Next Page 
గాజు బొమ్మ పేజి 1


                            గాజు బొమ్మ
                                                 యలమంచిలి ఝాన్సీ లక్ష్మీ.

                      
    "పంచారదధర సుధమధురధ్వని ముఖరిత మోహన వంశమ్]
    చలిత దృగంచల చంచల మౌలికపోల విలోల పతంసమ్
        రాసే హరి మిహవిహిత విలాసం
    స్మరతి మనో మమకృత పరిహాసమ్
చంద్రకచారు మయూర శిఖండ కమండల వలయిత కేశమ్
ప్రచుర పురందర ధనురనురంజిత మేదుర ముదిరను వేషమ్
    రాసే హరి మిహవిహిత విలాసం
    స్మరతి మనో మమకృత పరిహాసమ్...."
    "మరోసారి పాడగలరా , హిమబిందూ?"
    "అన్నయ్య కి అష్టపదులంటే ఎంతో ఇష్టం! పాడు, బిందూ!" అన్నది కరుణ.
    శ్యామసుందరుని వైపు చూసిందామె కనులెత్తి. అతని కనులలో ఆ గీతం పైన ఉన్న మక్కువ తప్ప మరో భావం కనిపించలేదామేకు. కంఠం సవరించుకుని ఆరంభించింది మళ్ళీ.
    పాల వెన్నెల్లో ఆ మృదు మధుర గీతం శ్యామ సుందరుని హృదయాన వింత వింత రంగుల్ని చిలికించుతుంది.
    దూరాన దేవాలయంలో మంగళ వాద్యాలు వినవస్తున్నాయి. మంచు తెరలు తెరలుగా కరుస్తుంది. పాట పూర్తయింది.
    "జయదేవుని కవిత్వం లో అమృతం ఉందండీ! ఎంత శ్రావ్యంగా ఉంటుందో! మీకేమని పిస్తుంది. అయన "గీతాగోవిందం" చదువుతుంటే?"
    "తేనెలో ద్రాక్షపళ్ళు వేసి తిన్నంత తీయని దాయన కవిత.
    "ఎంత చక్కగా చెప్పారు! మీ కంఠం ఆ తియదనాన్ని మరింత మధురంగా వినిపించిందనుకోండి! ఏం కరుణా! అవును కదూ?" చెల్లెలి వంక చూశాడు శ్యామ సుందర్.
    "మీలా నేను మాటల్లో చెప్పలేనన్నాయ్! కాని, బిందు పాటంటే నేనెందుకో పిచ్చిగా ఇష్టపడతాను. మా కాలేజీ లో ఇంకా ఒకరిద్దరున్నారు పాడగల వాళ్ళు. కాని, వాళ్ళ గొంతులో ఇంత మృదుత్వం వినిపించదు నాకు" అన్నది కరుణ.
    "చూడండి! మాటలు రావంతూనే కోటలు కట్టేస్తోంది! ఇంకా చెబుతుంది వింటుంటే. ప్రొద్దు బోయింది. వెళదాం, ఇక. అమ్మ మళ్ళీ కబురంపుతుంది." లేచి నిలుచుంది హిమబిందు.
    "అబ్బ! ! ఎంత చల్లగా ఉందీ!!?" అంటూ కరుణ చలి గాలికి పైట రెండో భుజం మీదికి లాక్కుంది.
    "మంచు మహత్యం మరి!" హిమబిందు గట్టు దిగి కాలి దారి వైపు నడవసాగింది. వెనకే వస్తూన్న శ్యామ సుందర్ నలువైపులా చూస్తూ అన్నాడు :
    "మీ ఊరు చిన్నదైనా అందమైనది. ఈ శెనగచేలూ, చేలల్లో మంచేలూ, పక్కన చిన్న చిన్న చెరువులూ , చింతల తోపూ, వెన్నెట్లో మెరుస్తూన్న , మంచులో తడుస్తూన్న ఇళ్ళూ ! మంచి చిత్రంలా వుంది."
    "మరి రానేరానన్నావుగా , అన్నాయ్ , నువ్వు! బాగుంటుందని చెప్పినా వినిపించుకున్నావా?" కరుణ తన పంతం నేగ్గినందుకు సంతోషంతో ఊగిపోతుంది.
    "నిజమే, కరుణా! మన ఊరి బస్సు తప్పిపోవడం, మీరిద్దరూ నచ్చ చెప్పడం మూలాన్నే వచ్చాను. లేకపోతె ఇంత మంచి దృశ్యాన్ని చూడగలిగే వాణ్ణి కాదు."
    హిమబిందు మాట్లాడకుండా నడుస్తుంది. వెన్నెలలో చెరువు తళతళా మెరుస్తుంది. చెరువు గట్టెక్కారు మువ్వురూ.
    రివ్వున కెరటం లా చల్లగాలి ఆ మువ్వుర్నీ పరామర్శించి పరుగెత్తింది క్షణం లో. మంచుతో తలా, కాళ్ళూ, చేతులూ చల్లబడి పోయాయేమో మాట్లాడకుండా నడుస్తున్నారు.
    చింతల తోపు దాటాక మంచి నీళ్ళ బావి ఎదురైంది.
    "అరె! ఇంత ప్రొద్దు బోయింది. ఇంకా నీళ్ళు తోడుకుంటున్నారెవరో?' అన్నాడు శ్యామసుందర్.
    "లంబాడీలు! పగలు వీళ్ళని బావి దరిదాపులకు కూడా రానీయరు. అర్ధరాత్రి అవుతోంది అన్నప్పుడు వస్తారు పాపం, నీళ్ళ కోసం!"
    "అరె! ప్చ్! ప్చ్! పాపం! ...చలిలో! ఇంకా మీ ఊళ్ళో ఈ అంటుకోగూడదన్న జాడ్యం ఉందన్న మాట!"
    "మా ఊరు కొంచెం నయం! అర్ధరాత్రన్నా ఆ భావాన్ని మరిచి పోతున్నారు. పక్క గ్రామాల్లో ఈ మాత్రం కూడా లేదు."
    "నిజం?"
    "వెన్నెల్లో ఇంత అందంగా కనపడుతున్న ఈ ఇళ్ళలో ఉన్న వాళ్ళ మనసు లింత అందంగా ఉండవు." బాధ తొంగి చూసింది హిమబిందు కంఠనా.
    "గాంధీ గారి ఆశయాలెన్నో కలల్లోనే నిలిచి పోయాయి . ఏమిటో? మన దేశం మరింతగా వెనుకంజ వేస్తుంది విషయంలో!" నిట్టుర్చాడతడు.
    మాట్లాడుకుంటూనే ఊళ్ళో కి వచ్చేశారు.
    విద్యుద్దీపాలు లేవు. కానీ, ప్రతి ఇంట్లో నుంచీ చిన్న దీపం మిణుకు మిణుకు మంటూ వెలుగుతూ కనిపించుతుంది. ఎడ్ల మెడల్లో కదులుతున్న గంటలు గణగణ మంటున్నాయి అప్పుడప్పుడు.
    హిమబిందు నెమ్మదిగా తలుపు తట్టింది , "అమ్మా!" అంటూ.
    "ఎవరూ? బిందూ, నువ్వా, అమ్మా! రా! అమ్మ లేదులే! గుళ్ళో పురాణం వినడానికి వెళ్ళింది. ఇంత రాత్రి దాకానా? మంచు కురుస్తోంది గదా! కాస్త పెందరాడే రాగూడదా?"
    బిందు పెదనాన్న తలుపు తీశారు వాత్సల్యం నిండిన గొంతుతో మందలించుతూ.
    "ఏవో మాటల్లో పడి పొద్దు మాటే మరిచి పోయాం నాన్నా!"

                     
    "ఊ! పడుకోండిక!...ఆ! ఆకలేస్తోందేమో! బీరువాలో అరటి పళ్లున్నాయ్ . తలో రెండూ తినండి."
    "ఇప్పుడా! భలేవాడివి , నాన్నా! ప్రొద్దున్నే తినవచ్చులే!" అన్నది హిమబిందు ఆవలించుతూ.
    అందరికీ పక్కలు వేసే ఉన్నాయి. తలగడ లందించి మంచి నీళ్ళు కిటికీ లో ఉంచి పడుకున్నదామె.
    అలిసిపోయిన ఆ ముగ్గురూ వెంటనే నిదురలోకి జారిపోయారు.

                           *    *    *    *
    మరునాడు ముగ్గురూ మరో చోటికి బయలుదేరారు. ఆ ఊరికి దూరంగా ఉన్న 'బ్రహ్మలింగం' చెరువు, అక్కడి శివాలయం , అడవి చూడ్డాని కెంతో మనోహరంగా ఉంటాయని చెప్పింది హిమబిందు. ప్రకృతి సౌందర్యం పైన అంతులేనంత అనురాగం ఉన్న శ్యామ సుందర్ వెంటనే తయారయ్యాడు.
    'అంతదూరం నడవ లేరమోనమ్మా! పైగా కొండ గట్టెక్కాలి!" వారించారు హిమబిందు పెదనాన్న.
    "ఎక్కుతాం , నాన్నా! మన చిన్న పాలేరుతో తినడానికి మాత్రం ఏవైనా పంపించడం మరిచిపోవద్దు. అమ్మతో చెప్పాననుకో. నువ్వు కూడా ఓసారి గుర్తు చేయి, నాన్నా!" అన్నదామె.
    కరుణ ఉత్సాహానికి అవధులే లేకుండా పోయాయి. ఫలహారం చేసి బయలుదేరారు. కొండగట్టు చేరుకునే సరికి పదకొండయింది.
    "చాలా ఎత్తుగా ఉందే! అబ్బ! ఇంత పెద్ద కట్టా ఈ చెరువుకి!" శ్యామ సుందర్ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు చెరువు గట్టు చూసి.
    "ఆ మోత వింటున్నారా?"
    "ఏమిటది, బిందూ?" కరుణ అడిగింది కుతూహలంగా.
    "అలలు లేచి పడుతున్నాయి! పైకి వెళితే నిజంగా భయం వేస్తుంది. ముందుగా ఆ శబ్దం వింటుంటే !"
    గట్టు ఎక్కడం మొదలెట్టారు. ముందు శ్యాం, తరువాత బిందు, కరుణ నడుస్తున్నారు.
    పెద్ద పెద్ద చెట్లు, పచ్చని మొక్కలు, గడ్డి పెద్ద పెద్ద రాళ్ళ ప్రక్కన మేస్తూన్న ఆవుల మందలు..... మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అలసటను మరిచిపోయారా మువ్వురూ కొంతవరకు. కానీ, కరుణ మాత్రం బాలా అలసిపోయింది.
    "నేనిక నడవలేను బాబూ! నా పని అయిపొయింది!" ఓ రాతి బండ మీద కూలబడిందామె.
    "అరె! ఇంతదూరం వచ్చి , గుళ్ళో దేవుణ్ణి చూడకుండా ఉండి పోతావా! ఇంకెంత ? అదుగో ! అల లేచింది పైకి! పద! లే, కరుణ!' శ్యామ సుందర్ చెల్లెల్ని చేయి పట్టుకుని లేవదీశాడు.
    హిమబిందు నవ్వింది కరుణ వంక చూసి.
    "ఫో! నువ్వసలు ఆడదానివి గాదు. కొండల మీది కేక్కడం , చెరువుల్లో ఈతలు కొట్టడం...."
    "కరుణ అన్న అమ్మాయితో చివాట్లు తినడం నాకు మహా ఇష్టం! ఊ! చెప్పు! ఆగిపోయావెం?" బిందు కళ్ళలో నవ్వు మెరిసింది.
    గట్టుపైనచేరగానే ముగ్గురూ ఆశ్చర్యంతో నిలుచుండి పోయారు ప్రతిమల్లా.
    కనుచూపు మేరలో ఆ నీటి కెక్కడా అంతు కనిపించడం లేదు వాళ్లకి. అల పైకి లేచి అంతలోనే పెద్ద శబ్దంతో క్రిందికి పడుతుంది. ఓ అల ప్రవాహం పైన తేలి వస్తుంది. అంతలో మరో కెరటం పందెం కడుతున్నట్లు ఎగసి పడుతుంది -- ఆ లలల విన్యాసా లేంటో కనువిందు చేస్తున్నాయి.
    ఎండలో తళతళా మెరిసిపోతున్నది చెరువు. చేపలు కొన్ని కెరటాల విసురులో ఒడ్డున పడి మళ్ళీ లోనికి దూకుతున్నాయి. పైన తెల్లని మబ్బులు! చుట్టూరా పచ్చని చెట్లు, పేరు తెలియని తీగలు, పూలు, పళ్ళు పక్షులు!
    ఆ చేరువుకీ, గుడికీ సంబంధించిన కధ ఉంది!"
    "ఏమిటది?' కరుణ ప్రశ్నించింది వెంటనే.
    "బ్రహ్మలింగం చేరువన్నారు? పేరు వింతగా ఉంది! ఏమిటో చెప్పండి ఇందులో విశేషం!" అంటూ బిందు కు ఎదురుగా కొంచెం దూరంలో కూర్చున్నాడు శ్యామ్ , రుమాలు పరుచుకుని.
    "పెదనాన్న చెబుతారు మరి-- ఈ కధలో నిజానిజాలు ఎంతవరకో నాకు తెలియదు.
    ఓ ఆసామీ నీటి ఎద్దడికి తట్టుకోలేక చెరువు తవ్వించాట్ట. చుట్టూరా కట్ట బోశారు. వానలు కురిసి చెరువు నిండి పోయిందట ఆ రాత్రి. ప్రొద్దున్నే వచ్చాట్ట అయన చెరువు ఎలా ఉందొ చూడ్డానికి. ఓ వైపున గండి పడి నీళ్ళు పెద్ద ప్రవాహమై కొండ కిందికి ప్రవహించి పోతున్నాయట. కట్ట చాలా పొడవున తెగిపోయింది. కూలీలను పిలిచి మట్టి పోయించాడు గండిలో. ఎంత మట్టి పోసినా గండి పూడలేదు సరిగదా అంతకంత కూ గట్టును మరింత కోసేస్తోందట.
    ఆ నీరంతా పొతే ఊరంతా పొలాల్ని ఎండ బెట్టుకోవలిసిందే. బెంగతో అయన రాత్రంతా మేలుకునే ఉండి పోయారట. తెలతెలవారుతుండగా ఓ కునుకు పట్టింది. ఆ నిదురలో కల ఒకటి వచ్చిందట.
    "చెరువు త్రవ్వడమయితే త్రవ్వారు గానీ, నాకేమీ ఉపహారం ఇవ్వలేదేమీటోయ్? నీ పెద్ద కొడుకుని నాకు బలి ఇచ్చావంటే గండి పూడి పోతుంది. అంతవరకూ ఇంతే!" అన్నట్ట ఆ కలలో ఓ పురుషుడు కనిపించి. అయన తుళ్ళి పడి లేచాట్ట. కల అంతా మళ్ళీ జ్ఞప్తికి వచ్చింది. పెద్ద కొడుకు ఆవుల్ని కట్టేస్తున్నాడు. అతడిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాట్ట. అలా నాలుగైదు రోజులు అన్నం సరిగ్గా తినకుండా, బెంగగా అహర్ణిశ లూ పడుకునే ఉంటున్నాడు . కోడలు కారణం అడిగింది. చెప్పలేక చెప్పలేక చెప్పాడాయన.
    నిర్ఘాంతపోయిందామె క్షణ మాత్రం. 'కానీ మీరేం బెంగ పెట్టుకోకండి మామయ్యా! ఇంతమంది బ్రతుకు తెరువు కోసం ఆయన్ని తప్పకుండా బలి ఇవ్వవచ్చు. పాపం గాదు!' అని లోనికి వెళ్ళిపోయింది . మరునాటి ఉదయాన్నే కొడుకూ, కోడలూ-- ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకొని, 'గట్టు దగ్గరికి పదండి' అన్నారట. అయన కోడల్ని వారించారు. 'అమ్మా! నువ్వు కూడానా?' అంటూ.
    "నన్ను విడిచి అయన ఉండలేరు, మామయ్యా!' అన్నదా కోడలు.
    కన్నీళ్ళు ప్రవాహం లా ముంచి వేశాయా మాట వినగానే ఆయన్ని. ఆ గండిలో ఆ దంపతులు ఒక్కసారే దూకారట. వెంటనే కూలీలు మట్టిని పోశారట. గండి పూడి పోయింది. అప్పటి నుంచీ వాళ్ళిద్దరి పేర్లు -- బ్రహ్మయ్యా, లింగమ్మా-- అన్న వాటి మీద చెరువు పేరు స్థిరపడి పోయింది.
    అది నిజమే ననిపించిందా శ్యామసుందర్ , ఎమ్.ఎ. కి కరుణ బిఎ. కి . తమ కళ్ళెదుట జరిగినట్ల నిపించింది వింటున్నంత సేపు. ఆ గుడీ , చల్లని వాతావరణం, మోతలు పెడుతున్న అలలూ మరో ఊహకే స్థాన మివ్వడం లేదు ఆ శ్రోతల మనస్సులో. ఎంతో సేపు ఆ చెరువు వంకే చూస్తుండి పోయారలా కదలికే లేకుండా.


Next Page 

WRITERS
PUBLICATIONS