Previous Page Next Page 
ఆరాధన పేజి 33


    "మీ దగ్గర ఫీజు ఎంత పుచ్చుకోవాలా! అని ఆ ప్రశ్నవేయలేదండి.....డబ్బు ఎంత నీచమైన పనైనా చేయిస్తుంది. డబ్బు కోసం వ్యక్తులతో చెలగాటమాడ్తారు నిజం దాచిపెడ్తారు....మీరు బాగా ముట్టజెప్పి వుంటారు. అందుకని మీకు ఏవేవో ఆశలు కల్పించి వుంటారు.......మీరు ధైర్యంగా వుండాలి ..... మంజు ఆ నోట్లను అతనివైపు నెట్టింది. అతను వెర్రిగా ఆమె వైపు చూస్తున్నాడు.
    మంజు కంఠం తగ్గించింది "ఆమె గర్భవతి కాదు."
    "ఏమిటీ?" నమ్మలేను అన్నట్లు చూచాడు, కుర్చీ అంచుకువచ్చి కూర్చున్నాడు. ఆమెను చూస్తుంటే తెలుస్తోందిగా - అలా అంటారేమిటి?" మీరు చెప్పినది అబద్ధం అన్నట్లు - వేళాకోళంగా అన్నాడు.
    ఆమె గర్భవతి కాదు గర్భంలో బిడ్డలేదు. దీన్నీ సూడో ప్రెగ్నంసి అంటారు. గర్భంతో వున్నామనుకుంటారు. అంతే- అవే చిహ్నాలు వుంటాయి. నొప్పులు కూడా వస్తాయి. కానీ బిడ్డ వుండదు.....మీరు ధైర్యం వహించాలి. ఎలాగో ఆమెకు తెలియచేయాలి. లేకపోతే మానసికంగా శారీరకంగా ఆరోగ్య పాడౌతుంది. ఇంతకన్నా నిరాశ మరింకొకటి లేదు. మాతృత్వం దీన్ని సహించలేదు.... మీకు నమ్మకం కలగాలంటే ఎక్స్ రే తీయించండి.... కానీ అనవసరం... మీ ఇష్టం .... ఇంతకన్నా నేనేమీ చెప్పలేను.
    అతను రెండు చేతుల్లో తల పట్టుకున్నాడు. ఎన్ని క్షణాలు గడిచాయో గడియారపు టిక్ టిక్ శబ్దం అతి బిగ్గరగా విన్పిస్తుందేగాని మరే సంచలనం ఆ గదిలో లేదు.
    అతను కళ్ళెత్తి డాక్టరు గోపాలరావు వైపు చూచాడు. అత్యంత వ్యధ ప్రతిఫలిస్తున్న ఆ కళ్ళలో లీలామాత్రంగా కన్నీరు అగుపించింది. డాక్టరు గోపాలరావు ముందుకు వంగి ధైర్యం చెప్పాడు. మీరు మనసు దిటవు చేసుకోవాలి సేట్ జీ. డాక్టరమ్మగారు చెప్పినట్లు ఆమెను చాలా జాగ్రత్తగా చూచుకోవాలి. ఎంతో చాకచక్యంతో ఈ కబురందజేయాలి ఇప్పటికే మీరు చాలా మోసపోయారు ఇంకా ఆమెను మభ్యపెట్టటం అన్నివిధాలా మంచిదికాదు. మనఃక్షోభతో ఆమె అతిగా కుమిలిపోవచ్చు. దీని పర్యవసానం అతిదారుణంగా కూడా వుండొచ్చు.... మీకు నమ్మకం కుదరాలి. ఎక్స్ రే తీద్దాం...."
    అతను స్తబ్దతతో కూచున్నాడు. 'ఎలా చెప్పటం. ఎలా చెప్పను "పదే పదే అంటున్నాడు' వాళ్ళు ముగ్గురు నిస్సహాయతతో చూస్తున్నారు.
    మంజులకు అక్కడ కూచోటానికి మనస్కరించలేదు.
    నిస్సత్తువతో అడుగులో అడుగేస్తూ బండెక్కింది. డాక్టరు గోపాలరావు బండివరకు వెళ్ళాడు. వీడ్కోలిస్తూ మంజుకేసి చూచాడు. ఆమె సజలనయనాలతో అతనికి నమస్కరిస్తుంటే గోపాలరావు చలించిపోయాడు. బండి కదిలింది.
    ఇల్లు చేరగానే కుర్చీలో చేరబడి కళ్ళు మూసుకుంది.
    ఆమె నా విధంగా చూసిన తండ్రి తల్లి పరస్పరం చూసుకున్నారు? ఏమైంది? ఎందుకలా వుంది?
    "అమ్మాయ్ స్నానం చెయ్యవూ? అలా వున్నావేం?"
    మంజు నిటారుగా కూచుని నవ్వింది. అది నిర్జీవమైన నవ్వు.
    "ఒకావిడను పరీక్షచేసి వచ్చాను...." అంటూ సంగతి విశదపర్చింది.
    ఆమె ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది' "ఇది నిజమేనా మంజూ? ఇది సంభవమంటావా? ఎప్పుడు వినలేదే! నువ్వు సరిగ్గా పరీక్ష చేశావా? నువ్వేం పొరపాటుచేయలేదు కదా"
    మంజు చటుక్కున తల్లివైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది. తాను పొరపాటు చేసిందా? ఏమో? కాని తను బాగా పరీక్షచేసిందే! తను తన తెలివినంతా కూడగట్టి చూసిందే! బిడ్డ వుందా?
    ఎక్స్ రే తీస్తే - అహ-అలా జరగటానికివీల్లేదు. తను చేతకానిదా? తనలోని ఆ నైపుణ్యం ఏమైంది? తను పరీక్షచేసి మూడో ప్రెగ్నన్సీ అవటం ఏమిటి - ఎక్స్ రేలో పాప కనబడటం ఏమిటి....మంజు హృదయాలోచనలు సముద్రతరంగాలా ఉవ్వెత్తునలేస్తూ తరుముకొస్తున్నాయి......వెంటనే ఏదో స్ఫురించి సిగ్గుపడింది.
    ఇదేమిటి ! తను పొరపాటు చేయదన్న అహంకారంతో ఆమె గర్భంలో బిడ్డ వుండరాదనే పరోక్షంగా కోరుతుందా? తన పరీక్ష సరి కాబట్టి బిడ్డ వుండనే కూడదని, గట్టిగా అనుకుంటుందా? మంజు తన అహంకారానికి కళ్ళెంవేసింది. తనది నిజంగా పొరపాటైతే ఎంత బావుంటుంది-ఆ గర్భంలో నిజంగా పసిపాపవుంటే అంతకన్నా ఆనందించదగ్గ విషయం ఏముంది.
    కానీ... కానీ..... అలా జరగదు. కారణం ....నాకు తెలుసు?
    తల్లి ప్రశ్నకు జవాబివ్వాలనికూడా మంజుకు తోచలేదు.
    ఆ క్షణంలో తోటి స్త్రీపట్ల సానుభూతితో- తప్తహృదయాలతో మౌనంగా వుండిపోయారు. మంజు తల పంకించి దీర్ఘంగా విశ్వసించింది. లేచి నుంచుంది" ఓ చీర-టవలు ఆ సూట్ కేసులో వున్నాయి అలా దండెం మీద పడేయ్యమ్మా, స్నానాని కెళ్తున్నాను."
    మంజు స్నానంచేసి వచ్చేసరికి తండ్రి భోజనం అయిపోవచ్చింది. అతను భోంచేసి వచ్చేదాకా మంజు పాపదగ్గర కూచుంది.
    కవల లిద్దరికీ పాలుపట్టి తను భోంచేసి తమలపాకు వేసుకుంటున్నది. అంతలోకి కుమార్ వచ్చాడు. అతని ముఖం బాగా తీసిపోయింది.
    మంజు ఆత్రంతో ప్రశ్నించింది. "ఆమెకు చెప్పారా?"
    "లేదు అత్తగారికి మాత్రం చెప్పాము, ఆమె ఒకపట్టాన నమ్మలేదు. ఎక్స్ రే తీయించాలని. ఫోటో చూస్తేగాని నమ్మరు. బహుశః రేపు తీస్తారేమో!"
    "నా పరీక్ష తప్పైతే బావుండును..... పొరపాటైతే ఎంత బావుంటుంది? ఆ ఫోటోలో పిండంవుంటే!" తనే అందరికన్నా ఎక్కువగా ఆనందిస్తుందేమో! మంజు పెదాలనించి పైమాటలు వెలువడినై. ఆమె పరధ్యానంగా ఎటో చూస్తోంది.
    కుమార్ హృదయాగతభావాలు అదే మార్గంలో పయనిస్తున్నాయి, "ఈ ఒక్కసారికి మంజు పరీక్ష సరైనది కాకపోతే! తనకూ ఆనందమే.....కానీ......కానీ...." ఇదెంత అసంభవమో తనకు దెలుసు? మంజు పొరపాటు చేయదని. చేయలేదనికూడా తెలుసు.
    ఆమెను తనుకూడా పరీక్షించాడు.
    ఆ గర్భంలో ఏమీలేదు..... హే-ప్రభూ-అనుకుని నుదురుపట్టుకుని కూచున్నాడు.
    గంభీర నిశ్శబ్దక్షణాలు దొర్లిపోతున్నాయి.
    డాక్టర్లు ఇలా చలించటం మామూలే.
    వాళ్ళు వెంటనే తమాయించుకుని. బైట పడటంకూడా మామూలే.
    ఏదో కబుర్లలో కాలక్షేపం అయింది.
    ఆ రాత్రి కుండిపొమ్మని బలవంతం చేశారు గానీ టాక్సీ వస్తుందని, మంజు ఒప్పుకోలేదు,
    సాయంత్రం కాఫీ టిఫిన్ తీసికొన్నారు.
    ఆరుగంటలకు టాక్సీ వచ్చి ఆగింది.    
    కొద్ది సామాను పెట్టించేశారు, పాప తండ్రి చేయిగట్టిగా పట్టుకుంది. మంజు ఒక కొడుకును భర్త కందించింది. మరొకర్ని ఎత్తుకుంది. "వాళ్ళను ఇక్కడేవుంచి వెళ్ళవే- నే చూచుకుంటాను" తల్లి నాలుక చివరిదాకా వచ్చి ఆగి పోయినై. ఖాళీ మంచం చూడగనే కడుపు దేవి నట్లయింది. "నువ్వు అమెరికావెళ్తేనే నున్నాను" మనసులోనే అనుకుని దీవించింది. ఉద్వేగంతో లేస్తూ పడ్తున్న హృదయాన్ని చిక్కబట్టి భర్తకేసి చూచింది. ఆయన గంభీరవదనులై పాపను ఎత్తుకున్నారు, భార్యను గమనించినా గమనించనట్లే ముభావంగా వుండిపోయారు.
    ఆమె ఉస్సురని విశ్వసించింది. గబగబ గదిలో కెళ్ళి వెండిపళ్ళెంలో అమర్చిన చీర, రవికె గుడ్డ, పసుపు కుంకుమ, పువ్వులు తెచ్చింది.
    కూతురికి బొట్టుపెట్టి - తల్లో పువ్వులు పెట్టింది.    
    చీరను చేతిలోకి తీసికొంటూ వుండగనే గబుక్కున అంది.
    "అమ్మా-పసుపుకొమ్ములు, ఆకువక్కలు ఇటుతే, అవన్నీ ఎందుకిప్పుడు!.... పోనీ పొట్లం కట్టివ్వు-కళ్యాణి కిస్తాను."
    ఆమె చలనరహితయై కూతురువంక అతిదీనంగా చూసింది. ఆమెకు తెలుసు, మంజు ఎందుకు నిరాకరిస్తుందో, కుమార్ కు ఏమీ యివ్వకుండా తనకుమాత్రమే ఈ పెట్టుపోతలు దేనికి? ఇద్దరు కలిసివచ్చారు, సుఖానికి దుఃఖానికి జంటగానే ఉండిపోయారు. తనభర్తను గౌరవించను మనసురాని నీళ్ళ దగ్గరనుంచి తనకీ పట్టుబట్టలు దేనికి?
    తల్లి కళ్ళు వాల్చేసుకుంది. శిలా ప్రతిమయై మౌనందాల్చి నుంచుంది ఆ కళ్ళలో -సుళ్ళు తిరిగి తిరిగి కన్నీరు టప్ టప్ మని పళ్ళెంలో పడ్తున్నాయి. మంజుకు దుఃఖం ఆగిందికాదు. అదురుతున్న క్రింది పెదవిని పంటితోనొక్కి వట్టి తాంబూలంమాత్రం తీసికుంది. తల్లి చేతి లోని పళ్ళెం అందుకుని బల్లమీద పెట్టింది తల్లికి కొడుకు నందిచ్చింది కుచ్చిళ్ళు సర్దుకునే నెపంతో.
    "అమ్మా-వస్తామరి-కళ్యాణికేం చెప్పమంటావ్."
    ఆమె ఊరడిల్లింది.... "అంతా కులాసా అని చెప్పు.....ఆరోగ్యం జాగ్రత్త అని మరీ మరీ చెప్పు" మంచి కొడుకును అందుకుంటుంటే-ఆమె బిడ్డను హృదయానికి గాఢంగా హత్తుకున్న తర్వాతనే ఇచ్చింది.
    పిల్లలకైనా ఏదైనా కుట్టించుమంజూ" తండ్రి డబ్బు యివ్వబోయాడు.
    "ఆ.....ఎందుకండీ.....ఉండండి ఉంచండి" అంటూ కుమార్ అడ్డు తగిలాడు. ఆయన నోట్లను నలుపుతూ నుంచున్నాడు.
    "పాపచేతిలో పెట్టండీ" అంది భార్య.
    "వద్దమ్మా వద్దు, తీసికోకూడదని దానికేం తెలుసు?' మంజు అంది. ఇదేదో ముసుగులో గుద్దులాటలా వుంది. మంజు పట్టుబడ్తే తిరుగులేదని ఆమెకు. అతనికి తెలుసు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS