దుబాసీ వాళ్ళని గద్దించి అడుగుతున్నాడు షేర్ ఖాన్ కొడుకు గురించి.
వాళ్ళు మాకు తెలియదని నెత్తీ, నోరూ మొత్తుకుని చెప్తున్నారు. ఆ మాట అంటున్నకొద్దీ దెబ్బలు అధికం అవుతున్నాయి. ఒక్కొక్క కొరడాదెబ్బ వీపుమీద పడుతుంటే విల విలలాడిపోతున్నారు.
"వీళ్ళని వుప్పుపాతరలో గొంతువరకూ పాతెయ్యండి" అంటూ హుకుం జారీచేశాడు షేర్ ఖాన్.
వాళ్ళని సిపాయిలు తీసుకుపోయారు.
ఈ దృశ్యాన్ని చూచి లింగప్పదొర తాను తప్పుచేశానని తెలుసుకున్నాడు. కూచిపోతి ప్రాణాలను బలియిచ్చికూడా పిల్లాడిని అప్పగించటానికి యెందుకు ఒప్పుకోలేదో అర్ధమయింది. ఆమె ఆంతర్యంలో చెలరేగిన తుఫానుకు కారణం యేమిటో లింగప్పదొరకు యిప్పటికి బాగా అర్ధమయింది. ఆమెను దహించి వేసిన బాధ యేమిటో తెలిసింది.
పశ్చాత్తాపం అగ్నిలా ఆయన శరీరాన్ని మండిస్తోంది. కాని అప్పటికే సమయం మించిపోయింది.
కుర్రాడు తండ్రిని చూడగానే లింగప్పను విదిలించుకుని పరుగుపరుగున వెళ్ళాడు నాన్నను కావిలించుకుని ఏడ్చాడు.
షేర్ ఖాన్ కి ఆనందమూ, దుఃఖమూ కలిగినాయి. ఆ అనుభూతులు రెండూ కలిసి లింగప్పదొరమీద అనుగ్రహంగా మారినాయి.
"నీ పేరు?" అడిగాడు షేర్ ఖాన్.
"లింగప్ప దొర."
"నా బిడ్డను యెక్కడనించీ తీసుకొచ్చావు?" షేర్ ఖాన్.
"మృత్యుముఖంనించి తప్పించి తీసుకువచ్చాను."
"నీవు చాల మంచివాడివి" షేర్ ఖాన్ ప్రశంసించాడు.
"నీవు చాల చెడ్డవాడివి షేర్ ఖాన్" అంటూ వురిమాడు లింగప్ప దొర.
"ఆ మాట యెవ్వరూ అనకూడదు. యీ శ్రీకాకుళం, రాజమండ్రి పరగణాలలో ఆ మాట అనగలిగినవాళ్ళు కూడా యెవ్వరూ లేరు. అయినా నా బిడ్డ ప్రాణాలు కాపాడి నాకు అప్పగించావు. కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. నీకు దయాభిక్ష యిస్తున్నాను" అని గడ్డం దువ్వేడు షేర్ ఖాన్.
"దయాభిక్ష నీకే నేనిచ్చాను షేర్ ఖాన్. వెలమదొర చేయి చాచడు. నీ దయ నాకక్కరలేదు" అంటూ మీసం దువ్వాడు లింగప్పదొర.
"మరేం కావాలి?"
"నీకు బందీలుగా చిక్కిన సవరల్ని విడిచిపెట్టు లేకపోతే నీవు ఒక్క వరహాడబ్బులు కూడా శిస్తురూపంలో వసూలు చెయ్యలేవు" అంటూ సవాలు విసిరాడు లింగప్పదొర.
అందకుండా పోయాడనుకున్న కొడుకు అంది వచ్చేసరికి షేర్ ఖాన్ సంతోషంలో వున్నాడు. తన సంతోషానికి కారణమయిన వ్యక్తి యేదయినా కోరుకుని సంతోషంగా వెళ్ళిపోవాలి. కాని యిట్లా యెదురు తిరగటం అతనికి నచ్చలేదు అయినా సహించాడు. అది లింగప్పదొరకు చాల మంచిరోజు. మరొక స్థితిలో అయితే తక్షణమే సభామంటపంలోనే అందరి సమక్షంలోనే అతని తల నరికించేవాడు. లింగప్పదొర అదృష్టం కలిసివచ్చి షేర్ ఖాన్ కు ఆ వూహ రాలేదు.
కొడుకు చెప్పిన మాటల్ని పట్టి లింగప్పదొరమీద అనుగ్రహం కలిగింది.
"సరే, సవరల్ని అందర్నీ విడిచిపెట్టండి. శ్రీకాకుళం పొలిమేరల్లో కన్పిస్తే పాతేస్తామని బెదిరించి కుక్కల్ని తరిమినట్లు తరమండి" అని సిపాయిలకు హుకుం చేశాడు ఖాన్. "చాలా లింగప్పదొరా?" అంటూ నవ్వుతూ చూచాడు దొరవైపు.
లింగప్పదొరకు నవ్వు రాలేదు అతని ఆలోచనలు అన్నీ సవరల క్షేమంకోసం పరితపించి ప్రాణాలు అర్పించిన కూచిపోతి జ్ఞాపకాలమీదికి మళ్ళినాయి. ఆమె ఆశయం నెరవేరాలి.
"ఇంకా యేదయినా కావాలంటే కోరుకో" కొడుకు తలమీద చేయివేసి నిమురుతూ అడిగాడు షేర్ ఖాన్.
"ఇంకెప్పుడూ సవరలమీదికి రాకూడదు."
"నీకోసం యేదయినా కోరుకో!" అన్నాడు షేర్ ఖాన్. స్వార్ధం తప్ప సహానుభూతి గురించీ, త్యాగం గురించీ యెన్నడూ ఆలోచించని అతనికి దొర కోరికలు విచిత్రంగా వున్నాయి. రాజానుగ్రహం కలిగిన పూట మణులో, మాన్యాలో కోరుకోవాలి. యీ పిచ్చివాడి కోరికలు యిలా వున్నాయేమిటి? అనుకున్నాడు యేది యేమయినా యీ దివానా నక్కతోక తొక్కివచ్చాడు. అందుకే యితని మీద నాకు కోపం రావటల్లేదు అని ఆలోచించాడు.
"అలాగే యింకెప్పుడూ ఆవైపులకు రాను" అని హామీయిచ్చాడు. అసలు అడవుల్లోకి వెళ్ళాలన్న ఆలోచనని యిదివరకే మానుకున్నాడు. యిప్పుడు జరిగిన శాస్తి మళ్ళీ జరగవచ్చు అడవుల్లోకి పోతే!
దేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమయిన మార్పులూ ఒక్క యుద్ధంద్వారా మాత్రమే నిర్ణయించబడే రోజులు అవి. బలం అధికంగా వున్నవాడు ముఖాముఖి యుద్ధం కోరుతాడు. బలం లేనివాడు గొరిల్లా పోరాటం కోరుతాడు. అందునించి తాను బహిరంగ యుద్దాలకు సవాలు చెయ్యాలేకాని అడవుల్లో యిరుక్కుపోయి గొరిల్లా పోరాటంలో చిక్కకూడదు అని యిదివరకే నిర్ణయించుకున్నాడు.
లింగప్పదొరకు కావలసిన రెండు కోరికలూ తీరినాయి. ఆయన మనసులో కూచిపోతి రూపమే వుంది. ఆమె ఆశయాలే వున్నాయి. తాను చేసిన తప్పుకు సరిఅయిన సవరణ ఆమె ఆశయం నెరవేర్చటమే!
షేర్ ఖాన్ యిచ్చిన యీ రెండు వరాలవల్లా అది కొంతవరకూ నెరవేరింది. యిక తాను అక్కడ వుండవలసిన అవుసరం యేమిటి?
తాను వెనుకకు తిరిగిపోయేందుకే నిర్ణయించాడు.
ఈ విచిత్రవ్యక్తి కోరికలు షేర్ ఖాన్ కు సంతృప్తి కలిగించలేదు. ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా ఒళ్ళు మర్చిపోయే తత్త్వం అతనిది తన కొడుకు ప్రాణదాత వుత్తచేతులతో వెళ్ళటం అతనికి నచ్చలేదు. తన అనుగ్రహంకోసం పడిగాపులు పడేవాళ్ళు యెందరో వున్నారు యీ వ్యక్తివాళ్ళకన్నా గొప్పవాడని అతనికి అనిపించింది.
