Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 30

 

    విమల తన భార్య కాదు. వేశ్య! ఆమెనొక వేశ్యగా భావించి అనుభవించాలి!
    రవికి శరీరావసరం ....ఈ తర్కాన్ని ఉపయోగించుకున్నది.
    అతడి వంటిలోని వేడి తగ్గడానికి కాసేపు పట్టింది. ఆపైన విమల అతడికి విందు భోజనం కొసరి కొసరి తినిపించింది.
    "మీ కిష్టమని పులిహోర చేశాను. మీ కిష్టమనేసేమ్యా హల్వా చేశాను..." అంటూ ఆమె అతడికి ఒకోక్కట్టే వడ్డిస్తుంటే రవికి చిన్న అనుమానం వచ్చింది.
    "ఇది నేను వచ్చేక చేసిన వంట కాదు. నేను వస్తానని ముందే ఊహించావా?' అన్నాడు రవి.
    'ఊ" అంది విమల.
    "ఎలా ఊహించావు ?"
    "మీరు వస్తారని తెలిసే మా వాళ్ళంతా మనకు ఏకాంతాన్ని వదలి వెళ్ళిపోయారు. నేను మీకిష్టమైన వంటలన్నీ చేశాను" అంది విమల.
    'అదే -- ఎలా తెలుసు? -- అని అడుగుతున్నాను" అన్నాడు రవి. అతడి కంఠంలోని కాఠిన్యం హెచ్చింది.
    "నా ఉత్తరం అలాంటిది కదా -- అది అందుకున్న వెంటనే మీ ఊళ్ళో ఏ ట్రైన్ కు మీరు బయల్దేరతారో -- ఈ ఊరు ఎప్పటికి చేరుకుంటారో ....అన్నీ సరిగ్గా నేను లెక్క కట్టినట్లు జరిగాయి." అంది విమల.
    "ఏ ఉత్తరం ?" అన్నాడు రవి.
    'అదే-- నేను మూర్తి పేరున రాసిన ఉత్తరం "అంది విమల.
    రవి క్షణకాలం దిగ్భ్రాంతుడయ్యాడు. ఏ ఉత్తరం చూపించి ఆమెను నిలదీయాలను కున్నాడో ఆ ఉత్తరం ప్రసక్తి తనే ముందు తీసుకుని వచ్చింది. అంటే ఇదంతా తన్ను ఇక్కడికి రప్పించడానికి కాడిన నాటకమా!
    'ఆ ఉత్తరం నాకెందుకు పోస్టు చేశావు?" అన్నాడు రవి.
    "మిమ్మల్నిక్కడకు రప్పించాలని ....నన్ను మీరు త్వరగా మీ వద్దకు తీసుకును పోయే ఏర్పాట్లు చేస్తారని...." అంది విమల నవ్వుతూ.
    రవికీ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. మళ్ళీ అతడి మెదడు చురుగ్గా పని చేయసాగింది.
    విమలకు మూర్తితో వ్యవహారమున్న మాట నిజం. పొరపాటున మూర్తి కానీ వ్రాసిన ఉత్తరం నాకు పోస్టు చేసింది. అయితే జరిగిన పొరపాటు మూర్తి ద్వారనో మరో విధంగానో ఆమెకు తెలిసి వుంటుంది. అప్పుడు వెంటనే యింటిలో చెప్పుకుని వుంటుంది. అంతా కలిసి తన్ను వెర్రి వెధవని చేసి ఆడించడానికో ఉపాయం పన్నారు. అసలు వీళ్ళకీ ఉపాయం ఆ మూర్తి గాడే చెప్పి వుంటాడు.
    "నీ కట్టుకధలు నేను నమ్మను. ఎవడో మూర్తితో నీకు సంబంధ ముంది. వాడికి నువ్వుత్తరం వ్రాశావు. పొరపాటున కవర్లు మారాయి. అది గ్రహించి ఈ కొత్త నాటకం అరంభించావు" అన్నాడు రవి.
    విమల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి -- 'మీరిలాగంటుంటే నాకెంతో బాధగా వుంది. నేను మిమ్మల్ని నమ్మినట్లే మీరు నన్ను నమ్మాలి " అంది.
    "నేను నమ్మను. అందుకీ ఉత్తరమే సాక్షి!"అంటూ జేబులోంచి ఉత్తరం తీశాడు రవి.
    విమల తన జకట్లోంచి ఓ ఉత్తరం తీసి "నేను నిర్దోషిని. అందుకీ ఉత్తరమే సాక్షి" అంటూ అతడికి అందించింది.
    రవి ఆశ్చర్యంగా ఆ కొత్త ఉత్తరాన్ని అందుకున్నాడు. ఉత్తరం చూసేక ఆశ్చర్యంతో అతడి కళ్ళు పెద్దవయ్యాయి.
    అది తనకు వచ్చిన ఉత్తరానికి నకలు. నకలు అంటే వేరే మళ్ళీ వ్రాసినది కాదు. కార్బన్ కాపీ!
    "మీరిలా అనుమానించక పొతే ఎంతో సంతోషించే దాన్ని. అయినా ఆడదిగా నా జాగ్రత్తలో నేనుండడం కోసం ఉత్తరం వ్రాసేట ప్పుడే కార్బన్ కాపీ తీశాను. కార్బన్ కాపీ మీద నా స్నేహితురాలు కమల సాక్షి సంతకం కూడా తీసుకున్నాను. ఇంకా మీకు అనుమానమేనా?" అన్నది విమల.
    "నన్ను క్షమించు విమలా!" అన్నాడు రవి. క్షమార్పణ పేరిట ఆ దంపతులిద్దరూ కొద్ది సేపు ఒకరి కౌగిట్లో ఒకరుండి పోయారు.
    "అది సరే! అసలిలాంటి రిస్కు ఎందుకు తీసుకున్నావు?' అన్నాడు రవి. ఈ పర్యాయం అతడి కంఠం లో లాలన ధ్వనించింది.
    "ఎందుకా?' అంది విమల. తను చెప్పదల్చుకున్నది చాలా వున్నదేమో -- ఆమె తన కంఠాన్నో  పర్యాయం సవరించుకుని అప్పుడు ప్రారంభించింది.
    "ఏం చేయను చెప్పండి ....పెళ్ళయినప్పట్నించీ మా యింట్లో నేను పరాయి దాన్నయిపోయాను. మా యింట్లో అన్నిటికీ నన్ను వేరుగా చూస్తున్నారు. చుట్టుపక్కల కూడా నేనింకా కాపురానికి వెళ్ళలేదని చులకనగా చెప్పుకుంటున్నారు. కొందరైతే మీ గురించి కూడా చెడ్డగా అంటున్నారు. అయ్య అక్కడ -- అమ్మ ఇక్కడ అని చాలామంది వేళాకోళంగా అంటున్నారు. కలో గంజో మీతోనే కలిసి తాగాలనీ, మీతో కలిసి కష్ట సుఖాలు పంచుకోవాలని నాకుంది. మీ గురించిన ధ్యాసలో నాకూ మా యింట్లోని వారంతా పరాయి వాళ్ళుగా కనబడుతున్నారు. చివరికి.... ఇంతపని చేశాను..."
    'ఆయామ్ వెరీ వెరీ సారీ విమలా.... ఇప్పుడు వెళ్ళగానే వారం రోజుల్లో ఇల్లు సంపాదించి నిన్ను తీసుకు వెళ్ళి పోతాను"అన్నాడు రవి.
    'అంత మాటన్నారు అదే చాలు నాకు" అంది విమల.

    
                                   3
    "అదీ సంగతి " అన్నాడు రవి.
    రామం ముఖం ఆనందంతో వెలిగిపోయింది "రవీ -- నీకు నేను అనేక విధాల థాంక్స్ చెప్పుకోవాలి" అన్నాడు.
    "నువ్వా , నాకా!" అన్నాడు రవి ఆశ్చర్యంగా.
    'అవును రవీ ....నీది పాల పొంగు లాంటి ఆవేశం ఎలా పొంగుతుందో అలాగే చల్లారి పోతుంది. నేనలాంటి వాణ్ణి కాదు. నాలో క్రమంగా ఆవేశం పేరుకుని పెరిగి పెరిగి ఒక రోజున  అగ్ని పర్వతంలా బ్రద్దలవుతుంది. అప్పుడు నేనే కాదు -- నా చుట్టూ వున్నవారు కూడా ఎందరో నాశనమవుతారు"అంటూ ....."ఇది చూడు"అన్నాడు రామం.
    రవి చూశాడు. సుమారు పన్నెండంగుళాల కత్తి అది.
    "ఎందుకిది"అన్నాడు రవి ఆశ్చర్యంతో.
    "నేనిది కమలను హత్య చేయడం కోసం కొన్నాను...."
    "కమలనా -- హత్యా -- ఎందుకు?"
    "ఆమె నుంచీ నాకూ అలాంటి ఉత్తరమే వచ్చింది --" అన్నాడు రామం గంబీరంగా.
    "ఆ ఉత్తరం చూడగానే నేనామెను చంపెయాలను కొన్నాను. నీకూ అలాంటి ఉత్తరం వచ్చిందని తెలియగానే నాలో కాస్త ఆశ పుట్టింది. ఇద్దరు స్నేహితురాండ్రు కలిసి ఏదయినా నాటకమాడుతున్నా రేమోనని! అయితే నేనూరికి వెళ్ళదల్చుకోలేదు. వెడితే నీకులా వెళ్ళి మాట్లాడలేను. చాటుగా వెళ్ళి చంపి వస్తాను. అందుకే నిన్ను పంపాను. కానీ నువ్విలాంటి నిజం పట్టుకు వస్తావన్న ఆశ నాకు లేదు. నీకు చాలా థాంక్స్ !"
    తర్వాత రామం భార్యకు ఉత్తరం రాశాడు.
    "డియర్ కమలా!
    నువ్వు కావాలని ఆ ఉత్తరం నా కవర్లో పెట్టి పోస్టు చేశావని నేను గ్రహించ గలను. రవి కిలా నిన్ను సాక్ష్యాలు కూడా అడగను. నేను నిన్ను ప్రేమించాను. ప్రేమిస్తూనే వుంటాను. సరిగ్గా వారం రోజుల్లో మనం కలుసుకుంటాం -- ఆ పైన మన మెప్పుడూ విడిపోమూ .
                                                                                              నీ
                                                                                             రామం --"

    "కమలా ! నువ్వు నీ భర్తకు రాసిన ఉత్తరం నాకు అందింది. అంటే నాకు రాసిన ఉత్తరం నీ భర్తకు చేరిందేమో నన్న కంగారులో పరుగున వచ్చాను--"అన్నాడు మూర్తి.
    "అ ఉత్తరం నేను నీకు పొరపాటున వ్రాయలేదు. కావాలనే పోస్టు చేశాను. నేను నా భర్తను ఎంతగా ప్రేమిస్తున్నానో గ్రహించాలని -- నీకా ఉత్తరం పోస్టు చేశాను" అన్నది కమల.
    'అదే నిజమైతే ఫరవాలేదు కమలా! నే నూళ్ళో లేని సమయంలో నీ ఉత్తరం వచ్చింది. చూడగానే కంగారు పడి పరుగున వచ్చాను. ఏదో క్షణం లో - అజ్ఞానపుటావేశంలో ఓ తప్పు చేస్తే అదే తప్పు కలకాలం చేయకూడదు. ఆ విషయం నాకు తెలుసు -- ...." అని వెళ్ళిపోయాడు మూర్తి.
    అతడు వెళ్ళిపోయినా కొద్ది సేపటికి కమలకు రామం నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదువుకుని ఉత్సాహంగా విమల ఇంటికి పరుగెత్తింది కమల.
    "ఏమిటే ఆ హుషారు !" అంది విమల.
    "విమలా! నీ మేలు మరిచిపోలేను. పొరపాటున మూర్తికీ, ఆయనకూ వ్రాసిన ఉత్తరాలు తారుమారై పోయాయి. ఉత్తరం పోయిన వెంటనే నీకు తెలియబర్చాను. వెంటనే నువ్వూ అలాంటి ఉత్తరం నీ భర్తకు రాసి -- నకలు కూడా వుంచి నాటకమని నిరూపించావు. ఇది నా భర్త మీద బాగా పని చేసింది -- " అంది కమల - రామం తనకు వ్రాసిన ఉత్తరం చూపిస్తూ.
    "మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సవుతుంది. అనే సూత్రాన్ని నేనుపయోగించాను. కానీ ఇక మీదట పొరపాట్లు చేయవు కదూ!" అంది విమల.
    "మూర్తికి కూడా చెప్పవలసిన విధంగా జవాబు చెప్పాను. నా ఆలోచనల్లో నావారు తప్ప యింకెవ్వరూ వుండరిక...."
    "విష్యూ అల్ ది బెస్ట్ " అంది కమల.
    సరిగ్గా రెండు వారాల్లో ఆ అతివలిద్దరూ తమ తమ భర్త లతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు.

                               *** end ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS