Next Page 
అసుర సంధ్య పేజి 1


                        అసుర సంధ్య
                                                సింగిరాజు రామచంద్ర మూర్తి

                            

    బస్సు ఒక్క కుడుపులో ఆగింది. సీటు వెనక తల ఆనించి నిద్ర మత్తు తో కునికి పాట్లు పడుతున్న రాజారావు కళ్ళు విప్పి చూశాడు. కండక్టరు తననే చూసి "మాష్టారూ! మీరిక్కడే దిగాలి. త్వరగా రండి." అనడంతో ప్రస్తుతంలోకి వచ్చి చేతి సంచితో కదిలి వచ్చి బస్సు దిగి నిలబడ్డాడు. తర్వాత ఒక్కసారి చుట్టూ చూసి, అనుమానంతో "రైట్' అనబోతున్న కండక్టరు ను ఆపి, "ఏమండీ? మీరు పోరబడలేదు కదా కొంపదీసి ఇక్కడ చుట్టూ పక్కల ఏ ఊరు ఉన్నట్టు లేదే....!!" అన్నాడు, కండక్టరు వోపికగా లేచి ఫుట్ బోర్డు మీద నిలబడి చెయ్యి చాపి చూపిస్తూ "నేనేమీ పోరబడలేదు. అదుగో! ఆ కాలి బాట కనిపిస్తున్నదే, దాని వెంట సుమారు నాలుగు మైళ్ళు నడిచిపోవాలి మీరు...." అని చెప్పి, తర్వాత పెద్దగా "రైట్ అని అరిచాడు.
    బస్సు విసురుగా కదిలి కొద్ది క్షణాలలో కనుచూపు మేర కూడా దాటి వెళ్ళిపోయింది.
    రాజారావు అలాగే కొన్ని క్షణాలు నిలబడి పోయాడు. అతనికేమీ పాలుపోలేదు. ఒక్కసారి తన ఎడమ వైపు దృష్టి సారించాడు. నిద్రమత్తు ఒదిలిన తన కళ్ళ కిప్పుడు పలుచని వెన్నెలలో పరిసరాలన్నీ స్పష్టంగానే కనుపిస్తున్నాయి. అటు వైపు అన్నీ సరివి తోటలు, దట్టంగా ఏపుగా పెరిగి ఉన్నాయి. నల్లని కాగితం మీద మరింత నల్లని సిరా వొలక బోసినట్లున్నదా వైపు అంతా. తనకు కొద్ది గజాల దూరంలో పెద్ద చింతచెట్టు ఒకటి విసురు గాలికి తల వూపుతూ బ్రహ్మ రాక్షసి లా నిలబడి ఉంది. ఆ చిక్కని కొమ్మలలో కలగుండు పడి విసురు గాలి చేస్తున్న శబ్దం, ఏ సుదూర తీరాల నుంచో, ఏ భిన్న ప్రపంచం నుంచొ వినవస్తున్న అవ్యక్త ఆక్రందనలా వినిపించి గుండెలు జల్లు మనిపిస్తున్నది. ఆవైపున ఆకాశంలో నక్షత్రాలు కూడాలేవు. ఒక్క నక్షత్రం మాత్రం ఒంటరిగా మబ్బు తెరలలో మినుకుమినుకు మని మెరుస్తుంది. ఆ ఒంటరి నక్షత్రం ఎర్రగా రక్త కాంతులతో ప్రకాశించడం గమనించి రాజారావు భయంతో చూపులు తప్పించాడు.
    అతడు సిగరెట్టు కాల్చుకుందామని , సంచి నేల మీద ఉంచి, జేబులో చేయి పెట్టాడు. అగ్గిపెట్టె నూ, సిగరెట్టు పెట్టె నూ ఇవతలకి తీయబోయిన వాడల్లా తన కుడి వేపుకు చూసి భయంతో కోయ్యబారిపోయాడు. ఒక్క క్షణం సేపు వూపిరి ఆగిపోయినట్టయింది. వొణుకు తున్న కుడిచేయి లాల్చీ జేబులో నుంచి ఇవతలికి వచ్చింది. అతడు ఒక్క క్షణం ఆగి గుండె దిటవు చేసుకుని మళ్ళీ అటు చూశాడు. ఆ పక్క కొన్ని గజాల దూరంలో ఎవరో మనిషి రోడ్డు పక్కనే కూర్చుని ఉన్నాడు. తెల్లటి గుడ్డ నొకదాన్ని చుట్టూ కప్పుకుని కూర్చున్నట్టున్నాడు. 'కొంప దీసి అదేమైనా భూతమో, దయ్యమో కాదు గదా! అనిపించింది రాజారావు కు. తర్వాత ధైర్యం తెచ్చుకుని అటు వైపు కొన్ని అడుగులు వేశాడు. అసలు విషయం గమనించిన తర్వాత అతనికి పెద్దగా నవ్వు వచ్చింది. తాను మరో మనిషిగా భూతంగా భావించింది ఆ మైలు రాయినని తెలిసిన తర్వాత అతనికి నవ్వు పొంగి పొర్లి వచ్చింది. పెద్దగా, మరింత పెద్దగా ఆ నీరవ నిశీధి లో రోడ్డు పక్కన నిలబడి తనకు తానె నవ్వుకున్నాడు.
    కొద్ది క్షణాల తర్వాత సిగరెట్టు ఇవతలికి తీసి అగ్గిపిల్ల వెలిగించి ఆ వెలుగులో చేతి గడియారం చూశాడు. తొమ్మిది గంట లయింది. ఈపాటికీ తాను ఉంటున్న పట్నంలో అయితే ఎంత హడావిడీ! ఇక్కడ వలె ఇంత భయంకరంగా ఎప్పుడూ ఉండదక్కడ, అయినా తన తెలివి తక్కువ కాకపొతే ఈ సమయంలో ఈ ప్రయాణ మేమిటి? పొద్దు వాటారే లోపులాగానే ఆ వూరు చేరుకునే విధంగా బయలుదేరి వచ్చి వుంటే ఎంతో బాగుండి పోయేది. అయినా ఇప్పుడిహ ఏమనుకుని మాత్రం లాభమేమిటి?
    అతడు మైలు రాయి మీద కూర్చుని కాలు వూపుతూ సిగరెట్టు పీలుస్తూ కాలిబాట వంక చూశాడు. అది లేత వెన్నెల్లో స్పష్టా స్పష్టంగా కనిపిస్తున్నది. పెద్ద తాచు  పాములా మెలికలు తిరిగి సరివి తోటల మధ్యగా సాగిపోతున్నది ఆ బాట వెంట తానిప్పుడు నాలుగు మైళ్ళు దూరం నడిచి వెళ్ళాలని అనుకుంటేనే బాధగా వుంది. "ఎందుకొచ్చిన ప్రయాణం రా భగవంతుడా" అనిపిస్తున్నది. ఆ దోవ కటూ ఇటూ చిన్న చిన్న పొదలూ, చెట్లూ ఉన్నాయి. ఏ పొదలో నుంచి ఏ పాము వచ్చి కాటు వేసినా తన పని ఆఖరే.... "అయ్యో" అనే దిక్కు కూడా లేకుండా అన్యాయంగా చావాలి. తెల్లవారిన తర్వాత ఎవడయినా చూస్తె దిక్కులేని శవమని దయతలిచి నాలుగు కట్టే పుల్లలు పేర్చి -- ఇక్కడ వాటిని కొననక్కర లేదుగా-- తగలేస్తారు . ఎవరూ చూడకపోతే అదీ లేదు. రాబందులు పీక్కు తింటాయి.
    రాజారావు కు తన ఆలోచనల సరళి నవ్వు తెప్పించింది. "ఛీ! ఏమిటీ పాడు ఆలోచనలు....అనుకుని మైలురాయి దిగి నిలబడి సంచి చేతిలోకి తీసుకుని కాలి బాట వెంట నడవడం ప్రారంభించాడు.
    ఎక్కడో ఏదో పక్షి అరుస్తున్నది. చల్లని గాలి విసురుగా వీస్తున్నది. కీచురాళ్ళ శబ్దం నిర్విరామంగా, కర్ణ కఠోరంగా వినిపిస్తున్నది. ఆకాశం మేఘామృతమై నిండు కుండలా వుంది. ఇంతకూ ముందు ఎర్రగా రక్త కాంతులతో ప్రకాశించిన నక్షత్రం కూడా ఇప్పుడు ,మబ్బుల మాటున చిక్కుబడి పోయింది. కాలి బాట కుడి వైపున దూరంగా కనిపిస్తున్న ఎత్తయిన చెట్ల గుంపు, ఏదో భయంకర మృగం కూర్చుని ఉన్నట్లుగా ఉంది. రాజారావు కు అటు చూస్తె, వొళ్ళు జలదరించింది.
    కొద్ది దూరం నడిచిన తర్వాత అతడు భయంతో కేవ్వుమన్నంత పని చేశాడు. కాలికి ఏదో చుట్టుకున్నది. అతడువొంగి దాన్ని చేతితో విదిలించబోయాడు. అది అతని చేతికి చుట్టుకున్నది. అతడు నెమ్మదిగా గుండె దిటవు చేసుకుని దాన్ని కళ్ళకు దగ్గరగా ఉంచి చూశాడు. అది పాము కుబుసం. పొడుగైన సిల్కు గుడ్డ పీలికలా ఉంది. అతడు  తనలో తను నవ్వుకుని దానిని పక్కకు విసిరివేసి మళ్ళీ నడవటం ప్రాంభించాడు. కొద్ది గజాలు నడిచి జేబులో నుంచి సిగరెట్టు తీసి కాల్చుకున్నాడు. ఆ వెలుతురులో చూస్తె పై ట్రేడ్ మార్కు కాయితం చింపి వేయబడిన ఆ అగ్గి పెట్టెలో మరి రెండు పుల్లలు మాత్రమె ఉన్నాయి. సిగరెట్లు ఫరవాలేదు. నిండు పెట్టెలో తానిప్పటికీ మూడు మాత్రమె కాల్చాడు.
    అతని కెదురుగా ఆకాశంలో పై నుంచి క్రింది వరకూ పెద్ద వెలుగు రేఖ గీచినట్టు మెరుపు మెరిసింది. నల్లని ఏనుగుల వలె ఉన్న మబ్బులు ఆకాశ రాజ్యంలో కొలువు దీరి "మన ప్రతాపం ఎప్పుడు ప్రదర్శించాలి? ' అనే విషయం మీద సమాలోచనలు జరుపుతున్నట్టున్నాయి. చల్లని గాలి ముందునుంచే తన ప్రయత్నం ప్రారంభించి కత్తి లాగా చురుకుగా వేగంగా వీస్తున్నది.
    రాజారావు మనస్సులో ఇప్పుడేవేమీ లేవు. అతడు యంత్ర వతుగా కాలిబాట వెంట నడిచి పోతున్నాడు. ఆ నడక ఇప్పుడంతా బాధగా లేదు. బయట చలిగాలి కత్తిలాగా తన ప్రతాపం చూపుతూ వీస్తున్నప్పటికి అతని మనసులో వెచ్చగా ఉంది. అందుకు కారణం వరలక్ష్మీ. ఆపిల్ల ఇప్పుడతని మనసులో బంగారు బొమ్మలా మెదులుతున్నది. ఇంతవరకూ జరిగిపోయిందేదో జరిగిపోయింది. కాని యిక అలా వీలులేదు. వరలక్ష్మీ తనది కావాలి. ఎప్పుడో ఏదో సందర్భంలో తన తల్లి వర్ణించి చెప్పిన వరలక్ష్మీ రూపు తన మనసులో హత్తుకు పోయింది. ఆమె దివ్య సుందరి వలె వెలుగులు చిమ్ముతూ తన మనసులో అత్యంత మనోహరంగా నిలబడి ఉండగా బయటి ప్రపంచం లోని క్షుద్రమైన చలిగాలి వోడిపోక ఏం చేస్తుంది?
    రాజారావు గర్వంగా వూపిరి పీల్చాడు. 'వరలక్ష్మీ తనది' అనే భావం అతనికి ఎంతో సంతృప్తి కలిగించింది. అతని నడక వేగం హెచ్చింది. హుషారుగా యిల వేస్తూ త్వరత్వరగా నడవ సాగాడు.

                       *    *    *    *
    అతడు అగ్గిపిల్ల వెలుతురులో చేతి గడియారం చూసుకుని "పదిన్నర ....అంటే నాలుగు మైళ్ళూ గంటన్నర లో నడిచాడన్న మాట" అనుకున్నాడు.
      అతడిప్పుడు వూరు చేరుకొని దేవాలయం ముందు నిలబడి ఉన్నాడు. అంత చీకటి లోనూ దేవాలయం గోడ మీద ఉన్న ఎరుపు తెలుపు చారలు కనిపిస్తూనే ఉన్నాయి. లోపలి నుంచి ఎవరిదో దగ్గు వినిపిస్తున్నది.
    రాజారావు ముందుకు అడుగు వేయబోయిన వాడల్లా చివాలున ఆగిపోయాడు. అతని ముంజేతి మీద పెద్ద వర్షపు చినుకు ఒకటి పడింది. మరి కొద్ది క్షణాలలోనే తన నెవరో తరుముకుని వచ్చినట్టు హటాత్తుగా పరమ బీకరంగా వర్షం పడటం ప్రారంభించింది. అతడు తటాలున గుడి లోపలికి పరుగెత్తి మంటపం లో తలదాచు కున్నాడు. అయినా ఈ కొద్ది గజాలు పరుగెత్తి వచ్చే లోపలే వర్షం అతని తడిపి వేసింది. ఆ కాస్సేపటి లోనే కంకర రాళ్ళతో కొట్టి నట్టయింది.
    అతడు మంటపం లో నిశ్చలంగా నిలబడి పై నుంచి పడుతున్న వర్షపు ధారల వంక చూస్తూ ఉండిపోయాడు. మంటపం లో ఉన్న చిన్న దీపపు ప్రమిద వెలువరిస్తున్న సుందరమైన కాంతి లో కింద కొంత మేర కనిపిస్తున్నది. కొద్ది నిమిషాల వానకే మండటం నేల ముందు నీళ్ళు నిలిచాయి. ఇంకా వర్షం దారుణంగా చప్పుడు చేస్తూ కుండపోతగా పడుతూనే ఉన్నది. ఇప్పట్లో అది తగ్గే సూచనలేవీ కనిపించటం లేదు.

                                   


Next Page 

WRITERS
PUBLICATIONS