Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 28

 

    నేను సుమారు 24 గం|| నిద్రపోయాను. అందువల్లనే నాకు చాలా నీరసంగా ఉంది. ఎక్కువసేపు నిద్రపోయిన అనుభూతి వుంది. కానీ అన్ని గంటలు నిద్రపోవడానికి కారణం --
    పరాయి ఆడది నాకు కొత్త కాదు. తాగుడు కూడా మరీ అంత కొత్త కాదు. ఎప్పుడూ ఆ అనుభవాల అనంతరం ఇంత నిద్ర పట్టలేదు. ఈసారి పట్టిందంటే కారణం ఏదో ఉండి ఉండాలి.!
    హటాత్తుగా నాకు ఆసలు విషయం గుర్తుకొచ్చింది. దాంతో మరే ఆలోచన లేదు. నేను పొరపాటున ఒక కాగితం శ్రీమతికి పోస్టు చేశాను. అది ఆమెను చేరేలోగా అందుకోవాలని 21 వ తేదీన బయల్దేరాను. ఈరోజు 23 వ తేదీ అంటే ఆ ఉత్తరం ఆమెకు నిన్ననే అంది వుండాలి! ఇప్పుడీ పరిస్థితుల్లో ఏం చేయాలి?
    శ్రీమతిని ఎలాగో మభ్యపెట్టాలి!
    ఏదో కధ రాస్తున్నాననీ పొరపాటున అది పోస్టు చేశాననీ చెప్పాలి. లేకపోతె కావాలనే సరదాకి పోస్టు చేశానని చెప్పాలి. అక్కడి పరిస్థితిని బట్టి చూడాలి. ఒకవేళ అదృష్టం బాగుంటే ఉత్తరం ఇంకా అంది ఉండక పోవచ్చు.
    ఆలోచనల దారి ఆలోచనలదే బస్సు దారి బస్సుదే! కరెక్టు టైముకి నన్ను ఊరు చేర్చింది బస్సు. రిక్షాలో అత్తవారింటి దగ్గర దిగాను. "బావొచ్చాడేవ్?" అంటూ నా మరదలు లోపలకు పరుగు తీసింది. నేను బ్యాగుతో ఇంట్లో అడుగు పెట్టగానే నవ్వుతూ మా ఆవిడ కనిపించింది.
    శ్రీమతి ప్రసన్న వదనం చూస్తూనే నా మనసు పరవశించింది. ఆమె ముఖంలో ఎక్కడా అనుమానం కానీ, కోపం కానీ కనబడలేదు.
    నేను మరీ అంత కొత్త అల్లుడిని కాకపోయినా మా మవగారిల్లు పెద్దది కాబట్టి నాకు వెంటనే ఒక ప్రత్యేకమైన గది దొరుకుతుంది. శ్రీమతి నేనూ ఆ గదిలో కూర్చుని కబుర్లాడుకుంటున్నాం. ఆమె ఎంతకూ ఉత్తరం ప్రసక్తి తీసుకు రాకపోవడంతో ఉండబట్టలేక నేనే అడిగేశాను.
    "మొన్ననేనో ఉత్తరం రాశాను. అది నిన్న అంది ఉండాలే!
    'అందకనే అందింది" అంది శ్రీమతి చిలిపిగా.
    నా గుండె ఆగినంతపనయింది. ఉత్తరం అందిందన్న మాట. అయితే శ్రీమతి చలించదే?
    "ఉత్తరం చదివావా?" అన్నాను.
    "మీ ఉత్తరం చదవకుండా ఉండగలనా? చదివాను. అంది శ్రీమతి.
    "మరి....." అని ఆగిపోయాను. ఏమని అడగాలో తెలియక.
    "ఊ --- మరి -----" అంది శ్రీమతి చిలిపిగా.
    'అబ్బే -- ఏం లేదు మరి ...." అంటూ మళ్ళీ ఆగిపోయాను.
    శ్రీమతి  నాకు కాస్త దగ్గరగా జరిగి "మీ మాట నేను పూర్తీ చేస్తాను -- మరి మీరు వచ్చేశారుగా ఇంక ఉత్తరం అవసరమేముంది?" అంటూ రెండు చేతులూ నా మెడ చుట్టూ వేసింది.
    నాకేం అర్ధం కావడం లేదు. అంతా మిస్టరీ గా వుంది. నేను పోరాబడ్డానా? శ్రీమతికి కరెక్టు ఉత్తరమే పోస్టు చేసానా? అయితే శ్యామలను చంపాలని వేసుకున్న కార్యక్రమం రాసిన కాగితం ఏమయింది? ఇంట్లోనే ఉందా? మరి శ్రీమతికి రాసిన ఉత్తరం కాగితం నా జేబులో ఉండి పోయింది. శ్రీమతికి పోస్టు చేసిన కవర్లో ఏ కాగితం పెట్టాను? సందేహం లేదు. నా హత్యా కార్యక్రమ వివరాలు శ్రీమతికి పోస్టు చేశాను . మరి?
    "ఈరోజు తారేకెంత?"
    "అదేం ప్రశ్నండీ -- ఇరవై మూడు " అంది శ్రీమతి.
    "మరి నిన్న ...." నా ప్రశ్న నాకే అసందర్భంగా తోచింది.
    "ఇరవై రెండు ...." అని "ఉండండి కాస్త జీలకర్ర అల్లం తెస్తాను. ,మీకు కాస్త పైత్యం చేసినట్లుంది...." అంటూ లేచింది శ్రీమతి. నేనామెను వారించలేదు. "నిన్న ఇరవై ఒకటి కాదా" అన్నాను స్వగతాన్ని పైకి అన్నట్లుగా. అల్లం మరికాస్త ఎక్కువ తెవాలనుకుందో ఏమో శ్రీమతి పరుగెత్తింది.
    శ్రీమతి అల్లం జీలకర్ర తో తిరిగి వచ్చింది. బలవంతంగా నానోట్లో వేసింది. నేను అల్లం జీలకర్ర నములుతూ అడిగాను --" ఒకసారి ఆ ఉత్తరం తెస్తావా?"
    "ఎందుకండీ  ఆ వుత్తరం " అన్న ఆమె ముఖంలో కొద్దిగా కంగారు స్పష్టంగా చూడగలిగాను. ఆ కంగారెందుకో నాకర్ధం కాలేదు. శ్రీమతి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది. ఒక అరగంట అనంతరం వచ్చింది. "కవరు కనబడింది కానీ ఉత్తరం కనబడలేదండీ చాలా జాగ్రత్తగా దాచాను మరి" అంది.
    ఆ కవరును చూశాను. ఎడ్రస్ నేను రాసిందే. దాని మీద మా వూరి స్టాంపు 21 వ తేదీ అని వుంది. సందేహం లేదు. ఈ కవర్లో నేనే నా ఉత్తరం పొరపాటున పెట్టాను. అది శ్రీమతికి చేరింది. చదివానంటుంది. నా మీద విరుచుకు పడదు. అసలు ఉత్తరంలోని విశేషాల గురించి ఏమీ మాట్లాడదు. "ఏమైనా సరే ఆ ఉత్తరం కావాలి. వెతికి తీసుకురా" అన్నాను కాస్త కటువుగా.
    శ్రీమతి ముఖంలో ఆదుర్దా కనబడింది. కళ్ళలో కొద్దిగా భయముంది. మారు మాట్లాడకుండా వెళ్ళి ఓ పది నిమిషాలలో వచ్చింది. "అమ్మయ్యా దొరికింది. ఇదిగో" అంటూ నాకో ఉత్తరం ఇచ్చింది. ఆత్రుతగా అందుకుని చదివాను.
    అది నేను రాసిన ఉత్తరమే కానీ మొన్న పోస్టు చేసినది మాత్రం కాదు! అంతక్రితం రాసింది. అందులో తను లేక నేను అనుభవిస్తున్న విరహం గురించి రాసాను. దురదృష్టం కొద్ది తారీఖు వేయలేదు.
    "ఇది కాదు నేను రాసిన ఉత్తరం!" అన్నాను.
    శ్రీమతి విసుగ్గా ముఖం పెట్టి "మీరేం రాశారో నాకు తెలియదు. ఏం పోస్టు చేశారో తెలియదు. మీకేమయిందో కూడా నాకు తెలియదు. నాకు నిన్నవచ్చిన ఉత్తరం మాత్రం ఇదే" అంది కచ్చితంగా.
    ఏమనాలో తెలియలేదు. ఆ ఉత్తరం కోసం ఎందుకు నొక్కిస్తున్నదీ చెప్పాడమేలా? శ్రీమతి ఎందుకు ఆదుర్దా పడుతోంది? ఏమిటి ఇందులోని మిస్టరీ!
    నా బుర్ర వేడెక్కిపోయింది. "మీ ఒంట్లో సరిగా ఉన్నట్లు లేదు. ఇక్కడో నాలుగు రోజులుండి విశ్రాంతి తీసుకోండి" అంది శ్రీమతి.
    "అబ్బే వీల్లేదు. ఈరోజే వెళ్ళి పోవాలి" అన్నాను. మళ్ళీ శ్రీమతి ముఖంలో కంగారు. కళ్ళలో అసంతృప్తి -- "మీరు వెళ్ళడానికి వీల్లేదు. మిమ్మల్ని వెళ్ళ నివ్వను" అందామె. అని అక్కణ్ణించి వెళ్ళిపోయింది . నేను తీవ్రాలోచనలో పడిపోయాను. ఒక గంటలో డాక్టరు వచ్చాడు. నా దగ్గరకు. డాక్టరు వెనుకే మావగారు వచ్చారు.
    "నాకేం కాలేదే నేను కులసాగానే ఉన్నాను" అన్నాను. కొంచెం చిరాగ్గా.
    డాక్టరు మౌనంగా నా దగ్గరకు వచ్చి పరీక్ష చేశాడు. నాడీ చూశాడు. స్టేతస్కోప్ పెట్టి చూశాడు. నాలిక చూపించమన్నాడు. కళ్ళు పరీక్ష చేశాడు. అన్నీ అయేక "కనీసం నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం --" అన్నాడు.
    "కానీ -- నీకు విశ్రాంతి తీసుకోవాలని లేదు."
    "అలాగనకూడదు నాయనా నేను, పెద్దవాడిని చెబుతున్నాను విను. సరిగ్గా నాలుగంటే నాలుగు రోజులుండి వెళ్ళిపొదువు గానీ . మీ కాలేజీకి టెలిగ్రాం ఇప్పిస్తానులే -----" అన్నారు మామగారు . నేనేం మాట్లాడలేదు.
    మావగారు వయసులో మా నాన్నగారి కంటే కూడా చాలా పెద్దవారు. ఆయనంటే నాకు భయమూ, గౌరవమూ, వున్నాయి. ఇంతవరకూ అయన మాటకు కాదనే ధైర్యం నాకు లేకపోయింది. డాక్టరు, అయన వెళ్ళిపోయాక ఏమీ ఎరుగని నంగనాచిలా వచ్చిన నా భార్య మీద విరుచుకు పడ్డాను.
    "మీరేన్నైనా అనండి పడతాను. కానీ మీరు నాల్గురోజులిక్కడుండాలి. మీరు లేక నాకిక్కడేమీ తోచడం లేదు. ఓ వారం రోజుల్లో మా అక్క వస్తోంది. అది వచ్చేక దాన్ని చూసి మీ దగ్గరకు వచ్చేస్తాను. అంతవరకూ ఇక్కడ ఎలాగూ గడపడం  అనుకుంటుంటే ఆపద్భాందవుడిలా మీరు వచ్చారు. మిమ్మల్ని వెళ్ళనిస్తానా ఎలాగైనా ఆపేస్తాను." అంటూ శ్రీమతి దగ్గరగా వచ్చి ప్రేమగా నా చుట్టూ చేతులు వేసింది.
    ఆమె మాటలకు , చేతలకు దాసోహం అనకుండా ఉండలేకపోయాను.

                                     5
    నా మనసులో మేదుల్తున్న ఆలోచనలకు సమాధానం లభించలేదు. కానీ నాల్గురోజులు నాలా తొందరగా గడిచిపోయాయి. శ్రీమతి నాతొ ఎన్నడూ ఎరుగనంత ఉత్సాహంగా ప్రవర్తించింది. శ్రీమతి నా ఉత్తరం చదివి వుంటే కోపగించుకోవడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి ఉంటుంది. ఆ ఉత్తరం తను చదివనట్లే నటించి తన ప్రవర్తన్ ద్వారా నా దృష్టి పరాయి ఆడవాళ్ళ మీదకు పోకుండా ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోందేమో!
    నేను తిరుగు ప్రయాణమై నా ఊరు చేరాను. ఇల్లు చేరి తలుపు తాళం తీయబోతుండగా ఇంటి యజమానురాలు చాలా హడావుడి లో ఉన్నట్ల నిపించింది. వాళ్ళ ఇల్లు చాలా సందడిగా వుంది. ఏమిటో తెలుసుకుందుకు వెళ్ళాను. ఏమిటి నేను తెలుసుకున్న వార్త. అది సామాన్యమైనది కాదు. నేను చేద్దామనుకున్న పని . నేను చేయకుండానే జరిగిపోయింది. శ్యామల నిన్న ఆత్మహత్య చేసుకుంది. "తన మరణానికి ఎవరూ బాధ్యులు కారనీ జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటూన్నాననీ" ఒక కాగితం రాసిపెట్టి మరీ చనిపోయిందిట. రాత్రి పడుకునేదాకా బాగానే ఉందిట. తెల్లారేసరికి జరుగవలసినది జరిగిపోయింది.
    నాకు మతి పోయినట్లయింది. నేను మనసులో అనుకున్న విషయం వాస్తవంలో ఎలా జరిగింది.
    నేను ఇంట్లో అడుగు పెట్టాను. మతిస్థిమితం తప్పింది. నిరుత్సాహంగా మంచం మీద కూలబడ్డాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS