Previous Page Next Page 
స్త్రీ పేజి 34

                          

    రామం వచ్చాడు భార్యను తీసికెళ్ళటానికి. పసివాడికి ఐ అరతులం గొలుసు, అరతులం ఒత్తులూ , వేళ్ళకు రెండు ఉంగరాలూ చేయించే ఉంచింది పార్వతి.
    రుక్మిణి కి నాలుగైదు చీరలు కొంది. రెండు రెండు బిందెలు చలిమిడీ, ఓ మణుగు మిఠాయి ఓ కుంచెడు సున్ని పిండి, పసుపూ, కుంకం -- అన్నీ తయారు చేయించింది. రుక్మిణి కి మాత్రం ఏ మంత సంతోషం కలిగినట్టు కనిపించలేదు. ప్రయాణం అన్న దగ్గరి నుంచీ మాటా పలుకూ లేకుండా ముభావంగానే తిరుగుతుంది.
    పార్వతి గబుక్కున జ్ఞాపకం వచ్చి పెట్టి తెరిచి ఓ ఐదు రూపాయల నోటు తీసింది. గదిలోకి వెళ్ళబోయిందల్లా ఆగిపోయింది.
    "చాల్లే! ఊరుకుందూ!" విసుక్కుంటూన్నాడు రామం.
    "ఊరుకోవటం ఏమిటి? మా అమ్మ ఉంటె ఇలాగే చేసేదా? ఇద్దరూ కలిసి మూడు వందల కి పైగా సంపాదించుకుంటున్నారు. లింగు లింగు మంటూ ఓ తులం సింగినాదం కొని నూలు దారం లా గొలుసూ, చీపురు పుల్లల్లా ఒత్తులూ పామించింది. ముష్టి నగలు! ఎవడి క్కావాలి? అక్కర్లేదనే చెప్పేస్తాను."
    "ఛీ! నువ్వు మనిషివి కాదూ? వదిన వింటే ఎంత బాధ పడుతుంది?"
    "బాధ! ఎందుకు పడుతుందీ? సిగ్గు తెచ్చికుంటుంది. చిన్నదాన్నని నా ముద్దు ముచ్చట్లేమైనా తీరి చస్తున్నాయా? నేనెంత బాధ పడుతున్నానో ఎవడికి తెలుసు?" ఏడుస్తున్న స్వరం!
    పార్వతి తల గిర్రున తిరిగింది. ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. తూలుకుంటూ తూలుకుంటూ పెరట్లోకి పోయి చీడీల మీద కూలబడి "అమ్మా!" అంటూ బావురుమంది. "నువ్వే ఉంటె నాకి నిందా వచ్చేది కాదమ్మా! నీ దగ్గరికి నన్ను కూడా తీసుకు పో, అమ్మా! అమ్మా!" ఆకాశం లోకి చేతులెత్తి కనిపించని అమ్మ కోసం ఆక్రోశించింది.
    ఏడ్చి ఏడ్చి చటుక్కున చెంపలు తుడుచుకుంటూ లేచింది. "సూర్యం! ఒక్కసారి ఇలారా!" అంటూ గావు కేక పెట్టింది.
    అప్పుడే ఇంట్లోకి వస్తున్నా సూర్యం , "ఎందు కక్కయ్యా?' అంటూ దగ్గరికి వచ్చాడు.
    "సీతమ్మ మామ్మ నడిగి నే నిమ్మన్నానని ఓ పాతిక రూపాయలుంటే తీసుకురా! తొందరగా వెళ్లిరా. ఇంకా భోజనాలు అవీ అవ్వాలి. బండికి వెళౌతుంది."
    "ఎందుకక్కయ్యా? ఇప్పుడు డబ్బెందుకు? వాళ్లకి చార్జీలకి మన దగ్గర ఉందిగా?"
    "ఎదురు ప్రశ్నలు వెయ్యక వెళ్ళిరా!"
    సూర్యానికి చిన్నతనమనిపించింది. కోపం కనిపించనీయకుండా, "ఆ మామ్మ రూపాయికి బేడ చొప్పున వడ్డీ తీసుకుంటుంది, తెలుసా?" అన్నాడు.
    "తెలుసు, తెలుసు. అన్నీ తెలిసే చెప్పాను" తీక్షణంగా చూసింది పార్వతి. సూర్యం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు.
    భోజనాలు ముగిశాయి. ఎవరి మట్టుకు వాళ్ళు ముభావంగా ఉన్నారు. రామం గదిలో కూర్చుని తమల పాకులు నములుతుంటే గుమ్మం దగ్గరికి వెళ్ళి పిలిచింది పార్వతి-- "రామం!" అని.
    "ఏం, వదినా, పిలిచావా?' గుమ్మం లోకి వచ్చాడు రామం. గంట కిందటే కొంగున కట్టుకున్న ఐదు రూపాయల నోటు విప్పి అందిస్తూ "మీ ఊళ్ళో ఓ రెండు వందల అరటి పళ్ళ కొనమన్నానని అత్తయ్య తో చెప్పు. ఇక్కడి నుంచి తీసి కెళ్తే చితికి పాడై పోతాయి. తీసి కెళ్ళటం ప్రయాస కూడాను. ఇదిగో, ఈ డబ్బు ఉంచు" అంది.
    'అదేమిటి వదినా! అమ్మ తప్పకుండా కొంటుంది. అరటి పళ్ళ భాగ్యానికి డబ్బు ఇవ్వాలా నువ్వు?"
    "కాదులే. ఉంచు. ఈ సారే లో మీ డబ్బేమీ పడకూడదు."
    రుక్మిణి సిల్కు చీర రెపరెప లాడించుకుంటూ వచ్చింది. "ఆ వాళ్ళ డబ్బు పడకుండానే అవుతుందా ఏమిటి? ఈ తీసి కెళ్ళేవి ఏ మూలకి సరిపోతాయి? అత్తయ్య మళ్ళా ఎలాగూ చేయిస్తుంది."
    పార్వతికి చాలా కోపం వచ్చింది. రుక్మిణి అహంకారానికి తనే కారకురాలేమో ననిపించింది. అయినా రామాన్ని చూసి కోపం కనిపించనీయకుండా చేసుకుంది. 'అత్తయ్య భాగ్య శాలి. సిరిసంపదలతో పెట్టి పుట్టింది. నా వంటి వాళ్ళ నేందర్నయినా పోషిస్తుంది. ఇక మనవడి బారసాల కి పెద్ద పెట్టున సారే పంచి పెట్టుకుంటే విశేషమేముంది?" అంటూ రామం కేసి చూస్తూ, "చూడు, రామం! రుక్కు అన్నట్టు నేనేమీ గొప్పగా చెయ్యలేక పోయాను. పిల్లాడికి కూడా ఏమీ పెట్టలేక పోయాను. పురిటీకి వాటికీ కాస్త ఖర్చయింది. కలిగినంత లో ఏదో చేశాను. ఏమీ అనుకోవద్దని అత్తయ్య తో చెప్పు. మాకు మాత్రం రుక్కు కాకపోతే ఇంకెవ్వరు న్నారు? ఈసారి నేనొచ్చి నప్పుడే మైనా తీసుకొస్తాను"అంది.
    రామం సిగ్గు పడ్డ వాడిలా తల దించుకున్నాడు. "నువ్వు యెంత చేస్తే అంతే సంతోషం వదినా! అమ్మకీ నాకూ కూడా అలాంటి పట్టింపులు లేవు. ఇక నీ చెల్లెలు నీకు పరాయిది కాదు. నువ్వెందు కంత బాధపడుతూ చెప్తున్నావు?"
    "ఆహా! మాట వరస కి అన్నాలే.
    బండి ఎక్కేముందు చెల్లెలికి బొట్టు పెట్టి చేతిలో పాతిక రూపాయలు పెట్టింది పార్వతి. "నీ చేతి ఖర్చులకి ఉంచుకో. ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే వ్రాస్తూ ఉండు. నన్నడిగి తీసి కెళ్ళటానికి నీకు బిడియం దేనికి? బాబు జాగ్రత్త ! రైల్లో జాగ్రత్త గా పట్టుకో. కిటికీ దగ్గర కూర్చోకు సుమా! వెళ్ళగానే దిష్టి తీయించు. అత్తయ్య ఎలాగూ తీస్తుంది లే. మరి జాగ్రత్తగా వెళ్లిరా!"
    రుక్మిణి ఏదో అపరాధం చేసిన దానిలాగా తల ఎత్తలేక పోయింది. నెమ్మదిగా , "వెళ్తాను" అనేసి బండి ఎక్కింది. కన్నీళ్ళ తో బండిని చూస్తూ నించుంది పార్వతి. ఇంట్లోకి వెళ్తే మేదర ఉయ్యాల ఖాళీగా ఊగుతూ బోసిగా కనిపించింది. ఉయ్యాల తాళ్ళు పట్టుకుని దీనంగా నిట్టూర్చింది.

                               *    *    *    *
    పరధ్యానంగా నడుస్తున్న పార్వతి కారు హారన్ వింటూ ఉలిక్కిపడి పక్కకు తప్పుకుంది. నిగనిగ లాడే నల్ల కారొకటి దూసుకు వచ్చి టక్కున ఆగిపోయింది, పార్వతికి రెండడుగుల దూరంలో. కారులోంచి దిగి నించున్న వ్యక్తిని చూస్తూ విభ్రాంతి లో నిలబడిపోయింది పార్వతి.
    పద్మజ నవ్వి పార్వతి చేయి అందుకుంది. "నిన్ను వెనక నుంచే చూసి పోల్చాను. అనుమానం తీర్చుకోటానికి మరో రెండడుగులు పైకి పోనిచ్చాను . పారూ, నేను గుర్తు లేనా ఏమిటి?"
    `"పద్మా' ఆశ్చర్యంగా సంభ్రమంగా అంత కన్నా మాట్లాడలేక పోయింది పార్వతి.
    "ఎందుకంత విస్తుపోతున్నావు? పద, కారులోకి, మాట్లాడుకుందాం."
    పార్వతి అయోమయంగా చూసింది. ఇంత హటాత్తుగా పద్మజ కనిపించటం, కారులో ఎక్కమనటం నమ్మ శక్యంగా లేవు. "నువ్వు..... ఈ వూరెప్పుడొచ్చావు?"
    "ఇలా నడి రోడ్డుమీదేందుకు నిలబడటం? అన్నీ చెప్పుకుందాం . రా, పారూ!"
    "ఇప్పుడెక్కడికి మనం వెళ్ళేది?"
    "మా బంగళా కి . ఏం?"
    "ఆహా! నే నిప్పుడే ఆఫీసు నుంచి వస్తున్నాను. ఇంటి దగ్గర ఇంకా వంటా అదీ.... అయినా సూర్యానికి చెప్పాలిగా?"
    "అయితే పద. మీ యింటికి వెళ్లి సూర్యాన్ని కూడా తీసి కెళ్దాం."
    'అబ్బే! వద్దు. ఎందుకూ? పొద్దుటి అన్నం కొంచెం ఉంది. తినమంటాను వాణ్ణి."
    'సరే, ఏదో ఒకటి చేద్దాం లే. ముందు కారులోకి పద."
    పార్వతి ఇంటి మీదుగా పరుగెత్తింది కారు. సూర్యాన్ని కూడా రమ్మంటే తనేదో పిక్చర్ కు వెళ్తున్నాననీ, రాలేననీ చెప్పాడు. పార్వతి ఆ రాత్రికి ఇంటికి రానని చెప్పి ,మళ్ళా స్టీరింగ్ ముందు కూర్చుంది పద్మజ. "పారూ! నీకు చాలా ఆశ్చర్యంగా ఉందా?"
    "ఏం ? నీకు లేదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS