Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 3


                                      3

    వీధిలోకే ఎదురువచ్చాడు రాజశేఖరం. "రండి, రండి. ఏడూ గంటలకు రమ్మంటే విధిగా ఎనిమిది తర్వాత బయలుదేరేవాళ్ళే హిందువులు" అంటూ స్వాగతవచనాలు పలికాడు. చిన్న ప్రహరీగోడ. గేటు దాటగానే ఓ పదిగజాల చతురపు నేల అంతా రకరకాల మొక్కలతో, రంగు రంగుల పూలతో నాయనానందకరంగా ఉంది. ఆ పూల మొక్కల మధ్యనే ఒక టేబుల్, నాలుగు కుర్చీలు ఉన్నాయి. ముందు రాజా దారితీయగా అందరూ అటు నడిచారు.                                కూర్చున్నాక రహస్యంగా, "వదినా, అతని భార్య కన్పించదేం?" అనడిగింది శాంతి.
    "అదే నేనూ ఆలోచిస్తున్నాను" అంది పద్మ మెల్లగా. "ప్రొద్దున్నే పనివేళ కదూ?" అంది తిరిగి.
    నౌకరు వచ్చి కాఫీ, టిఫిన్ యిచ్చి వెళ్ళిపోయాడు. రాజా, శ్రీహరీ ఏదో మాట్లాడుకుంటున్నారు. పద్మ వింటూంది, మధ్య మధ్య ఒక్కోమాట కలుపుతూ. శాంతి కాఫీత్రాగుతూ ఆ చిన్న పూదోట సౌందర్యాన్ని పరికించసాగింది. బంగళా గోడవార ఇరుప్రక్కలా, ప్రహరీ గోడవార వరుసగా ఎరుపు, తెలుపు గులాబీలు, నిన్నటి పూలు, ఇవాళ పూయబోతూన్న అరవిచ్చిన మొగ్గలు, రేపు పూయబోయే మొగ్గలు. ఆవరణ నాలుగు మూలలా నిలువుగా పాతబడిన వెదురు కర్రల పొడవునా చిక్కగా, గుంపుగా ఎగబ్రాకిన మాలతీలతల నిండా తెల్లని పూలగుత్తులు. గేటుమీద వంపు నావరించిన బొహిన్ విల్లా నిండా కాగితం పూలవంటి తెల్లని పూలు. గేటు నుండి బంగాళా మెట్లవరకు నున్నని బాట, ఇరు ప్రక్కలా అడుగు ఎత్తున అందంగా కత్తిరింపబడిన లైవ్ తోటకూర. ఆవిధంగా ఏర్పడిన రెండు చదరాలలో మన్మధబాణాలు, టెంకిస్, ప్రొద్దు తిరుగుడులు విరబూచి ఉన్నాయి. ఆకుల మీద, పూలమీద ఇంకా అమాయకంగా నిద్రపోతూనే ఉన్న హిమబిందువులు ప్రభాత సూర్యుని బంగారు కిరణాల కొంటె స్పర్శకు చలిస్తున్నాయి.
    "ఏమండోయ్, అంత పరధ్యానం? ఈ పువ్వు లన్నీ ఎప్పుడు కోసెయ్యడమా అని చూస్తున్నారా? కోసుకుందురుగాని లెండి. కొంచెం ఏమైనా మాట్లాడకూడదూ?"
    సిగ్గుపడింది శాంతి, రాజా మాటలకు.
    శ్రీహరి అన్నాడు నవ్వుతూ: "మా చెల్లెల్ని మరీ అలా ఆడించేస్తున్నావేమిటి? అదెప్పుడూ ఎక్కువగా వగదు నీకుమల్లే."
    "ఓరి బాబోయ్! ఏం గారాబంరా! అరిగిపోయిందా నా మాటలకు?"
    "ఆయనంతే. చెల్లెలిమీద ఈగ వాలనివ్వరు" అంటూ లేచింది పద్మ. "నడవండి, యింట్లోకి వెళ్దాం" అని దారితీసింది. అందరూ అనుసరించారు.
    డ్రాయింగ్ రూమ్ ప్రక్కగదిలోకి దారి తీశాడు రాజా. గోడలనిండా, బీర్వాలలో అనేక చిత్రలేఖనాలు ఉన్నాయి. "నిన్న అడిగారు కదూ? చూడండి" అన్నాడు నవ్వుతూ శాంతితో.
    అన్ని చిత్రాలూ చూడముచ్చటగా ఉన్నాయి. కొందరు చిత్రకారులవలె ఎక్కడా అసభ్యంగా కాని, వెకిలిగా కాని చిత్రీకరించలేదు. అన్నీ నిండుగా, హుందాగా జాతి సంస్కృతిని తెలిపేవిగా ఉన్నాయి. అన్నితికంటే శాంతిని, గురు దేవులు రవీంద్రుని చిత్రం బాగా ఆకర్షించింది. శ్వేతవస్త్రాలలో, నిర్మల దృష్టులతో దేవ దూతగా, శాంతమూర్తిగా నిల్చున్న ఆ మూర్తిని మైమరచి తిలకించింది శాంతి.
    "ఆది నేను ఫైనల్ ఎమ్మెస్సీలో వుండగా వేశాను. అప్పుడు ఢిల్లీలో 'యూత్ ఫెస్టివల్'లో ప్రథమ బహుమతి వచ్చింది" అని వివరించాడు రాజశేఖరం.
    "అవును. నాకూ గుర్తుంది. దానికి వెయ్యి రూపాయలిస్తామన్నారు. అయినా ఇవ్వలేదు. వాడికి ప్రాణం ఆ చిత్రమంటే" అన్నాడు శ్రీహరి.
    ఆశ్చర్య విస్పారిత నేత్రాలతో అన్నవైపు తిరిగింది శాంతి. "నీకింత గొప్ప స్నేహితులొక రున్నారని ఎప్పుడూ చెప్పలేదేమన్నయ్యా?"
    "ఎందుకో! చెప్తే ఏంచేసేవారు?" కొంటెగా ప్రశ్నించాడు రాజా.
    ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తికమక పడిన శాంతి మౌనంగా మరోచిత్రం దగ్గరకు నడిచింది. కాని తనలో తనే ప్రశ్నించుకుంది; "ఔను, ఎందుకు? చెప్తే ఏం చేసేదానివి?' ఎంతకూ సమాధానం దొరకలేదు. "చాలా బాగున్నాయి మీ చిత్రాలు. రేపు మా యింటికొచ్చి నా పెయింటింగ్సు చూచి నవ్వుతారని భయంగా వుంది" అంది కడకు.
    నవ్వుతూన్న రాజా ముఖంలో హఠాత్తుగా గాంభీర్యం నిండుకుంది. "నో, నో. అంత గర్విష్టిని కాను. ఎవరికున్న ప్రజ్ఞ వారిది. అయినా నా చిత్రాలలో కూడ ఎన్నో లోపాలు ఉండవచ్చు. నేనేమీ ఈ కళలో పండితుడను కాదు. ఎక్కువ పరిశ్రమా చెయ్యలేదు. చదువుకొనే రోజుల్లో అదొక సరదాగా వుండేది. ఇప్పుడీ వుద్యోగంలో ఎక్కడా తీరుబాటే వుండదు. ఎప్పుడోకాని వాటి జోలికి పోవడం లే దీమధ్య."
    "ఏమో!వాటితోనే లోకంగా వుంటుంది నాకు. క్రొత్త పెయింటింగ్ మొదలుపెడితే పూర్తిచేసేవరకూ నిద్రపట్టదు. హృదయంలో ఏదైనా ఒక భావం మెదలగానే దానికి ఆకృతి నిచ్చేవరకూ మనసు నిలువదు" అంది శాంతి.
    నిండుగా నవ్వాడు రాజా. "మీకింకా చిన్నతనం. ఆ వయస్సులో అలాగే అన్పిస్తుంది. అవిమించి జీవితం వద్దనుకుంటాం. కాని మనమూ రక్తమాంసాలున్న మానవులమేనని తర్వాత జీవితం గుర్తింపజేస్తుంది."
    "ఇప్పుడు మీరీ చర్చలలో ములిగారా, ఇప్పట్లో తేలదు" అన్నాడు శ్రీహరి నవ్వుతూ. సమాధానంగా అందరూ నవ్వారు.
    'మీరేదో క్రొత్తచిత్రం మొదలుపెట్టి నట్లున్నారు?" అడిగింది శాంతి స్టాండువైపు చూస్తూ అంతా అటు చూచారు. ఫలకంపై క్రొత్త చిత్రం తాలూకు రేఖాకృతి మాత్రం గీయబడి ఉంది.
    "అదేమిటో వూహించండి చూద్దాం" అన్నాడు రాజా. శ్రీహరీ, పద్మా ఆ పని తమది కాదన్నట్టు శాంతిదెస చూపులు త్రిప్పారు.
    శాంతి కొద్దిసేపు చూచి, "ఒక స్త్రీ, అవునా?" అంది. దరహాసంతో తల పంకించాడు రాజా. "అవును. ఆ స్త్రీ ఎవరో తర్వాత తెలుసుకుందురుగాని!"
    "ఇంకెవరు? ఏ శకుంతలో, తిలోత్తమో? మీ కళాకారుల కింకేం పనుంటుంది గాని, ఇంతసేపై వచ్చినా నీ తిలోత్తమను చూపెట్టావు కాదు." శ్రీహరి హాస్యపు మాటలకు అందరూ నవ్వుతూ ఆ గది దాటి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నారు.
    "పాపం, ఏ పల్లేటూరామేనేమో? సిగ్గుపడుతూందేమో మన ఎదటపడటానికి" అంది శాంతి మెల్లగా వదినతో.
    "నిజమే. అదుగో, అది వంటగదనుకుంటాను. పోనీ మనమే వెళ్ళి పలుకరిద్దాం" అంటూ లేచింది పద్మ.
    "ఏం కావాలి?" అడిగాడు రాజా.
    "మీ అంతఃపుర కాంత దర్శనం!" అంది శాంతి వెక్కిరింపుగా.
    "ఓ! అక్కడే వుంది. వెళ్ళి చూడండి."
    రెండు నిమిషాలలో వంటగదినుంచి తిరిగి వచ్చి ఎర్రబడిన ముఖాలను దించుక్కూర్చున్నారు శాంతీ, పద్మా మౌనంగా.
    "చూచారా?" పళ్ళు బిగబట్టి వస్తూన్న నవ్వు నాపుకుంటూ ప్రశ్నించాడు రాజా.
    "అక్కడ నాయర్ వంట చేస్తున్నాడు. ఆవిడ పుట్టింటి కెళ్ళారా?" ఎలాగో అడిగింది పద్మ.
    "ఊఁ. ఇంకా పుట్టింట్లోనే వుంది." రాజా సమాధానం.
    "ఆ ముక్క చెప్పడాని కింత సిగ్గెందుకురా, ఆడపిల్ల లాగ! వాళ్ళకే లేదసలీ రోజుల్లో. ఇంతకీ ఏ వూరేమిటి?" అడిగాడు శ్రీహరి.
    "ఇంకా అదే తెలియదురా" అంటూనే బిగ్గరగా నవ్వేశాడు రాజా. శ్రోతలు ముగ్గురూ ఒక్కక్షణం విస్తుపోయి తర్వాత శ్రుతి కలిపారు. అయిదు నిమిషాలపాటు ఆగకుండా నవ్వారు.
    "నీ వినోదం బంగారంగాను! ఈమాత్రం దానికి నిన్నట్నుంచి ఎంత సస్పెన్సులో పెట్టి చంపావురా!"
    "కట్టిపెట్టవోయ్! తప్పంతా నామీద వెయ్యకు" అన్నాడు రాజా. "పెళ్లైందా అనడగాకుండా 'ఏవూరు? నన్ను పిలవలేదేం?' అంటూ మొదలెడితే ఏం చెప్పను? ఒక్క ముక్కలో తేల్చేస్తే ఏం గౌరవంగా ఉంటుంది?" మళ్ళీ అంతా నవ్వారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS