హరికృష్ణ నీరసం మూలాన మాట్లాడలేక పోతున్నాడు. తలకు తగిలిన గాయాల్ని శుభ్రం చేసి మందులు వేసినట్లు కట్టారు శారద సతీశ్ లు. ఇంజక్షన్ లు యిచ్చారు. నిమిషనిమిషానికి అతి జాగ్రత్తగా పరీక్షించుతున్నారు.
అనూరాధ లో ఆందోళన అధికమౌతోంది వున్న కొలదీ! శారద లోపలి నుంచి బయటికే రాలేదు.
అరగంట గడిచిపోయింది. ఆమెలో భయం వూడలు వేస్తోంది. హృదయాన నిర్వచింపరాని బాధ తరంగం లా దూకుతోంది. తలుపులు తెరుచుకున్నాయి అంతలో. శారద వచ్చింది. కానీ అమెముఖాన ఆనంద రేఖలు విప్పారనే లేదింకా.
అనూరాధ గుండె లవిసి పోతున్నాయి. పెదవులు వణుకుతున్నాయి. కంఠనా దుఃఖం వుండలు వుండలుగా పైకీ, క్రిందికీ దిగుతోంది.
'అక్కా!' ఆవేదన పెల్లు బికిందా స్వరంతో.
'ప్రయత్నించుతున్నాం! అనూ! భారం భగవానుని మీద వేసి! వో గంట గడిచాక గానీ మాట యివ్వలేను!' అన్నది శారద.
అనూరాధ హృదయాన బాధ హోరు మంటూ మోతలు పెడుతోంది. ఆ గంట ఆమె కోక యుగం లా వుంది.
అన్నపూర్ణమ్మ గారూ, రాజూ వచ్చారంతలో. అనూరాధని చూసి మాట్లాడించలేక పోయిందా మాతృమూర్తి.
'అమ్మా! అయన...కన్పించారు! కానీ......' ఆ పైన దుఃఖం అగలేదా అనూరాగమయికి. తల్లిని కౌగలించుకుని కన్నీరు కార్చసాగింది.
'ఏం భయం లేదమ్మా! శారద వుందిగా! భగవంతుడు నిన్ను అన్యాయం చేయడమ్మా!' వోదార్చిందామె బాధను దిగమ్రింగుతూ.
నిమిషాలు నడిచి పోతున్నాయి. గంట పూర్తీ కావస్తోంది. అనూరాధ అంత రంగం ఆతురతతో వేగిపోతోంది. భయంతో ముడుచుకు పోతోంది. తల్లి ప్రక్కనే శిలా విగ్రహంలా కూర్చుండి పోయింది.
లోపలి నుంచి శారద, సతీశులు ఏదో చిన్నగా మాట్లాడుకోవడం విన్పించింది. కానీ స్పష్టంగా విన్పించడం లేదు, ఆ భార్యాభర్తల సంభాషణ.
ఏ చిన్న శబ్ధమైనా అనూరాధ వులిక్కి పడుతోంది. తలుపుల వంకే చూస్తుండి పోయింది నిశ్చలంగా.
అంతలో శారద "అనూ! రా! లోపలికి!' అంటూ తలుపులు తెరిచింది. వెంటనే లేచి వెళ్లిందా అనూరగామయి.
హరికృష్ణ కొంచెం కదిలాడు! 'అబ్బా!' అని సన్నగా మూలిగాడు.
'ఇక భయం లేదు! అనూ! నీ ప్రార్ధన విన్పించిందా పరంధామునికి! బావ మనలో ఒకడుగా తిరగ గలడిక. నీ ఆరాధన ఫలించుతుంది.' అన్నది శారద.
'అక్కా! నీ మనస్సున అమృతం వుంది. అందుకే ఆయన మళ్లీ జన్మ ఎత్తారు!'' అన్నది అనూరాధ ఆనందం పొంగి పోతున్న స్వరంతో.
ఆ అనురాగమయి మనస్సున మందారాలు విరిశాయి. మధురోహల మందిరాన అశాకుసుమాలు అందాలోలికించే మాలల నల్లాయి.
ఆ రాత్రి ఒక్క క్షణం కూడా కన్ను మూయనే లెదామే. హరికృష్ణ కు అపుడపుడు వేడి కాఫీ త్రాగించింది. అతడు బాధగా మూలిగినపుడు ఆమె అంతరంగం బాధతో మెలికలు తిరిగిపోతోంది.
శారదా సతీశులు కూడా ఆ రాత్రి ఎంతో సేపటి వరకు అతని దగ్గరే వుండి పోయారు.
తెల్లవారింది. అనూరాధ హృదయాన ఆశాలత మల్లెలు పూసింది. హరికృష్ణ ప్రక్కకు వత్తిగిల్లాడు.
శారద అతడు కనులు తెరవగానే నవ్వింది పువ్వులా. హరికృష్ణ నీరసంగా నవ్వాడు. తలమీదకు చేయి పోనిచ్చి యిదేమిటన్నాడు.
అతని మతి స్థిమితంగా వచ్చిందని పిచ్చి పారి పోయిందనీ గ్రహించింది శారద. ఆమె అంతరంగం ఆనందంతో పరవశించి పోయింది.
'ఏమీ లేదు! తలకు కొంచెం దెబ్బ తగిలింది!' అన్నది!'
'దెబ్బా! నాకు! ఎలా తగిలింది శారదా?' ఆశ్చర్యపడ్డాడు . అతనికి గతం గుర్తుకు రావడం లేదు.
'అనూరాధ నడుగు బావా!' అంటూ ఆమె వైపు చూసింది.
'అనూరాధ! ఎక్కడా?' అతడు తల త్రిప్పి చూశాడు.
ఆ మధురమూర్తి కనులలో మెరుపులు తళుక్కుమన్నాయి.
'ఎప్పుడు వచ్చింది ఏలూరు నుంచి? మళ్ళీ నృత్యం చేస్తోందా యిక్కడ?'
'అన్నీ తరువాత చెబుతుంది! కొంచెం విశ్రాంతి తీసుకో బావా?' అని శారద సెలవు దీసికొని వెళ్ళిపోయింది.
అనూరాధ కాఫీ అందించింది.
'అనూరాధా! నాకేమైనా దెబ్బ తగిలిందా? ఆ! అవును! నీరజ దగ్గిరకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది గదూ!' అతనికి ఆ జరిగింది అపుడే నన్పించుతోంది.
అనూరాధ జరిగినదంతా వివరంగా చెప్పింది. అతడు ఆశ్చర్యపోయాడెంతగానో.
'మరి....అంత పిచ్చిలో నన్నెవరు మనిషిగా చూశారు అనూరాధా! నువ్వే గదూ! నాకు తెలుసు! ఈశాపగ్రస్తుడ్ని నువ్వు తప్ప మరొకరు భరించలేరు. నీ రుణం ఎలా తీర్చుకోగలను అనూ!' ఆత్మీయతతో కదిలిపోయాడతడు.
'అనూరాధకి రుణపడి వుండడం మీ కిష్టం లేదా?'
అతడు ఆశ్చర్యంతో ఆమె కనులలోకి చూశాడు.
'అనూ! అంత అదృష్టం వుందంటావా నాకు?'
'ఆ సంగతి తరువాత ఆలోచించవచ్చు! ముందు మీరు కాస్త మాట్లాడకండి. నీరసంగా వున్నారు.'
'ఉహూ! ఉండలేను! అనూరాధా ఉండలేను! నా జీవితంలో మరుపురాని మధుర క్షణాలివి. నీరసం గాదు యిక ఏ రసం కూడా నన్నేమీ చేయలేదు. నాకు తరగని అమూల్యమైన అనురాగసంపద అనుగ్రహించిన దేవత ప్రత్యక్షమైందని యిపుడే తెలిసింది.'
అనూరాధ సిగ్గుతో పెదవి కదుపలేకపోయింది.
'నన్నిక్కడ వుండమంటారా? వెళ్ళమంటారా?'
'అనూ!' ఆమె చేతిని తన చేతులలోకి తీసుకొని మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు.
'నీతో యీ పిచ్చి వాణ్ణి కూడా తీసికొని వెళ్లాలి! మరి?' అన్నాడతడు చిలిపిగా నవ్వుతూ.
పదిరోజుల వరకూ హరికృష్ణ హాస్పిటల్ లోనే వుండి పోయాడు. శారద కంటికి రెప్పలా, కన్న బిడ్డలా చూసిందన్నాళ్ళూ. అనూరాధ అనుక్షణమూ అతని కంటి ముందరే వుంటోంది. అతని పరిచర్యతో అలసిపోయినా నిట్టూర్పు కూడా వెలికి రాలేదా అనురాగమయి నుంచి.
శారద జరిగిన సంగతి చెబుతూ హరికృష్ణ తో అన్నది అనూరాధ లేనపుడు .
'బావా! అనూరాధ నీ జీవితాన వెలసిన అదృష్ట దేవత! ఆ ఆరాధన అందరీకి అందదు. నిన్ను దైవంలా పూజించింది. నీకోసం తన సర్వస్వాన్నీ అర్పించింది. ఎన్నో అపవాదుల్ని భరించింది. చివరికి 'శాంతినికేతన్' లో చేరిపోవాలనుకుంది విరక్తితో. ఇంతలో ఈ సంఘటన ఎదురైంది. ఆమె ఆరాధన ఫలించింది! నీ జీవితం వో ఒడ్డు చేరిందిక.'
'శారదా! భగవంతుడున్నాడు.' పరవశంతో తూలిపోయిందని స్వరం.
'ఎక్కడండొయ్ ! డాక్టర్ గారూ! భగవంతుడున్నాడని కనిపెట్టేశారు? కాస్త నాక్కూడా చూపుదురూ!' అంటూ వచ్చింది అనూరాధ ఫలహారం ప్లేటుల్లో వుంచుకొని.
'ఎక్కడో ఎందుకుంటాడు అనూ! అమృతం నిండి వున్న నీ హృదయంలోనే!'
'ఆ! ఆ! ఆపండిక! వైతాళికీలు నయం అక్కా ఈయన కన్నా! ఈ మధ్య యీ స్తోత్ర పాఠాలు వినలేక విసిగి పోతున్నాననుకో!' ఫిర్యాదు చేసింది అనూరాధ.
'నీ అనురాగం ముందు ఆ స్త్రోత్ర మెంత? అనూ!' అన్నది శారద.
'అక్కా! నువ్వు కూడా అలాగే అన్నావంటే మరీ పొడుగ్గా పెరిగి పోతుంది ప్రశంసాకుసుమాల మాల.'
'మరీ అంత పిచ్చి వాడు గాదులే అనూ! ఈ డాక్టరు!' అన్నాడు హరికృష్ణ.
'ఏమో బాబూ! ఇక నా భారం తీరింది! పిచ్చి వాడివే అవుతావో, మంచి వాడివే అవుతావో, అంతా ఆ నీ దేవతకు విన్నవించుకో! నేను వస్తాను మరి!' అంటూ వెళ్ళిపోయింది శారద.
'ఆ! మరిచాను బావా! రామనాధం గారు తోక ముడిచారు. పాపం! కుటుంబంతో సహా నెల్లూరు వెళ్లి పోయారట నిన్ననే! ఇక మేడ అనూరాధదే!' అంది తిరిగి వచ్చి.
'నాది కాదా?' అన్నాడు హరికృష్ణ .
'నీది అంటూ యిక ఏమీ లేదు బావా! ఉన్నదంతా అనూరాధదే!'
'ధన్యోస్మీ! ధన్యోస్మీ! ఇంత కరుణామయి ఈ దీనుడికి లభించుతుందని ఎపుడూ ఊహించనే లేదు.'
శారద ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోయింది.
ఆ మరునాడే హరికృష్ణ యింటికి వెళ్లాడు. అన్నపూర్ణమ్మ గారి హృదయాన ఆనందం పరిపూర్ణ రూపం దాల్చింది. రాజు సంతోషంతో వుప్పొంగి పోతున్నాడు.
శారదా, సతీశ్ ల ఆధ్వర్యాన అనూరాధ, హరికృష్ణ ల వివాహం వైభవంగా జరిగింది. నీరజ అన్న అదృష్టానికి మురిసి పోయింది.
వదినా! అన్నయ్య పూజ ఫలించింది. లీలగా నిన్ను చూపిన నాడు నా మనస్సున మెదిలిన వూహ నిజమైనందు కెంతో సంతోషంగా వుంది.' అన్నది నీరజ.
'అవును! నీరజా! నా వూహ బంగారు కలగా మారి నిజమై కూర్చుంది! శారద ఆనందాన్ని వెల్లడించింది.
అన్నపూర్ణమ్మ గారా ఆనందంలో పాలు పంచుకున్నారు పసిపిల్లలా. 'మా అనూరాధ తపస్సు ఫలించిందమ్మా శారదా! నీలాంటి అక్కయ్య వుండగా దానికేం కొదువ తల్లీ!' అన్నదామె.
'లేదండీ! అనూరాధ కేనాడూ ఏ కొదువా లేదు మీరన్నట్టు. మా నీరజ బంగారు కలగంది. అన్నయ్య కోసం. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కూడా ఈ గృహాన మాకు అండగా వుండమని ఆనతిచ్చాడు.' హరికృష్ణ కృతజ్ఞత తెలుపుకున్నాడు.
ఆ రోజంతా అతిధులతో , మిత్ర బృందంతో ఆ గృహం సందడిగా వుంది. విందులతో, ఆనందోత్సాహాలతో మార్మోగి పోయింది. ఎన్నాళ్ళకో ఆ గృహాన ఆనందం కన్నుల పండువుగా , వెన్నెల కురిపించింది.
శ్రీలత అనూరాగ పూర్ణమైన జాబు వ్రాసింది. 'అక్కా! నీ బ్రతుకు నందన వనమై విరిసింది. అందుకు ఆ కరుణావిభువుడైన మాధవునికి కోటి నమస్కారాలర్పించుతున్నాను. ఈ నీ చెల్లాయి జీవితాన వెలిగించిన దీపం నీ అనురాగ బంధం కానుకే.' అంటూ.
ఆరేయి వెన్నెల కన్నుల పండువు చేస్తోంది. విరిసిన ,మల్లెలు నవ్వుతున్నాయి నిర్మలంగా. హరికృష్ణ హృదయాన అనురాగం ఆర్ణవమై సందడి చేస్తోంది.
వెన్నెల వెలుగులో, పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న అనూరాధ కనులలో కనులుంచి ప్రశ్నించాడు----
'అనూ! అనురాగం తప్ప యింతటి ఆరాధన మరో అనుబంధం అల్లలేదు. ఈ ఆరాధన లో నా జన్మ పునీతమైంది.'
ప్రసంశలతో మోసగించడం మీకు అలవాటేలెండి! డైరీ లనిండుగా దండలై వున్నాయి!'
'అమ్మ దొంగా! డైరీలు చూశావా? అవును? నిజంగా నీది కానిదేమున్నది నా దగ్గర! అనూ! ఇది కలేమో, కరిగి పోతుందేమోనని భయంగా వుంది.'
'ఇంకా ఆ కలల పిచ్చి పోలేదన్న మాట! మళ్లీ పారిపోకండి! ఈ అనూరాధ-----'
'కోమలంగా శిక్షించుతుంది? ఆరాధించుతూనే! అనూ! స్త్రీ జీవితమంతా ఆరాధనతోనే నిండి వుంటుందని తెలిసిందిపుదు----'
'అయ్యా! మహానుభావా! దండకం వల్లించవద్దని మనవి!' అన్నదామె రెండు చేతులు జోడించి.
'తధాస్తు! ఈ భక్తుడు ధన్యుడు! దేవీ!' అన్నాడు హరికృష్ణ.
అనూరాధ హృదయాన నవ్వులు పువ్వులై విరిశాయి -----
(అయిపోయింది)
