Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 3


    "నాకు సంస్కృతం బాగా రాదు. అర్ధం సెలవిస్తారా?" అన్నాడు వళ్ళుమండిన గోపాలం.
    "తప్పక! విను! అంటే మానవుడు తను పొందవలసిన వస్తువును తప్పకపొందును. దానిని భగవంతుడుకూడా ఆపలేడు. "సిద్దాంతి స్వరంలో తన్మయత్వం నిండివుంది.
    "అంటే మనకు ప్రాప్తం ఉన్నది దానంతట  అదే ప్రాప్తం అవుతుందంటారు? అలా లేకపోతే భగవంతుడుకూడా ఏమీ చెయ్యలేడంటారు?"
    "అవునోయ్ గోపాలం!" సిద్దాంతిగారు సగర్వంగా చిరునవ్వుతో అన్నారు.
    "అంటే భగవంతుడు ఒక వ్యక్తిని బాగుచెయ్యలేడన్నమాట! మరి భగవంతుడు చెయ్యగలిగిందేమిటో శెలవిస్తారా?" గోపాలంకూడా చిరునవ్వుతోనే ప్రశ్నించాడు.
    సిద్దాంతిగారు కొంచెం తికమకపడ్డారు. బొడ్లోనుంచి బంగారం పొదవిన పొడుంకాయ తీసి, ఇంత పొడుం అరచేతిలో వేసుకొని గట్టిగా పీల్చాడు.
    "ఎక్కడదాకా వెళుతున్నావ్!" అన్నాడు సిద్దాంతి మాట మారుస్తూ.
    "అనాదినుంచి అనంతంలోకి" అన్నాడు గోపాలం సిద్దాంతివైపు చూస్తూ.
    గోపాలం మాటల్లోని వ్యంగ్యాన్ని గుర్తించని సిద్దాంతి ఫక్కున నవ్వాడు. "బలే మాట్లాడతావోయ్ గోపాలం! ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావ్?" అరచేతిలో మిగిలిపోయిన ముక్కుపొడుం గట్టిగా ఎక్కించాడు. చేతులూ ముక్కూ శాలువాతో తుడుచుకున్నాడు.
    "తమరు ఎక్కడనుంచీ, ఎక్కడిదాకా?"
    "నేనా? కలెక్టరుగారింటినుంచి వస్తున్నాను. నలుగురు ఆడపిల్లల తరువాత ఓ వంశోద్దారకుడు జన్మించాడోయ్. ఆ కుర్రాడి జాతకం రాసి వస్తున్నాను. బ్రహ్మాండమైన అదృష్ట జాతకుడులే. జాతకం అంటే అలా ఉండాలి! తొంభయ్ సంవత్సరాలు జీవిస్తాడు. మహారాజ వైభవం అనుభవిస్తాడు. పద! నడుస్తూ మాట్లాడుకుందాం" అన్నాడు సిద్దాంతి.
    ఎక్కడికని అడక్కుండానే గోపాలం అవధాన్లను అనుసరించాడు.
    గోపాలానికి ఇవ్వాళ అవధానుల్ని ఒక పట్టాన వదలిపెట్టాలనిపించటంలేదు. తనకు వేరే పనిలేదు, ఏదో ఉబుసుపోకకోసం అలా నడిచివెళుతున్నాడు. భవిష్యత్తును గురించిన ఆలోచన ఓ వైపు పరుగులా తొలుస్తూనే వుంది.
    "అయితే పండిత్ జీ! కలెక్టరుగా రబ్బాయి అదృష్టజాతకుడంటారు? ఒకవేళ మీ జాతకం?"
    "ఆఁ ఆఁ ఎంతమాట! నేను వ్రాసిన జాతకాన్నే సందేహిస్తున్నావా?" తీవ్రంగా వుంది అవధానుల స్వరం.
    "ఇప్పుడు మర్చిపోయారేమో! నాన్నగారితో నా గురించీకూడా  అలాగే అనేవారు. నాకూ బ్రహ్మాండమైన జాతకం వ్రాశారు. నేను చాలా గొప్ప హోదాలో వుంటానని వ్రాశారు." అన్నాడు గోపాలం సిద్దాంతి మొహంలోకి చూస్తూ.
    "ఏం? ఇప్పుడుమాత్రం నీకొచ్చిన కష్టం ఏమిటి? అప్పుడే నీ జీవితంలో ఎంతభాగం అయిందని నా జాతకం తప్పంటావు? అలా చూస్తుండు అదృష్టదేవత నిన్ను వరిస్తుందో లేదో?" గోపాలాన్ని మందలిస్తూ అన్నాడు సిద్దాంతి.
    "ఎప్పుడో వరించింది దురదృష్టదేవత." గొణుక్కున్నాడు గోపాలం తనలో తనే మాట్లాడుకుంటున్నట్లు.
    ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు.
    "కలెక్టరుగారి అబ్బాయి మీరువ్రాసిన జాతకం ప్రకారం తొంబయ్ ఏళ్ళూ బ్రతికితీరాలంటారు?" మౌనభంగంచేస్తూ ప్రశ్నించాడు గోపాలం.
    "అవును" శాంత గంభీర స్వరంలో పలికాడు అవధానులు.
    "ఒకవేళ పురుడుకూడా వెళ్ళకుండానే చనిపోతే?"
    "అలా జరగటానికి వీల్లేదు. ఆ సమయం రాకుండా ఎన్ని గండాలు  వచ్చినా బ్రతికి తీరాల్సిందే." ఖచ్చితంగా అన్నాడు అవధాన్లు.
    "అయితే గురూజీ; అకాల మృత్యువు అని దేన్నంటారో కొంచెం శెలవిప్పిస్తారా?"
    సిద్దాంతి కొంచెం ఖంగారుపడ్డాడు. దూరంగా రోడ్డుమీద దేన్నో చూస్తున్నట్లూ, గోపాలం మాటల్ని వినిపించుకోనట్లూ నడుస్తున్నాడు.
    "ఆ సమయం వస్తే చావునుంచి ఎవరూ తప్పించుకోలేరంటారు? అవునా?" రెట్టించాడు గోపాలం కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు.
    "అవును! స్పష్టంగా వ్రాసిపెట్టివుంది. 'నా కాలేమ్రియతే కశ్చిత్ ప్రాప్తకాలే న జీవతి'."
    "అంటే నాకు జ్వరం వచ్చిందనుకోండి. ఆ జ్వరంతోనే నేను చావాలని వ్రాసిపెట్టివుంటే,. లక్షప్రయత్నాలూ నిరుపయోగం అంటారు?"
    "అంతే నాయనా! అంతే! మన చేతుల్లో ఏముంది? మానవ మాత్రులం. మన ప్రయత్నాలు ఆ లీలామయుని నిర్ణయం ముందు ఏపాటివి?"
    "రెండు సంవత్సరాల క్రితం మీ రెండోవాడికి జబ్బుచేస్తే, డాక్టర్ నాయర్ దగ్గిరకు పరుగెత్తారేమండీ? డాక్టరు కాళ్ళమీద పడి మీ బిడ్డ ప్రాణాల్ని కాపాడమని ఏడ్చారట? అన్నీ తెలిసిన మీరే మానవ మాత్రుణ్ణి బిడ్డప్రాణాలు కాపాడమని వేడుకోవటంఏమిటి?"
    అవధాన్లు పని కుడితిలోపడ్డ ఎలుక చందమైంది.
    "ఉద్యోగినం పురుషసింహ ముదైతి లక్ష్మీ. మన ప్రయత్నం మనం చెయ్యాలి నాయనా!"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS