'చస్' హేమలత కొట్టి పడేసింది. 'అవి పూర్వపు రోజులు. కాలం మారింది. మగవాళ్ళ దౌర్జన్యాదులకు నలిగిపోయే ఆడదానికి యెక్కడో దొరక్కపోరు సహృదయులు. అందుకే ఈ శ్రీనివాస్ దగ్గర కన్నా రాజేశ్వరి ఆ దేవదాసు దగ్గరే సుఖ పడుతుంది.'
'అయితే నువ్వింక పెళ్ళే చేసుకోవా?' కృష్ణ ప్రియ ఆశ్చర్యంగా అడిగింది.
హేమలత నెమ్మదిగా నవ్వి అంది: 'చేసుకునే పెళ్లి యిరవై దాటకుండా తలితండ్రుల చేతి మీదుగా జరిగిపోవాలి. ముప్పై -- యేళ్ళు ముద్దు ముద్దుగా మీదికి వస్తుంటే యిప్పుడా పెళ్లి? దీనికి యింక అర్ధం లేదు? మనం ఐహిక సుఖాలకి అతీతులం కాము అని మగవాళ్లు అనేకం అంటారు. లొంగలేదని నిందవేసి ప్రపంచం లో పరువూ- ప్రతిష్టా లేకుండా చేస్తారు. నాన్నగారు వుండగా చాలా సంబంధాలు వచ్చాయి. కట్నం చాలక అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆడపిల్లలు నాలుగు గోడల మధ్య యేడుస్తూ కూర్చునే కాలం మారిపోయింది. అందుకే వర్కింగ్ హాస్టల్లో వుంటున్నాను. నాకు అసలు చింతే లేదు.'
'అయితే నువ్వు చెప్పింది ...'కృష్ణ మనసు క్షణం రెపరెప లాడింది.
హేమ నిశితంగా చూస్తూ 'చూడు కృష్ణా! ఆస్తిపాస్తులు, అందం, చదువూ యిన్ని వున్న శ్రీనివాస్ పై పై మెరుగులు చూసి నేను మోసపోను. నీ యిష్టం నీ జీవితాన్ని ముళ్ళ ల్లోకి నడిపించాలను కుంటే నేనేమీ అభ్యంతరం చెప్పను. నిన్నుఅతనికి దూరం చేసి నేను అతని సన్నిధి కోరుకునే ప్రలోభం లో వున్నానను కుంటే క్షమించు. అతన్నే కాదు ఈ జన్మకి నేను ఎవరినీ కూడా చేసుకోను.
'మగవాదోయ్ అతను. ఎన్నో మాటలు అంటాడు. అన్నీ నమ్మేయడం ముఖ్యంగా జీవితం విషయం లో అంత మంచిది కాదు. కావాలంటే నేను పని చేసే స్కూల్లో అతని గురించి వున్న అభిప్రాయాన్ని తెలుసుకో. నేను నీ స్నేహితురాలిని. పైగా ఆడదాన్ని, నిన్ను మోసం చేయాలనే వుద్దేశ్యం నాకు యెందుకు వుంటుంది. వున్నా నువ్వు నన్ను నమ్మి నష్ట పోయేది ఏమీ లేదు. జీవితంలో అసలు నష్ట పోయేది పురుషుడి సాంగత్యం లోనే. నీ యిష్టం . ఆలోచించు, బాగా అలోచించి ఒక నిర్ణయానికిరా....నీకు ఓ తోడు కావాలనుకుంటే పెద్దల అనుమతి తీసుకో. నీకు యెవరూ లేరు అలాంటి వాళ్ళు. అటువంటి సమయంలో నీకు నువ్వే తీర్చి దిద్దుకోవాలి. నీకు అక్కగా, అప్తురాలిగా నేను వున్నాను ఆపైన. నా అభిప్రాయం యిది' అంది.
హేమలత ఒక్కతే కాదు. అతనికి సన్నిహితులైన మరి కొందరు పెద్దలు కూడా అతన్ని గూర్చి అదే మాట అన్నారు. యేది నిజం? యేది అబద్దం?? కృష్ణ ప్రియ ఆలోచనలు చెదిరిపోయాయి. ఆడది ఒంటరిగా బ్రతికేందుకూ , నిర్భయంగా తిరిగేందుకూ కావలసినన్ని హాస్టల్స్, చక్కని సౌకర్యాలూ వున్నాయి. యెందుకు జీవితాన్ని కూల్చు కుంటావు?' హేమ యింకా అంటూనే వుంది కృష్ణ మెదడు లో దూరి. కృష్ణ ఆలోచనలు అప్పటికప్పుడే తలలు యెత్తి మరో రకంగా చిందులు త్రొక్కుతున్నాయి. శ్రీనివాస్ మొహం లో అమాయకత్వం వట్టి నటనేనా? అతను కుమిలి కుమిలి ఏడవడానికి కారణమే లేదా...ప్చ్ ఏవిటో మగవాడు యేడిస్తే నమ్మకూడదని అంటారు నిజమేనేమో----
అసలు స్త్రీ జీవితం పునీతం అయేది సంతానం తోటే అంటారు అటువంటిది తను వుండగలదా?
'భలే దానివే కృష్ణా పెళ్లి కాని ఆడదంటే నీకూ అటువంటి నీచమైన అభిప్రాయం వుంటుందనుకోలేదు. ఏం యెందుకు వుండలేరూ నిగ్రహంగా. హాస్టల్లో నూటికి తొంబై మందికి పెళ్ళిళ్ళు కాలేదు అంటే వాళ్ళంతా పతితలనేనా నీ వుద్దేశ్యం ' హేమ కళ్ళు ఏరుపు రంగుకు మారిపోయాయి.
'ఛ! నేను అనేది నా విషయం ' కృష్ణ ప్రియ కంగారుగా అంది.
'పిచ్చి పిల్లవి నువ్వు. అదో జీవితం. అక్కడ బానిసత్వం లేదు. మనకి బ్రతుకులో కావలసినంత స్వాతంత్యం వుంది. అలాగని మనకి పరిధులు దాటే అవకాశం లేదు. తెల్లవారడం , సంధి పడటం, మనం చేయవలసిన మహత్తర కార్యాలకు అసలు యిరవై నాలుగు గంటలు చాలవు ఆలోచిస్తే. చాలా బాగుంటుంది తెలుసా.' హేమలత చెప్పుకు పోతూనే వుంది.
కిటికీ లోంచి జల్లులు వచ్చి మొహం మీద పడి తెప్పరిల్లింది . శ్రీనివాస్ వుత్తరం యింకా చేతిలోనే వుంది. తను రాసిన ఉత్తరం తో బాటు అతని ఉత్తరం యేకం అవుతోంది.
అపురూప శిల్పాల కాలవాలమ్మూ
విజయనగరపు శోభ నిరూపమానమ్మూ
రత్నాలు ముత్యాలు రాసులుగ పోసి
విక్రయించిరి నాడు విజయ నగరమున.
కృష్ణ ప్రియ చేతిలో పుస్తకం గాలికి రెపరెపలాడుతోంది. వర్షపు చినుకులతో పూర్తిగా తడిసి ముద్ద అయిపోతోంది. ఆ పాట శ్రీనివాస్ నోట్లోంచి అమృత ధారలా, వెల్లువలా, సముద్ర ఘోషలా వస్తూ ప్రకృతి లో కలిసి పోతోంది. ఆ పాట అంటే కృష్ణ ప్రియ కి పంచ ప్రాణాలు ఉయ్యాలా గొలుసులు చప్పుడు లయగా మ్రోగుతున్నాయి.
అల్లదే కృష్ణమ్మ చల్ల నౌతల్లి
పొంగి పొరలుచు నుండే నింగి పై కెగసి
పరుగెత్తుచున్నది భాగ్యాల రాశీ
గోదావరీ మాత కొండలను గడచీ
తూగుటుయ్యాలలో వూగు పాపాయీ
వూగుచూ కధలన్నీ వూ కోట వోయీ.
'వూ' 'వుహూ ' లతో కృష్ణ ప్రియ మనస్సు పెంద్యులంలా వూగుతోంది. కాగితం పుస్తకం తడుస్తూనే వున్నాయి.
పరుగులు పెట్టె కృష్ణ మనసుని బలవంతంగా కళ్ళెం వేసి అదుపులోకి తెచ్చుకుంది.
యెవరో అదృష్టవంతుడైన కవి అందాలుగా పేర్చిన సాహిత్యానికి సంగీతం మరెవరో సమకూరుస్తే కంచు కంఠం తో శ్రీనివాస్ పాడుతున్నాడు, వీధి ల్లోకి, వాడల్లోకి ఆ మాధుర్యాన్ని పంపేస్తూ.
కృష్ణ ప్రియ అడుగులు వెనక్కి పడాలని అనుకోవడం లేదు. అతని పాట ఆగడం లేదు. బయట గేటు పక్కన చిన్న కుటీరం లాంటి యింట్లో నౌఖరు కృష్ణ దాసు కునికి పాట్లు పడుతున్నాడు. అతన్ని లేపి అంది కృష్ణ ప్రియ! చూడు కృష్ణ దాసూ! ఈ వుత్తరం అయ్యగారికి యిచ్చేయి.'
'అమ్మా' వాడు వులిక్కి పడ్డాడు తెప్పరిల్లి. 'మీరు యింక రారమ్మా? అయ్యగారు మీమీద.....'
'అన్నీ తెలుసు కృష్ణ దాసూ. నేను వెడుతున్నాను. నా దగ్గర యేవీ లేదు నీకు యివ్వాలన్నా.'
'అదేమిటమ్మా ఒక్కసారి ఆయనతో చెప్పి వెళ్ళండి.'
'వుహూ నేను వెళ్ళను. అక్కడికి వెళ్ళానంటే మళ్లీ బయటికి రానివ్వరు.' మాటలు పూర్తీ చేస్తుంటే కృష్ణ ప్రియ కళ్ళల్లో నీళ్ళు ధారాపాతంగా కురుస్తున్నాయి. గేటు చప్పుడు అవుతూ 'కీ' చుమంది. కృష్ణ దాసు పరుగులు పెట్టాడు శ్రీనివాస్ యింటి వైపు.
కృష్ణ ప్రియ తలదించు కుని వడివడిగా ముందుకు నడుస్తోంది కటిక చీకట్లో, గాడాంధకారం లో . భోరున కురిసే వర్షం లో .
(అయిపొయింది.)
