నాకు ఇబ్బందిగా కూడా వుంటోంది. సీత మాత్రం అందుకు సంతోషిస్త్గున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, మగవారిని ఆకర్శించడానికామే ప్రయత్నిస్తున్నట్లుకూడా అనోపిస్తుంది.
    నాతో బయటకు వచ్చినపుడు సీత పైట తరచుగా జార్చి వేసుకుంటోంది. నా స్నేహితులెవరైనా ఎదురు పడి మాట్లాడుతుంటే జారిన పైటను అలా చేతుల మీదనే అపివుంచి -- చాలాసేపు వాళ్ళ చూపులు ఆమె హృదయ భాగం పై గుచ్చుకున్నాక అప్పుడు పైట వేసుకుంటోంది. చిలిపిగా నవ్వడం, కొంటెగా చూడడం, చిన్నచిన్న ఇంగ్లీషు పదాలు వాడడం మొదలెట్టింది.
    మొత్తం మీద నాకే సీత పట్ల ఆకర్షణ పెరగడం మొదలయింది.
    ఇంట్లో కూడా సీత నన్ను ఇదివరకటిలా చనువుగా వుండనివ్వడం లేదు. ప్రతిఘటిస్తోంది కూడా. ఇందివరకటిలా ఆమె ప్రతిఘటనను నేను నిర్లక్ష్యం చేయలేక పోతున్నాను. ఫలితంగా మధురంగా గడపవలసిన ఎన్నో రాత్రులు నాకు నిరాశను కలిగించాయి.
    ఏది ఏమైనా నేను భరిస్తున్నాను. ఎందుకంటె మా అన్యిన్యతకు వ్యతిరేకంగా ఎక్కడా సాక్ష్యం లభించకూడదు.
    గత రెండు మాసాలుగా మేము చాలా ఫోటోలు తీయించుకున్నాం. ఎందరో స్నేహితులు మా అన్యోన్యతను ప్రశంసించారు. "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అన్నారు చాలామంది.
    ఇలా తిరాగడం నాకు బాగుంది. కానీ ఈ తిరగడం సీతను చంపడం కోసమన్న విషయం మనసుకు బాధను కలిగిస్తోంది. అయినా సరే నేను చేయగలిగిందేమీ లేదు.
    కోరినప్పుడల్లా నాకు లొంగక పోయినా సీత నా ఆప్యాయతకు కరిగి పోతున్నట్లే వుంది. అది మెత్తబడుతోందని కూడా నాకు అనిపించింది.
    ఒకరోజున నేను దానికి ఒక ఉత్తరం రాశాను.
    "సీతా!   
    నీ మొగుడు నిన్నదరిస్తున్నాడని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు కదూ!నిన్ను నలుగురూ చూస్తుండగా సునాయాసంగా హత్య చేయగలను.'    
    ఇది నీకు నా మొదటి హెచ్చరిక--

                                                                                  నీ మాజీ ప్రియుడు -"
    దస్తూరీ తెలీకుండా వుండడం కోసం ప్రతి అక్షరాన్ని అష్ట వంకర్లతో రాశాను. ఉత్తరం పోస్టు చేశాక దాన్ని నేనే రిసీవ్ చేసుకున్నాను. సీతకు చూపించలేదు.
    నాలుగు రోజులాగి అలాంటి ఉత్తరాన్నే రెండో హెచ్చరికగా రాశాను. ఆ ఉత్తరం కూడా నా దగ్గరే ఉంచుకున్నాను.
    మరో మూడ్రోజులాగి మూడో ఉత్తరం పోస్టు చేశాను. మర్నాడు పోస్టులో రాలేదు నాకా ఉత్తరం. ఒకోసారి లోకలు పోస్టులో కూడా ఉత్తరాలు  ఆలశ్యం అవుతుంటాయి. నేను పెద్దగా కంగారు పడలేదు. మర్నాడోస్తుంది లే అనుకున్నాను.
    ఆ ఉత్తరం కూడా వచ్చేక మరో రెంద్రోజులాగి సీతను బీచికి తీసుకు వెళ్ళాలను కున్నాను. అక్కడ జనం బాగా రాష్ గా వున్న సమయంలో సీతకు సయనైడ్ సూది గుచ్చాలి. క్షణాల్లో పోతుంది సీత ప్రాణం. నేను గుండెలు బాదుకుని అరుస్తాను.
    తర్వాత పోలీసులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఉత్తరాలు చూపిస్తాను.
    ఆవిధంగా సీత శీలం కూడా అపవిత్రమైందని అందరికీ తెలుస్తుంది. అప్పుడు పార్వతీశం ముందుకు రావడానికి భయపడతాడు. తను సీతకు మాకీ ప్రియుడన్న విషయం బయటపడే అవకాశం ఇవ్వకుండా ఉండటం కోసం -- అతను పూర్తిగా మౌనం వహిస్తాడు.
    అద్భుతమైన పదకమిది. దీనికి తిరుగులేదు.

                                     10
    ఆరోజు సాయంత్రం నేను ఉత్సాహంగా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అది అప్సరసలాగా తయారై ఉంది. చూడగానే కళ్ళు మరల్చు కోలేక పోయాను.
    నానాటికీ దీని అందం ఇంతలా పెరుగుపోటింది!" నేనేమో దాన్ని చంపెయాలనుకుంటున్నాను!
    "బీచికీ వెడదామండీ!" అంది సీత.
    "తప్పకుండా!" అన్నాను.
    ఎంతో జాప్యం చేయకుండా ఇద్దరం బీచికి బయల్దేరాం. దారిలో హోటల్లో టిఫిను కూడా తిన్నాం.
    ఆరోజు బీచిదగ్గర చాలా హడావుడిగా వుంది. జనం బాగా ఎక్కువగా వచ్చారు. సీత అయిస్ క్రీం తిందామని అడిగింది. అయిస్ పార్లర్ వద్ద చాలా రష్ గా వుంది. ఇద్దరం వెళ్ళాం.
    అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూడడాని కొచ్చిన మగవాళ్ళు వున్నారు.
    నేను దృష్టిని అయిస్ క్రీం పైనే కేంద్రీకరించాను.
    ఉన్నట్లుండీ నా చెంప చెళ్ళుమంది - "యూ బ్రూట్ ఇడియట్ -- రాస్కెల్-- స్కౌండ్రల్ -- నేనెవర్ననుకున్నావురా?" అంటోంది ఆ యువతీ. నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె ముఖం కూడా సరిగా చూడలేదు.
    చెంప తడుముకుని కళ్ళు నులుముకుని చూసేసరికి నా చుట్టూ చాలామంది వున్నారు. వాళ్ళలో అడ, మగా -- ముసలీ, ముతకా -- పెద్దా, చిన్నా ఉన్నారు. అందరు నన్నొక దోషిని చూసినట్లు చూస్తున్నారు. వాళ్ళ చూపులు చూడగానే నాకు భయం కూడా వేసింది.
    "ఏమయింది?' అన్నాను.
    "వేషం బాగానే వుంది. ఏమీ ఎరుగనట్లు ఎలా అడుగుతున్నాడో చూడండి. నలుగురూ నాలుగు తగిలించండ్రా" అన్నాడోకడు ఉత్సాహంగా.
    జనం మీదకు కదలబోతున్నారు.ఉన్నట్లుండి -- "ఆగండి" అన్న కేక వినిపించింది. ఆగొంతు గుర్తు పట్టాను. సీతది!
    జనం మంత్రముగ్దుల్లా ఆగిపోయారు. సీత కదలికలో గొంతులో -- ఏదో ఆకర్షణ, మంత్రం వుంది.
    జనం మధ్య నుంచి సీత నన్ను సమీపించింది. దాని కళ్ళలో నీళ్ళున్నాయి. అది రుమాలుతో సుతారంగా కళ్ళు తుడుచుకుని -- "ఈయన నా భర్త! పక్కన పెళ్ళాం ఉందన్న బుద్ది కూడా లేదీయనకు. నన్ను బాధపెట్టడం కోసం ఇంటికి పరాయి ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి నా కళ్ళ ముందే అసహ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ అలవాటులో పోరపాటిది. దయుంచి ఈయన్ను మీరేమీ చేయకండి. నామీద కోపంతో నన్ను చంపాలని కూడా చూస్తున్నారీయన. అయినా సరే -- మీరంతా నన్ను మీ తోబుట్టువుగా భావించి -- ఈయన్ను వదిలిపెట్టండి" అంటూ అందరికీ చేతులు జోడించింది.
    అక్కడున్న అంతా నన్ను తలో మాటా అన్నారు. నాకు మాట్లాడే అవకాశమివ్వలేదు. ప్రతీ ఒక్కరూ సీతను పొగిడి -- దాని అవస్థకు జాలిపడి -- నన్ను బాగా తిట్టి వెళ్ళిపోయారు.
    నేను వంచిన తల ఎత్తకుండా అన్నీ భరించి -- అక్కణ్ణించి బయల్దేరాక -- "అసలేం జరిగింది సీతా!" అనడిగాను.
    "బయట ఓ ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తే -- ఆ పిల్ల  మిమ్మల్ని కొట్టింది--"
    "కానీ నేను అలా ప్రవర్తించలేదు--" అన్నాను.
    "కొన్ని నేరాలకు శిక్ష ఆలశ్యంగా పడుతుంది--" అంది సీత.
    "కానీ.....ఇలా...ఇలా....ఇది చాలా అన్యాయం! అసలా పిల్లెవరో కూడా నేను చూడలేదు-"
    "పెళ్ళి చేసుకోకుండా ఓ ఆడపిల్ల ననుభవిస్తే అది అన్యాయమేగా?"
    "ఊ" అన్నాను నీరసంగా.
    "అయితే వినండి. మిమ్మల్ని కొట్టిన పిల్ల పేరు రాధ!" అంది సీత.
    మెదడు మొద్దుబారి పోయింది. సీత ఎంత తెలివి మీరి పోయింది. రాధ చేత నన్ను కొట్టించింది. రాధ అన్నిమాటలు నా మెదడులో తిరుగుతున్నాయి-- "ఆమె ఆడది, నేనూ ఆడదాన్ని, మా యిద్దరికీ అన్యాయం జరిగిందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ నేను కూడా నీకు ఎదురు తిరిగినా ఆశ్చర్యం లేదు-"
    రాధ గూడా ఎదురు తిరిగి -- నామీద చావుదెబ్బ తీసింది.
    సీతను చంపాలని నేను వేసుకున్న పధకం దారుణంగా ఫెయిలైపోయింది. ఇప్పుడు సీతను నేనేం చేసినా మొత్తం  ప్రపంచమంతా నన్నే అనుమానిస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS