రాజారావు స్తంభాని కానుకుని కూర్చున్నాడు. అతనికి నిద్ర రావటం లేదు. నిజానికి పరాయి చోట్ల అతడికి ప్రాణాంతకంగా ఉంటుంది. అసలే కొత్త ఊరు .....అర్ధరాత్రి వేళ....కటిక చీకటి....పై నుంచి దారుణమైన వాన....ఇన్నిటితో అతని మనసు కకావికలైంది. ఒకవేళ వర్షం తగ్గినా తనకు తనవారి ఇల్లు తెలియదు.ఎవరినైనా వాకబు చేసి కనుక్కుని వెళ్ళాలి. ఈ అర్ధరాత్రి వేళ తనకు ఎవరా సహాయం చేయగలరు? ఇంతకూ ముందు ఈ దేవాలయం లోపలి నుంచి ఎవరిదో దగ్గు వినిపించింది. ఇప్పుడిక్కడేవ్వరూ లేరు. అదేమీ చిత్రమో!
రాజారావు జేబులో నుంచి సిగరెట్టు పెట్టె తీశాడు. చివరి సిగరెట్టు ఒకటి మాత్రం మిగిలి ఉంది. మిగిలినవన్నీ అయిపోయాయి. అగ్గి పెట్టె లేదు. అది దోవలోనే అయిపొయింది. అతడు చింతతో ఒక్క క్షణం అలాగే కూర్చున్నాడు. తర్వాత అతని దృష్టి గూటిలో వెలుగుతున్న ప్రమిద మీద పడింది. విసురు గాలికి ఆపసోపాలు పడుతూ మంద మందంగా వెలుగుతున్న దది. బహుశా కొంతసేపటికి అరిపోతుందేమో!
అతడు చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. ఏ అలికిడి లేదు. ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా లేచి గూటి దగ్గరికి వెళ్లి సిగరెట్టు ముట్టించుకొబోయాడు. కాని అంతలోనే అది అతన్ని హతశుడ్ని చేసి, ఒక విసురు గాలి అలకు లొంగి ఆరిపోయింది.
అతడు 'ఉస్సు' రని నిట్టురుస్తూ వెనుదిరిగి ఆగిపోయాడు. తానింత కు పూర్వం కూర్చున్న స్తంభాని కి ఎదురుగా ఇప్పుడెవరో కూర్చుని ఉన్నారు. అతడు ముందుకు అడుగు వేస్తూనే "ఎవరది?' అన్నాడు. అటువైపు నుంచి కూడా అదే సమయం లో అదే ప్రశ్న వచ్చింది. ఆ మనిషి మోకాళ్ళ చుట్టూ గుడ్డ కప్పుకుని కూర్చుని ఉన్నాడు.
రాజారావు ముందుకు వచ్చి తన సంచి పక్కన కూర్చుని "నేనీ వూరికి కొత్త వాణ్ణి. ఇంతకుమునుపెప్పుడూ ఇక్కడికి రాలేదు..." అన్నాడు.
అవతలి వ్యక్తీ "ఓహో" అని మాత్రం అని వూరుకున్నాడు. ఇంకేమీ మాట్లాడలేదు. రాజారావు కు అతడిప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతడు ముదుసలి....అరవై ఏళ్ళ వయస్సుండవచ్చు. అయినా దృడ కాయుడు. గడ్డము మీసాలు బాగా పెరిగి ఉన్నాయి. అతని కన్నులు చాలా చురుకుగా చూసే లక్షణం కలవి. అతడు ఒక్కసారి గడ్డం చేత్తో నిమురుకుని కప్పుకున్న గుడ్డను సరిగా సర్దుకున్నాడు.
తర్వాత కొద్ది సేపాగి అతడు "ఎవరి ఇంటికి వెళ్ళాలి మీరు?" అని ప్రశ్నించాడు. అతని కంఠస్వరం చిత్రంగా ఉంది. తుప్పు పట్టిన ఇనుప గొలుసులను కదిలించినట్టుంది.
రాజారావు ఆ ప్రశ్న విని సర్దుకుని కూర్చుంటూ "రాఘవయ్య గారని ..వైద్యుడున్నాడే ....వారి ఇంటికి వెళ్ళాలి...." అన్నాడు.
అది వింటూనే అవతలి వ్యక్తిలో విచిత్ర మైన సంచలనం కనిపించింది. ఒక్క క్షణం ఆగి చిత్రమైన కంఠస్వరంతో "మీకు తెలియదా?' అని అడిగాడు.
రాజారావు కు అర్ధం కాలేదు. అర్ధం కానట్లు గానే చూసి "ఏమిటి తెలియడం?' అని అడిగాడు.
ఆ వ్యక్తీ మాట్లాడలేదు, రాజారావు వంక తీక్షణంగా చూస్తూ అలాగే కొద్ది క్షణాల సేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
రాజారావు మళ్లీ "ఏమిటి? చెప్పరేం?' అని అడిగాడు. అది విని అవతలి వ్యక్తీ నెమ్మదిగా గొణుగుతున్నట్టు "మీకు తెలియదూ? అయన యిటీవలే చచ్చిపోయారు." అన్నాడు.
రాజారావు ఆశ్చర్యంతో తలఎత్తి "ఏమిటీ ? చచ్చిపోయాడా అయన?" అతని గొంతు ఒణికింది. అవతలి వ్యక్తీ ఒక్క క్షణం ఆగి, "చచ్చిపోవడం కాదు ఆయన్ను ఎవరో చంపేశారు. దారుణంగా చంపేశారు అన్నాడు. రాజారావు మొహంలో విపరీతమైన ఆశ్చర్యం ప్రస్పుటమైంది. ఆ వ్యక్తీ అతని ఆశ్చర్యం గమనించాడు.
రాజారావు ఆందోళన తో కూడిన కంఠస్వరంతో "ఏమిటది? ఆయన్ను చంపెశారా? ఎవరు? ఎందుకు?' అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఆ వ్యక్తీ గంబీరంగా "అవును. ఆయనను హత్య చేశారు. అదీ పరమ దారుణంగా చేశారు. మీకు తెలిసే ఉంటుంది. అయన యీ ప్రాంతంలో ప్రసిద్ది పొందిన వైద్యుడు. ఎక్కడెక్కడి నుంచి ఏవేవో మూలికలు సంపాయించి తెచ్చి వైద్యం చేస్తూ ఉండేవాడు. ఆ హస్తవాసి ఎంటువంటిదో గాని ఎటువంటి మొండి రోగమైనా అయన పేరు వినబడితే ఆమడ దూరం పారిపోయేది. అయన ఒక్కొక్కప్పుడు తనకు కావలసిన మూలికల కోసం చీకటి రాత్రులలో ఎంతెంతో దూరం జనసంచారం లేని చోట్ల నడిచి పోయేవాడు. మొన్ననూ అలాగే వెళ్ళాడు అలా వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. దానితో అందరికీ ఆదుర్దా కలిగి, వెదికితే ఇక్కడికి మూడు మైళ్ళ దూరంలో ఎవరూ, ఎన్నడూ వెళ్లని ఒక చోట చచ్చి పడి ఉన్నాడు. ఎవరో అయన కొడవలి తోనే అయన కంఠం తెగనరికి చంపేశారు. శవమూ, దాని పక్కన కొడవలీ కనిపించాయి. అయన ప్రాణాలు వదిలేటప్పుడు చేతిలో పచ్చని కొమ్మలు కొన్ని ఉన్నాయి. ఆ చేతుల లాగే బిగుసుకు పోయి ఉన్నాయి. అని చెప్పాడు.
రాజారావు అంతా విని మ్రాన్పడి పోయాడు.అది చూసి ఆ వ్యక్తీ "నిజమే ! ఎవరికైనా అటు వంటి మంచి మనిషి పోయాడని విన్నప్పుడు బాధ కలుగుతుంది. అందునా యిది దారుణమైన హత్య కావడం మరింత విచిత్రం....ఇంతవరకూ ఆ వ్యవహారం ఆనుపానులు ఏదీ లేదు. పోలీసులు వచ్చి పంచాయితీ జరిపి నమోదు చేసుకుని వెళ్ళారు. కానీ నాకు నమ్మకం లేదు. ఆ హంతకుడు దొరుకుతాడని నాకు ఏ కోశానా ఆశ లేదు. ఎందుకంటె హత్య జరిగిన చోట గాని ఆ ప్రాంతాలలో గానీ ఏ విధమైన గుర్తులూ లేవు....' అన్నాడు.
బయట వర్షం తగ్గలేదు. సరిగదా, మరింత విజ్రుంభించింది. కొద్ది క్షణాల సేపు ఆ యిద్దరి మధ్యా నిశ్శబ్దం రాజ్యం చేసింది. చివరకు రాజారావు నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టు "అయితే ఆ దారుణం ఎవరు చేసి ఉంటారో వూహించలేమా?" అన్నాడు.
ఆ వ్యక్తీ "అంటే" అని అడిగాడు.
రాజారావు 'అంటే ఏం లేదు....ఎవరైనా అయన మీద పగ తీర్చుకునేందుకుకో లేకపోతె ఆయనను చంపినందువల్ల ఏదైనా లాభం కలిగితెనో అటు వంటి పని చేసి ఉంటారు. ఇప్పుడ'ల్లా అనుమానించదగిన వారెవరూ లేరా?' అని అడిగాడు.
ఆ వ్యక్తీ కొద్దిసేపాగి మందహాసం చేశాడు. 'అవును....అటువంటి అనుమానం రావడం సహజమే....కాని యిక్కడ అందుకు అట్టే ఆస్కారం లేదు. అయన మీద పగబట్టిన వారెవరూ లేరు. కాకపొతే పడని వాళ్ళుండటం లో ఆశ్చర్యం లేదు. మనలో ఎవరూ అజాత శత్రువులు కారు గదా! ఆయనకూ మనలాగే హితులూ, పడని వారూ ఉన్నారు. అయితే యింత దారుణంగా పగతీర్చుకోవలసిన అవసరం అయన పరమ విరోధులకు కూడా ఉండదని నా ఉద్దేశ్యం....ఉదాహరణకు యీ వూరి మునసబు గారున్నారు. ఒకప్పుడు ఇద్దరూ అతి సన్నిహితులు. అయినా సంవత్సరం క్రిందట వారిద్దరికీ చెడింది. మాటా మాటా పెరిగింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. ఈ హత్య తర్వాత మునుసుబు గారు ఎంతో ఆందోళన పడి వారి యింటికి వెళ్లి దగ్గరి బంధువుల కన్నా ఎక్కువగా సహాయం చేశాడు......."
రాజారావు నెమ్మదిగా తనలో తాను గొణుక్కున్నట్టు "ఏమో! ఎవరూ అనుమాన పడకుండా ఉండేందుకు నలుగురిలో అలా నటిస్తున్నాడెమో!" అన్నాడు. ఆ వ్యక్తీ వినిపించుకున్నట్టు లేదు. మళ్లీ "ఇక అయన మరణంతో లాభం పొందే వారున్నారా అంటే -- ఏమో చెప్పలేము. అటువంటి మహత్తర హస్తవాసి కలిగిన వైద్యుణ్ణి చంపుకుంటే ఒరిగేదేమీ లేదు...ఇక వారికి "నా' అన్న వారెవరూ దగ్గరలో ఉన్నట్టు లేదు....ఆయనకు ఒక చెల్లెలున్నట్లు ఆమె అన్నగారి మాట వినక బాంధవ్యం కూడా ఒదులుకుని తనదారిన పోయినట్టూ విన్నాను. వారికీ, వీరికీ చాలా సంవత్సరాల నుంచీ రాకపోకలు కూడా లేవుట...." అని చెప్పాడు.
వర్షం తగ్గింది . చూరు చినుకులు మాత్రం పై నుంచి బొట్లు బొట్లు గా యింకా పడుతూనే ఉన్నాయి. ఆ యిద్దరూ వ్యక్తులూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. రాజారావు చేతిలోని సిగరెట్టు నలిపి విసిరి దూరంగా పారేశాడు. కొన్ని నిముషాల తర్వాత అతడెంతో వ్యధతో నిట్టూర్చి "అయ్యో ఎంత పని జరిగి పోయింది!' అనుకున్నాడు.
ఆ వ్యక్తీ 'అవును. చాలా దారుణమైన విషయమే జరిగిపోయింది. అన్నట్టు యింతవరకూ అడుగుదామను కుంటూనే మరిచిపోయాను. మీరెవరో చెప్పారు కారు." అన్నాడు.
రాజారావు నడుం వాలుస్తూ "నేనాయన మేనల్లుడిని ....అంటే యిందాక మీరు చెప్పారే ఆమెకు ఒక్కగానొక్క కొడుకును...." అని చెప్పాడు.
ఈసారి ఆశ్చర్యపోవడం అవతలి వ్యక్తీ వంతు అయింది. అతడు కొన్ని నిమిషాలాగి "వర్షం తగ్గిపోయింది కదా! వారి యిల్లు చూపిస్తాను ...వస్తారా ?' అని అడిగాడు.
రాజారావు మారు పలకలేదు. అతడప్పటికే గాడమైన షుషుప్తి లో మునిగి పోయాడు.
* * * *
అతనికి మేలకువ వచ్చి కళ్ళు తెరవగానే ఎదురుగా ఆ వృద్దుడు కనిపించాడు. అతడు తన వంకకే చూస్తూ ఉండటం కూడా అతడు గమనించాడు. తర్వాత ఆవులిస్తూ గడియారం చూసుకున్నాడు. అయిదు గంటలయింది.
ఆలయం ఆవరణలో బాగా నీళ్ళు నిలిచి ఉన్నాయి. రాత్రి అంత దారుణమైన వర్షం పడిందన్న మాట! పక్షులన్నీ రెక్కలు తపతప కొట్టుకుంటూ హడావిడిగా ఆహార సంపాదనలో బయలుదేరి పోతున్నాయి.
రాజారావు సంచి చేతిలోకి తీసుకుని వృద్దుడి వంక చూశాడు. అతడు లేచి "వస్తారా?" వారి ఇల్లు చూపిస్తాను...." అన్నాడు. రాజారావు మెట్లు దిగుతూ జాలిగా "నేను గంపెడాశ తో యిక్కడికి బయలుదేరి వచ్చాను. మామయ్యను చూసి 'గతమంతా మరిచి పొమ్మని ఎన్నెన్నో చెప్పాలనుకున్నాను. నిజానికి మా మధ్య పాత మనస్పర్ధలకు కారణమైన మా అమ్మ ఎలాగూ పోనే పోయింది. 'ఇక అనవసరమైన పట్టుదలలూ, భేషజాలు ఎందుకు? జరిగి పోయిందేదో జరిగిపోయింది....' అని ప్రాధేయ పడుదామనుకున్నాను. మామయ్య ను నేనెప్పుడూ చూడకపోయినా మా అమ్మ అప్పుడప్పుడు చెప్పిన దాన్ని బట్టి అయన ఆమె విషయంలో పైకి అలా కఠినంగా యిష్టం లేనట్టు ఉండేవాడే తప్ప లోలోపల మాపట్ల ప్రేమాభిమానాలతో ఉండేవాడని కూడా నాకు తోచింది. అందువల్లనే యిప్పుడూ ఆయనను చూడకపోయినా యీ వూరేప్పుడూ రాకపోయినా, నాకాయన పట్ల అభిమానం ఉండేది. సరే....యిక ఎలాగూ దాటి పోయాడు ...అత్తయ్య నూ, వరలక్ష్మీ ని అయినా చూసి పలకరించి యీ దీనావస్థ లో వారి నాదుకోకపోతే ఎలా?' అన్నాడు.
చల్లని గాలి విసురుగా వీస్తున్నది. సూర్యబింబం ఉదయిస్తున్నది. ఎర్రని ఉల్లిపొర వంటి వస్త్రం మడతలలో దాచి ఉంచబడిన పెద్ద వజ్రం వలె సూర్య బింబం జాలార్ద్త్రమైన మేఘ సమూహంలో ఉదయిస్తున్నది. పలుచని కాంతులు ప్రాగ్దిశనంతటినీ ఎర్రగా స్పురింపచేస్తున్నాయి. గత రాత్రి దారుణ వర్షానికి తడిసి పాడై పోయిన తమ గూళ్ళ లోనే ఉండి శకుంత సంతానం రోద చేస్తున్నది.
