Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 33

 

    "పార్వతీశం గారూ! సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడినందుకు మీ ఋణం ఉంచుకోను. నా భర్త నన్ను హత్య చెయ్యాలని ప్రయత్నించాడు. ఇలాంటి ప్రయత్నమొకటి జరిగినట్లు గుర్తుంచుకుని అవసరమైనప్పుడు పోలీసులకు చెప్పండి. ఇకమీదట నా భర్త మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయరని నా నమ్మకం. కాబట్టి మీరింక వెళ్ళిపోవచ్చు--"అంది సీత.
    పార్వతీశం వెళ్ళిపోయాడు.
    నాలో కోపం తగ్గలేదు కానీ నిస్సహాయంగా సీత వంక చూశాను.
    "మీరు నన్ను హత్య చేయబోవడానికి ప్రయత్నించారనడానికి ఓ సాక్ష్యం ఏర్పడింది. ఇంక మీరు చంపినా నాకు బాధ లేదు. మీకు శిక్ష తప్పదు--" అంది సీత.
    'అంటే ముందే ఇదంతా ఏర్పాటు చేసుకున్నావా?" అన్నాను.
    "మూడేళ్ళుగా మీతో కాపురం చేస్తున్నాను. మీరు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తారో ఆమాత్రం అర్ధం చేసుకోలేనా? ఎటొచ్చీ మీరే నన్నెప్పుడూ అర్ధం చేసుకోడానికి ప్రయత్నం కూడా చేయలేదు?"    
    సీత చెప్పింది నిజమే! నా అహంకారంతో దాన్ని శాసించడమే కానీ -- అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. నేను చేయాలని కూడా అనుకోలేదు.
    'అంటే సరిగ్గా సమయానికి పార్వతీశాన్నిక్కడికి నమ్మన్నావన్నమాట--"
    "అవును-- " అంది సీత నిశ్చలంగా.
    "వాడు నీమాట అంత కచ్చితంగా ఎందుకు పాటించాడు?"
    "రెండు వారాలుగా అయన భార్య పుట్టింట్లో లేదు."
    "లేకపోతే?" కంగారుగా అన్నాను.
    "వాళ్ళకూ మనకూ దొడ్డి ఉమ్మడి. ఎవరూ చూడకుండా అయన మనింటికి వచ్చే అవకాశముంది--"
    "ఉంటే?" ఈసారి కంగారుకు ఆవేశం జతపడింది.
    "నా ముఖాన్ని మీరు దరిద్రపు ముఖంగా భావించారు. ఏ మగాడూ మోజు పడడన్నారు. పార్వతీశానికీ మీకూ అభిప్రాయాల్లో తేడా వుంటుందేమో చూడాలనిపించింది చూశాను...."
    "చూస్తె?"
    "ఆయనకీ, మీవీ ఒకే రకం అభిప్రాయాలు కావని పది రోజుల క్రితమే తేలింది. ఆఖరికి పరాయి ఆడదాన్ని అనుభవించడం విషయంలో కూడా అయన అభిప్రాయం మీతో కలవదు. అలాంటి పనులు భార్యకు తెలియకుండా చేయాలంటాడాయన..."
    "యూ....యూ.....బ్లడీ....నువ్వు వాడితో కూడా...." అన్నాను. వాక్యం పూర్తీ చేయలేదు.
    సీత చక్కగా నవ్వి -- "అందుకే ఈరోజు చెప్పిన సమయానికి వచ్చాడాయన--" అంది.
    నేను మళ్ళీ సీతను సమీపించి కంఠం పై చేతులు వేశాడు.
    సీత అరవడానికి కూడా ప్రయత్నించలేదు -- "ఒక్క మాట వినండి! ఇప్పుడు మీరు నన్ను చంపడం సంగతి అటుంచండి. ఏ విషమో మింగి నేను ఆత్మహత్య చేసుకున్నా మీకే ప్రమాదం. అనవసరంగా మీకు నా ప్రాణాల్ని రక్షించాల్సిన బాధ్యత కల్పించాను-"
    అప్రయత్నంగా నా పట్టు విడిపోయింది.
    సీత నెమ్మదిగా అంది -- "మీ మేలు కోరి చెబుతున్నాను . వేళకాని వేళల్లో ఇంటికి రాకండి. అందువల్ల అనవసరంగా ఆవేశ పడడమూ హత్యా ప్రయాత్నాలు చేయడమూ తప్ప మరో ప్రయోజనముండదు. నా బ్రతుకు నన్ను బ్రతనివ్వండి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు బ్రతకండి--"
    

                                     6
    రాధతో కాసేపు ఒంటరిగా మాట్లాడాలని చెప్పాను. ఆమె అంగీకరించింది.
    రాధ ఉద్యోగానికి వచ్చిన కొత్తలో మా యింట ఓ వారం రోజులుంది. ఆ వారం రోజులు నాకెంతో హాయిగా గడిచాయి. కానీ తర్వాత రాధ వెళ్ళిపోయింది. ఆమెకు వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో గది దొరికింది. ఆ తర్వాత రాధ నాకు మరి అవకాశ మివ్వలేదు.
    పార్కుకి వెళ్ళాం ఇద్దరం. అక్కడ నేను నాకధ పూర్తిగా ఆమెకు చెప్పాను.
    రాధ ఆశ్చర్యపడింది . "సీత -- నీమీద తిరగాబడిందా? అలాంటి దానిలా కనబడలేదే!" అంది.
    "నువ్వేమిటి -- అనుభవిస్తున్న నేనే -- సీత ఇలా ప్రవర్తిస్తోందా అని ఆశ్చర్య పోతున్నాను. దానికేంలే గాని నువ్వు నాకోసాయం చేయాలి --"
    "ఎలాంటి సాయం?"
    "సీత దుష్ప్రవర్తనను ఋజువు చేయాలి. అది రుజువైతే దానికి నేను విడాకులిచ్చేస్తాను--"
    "అందువల్ల నాకు లాభమేమిటి?"
    "నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను --" అన్నాను.
    "నిజంగా?" అంది రాధ కళ్ళు రెపరెపలాడిస్తూ.
    "కావాలంటే కాగితం కూడా రాసిస్తాను...." అన్నాను.
    'అయితే ఏం చేయాలో చెప్పు!" అనడిగింది.
    "మా యింటి పక్క ఓ పార్వతీశం వున్నాడు. సీత వాణ్ని కూడా బుట్టలో వేసుకుంది. నీ అందం ముందు సీత బలాదూర్! కాబట్టి నువ్వు పార్వతీశాన్న బుట్టలో వేసుకోవాలి. పార్వతీశం ద్వారా సీత ప్రవర్తన మంచిది కాదని, మగాళ్ళ కి ఫోజులు కొడుతుందనో, ఆమె ఒకరిద్దరు పురుషులతో అక్రమ సంబంధం కలిగి వుండడం కళ్ళారా చూసినట్లూ చెప్పించాలి. వీలుంటే అలాంటి ఫోటోలు కూడా తీసే ఏర్పాటు చేయించాలి --" అన్నాను.
    అన్నింటికీ తల ఊపింది రాధ! నేనామెకు పార్వతీశానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చాను. అతగాడి ఫోటో ఆఫీసు అడ్రసు ఇచ్చాను.
    "మనిషి బాగున్నాడు-- నీకంటే కూడా!"అంది రాధ.
    రాధ కామెంట్ నాకు నచ్చలేదు.

                                  7
    రాధ పార్వతీశాన్ని ఆఫీసులోనే కలుసుకుంది. ఇద్దరూ ఓ పక్కగా వెళ్ళారు.
    "నేను సూటిగా మాట్లాడతాను. మీ కభ్యంతరం ముండదనుకుంటాను--" అంది రాధ.
    "అందమైన ఆడవాళ్ళు సూటిగా మాట్లాడితేనే అందం--" అన్నాడు పార్వతీశం.
    "నేనందమైన దాన్నని ఒప్పుకున్నారు. అంటే నేను మీకు నచ్చాను. నేను నీకు కావాలా?'
    "కావాలి -- కానీ పెళ్ళి చేసుకోను--" సూటిగా చెప్పాడు పార్వతీశం.
    "పెళ్ళి మీద నాకూ ఆసక్తి లేదు. ఎటొచ్చీ ఓ సాయం కావాలి--"
    "యేమిటది?"
    "రాధ చెప్పింది. పార్వతీశం కాసేపు తటపటాయించాక -- 'అది పెద్ద కష్టమేం కాదు. కానీ నీపని అయ్యాక నువ్వు నన్ను మోసం చేస్తే -- " అన్నాడు.
    "అ భయం లేదు. అడ్వాన్సుంటుంది. పని పూర్తయ్యాక మళ్ళీ మరోసారి. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు...." అంది రాధ.
    పార్వతీశం లొట్టలు వేసుకుంటూ - "అంతా బాగానే వుంది, కానీ నువ్వు మా ఇంటి కొస్తే బాగుండదు. పక్కింటావిడ ఇంటికే రా! మాది ఉమ్మడి దొడ్డి. నిన్ను నేను ఎలాగో కలుసుకునేందుకు ప్రయత్నిస్తాను-" అన్నాడు.
    "పక్కింటికి వస్తే ఎలా? వాళ్ళకూ నీకూ పరిచయముందా?" అంది రాధ.
    "నీలాంటి ఆడది దొరికితే పరిచయమెంతసేపు?" అన్నాడు పార్వతీశం.
    అతడు చెప్పిన ప్రకారం ఆ సాయంత్రం నేను ఇంటికి రాకూడదు. రాధ మా యింటికి వెళ్ళాలి.
    రాధ అలాగే చేసింది. నేను మొదటాట సినిమాకు పోయాను.
    సీత, రాధను సాదరంగా ఆహ్వానించి -- "మా వారు మళ్ళీ నిన్ను మా యింట్లో మకాం పెట్టమన్నారా?' అని అడిగింది.
    "లేదు, వేరే పని మీద వచ్చాను--' అంది రాధ.
    "ఏమిటా పని?" కుతూహలంగా అడిగింది సీత.
    "ఎవరితో చెప్పనని మాటిస్తే చెబుతాను --" అంది రాధ. సీత మాటిచ్చింది . "డబ్బు అవసరం నన్ను పతీతను చేసింది. మీ పక్కింటి పార్వతీశం రసికుడని విన్నాను. ఈరోజే కలిశాను. అడిగిన డబ్బిస్తానన్నాడు. మీయింటి గుండా ఆయనింటికి వెళ్ళి మళ్ళీ మీ యింటి గుండానే వెనక్కు వచ్చేస్తాను--" అంది రాధ.
    "నువ్వు నాకు నచ్చావు. చాలా సూటిగా మాట్లాడుతున్నావు--" అంది సీత.
    "నేనెప్పుడూ సూటిగానే ప్రవర్తిస్తాను--" రాధ నవ్వుతూ అంది.
    'అయితే నేను కూడా సూటిగా నీకో విషయం చెప్పేదా?" అంది సీత.
    "చెప్పు -- " అంది రాధ.
    "పార్వతీశం నా ప్రియుడు. చూస్తూ చూస్తూ మరో ఆడదాన్ని నా ప్రియుడి కెలా అప్పగించేది?"
    రాధ ఆశ్చర్యపోయింది. సీత ఇంత ధైర్యంగా నిజాన్ని ఒప్పుకుంటుందని ఆమె అనుకోలేదు. అసలు సీత పతిత అన్న నిజం కూడా ఆమె నమ్మలేదు. కొన్ని కారణాల వల్ల నేనామెకు అబద్దం చెప్పి వుండవచ్చునని ఆమె విశ్వశిస్తోంది.
    "పెళ్లయింది నీకు. అన్ని విధాల అదృష్టవంతురాలివి. నీకిదేం బుద్ది?" అంది రాధ.
    "కారణం చెప్పనా?' అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే చెప్పాగింది సీత.
    "నా భర్త మనిషి కాడు. మృగం . తను మృగం కాబట్టి నేనూ మృగాన్ననే భావించాడు. అలాగే హింసించాడు . నాలుగు తలుపులూ వేసి బంధిస్తే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. కానీ ఆడది ఎదురు తిరగదు. ఇలాంటి ఆడదాని చరిత్రకు నాతొ స్వస్తి చెప్పాలను కున్నాను. అందుకే ఎదురు తిరిగాను.
    నిజానికి నా భర్త హీరో ఏమీ కాడు. మగాడు కాబట్టి హీరో అయ్యాడు. అయన ఎందుకూ పనికి రాని ఏమీ చేతకాని చవట మనిషి. ఆవిషయాన్ని రుజువు చేయదలచుకున్నాను. నా గురించి అన్ని తెలిసి కూడా నన్నేమీ చేయలేని ఆ మనిషిని అనుక్షణమూ హింసించడమే నా ధ్యేయం.
    నువిక్కడి కెందుకొచ్చావో తెలియదు కానీ -- నిన్ను నా భర్త పురమాయించి వుంటాడని ఊహించగలను. నువ్వూ ఆడదానివి నేనూ ఆడదాన్ని. నువ్వోప్పుకున్నా ఒప్పుకోక పోయినా మగాళ్ళ వల్ల నీకూ ఎన్నో అన్యాయాలు జరిగాయి. నువ్వు కూడా నాతొ చేతులు కలుపు. ఆయన్ను హింసించడానికి సహకరించు. ఆడది ఆడది చేతులు కలిపితే కానీ ఈ మగాళ్ళ కు బుద్ది రాదు--"
    రాధ సీత ఉపన్యాసం ఓపికగా విని -- "నేనింక పార్వతీశం కోసం ప్రయత్నించను. నీకు జయం కలగాలని కోరుకుంటున్నాను--" అని అక్కణ్ణించి వెంటనే వెళ్ళిపోయింది.

                                      8
    జరిగింది యధాతధంగా రాధ నాకు చెప్పింది.
    'అయితే ఇప్పుడే మంటావ్?" అనడిగాడు.
    "నేను నీకు సహకరించలేను. నీ భార్యకు సహకరించకుండా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. కానీ ఆమె ఆడది. నేనూ ఆడదాన్ని. నీ కారణంగా మా యిద్దరికీ అన్యాయం జరిగిందని నాకు అనిపిస్తోంది. ఒక వేళ నేను కూడా నీకు ఎదురు తిరిగినా ఆశ్చర్యం లేదు--" అని వెళ్ళిపోయింది రాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS