"ఆపండహే వెధవ మోత. రాజూ వెంగమాంబ..... రాజూ- వెంగమాంబ అంటూ పిచ్చిక్కించేస్తున్నారు. ఇదిగో త్రీనాట్ త్రీ.... ఆ టీవీ ఆఫ్ చేసెయ్" అరిచాడు సర్కిల్.
ఆ మాటతో షైనీ మండిపడింది.
"నా టీవీ నా ఇష్టం! మధ్యలో మీరెవరండీ ఆఫ్ చేయడానికి? మా అపార్ట్ మెంట్ లేడీస్ అంతా టీవీలో కనబడుతున్నామా లేదా అని చూసుకోడానికి ఇక్కడ పెట్టుకున్నాం! ఆ టీవీ ముట్టుకున్నారంటే మర్యాదగా ఉండదు"
షైనీ తిరగబడేసరికి సర్కిల్ సైలెంటయిపోయాడు.
"ఐ సపోర్ట్ షైనీ" అన్నాడు కృష్ణమూర్తి మామూలుగానే.
"దినేష్! నువ్ డిఎన్ ఎ టెస్ట్ కి సిద్దమేనా?"
"నాకెందుకు సార్ డిఎన్ ఎ టెస్ట్! రాధికను ప్రెగ్నెంట్ చేసిన దీపక్ కి చేయమనండి!"
అందరూ ఉలిక్కిపడ్డారు.
"దీపక్ ఎవరయ్యా బాబూ! ఉన్నోళ్ళతోనే ఛస్తూంటే ఆ దీపక్ పేరెందుకొచ్చింది?"
"ఏమ్మా రాధికా! ఆ దీపక్ నీ బిడ్డకు తండ్రి అని దినేష్ అంటున్నాడు. ఆ దీపక్ ఎవరసలు?"
"ఆ దినేష్ గాడిని చెప్పు తీసుక్కొడతా! దీపక్ నాకు అన్నలాంటివాడు. మా ఇద్దరినీ కలిపింది అతనే!"
"అసలు దీపక్ ఎవరు?"
"తుగ్లక్ ఛానల్లో సయ్యాట కావాలా? లవ్వాట కావాలా?' ప్రోగ్రాం యాంకర్ సార్. అతనే ఫోన్ లో జంటలు ఏ లాడ్జ్ లో, ఏ పార్క్ లో, ఏ ఫామ్ హౌస్ లో కలుసుకోవాలో అన్నీ హెల్ప్ చేస్తుంటాడు. ఒంటరిగా ఉండే గాళ్స్ నీ-బాయ్స్ నీ ఫోన్ లో కలిపి జంటలుగా చేస్తుంటాడు. అతను నాకు అన్నయ్యలాంటివాడు. అతనికి రాఖీ కూడా కట్టాను".
"అలాగా వాడినీ నీకు ఆ సంబంధం లేకపోతే మీరిద్దరూ గ్రీన్ పార్క్ హోటల్లో రూమెందుకు తీసుకున్నారని నేనే అడిగాక వాడికి రాఖీ కట్టావ్" దినేష్ అరిచాడు ఆవేశంగా.
"ఆ దినేష్ మాటలు నమ్మకండి సార్! దీపక్, నేనూ అన్నాచెల్లెళ్ళ బంధంతోనే నా బర్త్ డే నాడు హోటల్ రూమ్ లో గడిపాం! ఆ రాత్రంతా అన్నాచెల్లెళ్ళ ప్రేమకు సంబంధించిన సినిమా పాటలు వింటూ గడిపాం. కావాలంటే మాతోపాటు అదే రూమ్ లో ఉన్న దీపక్ ప్రియురాలి స్రవంతిని అడగండి"
"అబ్బా" తల గట్టిగా పట్టుకుని నేలమీద కూర్చుండిపోయాడు సర్కిల్.
కానిస్టేబుల్, ఎస్.ఐ.లు అతని చుట్టూ మూగారు.
"ఏమిటి సార్-ఏమయింది?"
"స్రవంతి అని కొత్త కారెక్టర్ ఎంటరయ్యేసరికి కళ్ళు తిరిగినట్లనిపించింది. వెంటనే ఈ రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ లో టెర్రస్ క్లోజ్ చేసి లాక్ చేయించండి. లేకపోతే ఇంకెంతమంది వాటర్ టాంక్ మీదెక్కి దూకి ఛస్తారో ఏమో!"
సర్కిల్ ఇన్ స్పెక్టర్ చూస్తుండగానే ఇంకో బ్లాక్ వాటర్ టాంక్ మీద నుంచి ఇంకో కొత్త లేడీ గొంతు వినిపించింది.
"సార్ నా పేరు స్రవంతి! ఆరు నెలల క్రితం నేను టి.వి. టవర్ ఎక్కిదూకబోయాను. అప్పుడూ మీరే వచ్చి నా కోరిక ప్రకారం నాకూ, దీపక్ కీ ఆ టవర్ కిందే పెళ్ళి చేయడానికి ఒప్పుకొని ఆ టవల్ కిందకు దిగగానే పెళ్లి జరిపించారు గుర్తుందా సార్?"
సర్కిల్ ఆశ్చర్యంగా చూశాడు.
"అవును స్రవంతీ! నీకు, దీపక్ కీ మీ కోరిక మీద దీపక్ తల్లిదండ్రులను బెదిరించి ఒప్పించి పెళ్లి చేసాం కదా! మళ్ళీ ఇక్కడ వాటర్ టాంక్ ఎందుకెక్కావు?"
"ఆ దీపక్ నుంచి నాకు విడాకులు కావాలి! వాడు నన్ను నరకయాతన పెడుతున్నాడు. రోజుకోదాన్ని ఇంటికి తీసుకొచ్చి 'ఇదే నా అసలు పెళ్ళాం......నువ్వు మాకు చాకిరీ చేయాల్సిందే' అంటూ కొడుతున్నాడు. ఏదో రోజు నన్ను హత్య చేస్తానంటున్నాడు. ఇప్పటికిప్పుడు నాకు ఆ మృగం నుంచి విడాకులు ఇప్పించకపోతే నేను దూకి చచ్చేది ఖాయం! వాడి చేతిలో చావటం కంటే ఇలా ఛస్తే టీవీ కవరేజయినా దొరుకుతుంది" అందామె ఆవేశంగా!
"రాజూ! ఇప్పుడక్కడ పరిస్థితి ఏంటి! ఒక్కరయినా దూకారా? లేదా? దూకడానికి ఇంకెంతసేపు పట్టవచ్చు? చర్చలు జరుగుతున్నాయా?" వెంగమాంబ నుంచి మళ్ళీ ప్రశ్న.
"ఇంతవరకూ ఎవరూ దూకలేదు వెంగమాంబా- అసలిక్కడ ఎవరు ఎందుకు దూకుతున్నారో, ఎవరు ఎవరికోసం దూకుతున్నారో, ఇంతవరకూ ఎందుకు దూకటం లేదో, ఒకవేళ దూకితే ఎప్పుడు దూకుతారో, ఒకవేళ దూకకపోతే ఎందుకు దూకరో....ఏమీ అర్ధం కావటం లేదు వెంగమాంబా"
అప్పుడే పోలీస్ వైర్ లెస్ హడావుడిగా మోతెక్కింది. 'ఇనస్పెక్టర్ శ్రీరామ్..... ఇన్ స్పెక్టర్ శ్రీరామ్- అర్జంటుగా అధికార పార్టీ ఆఫీస్ కార్యాలయానికి ప్రొసీడ్ అవ్వాలి. అక్కడ నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేదని వారి అనుచరులు యాభైమంది పెట్రోలు పోసుకుని లైటర్ తో అంటించుకోవడానికి సిద్దంగా ఉన్నారు. వెంటనే ప్రొసీడ్ అయి వాళ్ళని రెస్క్యూ చేయాలి! ఓవర్"
"హలో.... శ్రీరామ్ స్పీకింగ్- శ్రీరామ్ స్పీకింగ్.... సార్, ఇక్కడ ఈ ప్రేమ గొడవల్లో దూకే వాళ్ళ సంఖ్య నాలుగుకి చేరింది. వీళ్ళను వదిలి పార్టీ ఆఫీస్ కి వెళ్ళమంటారా సార్! వెయిటింగ్ ఫర్ ఇన్ స్ట్రక్షన్స్ సార్- ఓవర్"
"నలుగురు పోతేపోనీ.....యాభైమంది ఇంపార్టెంట్ మనకి. పైగా ఇది పొలిటికల్. టాప్ ప్రయారిటీ-ప్రొసీడ్ ఇమ్మీడిఎట్లీ......ఓవర్" సైరన్ మోగించుకుంటూ వెళ్ళిపోయారు.
సర్కిల్ టాంక్ ల మీదున్న నలుగురికీ వార్నింగిచ్చాడు.
"ఏయ్! నేను అర్జెంట్ ఆత్మహత్యల కేసుకెల్తున్నా వచ్చేవరకు అక్కడే ఛావండి. దూకారో కేస్ బుక్ చేసి లోపటజేస్తా! సమజయిందా!" అంటూ పోలీసులందరినీ తీసుకొని వాన్ సైరన్ మోగించుకుంటూ వెళ్ళిపోయారు.
వెంగమాంబ మళ్ళీ లైన్లోకొచ్చింది- "రాజూ.....ఇప్పుడక్కడ పరిస్థితేంటి? పోలీసులేమంటున్నారు?"
"వెంగమాంబా! ప్రస్తుతం ఇక్కడ పోలీసులు లేరు వెంగమాంబా! పార్టీ వర్కర్స్ మూకుమ్మడిగా పెట్రోలు పోసుకుని తగలబెట్టుకోబోతున్నారని ఇన్ ఫర్మేషన్ రావడంతో వాళ్ళని రక్షించడానికి అక్కడికెళ్ళారు వెంగమాంబా"
"అయితే ఆ నలుగురూ ఏమంటున్నారు? దూకుతారా? లేదా?"
"అదే అయోమయంగా ఉంది వెంగమాంబా!" ఇవి దూకే మొఖాల్లాగా నాకు కనిపించటం ఎందుకంటే టెర్రస్ ల మీద వాళ్ళు మందు బాటిళ్ళు, చికెన్ కర్రీలూ, స్టాక్ చేసుకున్నారని తెలుస్తోంది. గనుక ఈ వ్యవహారం ప్రస్తుతం ఎటూ తేలని పరిస్థితి వెంగమాంబా"
"మరిప్పుడు ఆ అపార్ట్ మెంట్స్ కమిటీ వాళ్ళేమంటున్నారు?"
"ఇప్పుడే ప్రెసిడెంట్ హమీద్ మియాగారితో మాట్లాడతాను వెంగమాంబా- హమీద్ మియాగారూ! ఆ దూకే వాళ్ళతో మీరు చర్చలు జరుపబోతున్నారా?"
"అంటే మాకెవరికీ ఏం పనీపాటా లేవనుకున్నయ్? దూకే వాటితో చర్చలే మాకుపని అనుకున్నయ్? దూకి ఛస్తే ఛస్తయ్- ఉంటే ఉంటయ్- మేమందరం ఎవరిఫ్లాట్ కి వాళ్ళు పోతున్నాయ్- ఛలో భయ్ - సబ్ లోగ్ అందర్ ఛలో" అన్నాడు హమీద్ మియా కోపంగా. మొత్తం అందరూ ఫ్లాట్స్ లోపలికెళ్ళిపోయారు నిరుత్సాహంగా.
"మాణింగ్ నుంచీ అనవసరంగా వెయిట్ చేశాం! ఒక్కడయినా దూకి ఛస్తేనా?" విసుక్కుంటూ టి.వి.సెట్ లోపలకు తీసుకెళ్ళిపోయింది షైనీ.
వెంగమాంబ మళ్ళీ లైన్లో-
"రాజూ- ఏం జరుగుతోందక్కడ? లేటెస్ట్ న్యూసేంటి?"
"ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది వెంగమాంబా. కృష్ణానగర్ లో కొంతమంది సినిమాల్లో ఎక్ స్ట్రాగా పనిచేసే గాళ్స్ తమ డిమాండ్స్ ని సినీ పరిశ్రమ అంగీకరించాలని కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్నారట వెంగమాంబా- ఆ కవరేజ్ ని మన ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు కాబట్టి అక్కడికి వెళ్తున్నా వెంగమాంబా తుగ్లక్ ఛానెల్ కోసం కెమెరాస్ సునీతతో తుగ్లక్ రాజు"
"వెంటనే తుగ్లక్ ఛానెల్ వాళ్ళు కారులో అర్ధనగ్న ప్రదర్శనలకు లైవ్ ప్రసారం చేయడానికి వెళ్ళిపోయారు.
ఆ తరువాతేం జరిగిందో మాకు తెలీదు. మర్నాడు ఉదయం అందరం బయటికొచ్చి చూస్తే ఎవ్వరూ దూకిన దాఖలాలేమీ కనబళ్ళేదు సరికదా ఆ దూకేవాళ్ళు కూడా లేరు.

